" ఊహించని ఆనందాన్ని స్వంతం చేసుకున్నాను "

 

నా పేరు శశిరేఖ.

నేను గత ఎనిమిది నెలలుగా ధ్యానం చేస్తున్నాను. ధ్యానంలోకి రాకముందు నాకు అనేక సమస్యలు ఉండేవి. వాటితో నేను చాలా బాధపడ్డాను. అనేక రోగాలు నన్ను పట్టిపీడించాయి. ఎందరో డాక్టర్లు, ఎన్నో మందులు ఇలా నా జీవితమంతా రోగాల పుట్టగా ఉన్న సమయంలో నాకు "గీతా మేడమ్"తన చల్లని ధ్యానహస్తాన్ని నాకు అందించారు.

అలా నేను ధ్యానంలోకి వచ్చిన వారం రోజులకే నాలో ఎంతోమార్పు కనిపించింది. మొదటిరోజు నుంచే నేను మందులన్నింటికి ‘గుడ్‌బై‘ చెప్పేసాను. మందులు వాడకున్నా నాకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. అదే సమయంలో నేను పత్రిసార్ గురించి తెలుసుకున్నాను. అదృష్టవశాత్తు సార్‌ని రెండు సార్లు కలవడం జరిగింది. ధ్యానానికి సంబంధించిన అనేక పుస్తకాలు చదువుతూ, నిరంతరంగా ధ్యానం చేస్తూ ఉన్నాను. నాలో క్రమంగా ఎన్నో మార్పులు.. నాలో ఏదో శక్తి ప్రవహిస్తున్నట్టుగా, శరీరంలో ఏవో నొప్పులు వస్తున్నట్టుగా, శరీరం తేలికైనట్టుగా అనిపించేది.

అలా ధ్యానం చేస్తూ ఉండగా ఎనిమిది నెలల తర్వాత ఒకసారి ధ్యానంలో ఏదో వెలుగువచ్చి నా నుదటి భాగాన్ని స్పృశించినట్టుగా అనిపించింది. కళ్ళలో అన్ని రంగులు సుడితిరిగినట్టుగా అనిపించింది. మరుసటిరోజు అదే కాంతి మళ్ళీ వచ్చి తాకింది, ఆ రోజు నాకు హిమాలయ పర్వతాలు అక్కడి వృక్షాలు, ఇంకా డ్యామ్‌లో నీరు ఎగిసిపడుతున్నట్లుగా కనిపించాయి.

అలా జరిగిన రెండు రోజులకు నాకు ధ్యానంలో ఏవో శవాల గుట్టలు కనిపించసాగాయి. మరుసటిరోజు కూడా మళ్ళీ అలాగే కనిపించగా వాటిని ‘కట్‘ చేసి "అలా ఎందుకు వస్తున్నాయి?"అనుకుని మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళాను. కాస్సేపటి తర్వాత ఒక అడవి కనిపించింది. దాన్ని అలా గమనించి చూడగా అక్కడ ఒక పులి చూస్తూండగానే పెద్దగా అయిపోయింది, దాని ప్రక్కనే ఏనుగులు పెద్దగా పెరిగాయి, ఇంకా పక్షులు, మిగతా జంతువులు అన్నీ విశ్వరూపాన్ని ధరించాయి. పక్షులు, మనుషులను ముక్కుతో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరి అక్కడి నుంచి క్రిందికి విసిరాయి. క్రింది సముద్రంలో మొసళ్ళు పెద్దగా నోరు తెరిచి మింగేస్తున్నాయి. గుర్రాలు భీకరంగా పరుగెత్తుకుంటూ వస్తున్నాయి. "ఇలా జంతువులన్నీ ఆక్రోశంతో ఎందుకున్నాయి?" అని మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాను.

కాస్సేపటికి మంచుకొండల మధ్య తెల్లని పాలరాతితో ఉన్న శివలింగం అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించింది. అలా శివలింగాన్ని చూస్తూ ఉన్నాను, సడన్‌గా ఆ లింగం నుంచి ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడు బయటికి వచ్చాడు. అలా దాన్ని చూస్తూ ఉండగా బుద్ధుని హృదయంలో నుంచి ఒక జ్యోతి వెలుగుతూ వచ్చింది తర్వాత కాసేపు వలయాలు ఇంక అంతా చీకటైపొతుందేమో అనుకునే సమయంలో .. ఒక వ్యక్తి.. "ఎవరా?" అని చూడగా పత్రిసార్ కనిపించారు. వెంటనే కళ్ళు తెరుచుకున్నాయి. లేచిన తర్వాత మనసంతా ఎంతో హాయిగా, నేను ఎప్పుడూ అనుభవించని ఆనందం ఆ రోజు పొందాను. మాంసాహారం పేరుతో జంతువులను రాక్షసంగా అంతం చేస్తున్నఈ నరరూపరాక్షసుల నుంచి వాటిని రక్షించటం కోసమే పత్రిసార్ వచ్చారన్న నిజాన్ని తెలుసుకున్నాను.

ధ్యానంలో ప్రకృతి పడుతూన్న ఆవేదనని గ్రహించి, ప్రకృతి కోసం మనం అందరం " ఏకాతాధ్యానం" తప్పకుండా చేయాలని తెలుసుకున్నాను. అలా నిరంతరంగా ధ్యానం చేస్తూ ఉండగా ఒకరోజు ధ్యానంలో అయిదు పడగలతో ఉన్న ఆదిశేషు కనిపించింది. మరుసటిరోజు ధ్యానంలో కిందికి వంగి ఉన్న నా తల ఏదోశక్తి లేపినట్లుగా నిటారుగా అయ్యింది, తర్వాత తలంతా చాలా బరువుగా పుణికెభాగంలో చాలా నొప్పిగా అనిపించి, పుష్పం విచ్చుకునట్లుగా అనిపించి అక్కడి నుంచి ఏదోశక్తి లోపలికి వెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలిసింది. అలా నా ప్రమేయంలేకుండా 1.30 గం|| అలా ఉండిపోయాను. లేచిన తర్వాత చెప్పలేని ఆనందం, ఆ సంఘటన తర్వత నేను పునర్జన్మ తీసుకున్నట్టు అనిపించింది. ఆ రోజు ధ్యానంలో కూర్చున్న ప్రతిసారీ విశ్వశక్తి నాలో ప్రవహించి, ఇంతకాలం నేను అనుభవించిన రోగాలన్నింటినీ వాటిమూలంతోసహా బయటికి పంపి, ఇంకా భవిష్యత్తులో రాబోయే రోగాలను కూడా నయం చేస్తూ ఉంది. ఇంకా ధ్యానం చేయటం ద్వారా ఎందరో మహానుభావులను కలుసుకునే అదృష్టం కూడా కలిగింది.

ఇలాంటి అద్భుతశక్తి ఉన్న ధ్యానాన్ని అందరూ తప్పకుండా చేయాలి. నిజంగా నేను ధ్యానంలోకి రాకముందు, వచ్చిన తర్వాత ఎంతమార్పు వచ్చిందంటే, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా కనిపించింది. ధ్యానం అనే పేరు వినగానే మనసంతా సంతోషంతో నిండిపోతుంది. ఈ ఆనందాన్ని మనందరికి ఇచ్చిన పత్రిసార్ కి నా కృతజ్ఞతలు. నిజంగా ఒక అద్భుతశక్తి, అనంతశక్తి రూపమే మన పత్రిసార్.

 

శశిరేఖ

Go to top