" మీ సహస్రారం మీరు చూసుకున్నారు "

 

నా పేరు సత్యభామ కృష్ణమూర్తి. మాది చిత్తూరు జిల్లా మదనపల్లి. నేను ఈ ధ్యానాన్ని మా అక్కగారైన శ్రీమతి రాజేశ్వరి, చెన్నై గారి వద్ద నేర్చుకున్నాను. 2006 ఫిబ్రవరి 3 వతేదీ నుంచి అనగా మదనపల్లి మండల ధ్యాన తరగతుల నుండి నేను ధ్యానం ప్రారంభించాను. ఆ మండలం రోజులలోనే నాకు ఎన్నో అనుభవాలు, మార్పులు కలిగాయి.

"నీలోనే భగవంతుడున్నాడు"

నాకు రెండు సంవత్సరాలుగా ఆరోగ్యం అంత బాగాలేదు. నీరసంగా, అనిమిక్‌గా, హార్ట్ కంప్లయింట్‌తో, మెడిసిన్స్ వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధపడుతూండేదాన్ని. నేను ఈ ధ్యానాన్ని ఆరోగ్యం కోసమే సాధన చేయడం ప్రారంభించాను. మొట్టమొదటి అనుభవం శ్రీ ఆదిశంకరాచార్యులవారు "నీలోనే భగవంతుడున్నాడు ... అది తెలుసుకో" అని బోధించారు. ఆ తరువాత ఇంకొకరోజు 'ఓం' అని పెద్దదిగా కనపడి , "ఈ చరాచర సృష్టి అంతా ఈ ఓంకారం లోనే ఇమిడివుంది" అన్న కాన్సెప్ట్ వచ్చింది.

"చరాచర సృష్టి .. ఓంకారంలో"

ధ్యానంలో ఏం వచ్చినా మనకు ఏ ప్రశ్నలకు సమాధానాలు కావాలో తెలుసుకోవచ్చని మా మేడమ్ 'ధ్యాన రత్న' శ్రీమతి అనురాధ గారు చెప్పినదానికి మనస్సులో ప్రశ్నించుకున్నాను. నేనొక ధ్యానిగా, యోగిగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని సంకల్పం వున్నా నాకు ఆరోగ్యం కావలసినంత ధనం, జ్ఞానం, ధ్యానం, బుద్ధి, ఆసనం ఎవీ సరిగ్గాలేవు. "ఈ చరాచర సృష్టి అంతా ఓంకారంలో ఇమిడి ఉన్నప్పుడు నాప్రశ్నలకు జవాబు ఇవ్వాలి కదా" అనుకున్నాను. వెంటనే అనేకమంది గ్రేట్ మాస్టర్స్ ...వినాయకుడు, బిందెలతో కనకవర్షం కురిపిస్తూ లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ధ్యానస్థితిలో ఈశ్వరుడు కనబడ్డారు.

ఎంతోమంది మాహాపురుషులు దేదీప్యమానంగా వెలుగుతూ ఆనందకరమైన సంగీతధ్వనులు వింటూ వుండగా నాకు కనిపించారు. తరువాత నాలో ఓంకారనాదం రెండుమూడుసార్లు వినిపించింది. వెంటనే 'హ్రీం', 'శ్రీం' అనే భీజాక్షరాలు కనపడి ఏదో లిపిలో అక్షరాలు కనబడ్డాయి. "నాకు తెలిసిన భాషలో కనిపిస్తే నేను అర్థం చేసుకుంటాను కదా" అనుకున్నాను. వెంటనే "జయం" అని పెద్ద పెద్ద అక్షరాలతో కనబడి, శ్రీకృష్ణపరమాత్ముడు గోపికలతో వేణుగానం చేస్తూ నాట్యం చేస్తున్నట్లు కనబడింది. తరువాత మళ్ళీ 'ఓం' అని పెద్దగా కనబడి దానికి ఇరువైపులా దీపస్తంభాలు, ఓంకారానికి నీరాజనమిస్తూ ఐదువత్తుల హారతి కనబడింది. తరువాత భ్రూమధ్యంలోకి విపరీతమైన వెలుగు చాలా వేగంగా, శక్తివంతంగా ప్రవేశించింది.

"శరీరం లోని భాగాల దర్శనం"

ధ్యానంలో నాకు నా శరీరంలోని లోపలి భాగాలు కనిపించాయి. మొదటిసారి నా గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, పెద్ద ప్రేవులు, మూలం వరకు .. .అంటే చిన్నప్పుడు సైన్స్‌లో లోపలి భాగాలతో వున్న బొమ్మ కనపడింది. చూస్తుండగా మూలం నుండి ఒక సుడి గిరగిరా తిరుగుతూ ముక్కులో నుండి ఒక విధమైన ఘాటుగా వచ్చింది. ఆ తరువాత వెంటనే గొంతులో నుండి విపరీతమైన ఘాటుతో, వేగంగా తల వెనుకవైపు రాకెట్ లాగా దూసుకునిపోయి అక్కడ హార్ట్ బీటింగ్‌లా ఏర్పడి నడినెత్తిన పెద్ద రాయితో గట్టిగా అదిమినట్లు విపరీతమైన నొప్పి కలిగింది.

ఈ అనుభవం మండల ధ్యానం ప్రారంభించిన ఇరవై రోజులకే - క్లాస్‌లోనే కలిగింది. ఆ రోజే నాకు నుదిటిమీద విపరీతమైన దురద, ఒకటే వైబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మా మేడమ్ గారు "మీకు నాడీమండల శుద్ధి జరిగింది; విశుద్ధచక్రం యాక్టివేట్ అయ్యింది; ఇంకా ఎక్కువుగా సాధన చేస్తూంటే 'దివ్యచక్షువు' కూడా తెరుచుకుంటుంది" అని నన్ను ప్రోత్సహించారు.

"ఈశ్వరుడు ... విశ్వరూపదర్శనం"

ఈ మండలం లోనే శివరాత్రి రోజు ధ్యానంలో "నీలో వున్న అరిషడ్వర్గాలు నశిస్తే గాని మోక్షం లభించదు" అన్న సందేశం వచ్చింది. 'మోక్షం', 'ఆత్మసాక్షాత్కారం' అన్నవి నాలో ఎన్ని సంవత్సరాల నుంచో వున్న తపన ... అందువల్ల ఇలా వచ్చిందేమోననీ, ఇది నా భావనేమోననీ ... యోగనిద్రలో పడుకుని నిద్రపోయాను. తెల్లవారుఝామున నాకు కల, నాతో నిత్యజీవితంలో వుండే ... అంటే ప్రేమగా, స్నేహంగా, ద్వేషంగా, అసూయగా, విరోధంగా, అనురాగంగా, భక్తిభావంగా వుండే ... నాకు తెలిసిన వ్యక్తులు కనబడి అందరూ మాయమై ఈశ్వరుడు విశ్వరూపదర్శనం ఇచ్చారు. ఈ విషయం మా మేడమ్‌తో చెప్తే "మీరు నమ్మనందు వలన జాగృదావస్థ నుండి స్వప్నావస్థలో మీకు తెలిపారు" అన్నారు.

"కంటి చూపు మెరుగయ్యింది"

మాఘపౌర్ణమి రోజు పౌర్ణమి ధ్యానంలో విపరీతమైన విశ్వశక్తి వస్తుందని మేడమ్ అన్నందున ఆ రోజు రెండుగంటలపైన ధ్యానంలో కూర్చున్నాను. నాకు కంటికి చికిత్స జరిగినట్లు అనిపించింది. విపరీతమైన నొప్పి, బాధ కలిగింది. నాకు చాలా రోజులుగా ప్రతి చిన్న విషయానికీ కళ్ళద్దాలు వాడే అవసరం కలిగేది. ఈ అనుభవం తరువాత నాకు కంటిచూపు 50% మెరుగయ్యింది.

"ఇడ, పింగళ, సుషుమ్న నాడులు"

ఇంకొకసారి ధ్యానంలో పుర్రె కనబడింది. తరువాత పౌర్ణమి ధ్యానంలో విపరీతమైన వైబ్రేషన్స్, భ్రూమధ్యంలో విపరీతమైన ఎనర్జీస్ ప్రవేశించాయి. ఆ సమయంలోనే నాలో వున్న సైనస్ ప్రాబ్లమ్‌కు చికిత్స జరిగింది. ఆ తరువాత ఇడా, పింగళ నాడులు రెండూ ఒక్కసారిగా రెండు వెండి తీగల్లాగా సాగి సుషుమ్ననాడిలో కలవడం స్పష్టంగా చూశాను. "ఇలా జరిగితే 'ఆజ్ఞాచక్రం' యాక్టివేట్ అవుతుందంటారు కదా. దీనికి ఎవిడెన్స్ ఏమిటి?" అనుకున్నాను. వెంటనే తెల్లటి పొగ మాయమై బూడిదరంగు కనపడింది. మా మేడమ్ "మీరు తెలుసుకున్నది కరెక్ట్" అని చెప్పారు. ఆ మరుసటిరోజు సాయంకాలం క్లాస్‌లో ధ్యానం చేస్తూంటే నుదుటి మీద వైబ్రేషన్స్ కలిగి ఎంతటి ఆనందాన్ని కలిగించిందో మాటలతో వర్ణించలేను. ఆ అనుభూతిలోనే ఒక కన్ను నీటిలో తేలియాడుతున్నట్లు చూసాను. ఆ మరుసటిరోజు ధ్యానంలో నన్ను నేను స్పష్టంగా చూసుకున్నాను. ఈ అనుభవాలన్నీ మండల ధ్యాన తరగతులు పూర్తి అయ్యేటప్పటికి నాకు కలిగాయి.

"గురువు కోసం అన్వేషణ"

మొదటినుంచి నేను బాబా భక్తురాలిని. రెండు సంవత్సరాల నుంచీ ఎటువంటి కార్యక్రమాలు చేయక, వెళ్ళక, విశ్రాంతిగా ఇంట్లో ఉన్నప్పుడు నేను ఆయన్ని ప్రశ్నించేదాన్ని. "ఎందుకిలా చేశావు? నాలో ఏ మార్పు కోసం ఇలా చేశావు? అనుక్షణం నీ ధ్యానంలోనే వున్నానే?" అని ఆవేదనతో అడిగేదాన్ని. ఆయన చల్లని చూపు మాత్రం తెలిసేది.

ఎంతమంది మహాత్ములను చూసినా, గురువులను చూసినా నాకు ఎటువంటి ఆనందం సంతృప్తి కలిగేది కాదు. ఎప్పుడూ ఏదో తెలియని తపన, ఆవేదన, "నా మనస్సుకు నచ్చిన గురువు కావాలి; ఈ జన్మ ఆఖరిజన్మ కావాలి; మోక్షం కావాలి; ఆత్మసాక్షాత్కారం కలిగించు తండ్రీ" అని వేడుకునేదాన్ని. "ఎవర్నీ గురువుగా చూపించకపోతే నువ్వే నాకు గురువు. ఇందులో మార్పు లేదు: అనేదాన్ని.

"షిరిడి బాబాలో పత్రీజీ"

ఈ పిరమిడ్ ధ్యానంలో ప్రవేశించాక బ్రహ్మర్షి పత్రీజీ గారిని గురువుగా అంగీకరించడానికి నా మనస్సులో ద్వైదీభావంతో ఆలోచనలు కలుగుతూండేవి. అందుకేనేమో ఒకసారి పత్రీజీగారు మదనపల్లికి వచ్చినా దర్శనం కాలేదు.

బుద్ధపౌర్ణమికి 15,20 రోజుల ముందు నేను బాబాగుడికి మామూలుగా వెళ్ళాను. కనురెప్పపాటులో బాబా ముఖంలో మన గురువు గారి ముఖం కనపడింది. నా సందేహం తీరిపోయింది. గురువును సంపూర్ణంగా నమ్మేటప్పటికి నాకు ధ్యానంలో హృదయంలో మొదట షిరిడీ బాబా తరువాత పత్రీజీ కనబడ్డారు.

"స్పైనల్ కార్డ్‌లో ట్రీట్‌మెంట్"

ఇంకొకసారి ధ్యానంలో నాకు తలలో పూలబండి, దానిక్రింద పొడుగాటి పూలజడ కనిపించింది. "ఇదేంటి సుమా?" అని ఆశ్చర్యంగా చూస్తున్నంతలో పుర్రె (వెనుక), దానిక్రింద వెన్నుపాము కనిపించింది. ఇదీ, అదీ మార్చి మార్చి కనిపించింది. "దీని భావం ఏమిటి సుమా?" జవాబు రాలేదు.రెండు రోజుల తరువాత 'స్పైనల్ కార్డ్'లో లోపల ట్రీట్‌మెంట్ స్టార్ట్ అయ్యింది. చురుక్కు చురుక్కుమని సెన్సేషన్. నేను అంతవరకు ధ్యానానికి కూర్చోవాలంటే వెనుక సపోర్ట్ కోసం చూసి కూర్చునేదాన్ని. మామూలుగా కూర్చుని ధ్యానం చేయాలంటే వీపులో చాలా బాధ వుండేది. కానీ ఈ అనుభవం తరువాత, ధ్యానం చేసేటప్పుడు దేనికీ ఆనుకోకుండా కూర్చుని చేస్తున్నాను.

మొట్టమొదటి నాకు ధ్యానంలో 'ఓంకారం' కనిపించినప్పటి నుంచి నేను అడిగిన ప్రశ్నలకు జవాబులు వన్ బై వన్ నిజజీవితంలో జరుగుతున్నాయి. ఇంకొకసారి ధ్యానంలో ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది థ్రోట్ కనపడింది. నాకు శరీరం లోపలి భాగాలు కనబడిన వాటిలో ఎటువంటి బాధలు కలిగినా ధ్యానంలో వెంటనే నయమవుతుంది. ఉదాహరణకు తలనొప్పి, గొంతునొప్పి, కడుపునొప్పి, హృదయంలో, లంగ్స్ ఎక్కడైనా సరే ధ్యానంలోనే నాకు మార్పు తెలుస్తుంది.

"సేలంలో ... గురువు గారితో"

ఎప్పుడైతే పత్రీజీ గారిని నేను నా గురువుగా కన్‌‍ఫర్మ్ చేసుకున్నానో అనుకోకుండా 'బుద్ధపౌర్ణమి'కి 'మెగా పిరమిడ్' కు వెళ్ళాను. అక్కడ గురువు గారి మాటలు, చేతలు, దృష్టి చూస్తుంటే షిరిడీ బాబానే కనిపించారు. మా అమ్మాయి మధులిక కూడా "అలాంటి అనుభూతే పొందాను" అని చెప్పింది. "పత్రీజీ గారితో మాట్లాడాలి. గురువు యొక్క దృష్టి నా మీద పడాలి" అని ఎంతో తపన పడ్డాను. "సార్ దగ్గర పాటలు పాడాలి" అన్న కోరిక.

ఈ విపరీతమైన తపన ఫలితమేమో సరిగ్గా మూడువారాల తరువాత సేలంలో జూన్ 3,4 తేదీలలో పిరమిడ్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవం వుందని మా వదిన శ్రీమతి భారతి ... ఈమె కూడా సేలంలో గ్రేట్ మాస్టర్ ... గారి ద్వారా తెలిసింది. "అమ్మగారిల్లు కదా ... హాయిగా వెళ్ళిపోదాం" అని నేనూ, మా అమ్మాయి వెళ్ళాము. అక్కడ మా అక్క ద్వారా పత్రీజీ గారితో మాట్లాడి నాలోని తపన, ఆవేదన తెలిపాను. గురువు గారు ఓదార్చారు. నా అనుభవాలన్నీ చెప్పాను.

"అనుభవాలన్నీ వ్రాయి"

"నాకు ఏ నొప్పి వచ్చినా ధ్యానమే నాకు మెడిసిన్. ఇప్పుడు నాకు బాగా రెసిస్టెన్స్ పవర్ వచ్చింది. బ్లడ్ ఇంప్రూవ్ అయింది" అని చెప్పాను. " 'నేను శరీరం కాదు, ఆత్మ' అని తెలుసుకున్నాను. ఆత్మకు ఆహారం ధ్యానం. భౌతిక శరీరానికి ఆహారం తీసుకున్నప్పుడంతా నా ఆత్మకు నేను ఎటువంటి ఆహారం పెట్టలేదనే తపన కలుగుతుంది" అని చెబితే అన్నీ విని పత్రీజీ గారు "నీ అనుభవాలన్నీ వ్రాసి ఫోటోతో సహా రేపు సాయంకాలం నాకివ్వాలి" అన్నారు. మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. పాట పాడమన్నారు. ఇంకొక పాట ఇద్దరమూ కలిసి పాడాము. ఎంతో ఆనందానుభూతి. గురువు యొక్క దృష్టి నాపై బడి నా పాపాలన్నీ ప్రక్షాళన అయ్యాయనిపించింది.

"సహస్రారం చూసుకున్నారు"

జూన్ 4వ తేదీ సేలంలో సాయంకాలం జరిగిన క్లాసులో ఒక గంటసేపు అందరిచేతా ధ్యానం చేయించారు. ఆ ధ్యానంలో ఈశ్వరుడు లింగరూపంలో దర్శనమిచ్చారు. ఆ తరువాత బుద్ధుడి కనుబొమలు, మూసివున్న కనులు మళ్ళీ ప్రజాపిత బ్రహ్మర్షి కనబడ్డారు. తరువాత హృదయంలో ఒక అంగుళం సైజులో జాతిపచ్చ కనపడి బ్రహ్మర్షి పత్రీజీ గారి ప్రొఫైల్ కనపడింది తరువాత నా శ్వాస చుసుకున్నాను. అది పాము శరీరంలా ఆడుతూ కనపడి, పడగవిప్పిన పాము, అయిదు తలలతో కనపడి, గుండ్రంగా పుష్పంలా పాము పడగల మధ్యలో శివలింగం నల్లగా కనబడింది. దాన్ని అలా చూస్తూంటే పైకి పైపైకి వెళ్ళి శిరస్సు మీద పుష్పంలా పాము పడగలతో ఆడుతూ మధ్యలో దేదీప్యమానంగా వెలుగుతూన్న లింగం కనపడింది.

క్లాసు అయ్యాక పత్రీజీ గారు నన్ను చూసి "ఏం అనుభవం వచ్చింది?" అడిగారు, చెప్పాను. సూటిగా కళ్ళలోకి చూసారు. "మీ సహస్రారం మీరు చూసుకున్నారు. పదిరోజుల టైమ్ ఇస్తున్నాను. హైదరాబాద్‌కు మీ ఫోటోతో సహా మీ ఇప్పటి అనుభవాన్ని కలిపి వ్రాసి పంపాలి" అన్నారు. అంతకన్నా మహద్భాగ్యం ఏముంది చెప్పండి. ధ్యానంలో నేను పొందిన అనుభవాల ఆనందం కంటే, గురువు యొక్క సత్సాంగత్యంతో నేను పొందిన ఈ రెండు రోజుల అనుభవాల ఆనందం నా జీవితంలో మరచిపోలేని అనుభూతి.

ధ్యానం చేయడం ప్రారంభించినప్పటినుంచి రోజుకు కనీసం మూడుగంటల నుండి 5.00 గంటలసేపు ధ్యానం చేస్తున్నాను. ఇంకా ఇంకా సాధన చేసి ఎన్నో సాధించాలనీ, సంపూర్ణ ఆరోగ్యం పొంది ధ్యాన ప్రచారాలు మొదలైనవి చేపట్టాలనీ కోరికగా వుంది. త్వరలోనే నా ఆశ ఫలించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

 

పోలిశెట్టి సత్యభామ కృష్ణమూర్తి
మదనపల్లి, చిత్తూరు జిల్లా

Go to top