" ముళ్ళ కిరీటం లాంటి 'అనంత' బాధ్యత "

 

 

శ్రీ అనంతరెడ్డి గారు శ్రీ నరసింహరెడ్డి, శ్రీమతి బుచ్చమ్మ అనే పుణ్య దంపతులకి నాల్గవ సంతానంగా 13 జనవరి, 1948 తేదీన ఖమ్మం జిల్లాలో ఉన్న పుల్లూరు బంజర అనే చిన్నగ్రామంలో జన్మించారు.

వారి మొట్టమొదటి ఆధ్యాత్మిక గురువు వారి తండ్రిగారే. శ్రీ రెడ్డిగారి చేత వారి తండ్రిగారు చిన్న వయస్సులోనే 400 వేమన పద్యాలని కంఠత వల్లెవేయించారట. తనకి ఊహ తెలిసినప్పటి నుండి శ్రీ రెడ్డిగారు "మనం ఈ భూమ్మీద అసలు ఎందుకు పుట్టాం? మనం పుట్టి ఈ బాధలు పడే కన్నా హాయిగా ఆకాశంలోనే ఎప్పుడూ ఉండొచ్చు కదా. చనిపోయిన తరువాత మనం ఎక్కడికి వెళ్తాం? అసలు ఆ తరువాత నిజంగా ఏమైనా ఉందా?" లాంటి ప్రశ్నలు తనలో తానే వేసుకుని నిరంతరం ఆకాశం వైపు చూస్తూ ఉండేవారట.

ఆయన తను ఈ భూమ్మీద ఉండడమే ఎక్కడో సుదూరంలో ఇంకో కాంతి పుంజంగా కూడ ఉన్నాననే భావనలో ఎల్లప్పుడూ ఉండేవారట. అందుకే వారికి తల్లిదండ్రులు 'అనంత'రెడ్డి అని పేరు పెట్టారేమో. ఆయన తన ఎనిమిదవ ఏటనే 'జ్ఞానేశ్వర భగవద్గీత'ని ఔపోసన పట్టారు. ఆయన ఎన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు చదివారో లెక్కేలేదు. అవి కూడా 'అనంతం'గానే చదివారు. మచ్చుకు కొన్ని: గోపదేవశాస్త్రి గారి "ఆర్య సమాజం", దయానంద సరస్వతి గారి "సత్యార్ధ ప్రకాశం", స్వామి రామతీర్ధగారి "హిమాలయ లేఖలు", రమణమహర్షి, రవీంద్రనాధ్ టాగూర్, వేమన, యోగానంద పరమహంస, అరివిందఘోష్, అరిస్టాటిల్, ప్లేటో, జిడ్డుకృష్ణమూర్తి, రామక్రిష్ణ పరమహంస, వివేకానంద స్వామి, మళయాళ స్వామి గార్ల జీవిత చరిత్రలు, వారి వారి ప్రవచనాలు ఇలా వందల కొద్దీ యోగుల జీవితాలని వారి పుస్తకాల ద్వారా ఆకళింపు చేసుకుని నిజ జీవితంలో కూడా వాటిని. 'తు.చ.' తప్పకుండా ఆచరిస్తూ ఉన్న 'కర్మయోగి' శ్రీ రెడ్డిగారు.

లౌకిక పుస్తకాలైన చలం సాహిత్యం, కమ్యూనిస్టు పంథాలు కూడా శ్రీ రెడ్డి గారి మనోఫలకంపై విశేష ప్రభావాన్ని చూపాయి.

ఆయన చవిచూసినన్ని 'Missions' అంటే ఆధ్యాత్మిక సంస్థలు బహుశా ఏ పిరమిడ్ మాస్టర్ కూడా చూడలేదామో. ఇన్ని పుస్తకాలు చదివినా, ఇన్ని సంస్థల్లో ఉన్నా తను ఏమీ తెలుసుకోలేదన్న అసంతృప్తి అలాగే ఉండేదట ఆయనకి. చివరి ప్రస్థానంగా శ్రీ రెడ్డిగారు వారి మేనల్లుడైన సీనియర్ హైదరాబాదు పిరమిడ్ మాస్టర్ శ్రీ వేణుగోపాలరెడ్డి, హైదరాబాదు గారి ద్వారా బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు స్థాపించిన మన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలో కాలూనడం సంవత్సరంన్నర క్రితం జరిగింది.

"ఈ పిరమిడ్ ధ్యాన ప్రపంచంలోకి వచ్చాక ఆయన 'అనంత' లాభం పొందాన"ని ఆయన స్వయంగా అంగీకరించారు. ఎందుకంటే బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ప్రపంచంలో ఉన్న అన్నిరకాల ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్న 'మంచి' (అందరికీ సులభంగా ఉండి, పనికివచ్చే) అనే సారాన్ని గ్రహించి "పనికిరాని మూర్ఖ ఆధ్యాత్మిక చెత్త" అని పిప్పిని పారవేసి "పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్" ని స్థాపించి ఉన్నారు కాబట్టి. అందుకే శ్రీ పత్రి గారు అంటారు "సత్యం అంచులని తాకుతాయి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలు" అని.

శ్రీ అనంతరెడ్డి గారు నీటిపారుదల శాఖలో ఇంజనీర్‌గా చేరినప్పటి నుంచి ఉద్యోగరీత్యా కొండకోనల్లో, నదీజలాల మధ్య తిరిగి ప్రకృతిలో తాదాత్మ్యం పొందుతూ, ఇటు వారి పరిధిలో ఉన్న ఆయకట్టు ప్రాంత వాసులకి నీరు సకాలంలో అందించే బాధ్యత గల ఇంజనీర్‌గా అందరి మన్ననలు పొందుతూండేవారు. శ్రీ రెడ్డి గారు ప్రస్తుతం నివాసమున్న జగిత్యాల (కరీంనగర్ జిల్లా)లో 'శ్రీ రాంసాగర్ నీటిపారుదల ప్రాజెక్ట్ (SRSP)' ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా ఎంతో పని వత్తిడిలో ఉన్నా 'ది జగిత్యాల పిరమిడ్ ధ్యానకేంద్రం'లో తనవంతు పాత్ర ఎంతో విశేషంగా పోషిస్తున్నారు.

ఎన్నో చుట్టుప్రక్కల ఆయకట్టు గ్రామాలకి తనతో బాటు మిగతా పిరమిడ్ మాస్టర్లని తీసుకుని వెళ్ళి ధ్యానప్రచారం ముమ్మరంగా చేస్తూ ఆయా గ్రామాల ప్రజల్లో ఒక మంచి ఇంజనీర్‌గా మరి ఒక మంచి ధ్యానబోధకుడు ప్రాచుర్యం పొందారు.

అందుకే 'మహద్రష్ట' అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి 'దృష్టి' లో శ్రీ అనంతరెడ్డి గారు పడ్డారు. తొమ్మిది జిల్లాల తెలంగాణ "ధ్యాన ప్రచారం" బాధ్యతని 14-01-03 పత్రీజీ గారు నాడు, వీరి మీద మోపారు. ముళ్ళకిరీటం లాంటి ఈ 'అనంత' బాధ్యతని శ్రీ రెడ్డిగారు ఆనందంగా స్వీకరించి, శ్రీ పత్రిగారి కలలని సాకారంగా తీసుకుని రావడానికి 'అనంత'కృషి చేస్తామని చెప్పారు.

చెప్పడమే కాదు జనవరి 19 ఆదివారం, కరీంనగర్ పట్టణం నడిబొడ్డున వైశ్యభవన్‌లో సుమారు 500 మంది ఆధ్యాత్మిక జిజ్ఞాసువులని సమీకరించి 'ది జగిత్యాల పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ' "ధ్యాన తెలంగాణా" ఎజెండాని ఎగరవేసి, అక్కడికి విచ్చేసిన వారందరినీ 'పిరమిడ్ ధ్యాను'లుగా మార్చిన ఘనత శ్రీ అనంతరెడ్డి గారిదే అని చెప్పక తప్పదు.

త్వరలోనే వరంగల్, నిజామాబాద్‌లలో కూడా విస్తృతంగా తిరిగి, విస్తారంగా 'ధ్యాన' ప్రచారాన్ని చేపట్టాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు.

 

అనంతరెడ్డి
ఖమ్మం

Go to top