" విశ్వం చేసుకున్న అదృష్టం "

 

నా పేరు వెంకట సత్య అన్నపూర్ణాదేవి. మాది పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం.

నేను 2004 డిసెంబర్‌లో ధ్యానంలోకి రావడం జరిగింది. ఇక అప్పటి నుంచి నా జీవితమే ఒక అద్భుతమైన జీవనయాత్రగా మారింది. 2009 అగస్టు 1వ తేది నుంచి 12వ తేది వరకు పత్రీజీ తో పాటు "ధ్యాన హిమాలయ యాత్ర"లో పాల్గొనడం నా జన్మజన్మల అదృష్టం! ఆద్యంతమూ అద్భుతంగా సాగిన ఈ ధ్యానయాత్రలో ఎందరెందరో మాస్టర్స్ నుంచి నేను సందేశాలు పొందడం జరిగింది.

5వ తేదీన బదరీనాథ్ లోని లక్ష్మీనారాయణ గుడి లో పత్రీజీ మా అందరిచేత ధ్యానం చేయించినప్పుడు నేను బదరీనారాయణుణ్ణి ఒక సందేశమడిగాను. దానికి ఆ స్వామి మన పత్రీజీ ని చూపించి "ఈయనే ఒక పెద్ద సందేశం మీకందరికీ అన్నారు. ఆయన గురించి ఏమని చెప్పను? పత్రిసార్ లాంటి వ్యక్తి ఇప్పటివరకు ఈ భూమిమీద జన్మించలేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పిన ఏకైక వ్యక్తి. సత్యాన్ని బట్టబయలు చేసారు. ఎంతోమంది గురువులు వచ్చారు. ‘శిష్యులను’ తయారుచేసారు. కానీ రహస్యాన్ని మాత్రం బట్టబయలు చేయలేకపోయారు. ఉన్నది ఉన్నట్లు చెప్పలేక పోయారు. ఆశ్రమాల పేరిట శిష్యులను అలాగే వుంచారు. భయపడి సత్యాన్ని వెల్లడించలేక ఆచారాల పేరిట, పూజలు, జపాల పేరిట, శిష్యులను అలానే ఉంచారు. కానీ పత్రిసార్ నిర్భయుడు! కాబట్టి స్వంతం ధ్యాన ప్రచారం చేస్తూ ఇంతమంది ధ్యానులను తయారుచేసాడు. ఆయన ఆ ధ్యానుల ద్వారా విశ్వమంతా ధ్యానపరిచయ ఉద్యమాన్ని చేపట్టిన మహామనిషి. ఎంతోమంది అస్ట్రల్ మాస్టర్స్ ఈ భూమిమీదకు వచ్చి ధ్యానప్రచారం చేపట్టారు. మిగతా మాస్టర్స్ పత్రిసార్ లో ప్రవేశించి ఆయనకు సహాయపడుతూ వుంటారు” అంటూ పత్రిసార్ ని భూమికీ, ఆకాశానికీ సరిపోయేంత వ్యక్తిగా చూపించారు! ఎంతోమంది మాస్టర్స్ మరి ఆ బదరీనారాయణుడు పత్రిసార్‌లో కలవటం చూసాము. "‘నీవే దేవుడవు‘ అనే రహస్యాన్ని వెల్లడించిన ఏకైక వ్యక్తి మన పత్రిసార్ ! ధ్యానమే నీ జీవితం. శ్వాసయే నీ గురువు. శ్వాసే నీ ప్రాణం అని చెప్పిన మహిమాన్వితుడు. ఇంతటి జగద్గురువు లభించటం ఈ విశ్వం చేసుకున్న అదృష్టం" అని బదరీనారాయణుడు జ్ఞానసందేశమిచ్చాడు. ఆయనకు నా కృతజ్ఞతలు.

 

వెంకట సత్య అన్నపూర్ణాదేవి
పశ్చిమగోదావరి జిల్లా

Go to top