" పంజాబ్ ధ్యాన ప్రచార యాత్ర "

 

నా పేరు క్రిష్ణారెడ్డి. నేరేడ్‌మెట్ హైదరాబాద్ నివాసిని. గురూజీ పత్రీజీ గారితో ... పంజాబ్ యాత్ర .. ప్రారంభం నుంచి చివరివరకు అద్భుతాలతో కూడినటువంటి యాత్ర.

ఆయనతో కలిసి ప్రయాణించటం మహాభాగ్యం. "పంజాబ్ ధ్యాన ప్రచార యాత్ర"లో నా అనుభవాలు కొన్నింటిని మీతో పంచుకుంటున్నాను. జూన్ 14 ... హైదరాబాద్ నుంచి దేశరాజధానికి ప్రయాణం. ట్రైన్‌లో ఒక మిరాకిల్. నాన్ ఎసి 'తత్కాల్' టికెట్ తీసుకున్నాను. ట్రైన్ ప్రయాణం మొదలైన గంటకు T.T. టికెట్ కలెక్ట్ చేస్తూ అంతా అయిన తర్వాత మళ్ళీ అరగంట తర్వాత వచ్చి "బాబూ నువ్వు A/C2 టయ్యర్ కంపార్ట్‌మెంట్‌లో కూర్చో" అని చెప్పారు. దానికి నేను "ఎక్స్‌ట్రా డబ్బులు చెల్లించాలా?" అడిగాను. అందుకు ఆయన "అవసరం లేదు ... అందులో వెళ్ళి కూర్చో" అన్నారు. అప్పుడు నేను "గురువుగారి కోసం ప్రయాణమే దీనికి కారణం" అనుకున్నాను.

ఢిల్లీ చేరి, పిరమిడ్ మాస్టర్ ఉషాకిరణ్ గారి ఇంట్లో కాస్సేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం ట్రైన్‌లో నేను, సాయికుమార్ రెడ్డి, గురువుగారు పంజాబ్ రాష్ట్రం లూథియానా బయలుదేరాం.

లూథియానాలో రోజుకొక రకమైన క్రొత్త క్రొత్త అనుభూతులతో కార్యక్రమాలు చేస్తూ ఛండీగర్‌లో ఉదయం గురూజీ క్లాస్ అయిన తర్వాత లేక్ పార్క్‌కి వెళ్ళాం. గురువు గారు నాతో "స్వామీజీ, ఎలా వుంది ట్రిప్పు?" అని అన్నారు. "మీతో కలిసివుండటం కంటే, ఈ ప్రపంచంలో మరో అద్భుతం లేదు" అని నేను అన్నాను. ఆయన నవ్వి "ఇది ఎన్నో జన్మల నుంచి కలిసివస్తున్న బంధం స్వామీజీ" అన్నారు.

జూన్ 15 .. లూథియానాలో ఒక క్లాసు

జూన్ 16 .. లూథియానాలో ఐదు క్లాసులు

జూన్ 17 .. లూథియానాలో ఒక క్లాసు, చంఢీగర్‌లో ఒక క్లాసు.

జూన్ 18 .. జలంధర్‌లో వన్‌ డే వర్క్‌షాప్

జూన్ 19 .. జలంధర్‌లొ రెండు క్లాసులు

జూన్ 20 .. జలంధర్ సమీపం బడాపిండ్ గ్రామ సందర్శన; పిరమిడ్ నిర్మాణానికి శ్రీకారం.

జూన్ 21 న అమృత్‌సర్ బయలుదేరాం. అక్కడ స్వర్ణదేవాలయంలోకి వెళ్ళిన తర్వాత ఆ గర్భగుడి వెనుక భాగంలో ఒక పురాతన చెట్టువుంది. అక్కడ ధ్యానం చేసేవాళ్ళు మరి గురూజీ, నేనూ, అందరం కూర్చున్నాం. గురువు గారి ప్రక్కన నేను కూర్చున్నాను. ఇరవై నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాం. గురువు గారు "అనుభవాలు ఏంటి?" అని అందరినీ అడుగుతున్నారు. తర్వాత నన్ను కూడా అడిగారు.

ధ్యానంలో నాకు వచ్చిన అనుభవం ఏంటంటే కూర్చున్నప్పుడు బాగా శూన్యంలోకి ప్రయాణం చేసి ఆ శూన్యం నుంచే ఒక గోల్డెన్ చేతి మణికట్టు వరకు వున్న చేయి నా ముందుకు వచ్చింది. ఆ బంగారు చేతిలో ప్రసాదం వుంది. ఆ ప్రసాదం 'హల్వా'. ఆ ప్రసాదం పోయి ఒక దేవతా విగ్రహం వచ్చింది. తర్వాత ధ్యానం అయిపోయింది.

స్వర్ణమందిరం లోపలికి వెళ్ళేటప్పుడు పెద్ద క్యూ వుంది. ఆ క్యూలో కళ్ళుమూసుకుని అలా నడుస్తూంటే గురునానక్ అక్కడ దర్శనమిచ్చారు. ఆ ప్రసాదం నాకు ధ్యానంలో వచ్చిన ప్రసాదం ఒక్కటే అని తెలిసింది. అంటే ముందే ప్రసాదం చూసాను. ఇలాంటి ఎన్నో యాత్రలు గురువు గారితో చేయాలని నేను కోరుకుంటున్నాను.

 

V. క్రిష్ణారెడ్డి
హైదరాబాద్

Go to top