" పిరమిడ్ నిర్మాణానికి ఆస్ట్రల్ మాస్టర్స్ సహకారం "

 

హలో ఫ్రెండ్స్! నా పేరు మంజు!

నాకు ఆనాపానసతి ధ్యానం గురించి ప్రతినెలా ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న మన "ధ్యానాంధ్రప్రదేశ్" మ్యాగజైన్ అంటే చాలా ఇష్టం.

నా ధ్యాన జీవితం 2007 వ సంవత్సరం శివరాత్రి పర్వదినం నుంచి మొదలైంది. 2012 సం|| నాటికి "ధ్యాన జగత్" గా ఈ ప్రపంచాన్ని చూడాలన్న సంకల్పంతో అవిశ్రాంతంగా పనిచేస్తోన్న మన పత్రీజీ అడుగుజాడల్లో నడిచే కొంతమంది స్నేహితుల ద్వారా నాకు ఇంత చక్కని అద్భుతమైన ధ్యానం నన్ను చేరి నా నుంచి మరి కొంతమందికి ఆనందాన్ని రుచి చూపించింది.

మేం విశాఖపట్నంలో ఉంటాం. పత్రీజీ వైజాగ్ వచ్చిన ప్రతిసారి కలవాలనీ, మరి మాట్లాడాలనీ ఆశపడేదాన్ని. ఈ విధంగానే ఈసారి సంక్రాంతి పండుగ కి ఆయన్ని కలిసినప్పుడు మాటల సందర్భంలో పత్రీజీ నాతో ఇలా అన్నారు "ఎప్పుడు మీ ఊరు తీసుకువెళ్తారు మేడమ్?" అని. నాకు చాలా షాక్ అనిపించింది .. "తప్పకుండా సార్! పిరమిడ్ కట్టించి మా ఊరు తీసుకువెళ్తాను" అని ఖంగారులో అనేసాను కానీ అప్పటి నుంచీ నాలో ఒకరకమైన అదుర్దా మొదలైంది. సార్‌తో "తీసుకువెళ్తాను" అన్నానేగాని "ఎలా? ఎవరు నాకు సపోర్ట్ చేస్తారు పిరమిడ్ కట్టటానికి? ఎలా ఒప్పించాలి? ఒప్పుకున్నా పిరమిడ్ నిర్మాణానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?" .. అని రకరకాలుగా ఆలోచించేదాన్ని. అప్పటికి నా దగ్గర 500 రూ||లు కూడా లేవు.

తర్వాత తర్వాత అనుకోని కొన్ని కారణాల వలన మేము మా ఊరు మారాల్సి వచ్చింది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇంట్లో అందరూ బాధపడుతూ హాస్పిటల్‌లో కూడా జాయిన్ అయ్యారు అప్పుడు మా వారితో అన్నాను “ఇంట్లో పిరమిడ్ నిర్మించుకోవడం వల్ల మనం అన్ని ఇబ్బందులు నుంచి బయటపడవచ్చు" అని! మా వారు మరి కొంతమంది "సరే" అన్నారు. ఎవరైతే ఒప్పుకోరు పిరమిడ్ కట్టటానికి అనుకున్నానో వాళ్ళతో కాసేపు మాట్లాడేసరికి అద్భుతంగా ఒప్పుకోవడం నాకు ఆనందాన్ని కలిగించింది!

ఫ్రెండ్స్ ! నా అనుభవం ఏమంటే మీలో "పిరమిడ్ కట్టాలి" అని కోరిక ఉంటే చాలు భౌతికంగా మనకు కావలిసిన ఆర్థిక సహాయాన్నీ, ఆస్ట్రల్‌గా మనకు మనోశక్తిని మన మాస్టర్స్ అందిస్తారు! నేను కలలో కూడా ఊహించని విధంగా మావారు నాకు సహకరించారు ఈ అద్భుత నిర్మాణంలో.

పత్రీజీ చెప్పినట్లు మనం ధ్యానం చేస్తూ మరి ఈ ధ్యానానందాన్ని నలుగురికి పంచుతూ మన స్థోమతను బట్టి ఒక పిరమిడ్‌ని నిర్మించి లోకకళ్యాణానికి దాన్ని అర్పించినట్లైతే మన ఆత్మకు మోక్షం మరీ ఈ భూమిపై మళ్ళీ పుట్టకుండా మనకు ప్రమోషన్ లభిస్తుంది. మరి మీరంతా "ధ్యానజగత్" మరి "పిరమిడ్ జగత్" లో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటూ నా ఆత్మపూర్వక శుభాకాంక్షలు.

 

మంజు

Go to top