" సృష్టితల్లి సహాయం కోరాను.. పొందాను" "విత్తనాలు చాలా బాగున్నాయి "


 

నా పేరు వెంకటరత్నం.మాది తూర్పుగోదావరి, నేను పండించేది వరి. ఊరు కట్టుంగ, అత్రేయపురం మండలం.

నేను 2002 సం|| నుంచి ధ్యానం చేస్తున్నాను. మా అక్క కృష్ణవేణి మేడమ్ ద్వారా ధ్యానపరిచయం కలిగింది. 2008 సం|| జూలై నెల 28, 29, 30 తేదీలలో వ్యవసాయశాఖవారు వ్యవసాయంలోని మెలకువలు నేర్పే విషయం నిమిత్తం మా రైతులకు క్లాసులు నిర్వహించారు. మండలంలో 40 మంది రైతులు పాల్గొన్నారు అందరూ శ్రద్ధగా విన్నారు. మూడవరోజు మధ్యాహ్నం వారు నిర్వహించిన క్లాసులపై ‘క్విజ్‘ కార్యక్రమం నిర్వహించారు. 25 ప్రశ్నలకు 25 మార్కులకు గాను నాకు 201/2 మార్కులు వచ్చి మొదటి భహుమతి రావటం జరిగింది! మండలం ప్రెసిడెంట్ P.S. రాజు గారు చేతులమీదుగా బహుమతి స్వీకరించటం జరిగింది. మా స్నేహితులు అందరూ అభినందించారు. కానీ నాకు ఆనందం కలుగలేదు. కారణం 1982 సం||లో అంటే 20 సం||క్రితం 10వ తరగతిలో 4 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. 20సం|| క్రితం నాకు ఈ ధ్యానం తెలిసిఉంటే నేను 10వ తరగతి పాస్ అయి ఉండేవాడిని.

ధ్యానం వలన గ్రహించేశక్తి బాగా పెరిగింది. వ్యవసాయంలో అపారమైన అనుభవం కలిగింది. పొలం దగ్గర కూర్చుని ధ్యానం చేస్తూంటే నాకు చాలా అనందంగా ఉంటుంది. పొలంలో ఎలుకలు పంటను పాడుచేస్తాయి. కానీ నేను ధ్యానంలోకి వచ్చాక ఎలుకలకు మందు పెట్టడం మానేసాను. పెట్టుబడి తక్కువతో పంటను సమానంగా పండిస్తున్నాను. 2009 సం|| జనవరి 4, 5, తేదీలలో 4 ఎకరాల పొలంలో "స్వర్ణవిత్తనం" ఊడ్చాను.

జనవరిలో స్వర్ణరకం ఎవ్వరూ పండించరు. "అగ్గితెగులు బాగా పట్టి వరి బాగా కుచించుకుపోయి పంట సరిగ్గా పండదు" అని అందరూ అంటూంటారు. దానికి విరుద్ధంగా నేను అదేరకం ఊడ్చి బాగా పండించి వాటిని జూన్ నెలలో ఊడ్చేందుకు విత్తనాలుగా అమ్మాలని నా సంకల్పంతో సృష్టితల్లి సహాయం కోరాను. అత్యద్భుతంగా 1 ఎకరానికి 75 కేజీ బస్తాలు చొప్పున పండింది! బస్తా ఒక్కింటికి 1000 రూ||లు విత్తనాలు ధాన్యం అమ్మటం జరిగింది. 4 ఎకరాలకు 200 బస్తాలు 1000 రూ||లు చొప్పున 2,00,000రూ|| వచ్చాయి! "స్వర్ణవిత్తనం ఊడ్చుడమంటే కత్తిమీద సాము" అంటారు. "నీకు సాహసం అంత అవసరమా? 1/2 ఎకరం గాని, 1ఎకరం గాని ఊడ్చకపోయావా? ఆశకొద్దీ4 ఎకరాలు ఊడ్చావు" అని అందరూ అనేవారు. ఎకరానికి 50 బస్తాలు, బస్తా ధర 1000 రూ||లు అమ్మేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. "విత్తనాలు చాలా బాగున్నాయి" అంటూ అందరూ కొనడం జరిగింది ఈ సం|| 400 ఎకరాలకు పైగా ధ్యానవిత్తనాలు నా నుంచి వెళ్ళాయి. వచ్చే సం||ఇదేరకం విత్తనం పండించి 800 ఎకరాలకు పైగా విత్తనాలు పంపిణీ చేయాలని నా సంకల్పం. నేను ఇంత రిస్కు చేసాను అంటే.. "రిస్కులోనే ‘కిక్కు’ ఉంది అది పిరమిడ్ మాస్టర్‌కి సాధ్యం" అని చేసాను! ధ్యానం మొదలుపెట్టక ముందు విత్తనాలు రసాయనాళ్ళతో శుద్ధి చేసేవాడిని.

ఇప్పుడు మా ఇంటిదగ్గర "గీతా పిరమిడ్ ధ్యానకేంద్రం ప్రారంభోత్సవం" పత్రీజీ చేతులమీదుగా జరిగింది. అప్పటినుంచి విత్తనశుద్ధి కెమికల్స్ మానివేసి పిరమిడ్ శక్తితో శుద్ధిచేయడం జరుగుతోంది. కెమికల్స్‌తో శుద్ధిచేసిన విత్తనాలకు కొద్దిరోజుల ప్రభావమే ఉండేది. "పిరమిడ్‌శక్తితో శుద్ధిచేసిన విత్తనాలకు పంట పూర్తి అయ్యేవరకు దాని ప్రభావం ఉంటుంది" అని నేను అనుభవ పూర్వకంగా గ్రహించాను!

ఒకసారి ఒక పుస్తకంలో ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీమిట్టల్ గారి ఇంటర్వ్యూ చదివాను. "మీ అభివృద్ధికి కారణం ఏమిటి?" అని అడిగితే ఆయన "మా వర్కర్స్" అన్నారు. నేను నా వర్కర్స్ నుంచి అది గ్రహించడం జరిగింది. ఈ సంవత్సరం ఇంత పంట పండించాను. అంటే నేను ధ్యానం చేయడం వలన. ధ్యానంలో ప్రతి వరి మొక్కతోనూ మాట్లాడటం జరిగింది. ఆ మొక్కలు ఏం మందులు కావాలో అడిగి అవే మందులు పిచికారి చేయడం జరిగింది. అందుకే అవి పెద్ద అయి ఎవరికీ పండనీ విధంగా ఫలసాయాన్నిచ్చాయి. బ్రహ్మర్షి పత్రీజీ యొక్క సందేశాలు విని ఆచరించడం వలన ఈ విజయం నా సొంతం అయింది! ఈ విజయం ప్రకృతి ఇచ్చిన సహకారం అందుకే ఈ విజయాన్ని ప్రకృతికే అంకితం ఇస్తున్నాను. అందరూ ధ్యానం చేసి శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక, అరోగ్యాలతో ఉండాలని సృష్టిపట్ల కృతజ్ఞత భావంతో ఉండాలని కోరుకుంటున్నాను.

వ్యవసాయానికి కూలీలు తక్కువగా ఉండి రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. నాకు ఆ ఇబ్బంది లేదు. కారణం నేను నా తల్లిదండ్రులను, నా భార్య బిడ్డలను ఎంతగా ప్రేమిస్తానో అంతే ప్రేమతో నా కూలీలను కూడా చూస్తాను. వాళ్ళు కూడా నన్ను అంతగా ప్రేమిస్తారు. ఈ విజయం వారిది కూడా. వారికి నా కృతజ్ఞతలు! మా కూలీలు ఇప్పడిప్పుడే ఒక్కొక్కరు మాంసాహారం తినటం మానివేస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మా కూలీలు కూడా “ఇలా పని చేస్తూంటే అసలు అలసట ఉండదు, చాలా హుషారుగా ఉంటోంది" అంటున్నారు. ధ్యానం చేయడం, ధ్యానం చెప్పటం కాకుండా ధ్యాన వ్యవసాయం బాగా ప్రచారం చేయాలని నా సంకల్పం.

 

P. వెంకటరత్నం
కట్టుంగ, తూర్పుగోదావరి జిల్లా
సెల్ : +91 94900 86545

Go to top