"పుష్పవనం లో స్వస్థత పొందాను"

 

 నా పేరు దేవరాజ్, తిరుపతి పిరమిడ్ మాస్టర్‌ని.

తిరుపతి నుంచి ధ్యాన హిమాలయాత్ర కై 1-8-2009 తేదీన ఢిల్లీ చేరుకొని, 275 ధ్యానులతో 11 బస్సులలో ఋషికేష్ దయానందాశ్రమం చేరుకొన్నాం. ఉదయం గంగానదిలో అతి చల్లని నీటిలో స్నానం చేసి, ఒడ్డున ధ్యానం చేస్తున్నప్పుడు వర్షం పూలజల్లుగా కురిసింది. అప్పుడు హిమశిఖరాల అందాలు మాటల్లో వర్ణించలేము.

బదరీనాథ్‌లో "ఉష్ణగుండం"లో సహజంగా వున్న అతి వేడినీటిలో స్నానం చేసినప్పుడు కలిగిన అనుభూతి వర్ణనాతీతం! బదరీనాథ్‌లో వున్న వ్యాస గుహ, గణేష్ గహల దర్శనం మరి అచ్చట చేసిన ధ్యానం అత్యద్భుతం. అక్కడే వున్న "భారతీయ ఆఖరీ టీ స్టాల్" (అచ్చ తెలుగులో బోర్డు వ్రాసి ఉంది) లో తోటి ధ్యానులతో కలిసి ‘టీ’ త్రాగడం మరువలేనిది! ఆ ‘టీ’ కొట్టు నేపాలీలు "టీ త్రాగండి" అని అప్యాయంగా ఆహ్వానించారు!

ధ్యానం చేస్తున్నప్పుడు నాకు మంచి సుగంధం వాసనలు వచ్చి ఎవరో ఆస్ట్రల్ మాస్టర్స్ స్పర్శ కలిగింది. అటు తరువాత నేను చక్కగా ధ్యానం చేస్తున్న చోటు నుంచి 5 కి.మీ. గంగారియాలో మేము బస చేసి ఉన్న హోట‌ల్ కు వచ్చాను. ఆ మరుసటిరోజు 14కి.మీ. ఘాట్‌రోడ్డులో నడక ద్వారా గోవింద్ ఘాట్ చేరుకొన్నాను.

ఇప్పటికి సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం నాకు కారు ఆక్సిడెంట్ జరిగినప్పుడు కుడికాలు నడుము వద్ద జారిపోయి 80 రోజులు హాస్పిటల్‌లో వున్నాను. అప్పటి నుంచి ఈ రెండేళ్ళు జాగ్రత్తగా ఎక్కువ నడవకుండా కారులో తిరుగుతూ వుండేవాడిని. అటువంటి నేను ఈ యాత్రలో ఎన్నో యుగాల నుండి ప్రసిద్ధిపొందిన "సుగంధ పుష్ప వనం" లో స్వస్థత పొందడం, పిరమిడ్ ధ్యాన విశిష్టత మరి మన పరమగురువు బ్రహ్మర్షి పత్రీజీ గారి కృప తప్ప మరేమీ కాదు! అప్పటి నుంచి యాత్ర అంతా నేను కాలినడకన ఉత్సాహంగా పాల్గొన్నాను.

"పుష్పవనం" 12 కి.మీ. విస్తరించివుంది. దానిని వరల్డ్ హెరిటేజ్ కింద గుర్తించి 14 కి.మీ. ఘాట్ రోడ్డుతో సహా దాదాపు ఎటుచూసినా పరిశుభ్రత ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. అది ఎంతో అత్యద్భుతం!

ద్వారాహాట్‌లో బసచేసి, మహావతార్ బాబాజీ గుహవద్దకు 3 కి.మీ. ల నడక చేరుకుని ధ్యానం చేసాం. తిరుగు ప్రయాణంలో గురువు గారి సహచర్యం, ఫోటోలు దిగడం వగైరా మరిచిపోలేనివి. హిమాలయ ప్రాంతమంతా పూర్తి శాకాహారమయం. అది ధ్యానులకు మంచి అనుభూతి మిగిల్చింది.

తిరుగు ప్రయాణంలో "నైనిటాల్" సోయగాలు, బోట్‌లో విహారం. అక్కడ వాళ్ళు పాటిస్తున్న పరిశుభ్రత వర్ణించ సాధ్యం కాదు ఆగ్రాకోట, తాజ్‌మహల్ అందాలు అద్భుతాలు. "మధుర" లోని కృష్ణాష్టమి వేడుకలను మేం యాదృచ్ఛికంగా కృష్ణాష్టమి రోజే చూడడం మా అదృష్టం !

ఈ యాత్ర ద్వారా తెలిసిన సందేశం "ధ్యానం, శాకాహారం, పరిశుభ్రత ద్వారానే దైవత్వం అలవడుతుంది" అని.

 

పెద్దినేని దేవరాజ్
తిరుపతి

Go to top