" అమ్మ బాబోయ్, ఈయన సామాన్యుడు కాడు "

 

నా పేరు గాజుల పార్వతమ్మ ... అలియాస్ 'దయ్యాల' మేడమ్. మాది అనంతపురం జిల్లా ... సోమందేపల్లి. శ్రీవారి పేరు ఆంజనేయులు. నాకు ఇద్దరు కుమారులు. మా కుటుంబం 'ధ్యాన కుటుంబం'. నేను మహిళామండలి ప్రెసిడెంట్ మరి జనవిజ్ఞాన వేదిక జిల్లా కమిటీ సభ్యురాలిని.

నేను ధ్యానంలో 25-12-2003లో ప్రవేశించాను. ఈ ధ్యానం చేయకముందు S.S.Y. ధ్యానాన్ని 15 నిమిషాలు చేసేదాన్ని. ఆ కొద్దిసేపటి ధ్యానంలోనే మనశ్శాంతి పొందేదాన్ని. ఆ ధ్యానాన్ని మించింది లేదని నాకు అపారమైన నమ్మకం. అంతకుముందు "ఓం శాంతి" కి కూడా వెళ్ళేదాన్ని. పూజలు, వ్రతాలు, యజ్ఞాలూ, యాగాలు ఎక్కడైనా జరుగుతున్నాయని తెలిస్తే అక్కడికి వెళ్ళవలసిందే.

అలాంటి సమయంలో "పిరమిడ్ ధ్యానం" గురించి చెప్పడానికి ధర్మవరం పిరమిడ్ మాస్టర్ ఓబయ్యగారు ఊరికి మాస్టర్స్ అందరినీ పిలుచుకుని వచ్చేవారు. నేను ఇన్ని పనులలో తీరిక లేకున్నా నాకు "ఈ పిరమిడ్ ధ్యానం అతితక్కువది" అనిపించేది. పైపెచ్చు "మాలాంటి వారు చేసేది కాదు" అనీ ... "నేను మహాభక్తురాలను" అనీ ... విర్రవీగేదాన్ని.

అదిగో ... అలాంటి సమయంలోనే ... నా గర్వం అణచటానికి ధ్యానులందరినీ శ్రీ ఓబయ్య మాస్టర్ ఎంతో కష్టపడి పిలుచుకుని వస్తే ఆ సమయంలో నేను మాయం అయ్యేదాన్ని. అయితే నా పొగురు అణచడానికై పత్రీజీ గారిని మా గ్రామానికి పిలుచుకుని వచ్చారు. అప్పుడు కూడా ... ఆ బ్రహ్మర్షి ముందు కూడా ... ."నాకు అంతా తెలుసును" అని ప్రవర్తించాను. ఆ రోజే ఆయనచేత తిట్లు తిన్నాను. చాలా అవమానంగా ఫీలయ్యాను. ఇక జీవితంలో 'ఓబయ్య' గారి మాట వినకూడదని మనస్సులోనే నిశ్చయించుకున్నాను.

నా పొగరుకు కళ్ళెం వేసే సమయం వచ్చింది. అదే మన పత్రీజీ గారి కరచాలనం. సార్ చేయి తగిలినంతనే ఈ 52 సంవత్సరాలు ఎరుగనంతటి హాయి కలిగింది. ఎంత మహత్యం వుంటే ఈ విధంగా నాకు జరగాలి. ఏదో నాకు తెలియని ఆనందం పొందాను. " 'కొత్త పార్వతి' గా

ఆ క్షణం లోనే అవతరించాను" అనిపించింది.

అదేరోజు రాత్రి ధ్యానానికి కూర్చున్నాను. కూర్చున్న పదినిమిషాలకే పత్రీజీ గారు ప్రత్యక్షమై చూపుడువ్రేలు చూపించి "నీకు ఒక సంవత్సరం శిక్ష" అని మాయమయ్యారు. "అమ్మ బాబోయ్, ఈయన సామాన్యుడు కాడు. ఈ అవనిని ఉద్ధరించడానికి అవతరించిన దేవదేవుడు" అని నా రెండు చెంపలకు లెంపలు వేసుకుని ... ఇప్పుడు ... ఏ పూజలు కానీ, వ్రతాలు కానీ, ఏ పొగరు కానీ ఏమీ తెలియని మంచి మేలిమి ముత్యంలా తయారయ్యాను.

ధ్యానంలోకి రాకముందు నేను సత్యసాయి భక్తురాలిని. 30 సంవత్సరాల నుంచీ పుట్టపర్తికి సేవ చేయడానికి వెళ్ళేదాన్ని. అక్కడ భజనలకు, సత్సంగాలకు తప్పక వుండేదాన్ని. ఏ సన్యాసి గారు మా ఊరు వచ్చినా "c/o పార్వతమ్మ"గా ఒక వెలుగు వెలిగాను. మా ఇంట్లోనే వుండేవారు కాబట్టి "వారి పాదపూజలు చేసి పుణ్యం సంపాదించాను." అని ఆ నిమిషానికి ఆనందం పొందేదాన్ని. మళ్ళీ ఇన్ని చేసినా నా మనస్సు మాత్రం దేనికో వెంపర్లాడేది. అలాంటి సమయంలోనే, ఈ వయస్సులో ఈ "పిరమిడ్ ధ్యానం"వల్ల ఎప్పుడూ పొందని ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని నేను సొంతం చేసుకున్నాను.

ఈ ధ్యానాన్ని నేను ప్రారంభించినప్పుడు వూర్లో నాతోపాటు ఇంకొకరు మాత్రమే కానీ ఈ రోజు మా గ్రామంలో 500 మందికి పైగా ధ్యానులయ్యారు. ఇంక నా నాసికలో ఊపిరి ఉన్నంతవరకు ధ్యానప్రచారం చేస్తాను.

పూర్వం ఎవరైనా అతిథి వచ్చిన వారికి తృప్తిగా వడ్డించిన తర్వాతే ఇంట్లోవారు భోంచేసేవారట. ఇప్పుడు నా పరిస్థితి కూడా ఒక్కరికైనా ధ్యానం నేర్పించకపోతే ఆ రోజు నాను నేను శిక్షవేసుకునేదాన్ని. ఆ శిక్ష ఏంటంటే ఇంకొక గంటసేపు ఎక్కువుగా ధ్యానం చేసేదాన్ని. చూసారా, ఎంత మంచి శిక్షో. ఎవరైనా ధ్యానం గురించి హేళనగా మాట్లాడితే వారితోనే మంచిగా దోస్తీ చేసి కొంచెం సమయం వారితోనే గడిపి వారి నోటితోనే "మాకు ధ్యానం నేర్పించవా?" అనే స్థితికి వారిని తెచ్చేవరకూ నిద్రపోయేదాన్ని కాదు. ఎంత భీష్మించి కూర్చున్న వారినైనా క్రొవ్వొత్తిలా కరిగించే నేర్పు మన ప్రియతమ గురూజీ మనకొసంగిన గొప్ప వరం.

ఇకపోతే, అనుభవాలు ఎన్నెన్నో. మచ్చుకు ... మంచి మంచి సువాసనలు రావడం, పత్రీజీగారిని, ఇతర మాస్టర్లను దర్శించడం, కళ్ళల్లో నుంచి మేలుకున్నప్పుడు గొప్ప వెలుగులు వెలగడం, నన్ను నేను ప్రత్యక్షంగా చూడడం, నాలోనుంచి నాకు కొన్ని సందేహాలు వినడం లాంటివి.

నాకో చిరకాల కోరిక వుండేది. అది మా ఇంట్లో ఆడపిల్ల లేకపోవడం. ఆ కోరిక కూడా ఈ ధ్యానం పుణ్యమా అని నెరవేరింది. మా ఇంట్లోనే ధ్యాని అవతరించింది. నా రెండో కోడలికి కాన్పు చాలా కష్టం అయ్యింది. సిజేరియన్ చెయ్యాలని డాక్టర్ చెప్పారు. అయినా కూడా ఇంకా రెండు గంటలు వేచిచూద్దాం అని చెప్పారు. నా కోడలు రెండు నిమిషాలు కూడా వుండలేనని నన్ను పట్టుకుని ఏడ్చింది. నేను కూడా మామూలు మనిషి కన్నా ఎక్కువగా ఏడ్చాను. నేనూ ఒక ధ్యానిననే విషయం మరచిపోయాను. ఒక గోడ దగ్గర కూర్చున్నాను చేష్టలుడిగి ... అప్పుడొక అద్భుతం జరిగింది. నా వెనుకవైపు నుంచి నా భుజాల్ని చిన్నగా చరిచినట్లయింది. "ఎవరబ్బా?" అని తిరిగి చూస్తే అక్కడ ఎవరైనా వుంటే కదా. అప్పుడు "నేనొక ధ్యానిని, ధ్యాని సత్ సంకల్పంతో సాధించలేనిది ఈ పృథ్విలో లేదు కదా" అని నేను ఒక పదినిమిషాలు ధ్యానంలో కూర్చున్నాను. అద్భుతం ... లేబర్ రూమ్‌లో నుండి పసిబిడ్డ ఏడుపు. ఒక చూడండి నా ఆనందం. ఆ ఆనందంలో ఇంకా గట్టిగా ఏడ్చాను. అది ఏడుపు కాదు. ఎన్నడూ ఎరగని ఆనందభాష్పాలు. చూసారా ధ్యానం వలన నాకు ఎంత గొప్ప వరం లభించిందో.

30-4-2006 న 'ధ్యాన రత్న' తిరుపతి స్పిరిచ్యువల్ సొసైటీ అధ్యక్షులైన శ్రీ కంచి రఘురామ్ గారు మా గ్రామానికి వచ్చి ఏకధాటిగా దాదాపు 3 1/2 గంటలు మాకు తెలియని ఎన్నో విషయాలను విపులీకరించి పామరులైన మమ్మల్ని ఆనంద డోలికలలో తన అపారమైన జ్ఞానసంపదతో మా నెత్తిన మోస్తున్న బండలన్నీ తొలగించి, మమ్మల్ని పునీతులను చేసారు. వారికి మా గ్రామ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు.

ఆ రోజు దాదాపు 300 మందికి పైగా క్లాసుకు హాజరయ్యారు. మండే ఎండలు, వర్షాలు లేక అల్లాడిపోయిన మాకు, మా గ్రామానికి ఆ జ్ఞానయోగి ప్రసంగానికి ఆకాశం ఆనందంతో పులకించి పుడమి తల్లిని తన చిరుజల్లులతో తడిపి, మమ్మల్ని ఆనందడోలికలలో ఊయలలూపింది. ఈ సంఘటన అరుదైన అద్భుతమైన సంఘటన.

ఇంకా అనంతపురం పిరమిడ్ మాస్టర్ 'ధ్యాన రత్న' అయిన శ్రీమతి లక్ష్మి గారు, 'ధ్యాన రత్న' శివరామనాయుడు గారు, భీమవరం తటవర్తి వీరరాఘవరావు గారు, బళ్ళారి మస్కీగారు, నెల్లూరు ఆనందరావు గారి సతీమణి సుమతిగారు, ధర్మవరం పిరమిడ్ మాస్టర్ ఓబయ్యగారు, సుబ్బరత్నమ్మ మేడమ్ గారు, గోపాల్‌రెడ్డిగారు, వలిగారు, శ్యామ్‌సుందర్ గారు, రమణ గారు మా గ్రామానికి వచ్చి తమ అపారమైన జ్ఞాన సంపదతో మమ్మల్ని ధ్యాన పనిముట్లుగా తయారుచేసిన వారి ఋణం మేము ఏం చేసి తీర్చుకోగలం ... అందరికీ వినమ్రంగా తలవంచి నమస్కరించడం తప్ప.

హిందిలో ఒక సామెత ఉంది ... " జో సోతా హై ఓ ఖోతా హై, జో జాగ్‌తా హై ఓ పాతా హై " అని. ధ్యానాన్ని అంతు చూడాలంటే మనం పట్టువదలని విక్రమార్కుల్లా శ్రమించి ఆ అంతులేని ఆనందాన్ని మనం వశం చేసుకోవాలి.

 

గాజుల పార్వతమ్మ
సోమందేపల్లి, అనంతపురం జిల్లా
ఫోన్ : +91 9440852782

Go to top