" నా .. ‘ఆత్మ’ కథ "

 

నా పేరు సోమశేఖరరావు ; నా భార్య శ్రీమతి స్వర్గీయ భగవతి; ప్రస్తుతం నా వయస్సు 58 సం||రాలు.

సెప్టెంబర్ 13, 2001 ప్రాంతంలో సికింద్రాబాద్ తిరుమలగిరిలో "Paramount School" లో బ్రహ్మర్షి పత్రీజీ క్లాసు జరిగినప్పుడు నేను ఆ క్లాసుకు వెళ్ళాను. ఆ క్లాసులో పత్రీజీ అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ నాకూ ఇచ్చారు. నా కళ్ళలోకి చూస్తూ "స్వామీ! మీరు వాడే మందులన్నీ మానేయండి!" అన్నారు. నేను నిశ్చేష్టుడిని అయ్యాను. అంతకుముందు వారితో నాకు అస్సలు పరిచయమే లేదు. "నాది ‘కంటి జబ్బు’ అని ఈయనకు ఎలా తెలుసు?!" అని ఆశ్చర్యపోయాను.

1984 సం|| నుంచి నాకు కంటిలో నీళ్ళు వచ్చేవి కావు. ఒక చిన్న బాటిల్ రూ. 100/- అవుతుంది. ఆ డ్రాప్స్ రెండు చుక్కులు రెండు కళ్ళలోనూ వేసుకుంటే తప్ప కళ్ళు కనిపించేవి కావు. పైగా భగ్గుమని మంటలు ఉండేవి. 1984 సం|| నుంచి రెగ్యులర్‌గా ఈ మందు వాడేవాడిని. పత్రీజీ ఈ మందులు మానమన్నప్పుడు నేను సందేహిస్తూ ఉంటే ప్రక్కనే సీనియర్ పిరమిడ్ మాస్టర్ Y.J. శర్మగారు నన్ను పలకరించి "సార్! పత్రీజీ సాధారణంగా ఇలా చెప్పరు. మరి వారు మీకు చెప్పారంటే, అందుకు ప్రత్యేకమయిన కారణం ఉంటుంది. మీరు ఒక వారం ప్రయత్నించి చూడండి" అని సలహా ఇచ్చారు. నేను అలాగే చేశాను. మందులు వాడడం మానేశాను. 2001 సెప్టంబరు నుంచి ఇంతవరకు మరి కళ్ళలో డ్రాప్స్ వేసుకోలేదు. నా కళ్ళు పనిచేస్తున్నాయి! మంటలు లేవు! ఈ విధంగా పత్రీజీ ఇలా తొలిపరిచయంలోనే నాలో గాఢమైన ముద్రవేసుకొనిపోయారు. నేను నా ఆత్మలో వారితో పెనవేసుకుని పోయాను. Y.J. శర్మగారు చెప్పినట్లు, నాకు పత్రీజీ తో జన్మజన్మల సంబంధం ఉందని క్రమంగా అర్థమయ్యింది!!

2001 మార్చి 31 నాడు నేను "స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా" లో స్పెషల్ అసిస్టెంట్ గా స్వచ్ఛంద రిటైర్‌మెంట్ తీసుకున్నాను. "ఆ సమయం ఎలా గడపాలి" అనుకుంటూ, కాకతాళీయంగా RSS లో చేరాను. అందులో యోగాసనాలు, వ్యాయామం నేర్చుకున్నాను. ఆ పైన కార్ఖానాలోని ఓల్డ్ వాసవీనగర్‌లో 2-9-2001 న ఈనాడు పేపర్‌లో "ఉచిత ధ్యాన శిక్షణ" అనే విషయం చూసి, అప్పుడు 8 రోజుల ధ్యాన కార్యక్రమానికి హాజరయ్యాను. ఈ ఎనిమిది రోజులూ నేను ఆ ప్రోగ్రాం కు విధిగా హాజరయ్యాను. ఆ కార్యక్రమంలో M. నిర్మలాదేవి, మారం శివప్రసాద్‌గారు, ప్రభాకర్, ఓమనా మేడమ్, పుష్ప మేడమ్, పద్మ మేడమ్, రాములుగారు, Y.S. శర్మ గారు.. ఈ మాస్టర్లందరూ పరిచయం అయ్యారు. నేను మారం శివప్రసాద్ గారి వద్ద, నిర్మలా మేడమ్ వద్ద ఎంతో నేర్చుకున్నాను. అయితే నా తొలిగురువు నిర్మలా మేడమ్ అని చెప్పవచ్చు!

ఇక నా భార్య స్వర్గీయ M. భగవతి, B.Ed. చేశారు. టీచర్‌గా పనిచేశారు, అన్ని సబ్జెక్టులు చెప్పేది. ఆమెతో 1975 ఫిబ్రవరి 28 న నాకు పెళ్ళి అయ్యింది. ఆమె కాన్సర్‌తో 7-7-2007 సాయంత్రం 7 గంటలకు భౌతికకాయాన్ని వెకేట్ చేసింది. "సహధర్మచారిణి" అనే పదానికి ఆమె నిర్వచనం. 32 సంవత్సరాల మా వైవాహిక జీవితంలో నాకొక అద్భుతమైన స్నేహితురాలిగా తాను మెలిగింది. మాకు సంతానం లేకపోయినా ఆమె ఎప్పుడూ నవ్వుతూ, తుళ్ళుతూ, ఆనందంగా జీవించింది.

1975 ప్రాంతంలో "కంచి పరమాచార్య’ వారు చాతుర్మాస్యదీక్షకు కర్నూలు వచ్చారు. అప్పుడు మా నాన్న M. అరుణాచల రావు కర్నూలులో DSP గా ఉండేవారు. నేను పరమాచార్య చంద్రశేఖర్ సరస్వతి వారిని దర్శించుకొని నాకు మంత్రదీక్షనిమ్మని ప్రార్థించాను. వారు నన్ను "స్వామీజీ" అని సంబోధించి, "మీరు ఒక ప్రత్యేకమైన పనిమీద ఈ భూమిమీదకు వచ్చారు. మీకు 50 సం||ల వయస్సు దాటిన తర్వాత మీకు మీ ‘గురుదర్శనం’ లభిస్తుంది. అంతవరకు ఇప్పటికే మీరు ఉపాసిస్తున్న గాయత్రీ మంత్రజపాన్ని కంటిన్యూ చేయండి. అంతకుమించిన మంత్రం ఏదీలేదు" అన్నారు. వారు ప్రవచించినట్లుగానే, నాకు 50 సం|| దాటిన తర్వాత, 2001 సం||లో బ్రహ్మర్షి పత్రీజీ పరిచయమవడం, "మంత్రం కన్నా ధ్యానం కోటిరెట్లు గొప్పది" అని తెలుసుకోవడం, తద్వారా పూర్తిగా ధ్యానయోగి గా మారడం జరిగింది!!

వీటన్నింటినీ గమనించినప్పుడు, నాకు నా యవ్వన దశలోని కొన్ని ఆధ్యాత్మిక అనుభూతులు స్ఫురణలోకి వస్తున్నాయి. మాకు శ్రీరాముడంటే చాలా ప్రీతీ. శ్రీరాముడు నా ఇష్టదైవం. చాలా సంవత్సరాల క్రితం నేను, మా ఆవిడ భగవతి ‘భద్రాచలం’ వెళ్ళాం. బస్సుదిగిన వెంటనే ఒక పది అడుగుల ఎత్తు కోతి మాకు ఎదురువచ్చింది. మా ఆవిడ "ఇంత పెద్దకోతి అంటే అంజనేయస్వామి తప్ప మరెవ్వరుంటారు?" అంది. ఇద్దరం ఆ మహావానరానికి నమస్కరించుకున్నాం. ఆ తరువాత కొండల్లోకి వెళ్ళిపోయినట్లుంది ఆ మహావానరం! మళ్ళీ మాకు కనపడలేదు. ఆ తరువాత భద్రాచల రామభద్రుడిని, సీతా, లక్ష్మణ సమేతుడిని దర్శనం చేసుకుని, ఇంటికి తిరిగివచ్చాం. ఇంటి తలుపుతాళం తీయబోతే, మేము వేసిన తాళం కాకుండా వేరేతాళం ఉంది. అంతలో ప్రక్కింటివాళ్ళు వచ్చి, "మీ ఇంట్లో దొంగలు పడ్డారు, మేం వేరే తాళం వేశాం, ఏం పోయాయో చూచుకోండి" అన్నారు.

లోపలికి వెళ్ళిచూస్తే ఇల్లంతా తిరగవేసినట్లు గజిబిజిగా గందరగోళంగా సామాన్లన్నీ ఇంటినిండా పడివున్నాయి. అయితే వెళ్ళేముందు మేం పడుకునే పరుపుక్రింద ఒక 10,000 రూ|| పెట్టి ఉంచాను, ఆ 10,000రూ|| పదిలంగా ఉన్నాయి! ఇక మా ఆవిడ తన నగలు మా పూజామందిరంలో శ్రీరాముడి పటం వెనుక ప్రక్క దాచి ఉంచి వచ్చింది. అవి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. అపుడు మాకు అర్థమయ్యింది, భద్రాచలంలో మాకు కనబడిన మహావానరం అంజనేయస్వామి ప్రతిరూపమేనని, తాను మమ్మల్ని కాచుకున్నాను అని తెలుపడం కోసం మాకు దర్శనమిచ్చాడని అర్థమయ్యింది! అంజనేయస్వామి గుడిలో ఆ తరువాత నలభై రోజులు ప్రదక్షిణలు చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నాం. అంజనేయస్వామి నా చిన్నప్పటి నుంచి ఎలా కాపాడుతున్నాడో, ఇపుడు బ్రహ్మర్షి పత్రీజీ అలా కాచుకుంటున్నారు నన్ను.

" ఏం జరిగినా మంచికే జరుగుతుంది, సరిగ్గానే జరుగుతుంది" అనేది నాకు చిన్నప్పటినుంచే అవగాహన. అలాగే నాకు ఎప్పుడూ చిరునవ్వుతో ఉండడం చిన్నప్పటి నుంచి అలవాటే. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థం అయ్యింది ఇది ‘మాస్టర్స్ క్వాలిటీస్’ అని. ధ్యానంలోనే నేను పొందిన సందేశం ఏమంటే.. నేను వేయి సంవత్సరాల క్రిందనే పత్రీజీతో సహవాసం చేసానని పత్రీజీ తరుచుగా చెపుతూంటారు! వారు తన వెంట 1,44,000 మందిని ఈ భూమి పైకి తీసుకువచ్చారనీ వారంతా పిరమిడ్ మాస్టర్స్ అనీ అందులో నేనూ ఒకడిననీ. నాకు పూర్తిగా అర్థమయ్యింది!

మా అమ్మ, నాన్న, నా భార్య అందరూ పైలోకాలకు ప్రయాణం చేసినా, నేను ఒంటరినయ్యాననే భావం నాలో లేదు. నాతో నేను ఉన్నాను! ధ్యానం వల్ల కలిగిన మహాలాభం ఇది!

ఇక ఆర్థిక విషయాలకొస్తే, మా నాన్నగారు చాలా చిన్నతనం నుంచే వారాలు చేసుకుని, చాలా శ్రమించి ఉద్యోగం సంపాదించి, మమ్మల్ని జాగ్రత్తగాపెంచి, బాగా చదివించారు. నేను నా సమస్తమైన సంపదనంతా పిరమిడ్ ధ్యాన ప్రచారానికే, పిరమిడ్ నిర్మాణాలకే వినియోగించాను, వినియోగిస్తున్నాను, వినియోగిస్తాను కూడా!ధ్యానానికి, ధ్యానప్రచారం చేసేవారికి, ధ్యాన కార్యక్రమాలకు వినియోగించేవారికి మాత్రమే నా ఆర్థిక సహాయం అంతే!

నా భార్య మరణించి రెండు సంవత్సరాలు దాటినా, నేను చిరునవ్వుతో జీవించగలగుతున్నాను అంటే అదంతా "బ్రహ్మర్షి పత్రీజీ" సాంగత్యమే! 2007 డిసెంబర్‌లో నేను తీవ్రమైన అనారోగ్యానికి గురిఅయ్యాను. అప్పుడు బ్రహ్మర్షి పత్రీజీ నా శరీరాన్నంతా శక్తిమయం చేసారు. "స్వామీజీ! పిరమిడ్ సొసైటీకి మీ సేవలు ఇంకా ఎంతో అవసరం ఉన్నాయి" అని .. నా ధ్యానమిత్రుడు M. సాంబశివరావు కు నన్ను అప్పజెప్పి జాగ్రత్తగా నన్ను గమనించుకోమని చెప్పారు. అలాగే శ్రీ సాంబశివరావు నన్ను కంటికి రెప్పలా కాచుకున్నారు. వారితో బాటు వాసవీనగర్ మాస్టర్స్ శ్రీ ప్రభాకర్, మారం, ఓమనా మేడమ్, చంద్రా మేడమ్, పుష్ప, నిర్మల వీళ్ళంతా నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నారు!

అలాగే పత్రీజీ నన్ను ప్రకాశం జిల్లాలోని " వలివేటిపాలెం" పిరమిడ్‌లో 40 రోజులు నన్ను ఉండమన్నారు. నేను దాదాపు 100 రోజులు అక్కడ వున్నాను. "శ్రీ రమణ సాయి పిరమిడ్"అది. చాలా గొప్ప హీలింగ్ పిరమిడ్! ప్రతి పిరమిడ్ మాస్టర్ చూసి ధ్యానం చేయవలసిన గ్రేట్ పిరమిడ్ అది! ఆ పిరమిడ్ నిర్మించిన శ్రీమతి రాజలక్ష్మి మేడమ్ ఆయుర్వేద వైద్యురాలు. ఆమె నన్ను కన్నతల్లిలా కాపాడారు. సేవ చేసారు. అవసరమైన ఆయుర్వేద వైద్యం చేసారు. అలాగే ఆ పిరమిడ్‌లో లోబ్ సాంగ్ రాంపా మాస్టర్ అక్కడికి వచ్చిన వారికి ఆస్ట్రల్ హీలింగ్ చేస్తారు. మరి బ్రహ్మర్షి పత్రీజీ యొక్క ఒక బాడీ సదా నన్ను సంరక్షిస్తూనే ఉంది. "ప్రతి పిరమిడ్ మాస్టర్ ను ఇద్దరు ఆస్ట్రల్ మాస్టర్స్ గైడ్ చేస్తూ ఉంటారు" అని పత్రీజీ చెప్పింది అక్షరసత్యం.

చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. "మీ జీవిత సహధర్మచారిణి క్యాన్సర్‌తో మరణించినపుడు.. ’ఆవిడ వెళ్ళిపోతారు’ అని మీకు ముందే తెలిసి ఎలా నిలదొక్కుకోగలిగారు?" అని! ఆమె శరీరాన్ని వెకేట్ చేయడానికి ఒక గంట ముందే నాకు విషయం అర్థమయ్యింది. సాయంత్రం 5గం||లకు కంఠం వరకు మంచులాగా అయిపోయింది. భగవతి చెప్పింది" ఏమండీ ! నేను వెళ్ళిపోతున్నాను" అని. "అవునమ్మా నాకూ అర్థమయ్యింది" అన్నాను. సాయంత్రం 7 గం||లకు 7-7-2007 న ఆమె నాకు ‘టాటా’ చెపుతూ కన్నుమూసింది.

ఎంతో యోగీశ్వరురాలు నా భార్య భగవతి! పత్రిగారి మార్గంలో తానూ ధ్యానం చేసేది. అందుకే మాట్లాడుతూ ‘టాటా’ చెప్పి వెళ్ళిపోయింది. ఆమెలేని లోటు ఒక ఆరునెలలు బాధాకరంగా ఉన్నా క్రమంగా లేవు. అనారోగ్యం నుంచి కూడా కోలుకోగలిగాను.

పత్రీజీ ఆదేశానుసారం 2004 సికింద్రాబాద్ ధ్యాన విజయోత్సవాల్లో కో-ఆర్డినేటర్ గా ఉన్నాను. పత్రీజీ నా సేవలను చాలా ప్రశంసించారు. అప్పటినుంచి పాంప్లెట్స్ తయారు చేయడం, పిరమిడ్ సొసైటీ ద్వారా ఎవరికి ఎటువంటి ఇన్‌ఫర్మేషన్ కావాలన్నా ఇవ్వడం ఇదే నా పని! పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ లో ఎవ్వరూ ఎక్కడ నుండి through out లో, విదేశాలలో నుండి ఫోన్ చేసినా వాళ్ళకు కావలసిన పిరమిడ్ స్పిరిచ్యువల్ ఇన్‌ఫర్మేషన్ సేకరించి తయారుచేసి పెట్టుకున్న దాంట్లో వెతికి ఇవ్వడం, సేకరించి తర్వాత వాళ్ళకు ఇన్‌ఫామ్ చేయడం ధ్యేయంగా పెట్టుకున్నాను.

పత్రీజీ ఏం చెపితే అలా చేయడం నా విధి! పత్రీజీ మీరు "బెంగళూరు విశ్వాలయం ట్రస్ట్ లో పనిచూడండి" అన్నారు. వారు చెప్పినట్లే బెంగళూరు వెళ్ళాను. అక్కడ పాల్ , I.V. రెడ్డి, ఇంజనీర్ ప్రసాద్ ల సాంగత్యం కలిగింది. వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు. సీనియర్ మోస్ట్ గ్రాండ్ మాస్టర్స్ I.V. రెడ్డి గారి నుండి ఆఫీస్ బాధ్యతలు స్వీకరించి, 15 రోజులు బెంగళూరులో, 15 రోజులు హైదరాబాద్‌లో ఉంటూ వచ్చాను. బెంగళూరులో ఆఫీస్‌లో అకౌంట్స్ అన్నీ గమనించే వాడిని. అలా దాదాపుఒక మూడు నెలలు 2005 జూన్, జూలై, ఆగస్టుల్లో ఉన్నాను. ఆ తర్వాత నా భార్యకు కాన్సర్ అని తెలిసిన తర్వాత, ఆమెను ఫుల్‌టైమ్ గమనించుకున్నాను. ఆమెకు వంటవండి తినిపిస్తూ, ఆమెను అనుక్షణం గమనించుకుంటూ, ఒక భర్తగా ఆమె ఋణం తీర్చుకున్నాను.

ఇక పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ లో నాకు పత్రీజీ ఇచ్చిన బాధ్యతలు పూర్తిగా నిర్విర్తించాను. మాస్టర్స్‌ను తయారుచేసే బాధ్యతను నాకు, S.R. నగర్ వెంకటరమణ గారికి ఇచ్చారు పత్రీజీ. ధ్యానుల్లో మెరికల్లాంటి వాళ్ళను ఎన్నిక చేసి వాళ్ళను మాస్టర్స్‌గా తీర్చిదిద్దే బాధ్యత నాకు చాలా తృప్తినిచ్చింది. ఎంతోమంది ఎన్నో సందేహాలు ఫోన్‌లో అడిగేవారు. నాకు తెలిసిన విషయం చెప్పేవాడిని. తెలియనివాటికి సీనియర్ మాస్టర్స్ వద్ద క్లారిటీ తీసుకుని, మళ్ళీ నన్ను అడిగిన వారికి ఫోన్ చేసి చెప్తాను.

"పత్రీజీ మంచి స్నేహితుడు" అని వారిని దగ్గరగా గమనించినవారందరికీ అర్థమవుతుంది. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ లోని 1,44,000 మాస్టర్లందరినీ ఏకకాలంలో గమనించేస్థాయి వారిది. ఏమిస్తే వారి ఋణం తీరుతుంది? తీరదు గాక తీరదు!!

 

మణూరి సోమశేఖరరావు
సికింద్రాబాద్
స్ ల్ : +91 93473 33723

Go to top