" వ్యాపారం మొత్తం కొడుకుకు అప్పజెప్పి హాయిగా ధ్యానం చేసుకుంటున్నాను "

 

నా పేరు పళనికుమార్. ఊరు చెన్నై. నాకు చిన్న వయస్సు నుంచి జ్యోతిష్యం పైన నమ్మకం వుండేది. జ్యోతిష్యం గురించి తెలుసుకుని నేను కూడా జ్యోతిష్యుడిలా మారిపోయాను. అందరూ నా దగ్గరకు జ్యోతిష్యం చెప్పించుకోవటానికి వచ్చేవారు. అందరికీ జ్యోతిష్యం చెప్పేవాణ్ణి.

ఒక దేవుడి గుడి కూడా వదలక, ఎవ్వరు ఏ గుడి చెప్పినా, ఏ పూజ చేసినా వదలక అన్నింటినీ చేసేవాడిని. ఐదు సంవత్సరాల పాటు మా యింట్లో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం బంధుమిత్రులతో కలిసి చేసాను. ప్రతి సంవత్సరం వినాయకచవితి, కృష్ణజయంతి, వరలక్ష్మీవ్రతం అన్ని పండుగలకూ దేవుని పటాలను పువ్వులతో అలంకరించి వైభవంగా చేసేవాడిని.

నా అరవై సంవత్సరాలప్పుడు సొంత ఇల్లు కొని, ఆ ఇంట్లో ఒక గది దేవుని పూజామందిరంగా నిర్మించి, అన్ని దేవుళ్ళ పటాలు పెట్టి ప్రతిరోజూ పూలు అలంకరించి రెండుగంటల పాటు పూజ చేసి, జపం చేసేవాడిని. ఇంటిపైనే పూలచెట్లను పెంచి, ఆ పువ్వులనే దేవునికి పెట్టి పూజించేవాడిని. ఈ విధంగా నా 63 సంవత్సరాల జీవితం మొత్తం దైవభక్తిలోనే గడిపాను. దైవచింతనతోనే గడిపాను. ప్రతి శివరాత్రికీ మౌనవ్రతం, ఉపవాసం ఉండేవాడిని. ఇంత చేసినా నాలో ఏదో తెలియని వెలితి వుండేది.

నాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. మొట్టమొదట నా పెద్దకుమార్తె కాంచన " ఆనాపానసతి " అనే ధ్యానపద్ధతిని మా కుటుంబ సభ్యులందరికీ చెప్పింది. కానీ నేను ఏ మాత్రం నమ్మక, పైగా ఎగతాళి చేసి, " కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏం వస్తుంది ? " అన్నాను. ఆరునెలల తర్వాత నా కుమారుడు జయకుమార్ " నువ్వుకూడా ధ్యానం చేసి చూడు " అని చెప్పిన తర్వాత నేను కూడా చెయ్యడం ప్రారంభించాను. ఇలా ధ్యానం చేస్తూండగా నాకు ఎంతో ఆత్మసంతృప్తిగా ఆనందంగా వుంటోంది. మా ఇంటిపై 12'X12' A.C.పిరమిడ్ కట్టగా దాని ప్రారంభోత్సవానికి మన గురువుగారైన పత్రిగారు వచ్చారు.

నేను మొట్టమొదట గురువు గారిని చూసింది అప్పుడే. ఆయన్ను చూసిన తర్వాత .. ఆయన మాట్లాడిన తీరు,ఆయన వేణునాదం నాకు బాగా నచ్చింది. ఈ విధంగా ధ్యానం చేస్తూ, మా ఇంటిదగ్గర ఉండేవాళ్ళకు ధ్యానం చెప్పిస్తూ, మా పిరమిడ్‌లో ధ్యానం చేయించేవాడిని. తర్వాత బెంగళూరు, శ్రీశైలం ధ్యానయజ్ఞాలకు కుటుంబం మొత్తం వెళ్ళి వచ్చాం. నాకు షుగర్, BPతో పాటు మూడుసార్లు హార్ట్‌అటాక్ వచ్చింది. కానీ ధ్యానం చేసిన తర్వాత షుగర్, BP నార్మల్‌కు వచ్చింది.

ధ్యానంలోకి రాకముందు " వ్యాపారం, డబ్బు మాత్రమే ప్రధానం " అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వ్యాపారం మొత్తం కొడుకుకి అప్పజెప్పి హాయిగా ధ్యానం చేసుకుంటున్నాను. నాకు కలలో రెండుసార్లు పత్రిగారు కనిపించారు.

ఇప్పుడు మా ఇంట్లోని పూజామందిరం తీసేసి గుడికి వెళ్ళి కూడా ధ్యానమే చేస్తున్నాను. మా అన్నదమ్ములకు కూడా ధ్యానం చేయమని చెబుతున్నాను. పత్రిగారిని చూసినప్పుడల్లా నా మనస్సుకు " కలియుగదైవం " లా అనిపిస్తారు. అందరూ ఈ ధ్యానం ఆచరించవలసిందిగా కోరుకుంటున్నాను.

 

M.S పళనికుమార్
చెన్నై

Go to top