" ధ్యానంతో మానసిక సమస్యలు దూరం "

 

నా పేరు జగపతి రాజు.

నా విద్యార్థి దశలో.. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు.. "థింక్ అండ్ గ్రో రిచ్" అనే "నెపోలియన్ హిల్" వ్రాసిన పుస్తకం చదివాను. ఆ పుస్తకం చదివినప్పటినుంచీ నాకు ‘సైకాలజీ’ పై ఆసక్తి కలిగింది. అప్పటి నుంచి నేను వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదివేవాడిని. నేను జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా పనిచేసేటప్పుడు స్టూడెంట్స్ కు నేను పుస్తకాలలో చదివిన విషయాలను బోధించేవాడిని. అయితే నాకు తెలిసిన సమాచారానికి తెలిసిన విషయాలు ఆచరణలో రావడానికి చాలా గ్యాప్ ఉండేది. నా బలహీనతలను అధిగమించడం ఎలాగో తెలిసేది కాదు.

ఆ సమయంలోనే నాకు డా||K. న్యూటన్ గారి ద్వారా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ గురించి తెలిసి "ఆనాపానసతి" ధ్యానసాధన ద్వారా ఈ కార్యకారణ సంబంధం, మానవ జీవిత అనుభవాలకు మూలకారణం ఏమిటో ..అనే ‘రహస్యం’ నాకు అవగతమైంది.

నా జీవితంలో ఈ విషయం తెలిసిన రోజు ఆ అనుభూతి నేను వర్ణించలేను! ఇలా అవగాహన చేసుకొన్న ఈ విషయాలసారాన్ని నేను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శాస్త్రీయ ఆధారాలతో కూడిన స్లైడ్స్‌తో తయారు చేసి సెమినార్స్, వర్క్‌షాప్‌లు నిర్విహిస్తున్నాను. ముఖ్యంగా స్టూడెంట్స్‌కు ఈ సబ్జెక్టు అందించడానికి నేను రాష్ట్రమంతా పర్యటిస్తూ ఉంటాను! గత 5 సం||లుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, B.C. వెల్ఫేర్ హాస్టల్స్‌లోని పబ్లిక్ ఎగ్జామ్స్‌కు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్విహిస్తున్నాను. ఈ క్లాసుల తరువాత విద్యార్థులలో చాలా గొప్ప మార్పు వచ్చిందనీ, ఉత్తీర్ణత శాతం పెరిగిందనీ సాంఘిక సంక్షేమశాఖ అధికారులు ఆ శాఖ కమీషనర్‌కు నన్ను పరిచయం చేస్తూ పేర్కునడం నాకు చాలా ఆనందం కలిగించింది.

పశ్చిమగోదావరి జిల్లాలో C.R. రెడ్డి వుమెన్స్ కాలేజీలో సుమారు, 5,000 మంది విద్యార్థులకు ఈ క్లాసులు నిర్వహించాను. కాలేజీలో కొంతమంది విద్యార్థినులు మానసిక సమస్యలతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారనీ, ప్రతి సంవత్సరం కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకునేవారనీ.. ఈ క్లాసుల తరువాత ఆ కాలేజీలో ఆత్మహత్యల కేసు ఒక్కటి కూడా రాలేదనీ ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా నాకు తెలియజేసారు.. ఇది మనధ్యాన మహా విజయం!

అలాగే కాకినాడ నగరంలోని ఐడియల్ కాలేజీలో ఈ క్లాసు అయిన తరువాత ఆ కాలేజ్ కెమిస్ట్రీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ గారు తాను రెండు నెలల్లో రిటైర్ కాబోతున్నాననీ, ఈ క్లాస్ గనుక తాను ఉద్యోగంలో చేరినప్పుడు విని ఉంటే తాను ఎంతో గొప్ప లెక్చరర్‌ను అయిఉండేవాడిననీ అదే మీటింగ్‌లో స్టూడెంట్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఇలాంటి సందర్భాలు నేను ప్రతి క్లాసు తరువాత వింటున్నప్పుడు, ముఖ్యంగా పత్రీజీ లాంటి సద్గురువు లభించినందుకు, ఇంతటి గొప్ప సబ్జెక్టు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీద్వారా నాకు లభించినందుకు ఎంతో గర్విస్తున్నాను!

కొన్ని ముఖ్యమైన విషయాలు :-

మన జీవితాల్లో, మన ప్రపంచంలో సంభవిస్తున్న వాటికి సమాధానాలూ, పరిష్కారాలు కేవలం దాని మూలకారణాన్ని అవగాహన కలిగించుకోవడం వలననే సాధ్యం.

సమాజం .. నిరంతరం వ్యక్తమౌతున్న, బాహ్యంగా కనిపిస్తున్న పరిస్థితులనే కారణంగా చూస్తూ ‘అసలు కారణాన్ని’ గుర్తించలేకపోతోంది.

మన నాగరికత కూడా ఖచ్చితంగా మన చుట్టూ వున్న భౌతిక ప్రపంచం పైనే తన దృష్టిని కేంద్రీకృతం చేస్తోంది. అంతర్గత శక్తుల్ని గురించి దాదాపు పట్టించుకోవడం లేదు.

ఎప్పుడైతే మనం మనల్నీ, మన చైతన్యాన్నీ అవగతం చేసుకుంటామో అప్పుడే సృష్టిని కూడా అవగతం చేసుకోగలం.

మనకు గోచరిస్తున్న ఈ దృశ్య ప్రపంచంలో, బహిర్గత జగుత్తులో కారణం గుర్తించలేము. కారణం దృశ్య ప్రపంచంలో ఉండదు. బహిర్గత జగత్తు కేవలం ప్రభావం మాత్రమే.

బహిర్ ప్రపంచంలో మార్పు రావాలంటే దానికి కారణమైన అంతర్ ప్రపంచంలోని కారణాన్ని ఖచ్చితంగా మార్పు చేసుకుని తీరాలి. అంతర్ ప్రపంచంలోని కారణం అంటే మనం చేసే ఆలోచనలు మరి మనం ఊహించే సంఘటనలు.

మన జీవితాల్లో సంభ‌వించే అన్ని పరిస్థితులనూ, మరి అనుభవాలనూ మనమే సృష్టించుకుంటూ మనం కోరినా కోరకపోయినా ఏదైతే ఆలోచిస్తామో వాటినే పొందుతాము.

మీ జీవితపు ఉనికి, మీ శరీరం, మీ ఆర్థిక స్తోమత, మీ సంబంధ బాంధవ్యాలు, మీ మిత్రులు మరి మీ సామాజిక స్థితి.. మొదలైనవన్నీ కూడా మీ గురించి మీరేమనుకుంటున్నారో, లేదా మీ పట్ల మీకు ఎలాంటి భావాలున్నాయో అలాగే వ్యక్తీకరింపబడుతున్నాయి. యద్భావం తద్భవతి. "మీ విశ్వాసం మీ పట్ల మీకెట్లా వుంటుందో మీకు అలాగే జరుగుతుంది" అంటారు జీసస్.

కోపం, భయం, అసూయ మరి ప్రతీకారవాంఛ లాంటి భావాల చేత మనల్ని మనం గాయపరుచుకుంటున్నాము. ఇవన్నీ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోనికి ప్రవేశించే విషపు ప్రకంపనలు. కనుక వాటిపట్ల మనం సదా ఎరుకతో ఉండాలి.

 

దాట్ల జగపతి రాజు
డైరెక్టర్
పిరమిడ్ ఇన్స్టిట్యూట్
హైదరాబాద్

Go to top