" ధ్యాన ముద్ర - యోగనిద్ర "

 

నా పేరు హిమబిందు. మా వారు శ్రీనివాస్ ECILలో టెక్నికల్ ఆఫీసర్. మావారు మొదటిసారి మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో "అంకుల్, మీ అమ్మాయిని ప్రేమించాను. పెళ్ళిచేసుకుంటాను." అని అడిగినప్పుడు మా నాన్నగారు "నీ ప్రేమను అంగీకరిస్తున్నాను; ఐతే నువ్వు మా కుటుంబసభ్యునిగా రావాలంటే ముందుగా మెడిటేషన్ గురించి తెలుసుకుని నిత్యం ధ్యానసాధన చేయాలి" అన్నారు.

"ఇదేం షరతురా బాబు?" అని అనుకున్నారట మా వారు. ఎందుకంటే ఆయనకు పూజలంటే ఎక్కువ ఇష్టం. నిత్య ధ్యానసాధకుడు ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా తన జీవితనౌకను ఎన్ని ఆటుపోట్లు వున్నా నిశ్చింతగా ఆవలి ఒడ్డుకు చేర్చగలడన్నది మా నాన్నగారి విశ్వాసం.

సరే .... నాకోసం ఆయన హైదరాబాద్ లోని సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మా మేనత్త మేనమామ అయిన అక్కిరాజు విజయలక్ష్మి, మధుమోహన్ గారింటికి వెళ్ళి ధ్యానం గురించి తెలుసుకున్నారు. కానీ ధ్యాన సాధన ఎప్పుడూ చేయలేదు.

పత్రీజీ గారి ఆధ్వర్యంలో మాకు తిరుపతిలో పిరమిడ్ వివాహం జరిగింది. పత్రీజీ గారి సూచన మేరకు వివాహానికి విచ్చేసిన అతిథులందరూ పదిహేను నిమిషాలు ధ్యానం చేసి తమ ధ్యానశక్తిని, ఆత్మశక్తిని మాకు పెళ్ళికానుకగా సమర్పించారు. నేను ఆరు మాసాల గర్భవతిగా వున్నప్పుడు మా పుట్టింటికి వచ్చేశాను. మా అమ్మ నాన్న ప్రతిరోజూ నన్ను తిరుపతి 'మహతి ధ్యనా మందిరం' కు తీసుకెళ్ళి నా చేత ధ్యానం చేయించేవారు. ఇంట్లో కూడా నేను గర్భస్థ శిశువుకు ఇయర్‌ఫోన్స్ ద్వారా ఓంకారాన్ని, అన్నమయ్య కీర్తనలు వినిపించేదాన్ని. అక్టోబర్ 5 2005 న నాకు బాబు పుట్టాడు. పేరు రేవంత్.

మా రేవంత్ నెల బాలుడిగా వున్నప్పటి నుంచి నిద్రించే సమయంలో ధ్యానముద్ర అంటే వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టుకుని నిద్రించేవాడు. ఇప్పుడు బాబుకు ఏడునెలలు. ఇప్పటికీ ఊయలలో పడుకున్న మరుక్షణం ధ్యానస్థితిలో వుంటాడు.

ధ్యానముద్రలో - యోగనిద్రలో వున్నట్లు కనిపించే ఆ ముచ్చటైన దృశ్యాన్ని ఇప్పుడు మా వారు ప్రతిరోజూ ఒక గంటసేపు ధ్యానం చేయడం ప్రారంభించారు. మా వారి ధ్యాన సాధనకు ప్రేరణ మా చిన్నారి రేవంత్ ధ్యాన ముద్ర - యోగనిద్ర.

కాబోయే తల్లులకు నా సందేశం ఏమిటంటే నిత్యం ధ్యాన సాధనతో మన గర్భాశయాన్ని 'ధ్యాన మందిరం'గా మార్చితే అందులో ఒదిగి వుండే బిడ్డ బాహ్యప్రపంచంలో ఎంతో ఎత్తుకు ఎదగడానికి దోహదం చేసినవారమౌతాము. గ్రేట్ సోల్స్‌‍కు మనం తల్లులు కావాలంటే మనం ధ్యాన సాధన చేసి తీరవలసిందే.

నాకు పిరమిడ్ వివాహం జరిపించిన ప్రేమమూర్తి పత్రీజీకి శతకోటి వందనాలు.

 

హిమబిందు
హైదరాబాద్

Go to top