" అనుభవిస్తేనే .. ఆ ఆనందం "

 

బ్రహ్మర్షి పత్రీజీ సమక్షంలో, ‘ధ్యానరత్న’ కేశవరాజు గారి సారధ్యంలో జరిగిన 13 రోజుల "హిమాలయ ధ్యానయాత్ర" బ్రహ్మానంద భరితం. ప్రతిరోజూ ఏనాటిది ఆనాటిదే, ఎవరిది వారిదే అనుభవాల మాలిక! కష్టం, సుఖం ప్రక్కప్రక్కనే వుంటాయన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొన్నాం. రోజంతా ఎత్తైన శిఖరాలలో ట్రెక్కింగ్ .. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారు నడక, గుఱ్ఱం, డోలీలలో! ఆ రోజుకి శ్రమ కొంత శ్రమ అనిపించినా -ఉదయానికి అంతా హుష్ కాకి! మళ్ళీ మంచి ఎనర్జీతో ఫ్రెష్, మరో ట్రెక్కింగ్‌కి సిద్ధం.

మేం 1990 లోనే ఢిల్లీ, హరిద్వార్, ఋషికేశ్, కేదార్‌నాథ్, బదరీనాథ్‌లు ఆ తర్వాత అమర్‌నాథ్, నేపాల్‌లోని ముక్తీనాథ్, టిబెట్‌లోని మానస సరోవర్‌లను దర్శించడం జరిగింది. తిరిగి ఇప్పుడు ఆగస్టు 2009 లో ఈ యాత్ర. ఈ రెంటికీ ఎంతో వ్యత్యాసం!

అప్పుడు "ఈ సృష్టికి మూలకారణం దేవుడు" అనే స్థితిలో వున్నాను. ఒక నిజమైన భక్తురాలిగా ఆనందించాను. ఇప్పుడు "అదే నేను; నేను దేవుని అంశాన్ని" అనే భావంతో .. అదే యాత్ర ఎంతో ఎనర్జీతో హుషారుగా, సామూహిక ధ్యానాలతో ఎంజాయ్ చేసాను. మేము ప్రయాణం చేసిన ట్రైన్, బస్సులలోని వారంతా ధ్యానకుటుంబమే! "ప్రపంచమంతా యిలా వుంటే ఎంత బాగుండు" అనిపించింది. తినుబండారాలు పంచుకుంటూ, ధ్యానానుభవాలు తెలుసుకుంటూ, అందరితోను స్నేహాన్ని పెంచుకుంటూ .. అంతా థ్రిల్లింగ్! అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది!

మొదటి రెండు రోజులలో ఢిల్లీలో అద్భుత నిర్మాణమైన అక్షరధామ్, మరింత ఆశ్చర్యకరమైన లోటస్ టెంపుల్‌, హరిద్వార్‌లో మానస దేవాలయం దర్శించాము. బదరీనాథ్ దారిలో పెద్ద కొండ విరిగిపడగా, దానిని పూర్తిగా తొలగించగా మాకు ముందుకు దారి ఏర్పడింది. వర్షాలతో, చలితో వుండాల్సిన వాతావరణం వేడికి అలవాటైన వాళ్ళమని వేడిగా మారటం ఒక వింతగా అనిపించింది. బదరీనాథ్ సమీపంలో వ్యాసాశ్రమం, సరస్వతీ లోయ మమ్మల్ని స్వాగతించాయి. ఎప్పుడూ ఎంతో రద్దీగా వుండే బదరీనారాయణ గుడి కూడా ఖాళీగా మాకు స్వాగతం చెప్పింది. చక్కగా పత్రీజీ వారి సమక్షంలో ధ్యానం చేసుకున్నాము.

పత్రీజీ కలల లోయ "వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్’కు ప్రయాణం పరమాద్భుతం! గుఱ్ఱంపై బ్యాలెన్స్ చేసుకుంటూ కొండ అంచుల మీదే ఏమాత్రం తడబడకుండా నడుస్తూన్న గుఱ్ఱాన్ని భగవంతునిగా భావిస్తూ ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ జీవితంలో ఎన్నడూ చూడని అందాల మేఘాల తోరణాలు, అప్పటికప్పుడే వచ్చే చిరుజల్లులు, పువ్వుల సువాసనలు, రంగుల ఇంద్రధనస్సులు జలపాతాల హోరుతో ఏర్పడిన ఆ మంచుపొగ, ఆ ఆనందం చూసి ఆనందించవలసిందే!

మా అబ్బాయి "రవి" U.S.A. లో టూర్‌కి "Smoky Mountains" కి తీసుకువెళ్ళాడు. అక్కడ సహజంగా ఉన్న అందం కంటే వాళ్ళు కల్పించిన కృతిమ అందాలే ఎక్కువ. రోప్‌వేలు, లిప్ట్‌లు మొదలైనవి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అందాల ముందు దిగదుడుపే!

ఆ తరువాత సుదీర్ఘ ప్రయాణం. ఉల్లాసంగా, ఉత్సాహంగా బస్సులో జోక్స్ వేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, వయస్సును మరచి చిన్నపిల్లలా అనందించాను. "ద్వారాహట్" చేరాము. ‘హోటల్ మయాంక’, నిజంగా మయసభలానే వుంది. ఎన్ని మెట్లు, ఎన్నో చుట్లు తిరిగినా ఎంట్రన్స్ రాదు. చలిలేదు, హాయిగా స్నానాలుచేసుకొని మహావతార్ బాబా గుహకి ప్రయాణం, రజనీకాంత్ “బాబా" సినిమా గుర్తుకు వచ్చింది. మళ్ళీ ట్రెక్కింగ్. మూడు కిలోమీటర్లు. ఆయన కట్టించి, "యోగదా సత్సంగ్" వారికి యిచ్చిన హాలు ముందు ఎత్తైన కొండ మీద వున్న బాబాజీ ధ్యానం చేసిన గుహ వద్దకు చేరుకున్నాం. అక్కడ ఎంతో ఎనర్జీ లెవల్స్ వున్నాయి. ధ్యానంలో కూర్చున్న క్షణమే ఆలోచన లేని ధ్యానస్థితి వచ్చింది. కొండమీద వృక్షాల పచ్చదనం. మనసు హాయిగొలుపు చల్లదనం, ఆ సెలయేరుల హోరు. "ఆహా! ఏం ఆనందం, వర్ణానాతీతం!

కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దామంటే, "ఇంత ఆనందాన్ని కోల్పోతామేమో" అనిపించింది. కళ్ళు తెరిచినా ధ్యానస్థితే! బాబాగారు పత్రిగారి రూపంలో మావెంటే వున్నట్లు అనిపించింది. 3కి.మీ కొండ ఎక్కినా ఎక్కినట్లే అనిపించలేదు. నా జన్మ తరించింది. "నేనేనా యిక్కడికి వచ్చింది? ఇది కలా! నిజమా?" అనే అనుమానంతో గిల్లి చూసుకున్నాను. గుహలో కూడా సహజంగా, కూల్‌గా అనిపించింది. స్వర్గంలోనికి 10 ని||వెళ్ళి, తిరిగి భూమి మీదకు వచ్చినట్లు అనిపించింది. ఆ రోజు రాత్రి జరిగిన సంబరాలలో నేను డాన్స్ కూడా చేసాను!!

తిరుగుప్రయాణంలో ఆఖరుగా "నైనిటాల్" పర్వత శిఖరాల సౌందర్యాలు, సరస్సులోని బోటు విహారాలతో ధ్యాన విహారయాత్ర ముగించుకొని మరుసటి ఉదయానికి ఆగస్టు 12వ తేదికి ఢిల్లీ చేరుకున్నాము.

ఈ యాత్ర నా జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేని, మరుపురాని, మధురానుభూతిని కలిగించింది!

 

చిట్టూరి కల్పనామూర్తి
రాజమండ్రి
సెల్ : +91 94404 83875

Go to top