" మహామౌనధ్యానం "

 

నా పేరు శ్రీనివాసరావు. నేను విశాఖపట్టణం .. గాజువాక దగ్గర శ్రీనగర్‌లో ఉంటున్నాను. ఐదు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను .. మరి మా ఇంటిపైన పిరమిడ్ కూడా కట్టాము. గత మూడు సంవత్సరాలుగా " శ్రీ రమణ పిరమిడ్ " ధ్యాన ఆధ్యాత్మిక శిక్షణ కేంద్రం నడుపుతున్నాను.

నేను రెండు సంవత్సరాల క్రితం ప్రతివారం ఒకరోజు మౌన ధ్యానం చేసేవాడిని. కానీ నాకు అంతర్ మౌనం రాలేదు. అలాగే మా ఇంటి సమస్యలు కొన్ని తీరలేదు. ఒకరోజు ధ్యానంలో ఎక్కువ రోజులు మౌన ధ్యానం చేయమని సందేశం వచ్చింది. నేను 4-2-2009 నుంచి 4-4-2009 వరకు .. రెండు నెలలు .. మౌన ధ్యానం చేశాను. అప్పుడే నాలో అంతర్ మౌనం కలిగింది. " మా ఇంటి సమస్యలకు నా ఆలోచనలే కారణం " అని తెలుసుకున్నాను. అలాగే " ఆలోచనలు సరికావాలి అంటే ‘ మౌన ధ్యానం ’ మార్గం " అనిపించింది. ఇప్పుడు మా ఇంట్లోని సమస్యలు తీరిపోయాయి.

మా సెంటర్‌లో నవంబర్ 2009 లో డెబ్భైరెండుగంటల అఖండ ధ్యానం పెట్టాం. నేను గత నెలలో సేత్ విజ్ఞానం క్లాసులకు వెళ్ళాను. అక్కడికి హైదరాబాద్ నుంచి లత మేడమ్ వచ్చి కౌన్సెలింగ్ చేసారు. " నేను చేసే పనిలో తృప్తిలేదు ; ఇంకా ఏదో చేయాలనిపిస్తోంది ; అది ఏదో తెలియడం లేదు " అని చెబితే " మీరు ఇంతకుముందు రెండు నెలలు మౌన ధ్యానం చేసారు కాబట్టి ఇప్పుడు మహా మౌనధ్యానం వర్క్‌షాప్ చేయండి " అన్నారు.

" హైదరాబాద్‌లో ప్రాణహిత మేడమ్ ఇప్పటికే ఇలాంటి రెండు వర్క్‌షాప్‌లు చేసారు. దానిని మీరు విశాఖలో చేస్తే బాగుంటుంది " అని చెప్పి నన్ను ధ్యానంలో కూర్చోబెట్టారు. వెంటనే నేను ఇంటి దగ్గర మళ్ళీ మూడురోజుల మహామౌనధ్యానం చేశాను. రాగి జావ, పండ్లు మాత్రమే తీసుకున్నాను. ఎనర్జీ బాగా తెలిసింది.

ప్రతి సెంటర్‌లో ఈ మహా మౌన ధ్యానం చేయాలనిపించి మార్చి 6,7,8 తేదీలలో సహాస్రాక్షి శక్తిపీఠం, దేవిపురం, సబ్బవరం మండలం, విశాఖ జిల్లాలో మొట్టమొదటి " మహామౌనధ్యానం " యజ్ఞం చేయడం జరిగింది.

మొదటి బ్యాచ్‌గా నలభైతొమ్మిదిమంది ఈ మహా మౌన ధ్యానం యజ్ఞంలో పాలుపంచుకోవటం చాలా ఆనందంగా వుంది. అందరూ చాలా అద్భుతంగా ఎనర్జీని పొందామని ఆనందంగా వాళ్ళ అనుభవాలను పంచుకున్నారు. ఈ మహాయజ్ఞానికి .. " ప్రాణహిత మేడమ్ " వాళ్ళ అమ్మగారితో కలిసి ఎంతో సహకరించారు.

కార్యక్రమం చివర్లో ప్రాణహిత మాట్లాడుతూ " మేము హైదరాబాద్‌లో చేసినదానికన్నా ఇక్కడ ఈ ప్రకృతి మధ్య చేసిన ఈ మహామౌనధ్యానం చాలా అద్భుతంగా వుంది " అని చెప్పటం జరిగింది.

అలాగే ఈ మహామౌనధ్యానం ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహిస్తాం. ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి.

 

K. శ్రీనివాసరావు
విశాఖపట్టణం
ఫోన్ : +91 90002 73274, +91 99496 82589

Go to top