" పరమసత్యాన్ని తెలియజేస్తూ, ప్రతిఒక్కరినీ దైవాలుగా మలుస్తున్నారు పత్రీజీ "

 

నా పేరు సువర్ణ. నేను 2004 సంవత్సరం నవంబర్ నెలలో ధ్యానానికి వచ్చాను. నేను మొట్టమొదట పత్రీజీ ని మా ఇంటివద్ద ధ్యానకేంద్రంలో ఉండే ఫోటోలో చూసాను. ఫోటో చూస్తేనే మంచి వ్యవహార దక్షత, శైలీ ఉన్న "పెద్ద ఎగ్జిక్యూటివ్" లా అనిపించారు కానీ..దానిలో "బ్రహ్మర్షి పత్రీజీ" అని వ్రాసి ఉంది.

"బ్రహ్మర్షి గా అవ్వాలంటే వేలకు వేల సంవత్సరాలు తపస్సు చేయాలి; ఎంతో కష్టపడాలి" అని పురాణాలూ, ఇతిహాసాలూ ఘోషిస్తూన్నాయి. ఈయన వయస్సు చూస్తే అరవై సంవత్సరాలు కూడ దాటినట్టు లేదు. మరి ఇంత చిన్న వయస్సులో ‘బ్రహ్మర్షి’ కావడం ఎలా సాధ్యం?" అనే అనుమానం నాకు కలిగింది.

"సరే లే.. పేరుకు ముందు ఏదో ఒకటి వేసుకోవడం ఈ రోజుల్లో ప్రతిఒక్కరికీ ఫ్యాషన్ అయిపోయింది. ఈయన కాస్త వెరైటీగా ‘బ్రహ్మర్షి’ అని వేసుకున్నారు. అయినా, ఎవరెట్లా పోతే నాకేం? ఎవరేదైతే నాకేం? వచ్చామా, ధ్యానం నెర్చుకున్నామా, వెళ్ళామా అని ఉండాలి కానీ, ఇదంతా మనకెందుకు?" అనిపించింది.

కానీ వెంటనే మనస్సులో "మనం పిరమిడ్ సంస్థకు వచ్చి, ఈ సంస్థ నేర్పిస్తున్న ధ్యానవిద్యను నేర్చుకుని, ఆ విద్య ద్వారా జీవితంలో బాగుపడాలని అనుకున్నప్పుడు, ఆ సంస్థ ఫౌండర్ గురించి తెలుసుకోవలసిన అవసరం ఉందా? లేదా?" అన్న ప్రశ్న మళ్ళీ నాలో తలెత్తింది! నాటి ఆ ప్రశ్నకు సమాధానం నాకు అతితొందర్లోనే దొరికింది.

ఆ తర్వాత "ధ్యానాంధ్రప్రదేశ్ విజయోత్సవాలు -2004" హైదరాబాద్‌లో జరిగినప్పుడు సార్‌ని చూడాడం జరిగింది. ఎంతో సింపుల్‌గా ధవళ వస్త్రాల్లో పత్రీజీ ఒక్కరే స్టేజీ మీద ఉన్నారు. ఆ రోజు చీఫ్‌గెస్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ శాఖామాత్యులు ముఖ్య అతిథిగా వస్తున్నా ఎటువంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా అతి సాదాసీసాగా పత్రీజీ ఉండడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.

"మన దగ్గరకు ఎవ్వరు వచ్చినా మనతోపాటు మనలాగే మన దగ్గర ఉండాలి కానీ, ఎవ్వరికోసం మనం మారం" అని సార్‌ని చూసిన వెంటనే నేను అందుకున్న సందేశం. అక్కడ సభలో సార్ అతిథులను ఆహ్వానించడం, వెళ్ళేవారిని సత్కరించి సాగనంపడం, ఆర్గనైజర్స్‌కు సూచనలు ఇవ్వడం, మధ్యమధ్యలో తాను మాట్లాడటం, అందరిచేత చప్పట్లు కొట్టించడం, ఇలా ఏకకాలంలో అన్ని పనులు చేయడం చూసి "‘సవ్యసాచి’ అన్న పదానికి నిజమైన అర్థం ఇదే" అని తెలిసింది.

అంతకు మునుపు సార్‌ను ఫోటోలో చూసి "‘వయస్సు మళ్ళినవారు’ అనుకుని చాలానే మోసపోయాను" అన్న పరమసత్యం నాకు తెలిసింది. పత్రీజీ దగ్గర ప్రతిఒక్కరూ నేర్చుకోవలసిందీ, తెలుసుకోవలసిందీ వారి ఓర్పు, సహనం. "వినదగు నెవ్వరు చెప్పిన" అన్నట్లు ఎవ్వరేం చెప్పినా ఆసాంతం ఓపికగా వింటారు! ఆ తర్వాత దానికి చక్కని పరిష్కారం సూచిస్తారు.

ఆదరణతో ప్రతిఒక్కరికీ షేక్‌హ్యాండ్ ఇచ్చి పరామర్శించడంతో ‘ప్రేమ’ ...ధ్యాన జగత్తు‌ను సంకల్పించడం ద్వారా ఈ భూమిమీద ప్రతిఒక్కరినీ ధ్యానిగా చేయాలనడంతో ‘దయ’. మానవజాతినే కాకుండా జంతుజాలాన్ని కూడా రక్షించడానికి ప్రతిఒక్కరినీ శాకాహారులను చేయడంతో ‘కరుణ’ ..వెనుకటి ఆస్థిపాస్తులు ఏమీ లేకపోయినా, ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టడంతో ‘త్యాగం’..కోపంతో తిట్టడం, కొట్టడం ప్రదర్శిస్తూ ‘రౌద్రం’ సేవ,డబ్బు ప్రమేయం లేకుండా ప్రతిఒక్కరికీ ఆత్మజ్ఞానం ఉచితంగా అందివ్వడంతో ‘సేవ’ ఇలా అన్ని గుణాలనూ వారూ అద్భుతంగా ఆచరణలో చూపిస్తారు!

పత్రీజీ ప్రతిఒక్కరినీ "గ్రేట్ మాస్టర్స్" అంటూ పొగడడం చూసి, మనచేత పనులు చేయించుకోవడానికి ఆయన ఇలా అంటారేమో, "మనమేంటి? మాస్టర్స్ ఏంటీ? అందులో ‘గ్రేట్’ ఏంటి అంతా ఉట్టిదే!" అనుకున్నాను.

కానీ మనం ఏ పని చేయడానికి ఈ జన్మ తీసుకున్నామో మనకు తెలియకపోయినా.. ఏ పనినైతే మనవల్ల అవుతుందో, ఆ పనినే మనకు అప్పగించి, ఆ పనే మనచేత చేయిస్తారు" అని నాకు అర్థం అయ్యింది.

ఈ రోజు ప్రతిఒక్కరికీ కావలసింది డబ్బు, సైన్స్, టెక్నాలజీ మాత్రమే కాదు, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అభిమానం.. మరి వీటన్నిటినీ మించిన గాఢమైన స్నేహం! ఇవన్నీ కొరవడడం వల్లనే మానవ జీవితాల్లో ఇంతటి ఆటుపోట్లు మరి సంఘంలో ఇంతటి కల్లోలం.

అయితే ఇవన్నీ ధ్యానం వల్ల పుష్కలంగా పెంచుకుంటూ ప్రతిఒక్కరూ మానవత్వం నింపుకున్న దైవాలుగా మలచబడుతున్నారు! స్త్రీల పట్ల పత్రి సార్ చూపించే గౌరవమర్యాదలు అనన్య సామన్యం! స్త్రీ శక్తిని ఇంతగా వినియోగించుకుంటూన్న గొప్ప గురువు ప్రవక్త ఈ భూమిమీద మరొకరు కానరారు!

గౌతమబుద్ధుడు కూడా తాను బుద్ధత్వం పొందడానికి భార్యతో చెప్పకుండా వెళ్ళాడట. తీరా తాను బుద్ధత్వం పొందాక చేసిన మొదటిపని తనతోపాటు అంతకుమునుపు సాధన చేస్తోన్న నలగురిని తన శిష్యులుగా చేసుకుని మార్గం చూపించడం. కానీ..అంతకన్నా ముందు కపిలవస్తుకు పరిగెత్తుకు వచ్చి, యశోధరతో "నేను సాధించాను, నేను తెలుసుకున్నాను, పొందాను, రా! నువ్వు కూడా సాధన చేసి నిర్వాణాన్ని పొందు" అంటూ భర్తగా తన కర్తవ్యాన్ని నెరవేర్చలేదు. బుద్ధుడి జీవితంలో వేలెత్తి చూపించదగ్గ సంఘటన ఏదైనా ఉందా అంటే అది యశోధర విషయంలో ఆయన ప్రవర్తించిన తీరు మాత్రమే! కానీ పత్రీజీ మాత్రం బుద్ధత్వాన్నీ, నిర్వాణాన్నీ కలిపి "సంసారయత నిర్వాణం" అనే షార్ట్‌కట్ మార్గాన్ని మనకు చూపించి, తాను దానినే ఆచరిస్తూ, తనతోపాటు తన అర్థాంగిని కూడా బుద్ధత్వం వైపు నడిపిస్తున్న ప్రథమ పరమ బుద్ధుడు!

"ఆత్మజ్ఞానానికి స్త్రీ, పురుష బేధం లేదు; వారి వారి ప్రయత్నం, సాధన అభిరుచిని బట్టి ఆత్మ ఎదుగుదల ఉంటుంది; స్త్రీ అంటే శక్తిస్వరూపిణి, ఆత్మజ్ఞానంలో పురుషుడి కన్నా స్త్రీనే ప్రకృతిపరంగా మరింత అర్హురాలు" అంటూ స్త్రీ జాతి యావత్తుకూ వారు అందిస్తూన్న చేయూత, ఇస్తూన్న ప్రోత్సాహం సృష్టిలోనే అపురూపం!

వారు నిర్వహిస్తున్న "మహిళా ధ్యానయజ్ఞాలు" స్త్రీ లోకానికి మరింత వన్నెను చేకూరుస్తూండగా స్త్రీలోకం.. కై మోడ్చి... వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటోంది!

"స్వర్గం అన్నది ఎక్కడో లేదు, అది ఈ భూమిమీదే ఉన్నది. ప్రతిఒక్కరూ ధ్యానం చేయడం ద్వారా..హింసను విడనాడడం ద్వారా...ఆరోగ్యం పొందడం ద్వారా..ఆనందంగా జీవించడం ద్వారా..స్వర్గం అన్నది ఈ భూమిమీదే ఆవిష్కరింపబడుతుంది" అన్న పరమసత్యాన్ని తెలియజేస్తూ, ప్రతిఒక్కరినీ దైవాలుగా మలుస్తున్నారు పత్రీజీ..

హ్యాట్సాఫ్ టు పత్రీజీ!!

 

సువర్ణ
చెన్నై
తమిళనాడు

Go to top