" హిమాలయ ధ్యానయాత్రలో .. పత్రీజీ దివ్యసందేశాలు "

 

నా పేరు సత్యవతి.

హిమాలయాల అద్భుత ధ్యానయాత్రతో పాటుగా ప్రతిమనిషి జీవితాలను పండించే విజ్ఞానసంపదను దివ్యసందేశాల రూపంలో బ్రహ్మర్షి పత్రీజీ మనకందించారు.

3వతేది రాత్రి 8.30గం||లకు ఋషికేష్ దయానంద ఆశ్రమంలో పత్రి గారి "మైండ్" సందేశం :

"దూరంగా చూస్తే నాలుగువ్రేళ్ళు ఒకటిగా కనిపిస్తాయి. దగ్గరగా చూస్తే నాలుగుగా కనబడతాయి. ఆ నాలుగు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ‘మనస్సు’, ‘బుద్ధి’ అనేవి హీరోలు. ‘చిత్తం’, ‘అహంకారం’ అనేవి విలన్’లు. విదేశీయులు ఈ నాలుగింటినీ ఒకటిగా చూసి ‘మైండ్’ అని పేరు పెట్టారు. హిందూత్వంలో స్వామీజీలు ‘ఈ నాలుగూ ఉన్నాయి’ అన్నారు, కానీ వాటిని తేటతెల్లం చేయలేదు. ధ్యానం ద్వారా మాత్రమే చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. చిత్తం ఎప్పుడు అయితే నిరోధం అయితుందో.. అప్పుడు అహంకారం నశిస్తుంది. దాంతో మనస్సు నిశ్చలంగా అయి బుద్ధి ‘హీరో’ లా మారుతుంది."

5వ తేదీ రాత్రి 9.00 గం||లకు పత్రీజీ ఇచ్చిన "భక్తి" అనే సందేశం:

"చేసే విషయం మీద భక్తి ఉండాలే కాని, వ్యక్తిమీద కాదు. సైన్స్ మీద భక్తి ఉంటే సైన్స్‌లో మాస్టర్ అవుతాడు. క్రికెట్ మీద భక్త్తి ఉంటే క్రికెట్‌లో మాస్టర్ అవుతాడు. అలాగే ధ్యానం మీద భక్తి ఉండాలి కాని పత్రీజీ మీద కాదు. ఎవరు ఏపని అయితే చేస్తారో ఆ పనిపైన మనకు భక్తి అనేది ఉండాలి, దానికి సంబంధించిన వ్యక్తుల పైన కాదు. సత్యం పైన భక్తి ఉండాలి, కానీ రూపం పైనా, నామం పైనా ఉండకూదదు.

8వతేదీ సాయంత్రం ధ్యానం క్లాసులో పత్రీజీ .. షిర్డీ సాయిబాబా సూత్రాలు అయిన "శ్రద్ధ, సబూరీ" గురించి సందేశం:

"‘శ్రద్ధ’ అంటే ఏకాధాటిగా చూసేది. అంటే చేస్తున్న దాని మీదే శ్రద్ధ పెట్టడం మరి ‘సబూరి’ అంటే సహనం, ఓర్పుగా ఉండటం, ప్రాపంచిక జీవితంలో అయినా, ఆధ్యాత్మిక జీవితంలో అయినా, సంసారిక జీవితంలో అయినా, నిర్వాణంలో అయినా శ్రద్ధ, సబూరీ అవసరం"

9వ తేదీ ఆదివారం ఉదయం పత్రీజీ సమక్షంలో ‘ఏకతాధ్యానం’ జరిగింది. ఆనంతరం ‘భగవద్గీతలో’ సందేశం :

అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |

గతసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ||

"శోకింపదగని దాని గురించి శోకించగూడదు. తక్షణ కర్తవ్యం ఆలోచించాలి." ఈ సందేశం అనంతరం మాకు తెలిసిన విషయం:

విజయవాడకు చెందిన A.V. శ్రీ చలపతిరావు గారు ఆ తెల్లవారుఝామున శరీరాన్ని విడిచేశారు. ఆయన ఆత్మ ముక్తాత్మగా పైలోకాలకు వెళ్ళి చేరినట్లుగా పత్రీజీ తెలిపారు. చలపతిరావు గారి భార్య మాటల ప్రకారం.. అయనకు మరణం వస్తున్నట్లుగా ముందే తెలిసి తన భార్యకు అన్నీ అప్పచెప్పి తనకు ఈ యాత్రలో ఎక్కడ మరణం సంభవించిందో అక్కడే అంత్యక్రియలు చేయవలసిందిగా కోరారట. ఆ ప్రకారం పత్రీజీ సమక్షంలో, పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో పత్రీజీ స్వయంగా ఆయనకు తలకొరివి పెట్టడం పిరమిడ్ సొసైటీకీ ఒక తలమానికమైన విషయం! ఈ కార్యక్రమం అంతా "అలకనందా" నదిఒడ్డున జరిగింది. అందరితో పాటు చలపతి రావు గారి భార్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్త్రీ జాతికే ధీరవనితగా నిలచింది. ఆమె మనోధైర్యం చెప్పనలవికానిది. ఇది ఒక పిరమిడ్ మాస్టర్లకే చెల్లింది!

ఇలా మనం మన సామర్థ్యాన్ని గుర్తింపగలిగేలా చాలా సామాన్యమైన సూత్రాలను అసామాన్యంగా వివరించి ఆధ్యాత్మిక రహదారి వెంబడి వ్యక్తిగత సంతృప్తిని పొందేమార్గం చూపిన.. జగద్గురువు బ్రహ్మర్షి పత్రీజీ కి శతకోటి ధ్యానాభివందనాలు.

 

బొద్దేటి సత్యవతి
చింతల అగ్రహారం
విశాఖపట్నం
సెల్ : +91 9985313423

Go to top