" 30 సంవత్సరాల గురక మాయం "

 

నా పేరు శ్యామసుందరరావు. మాది రాజమండ్రి. ధ్యానంలోకి వచ్చి ఐదు నెలలు అయ్యింది. నేను ఈ ధ్యానంలోకి రావటానికి ముఖ్యకారణం నా స్నేహితులు శ్రీ C.S. మూర్తి, కల్పనగార్లు. జనవరి 2006 నుంచి వారు నిర్వహించే ఉచిత ధ్యానయజ్ఞం క్లాసులకు వెళ్తూండేవాణ్ణి.

ఫిబ్రవరి 2006 లో బ్రహ్మర్షి పత్రీజీ గారు మండపేట వచ్చినప్పుడు చూసే భాగ్యం కలిగింది. అదేరోజు వారితో డాక్టర్ రఘునాధరావు గారి ఇంట్లో పరిచయ భాగ్యం కలిగింది. మార్చి 22 వ తేదీన రాజమండ్రిలో బ్రహ్మాండమైన ధ్యానం క్లాసు నిర్వహించారు. చాలా, చాలా మంచి విషయాలు చెప్పారు. మే నెలలో బెంగుళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళి బుద్ధపౌర్ణమి ఉత్సవాలలో చాలా సంతోషంగా పాల్గొనటం జరిగింది.

నాకు నిద్రలో గురక 30 సంవత్సరాల నుంచి ఉండేది. ధ్యానం చేసిన కొద్దిరోజులకే తగ్గిపోయింది. నాకే ఆశ్చర్యంగా ఉంది. అలాగే కుడిచేయి చూపుడు వేలుకు మూడు సంవత్సరాల నుంచి వున్న చర్మవ్యాధి .. ఎలర్జీ .. కూడా తెలియకుండానే మాయమయింది. ధ్యానం చేసిన దగ్గర నుంచి షుగర్ వ్యాధికి మందులు వేసుకోవటం లేదు. ధ్యానం చేయటం వలన నాకు కలిగిన లాభాలు ఎన్నెన్నో.

మాంసాహారం అంటే నాకు చాలా ప్రీతి. నాకు తెలియకుండానే మాంసాహారం పూర్తిగా మానివేయటం జరిగింది. నేను పూర్తిగా శాకాహారినయ్యాను.

మే నెల 26,27,28 తేదీలలో భీమవరంలో శ్రీ తటవర్తి వీరరాఘవరావు గారు నిర్వహిస్తున్న ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరానికి హాజరయ్యాను. ఆ క్లాసులకు వెళ్ళిన దగ్గర్నుంచి మా ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళకు ధ్యానం చెయ్యమని చెప్పటం, 'ధ్యానాంధ్రప్రదేశ్' పత్రికకు చందాదారులుగా చేర్పించటం చేస్తున్నాను.

నేను ప్రతిరోజూ మూడుగంటలు ధ్యానం చేస్తున్నాను. నాకు చిన్న చిన్న అనుభవాలు కలిగాయి. కాళ్ళు, చేతులు తేలికైనట్లు, ఎవరో శరీరాన్ని గుంజుతున్నట్లు అనుభూతి పొందుతున్నాను. భీమవరం ధ్యానం క్లాసులో గౌతమబుద్ధుడు కన్పించారు.

నాకు ఈ ధ్యానం నచ్చటానికి ముఖ్యకారణం బ్రహ్మర్షి పత్రీజీ గారు. వారి వ్యక్తిత్వం నచ్చింది. తానే గురువునని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడూ "మైడియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్" అని సంబోధిస్తూ "బుద్ధుడు, మహావీరుడు, శ్రీకృష్ణుడు, పరమహంస యోగానంద, జీసస్ లను ఆదర్శంగా తీసుకుందాం" అనీ, "వాళ్ళు ఏం చెప్పారో, ఏం చేసారో అదే మనమూ చేద్దాం." అనీ బోధిస్తూ ఉంటారు.

బ్రహ్మర్షి పత్రీజీ గారు చెప్పిన తొమ్మిది సూత్రాలు చాలా చాలా ఆచరించదగినవిగా ఉన్నాయి. బ్రహ్మర్షి పత్రీజీ గారు తలపెట్టిన బృహత్ "పిరమిడ్ వ్యాలీ" ప్రాజెక్ట్‌ను తొందరలో పూర్తిచేయటానికి ధ్యానులందరూ సహాయ సహకారాలు అందిస్తారనీ, త్వరలో ధ్యానభారత్ సాధించటానికి తమవంతు కృషిచేస్తారనీ ఆశిస్తూ, ప్రార్థిస్తూ..

 

శ్యామసుందరరావు
మల్లిన నగర్
రాజమండ్రి - 533103

Go to top