" బాబాయే ఈ ధ్యానమార్గం చూపారు "

 

నా పేరు విశాల. నేను ధ్యానంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది. మేము కర్నూలులో .. ఐశ్వర్య అపార్ట్‌మెంట్‌లో వుంటున్నాం. మా అపార్ట్‌మెంట్‌కి గాయత్రి అనే మాస్టర్ వచ్చి మాకు ధ్యానం గురించి చెప్పి చేయించారు. అప్పటికి నేను పన్నెండు సంవత్సరాలుగా బాబా భక్తురాలిని. ఎన్నో పూజలు, భజనలు చేసేదాన్ని. బాబా నామం నాలో ఎప్పుడూ జరుగుతూ వుండేది. ఎప్పుడైతే ధ్యానం మొదలుపెట్టానో ఆ రోజు నుంచే .. నామం ఆగిపోయింది. చాలా రోజుల వరకు " నేను చేసేది కరెక్టా ? కాదా ? " అని నాలో సంఘర్షణ జరిగేది. కానీ ఒక్కరోజు కూడా ధ్యానం చేయకుండా ఉండలేకపోయేదాన్ని. " బాబాయే ఈ ధ్యాన మార్గంలోకి పంపిస్తున్నారు " అనుకునేదాన్ని.

ఒకసారి కర్నూలులో కేర్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు, అక్కడ ఒక సార్ మమ్మల్ని కలిసి మా స్నేహితులందరితో " నలభై రోజులు పదిగంటల ధ్యానం చేస్తే బావుంటుంది " అని చెప్పారు. ఆయన చెప్పాగానే " నేను పదిగంటలు చేయలేనేమో " అనిపించింది. కానీ " ఆయన అంతగా చెప్పినందుకు ఒక్కరోజు ప్రయత్నం చేద్దాం " అనిపించింది. రెండవరోజు " చాలా బావుంది, చేయాలి " అనిపించింది. మూడవరోజు కూర్చున్నప్పటినుంచి నొప్పులు మొదలయ్యాయి. మాస్టర్‌ని అడిగితే " నాడీమండలశుద్ధి జరుగుతోంది ; బ్రేక్ చేయవద్దు " అని చెప్పారు. మొదట్లో చేయడం కష్టంగా అనిపించేది. ఎంత కష్టం అంటే .. కాళ్ళు నరికేసుకోవాలి అన్నంత నొప్పులు వచ్చేవి. తర్వాత తర్వాత " చాలా బావుంది " అనిపించింది.

తర్వాత నుంచి మా స్నేహితులకూ, బంధువులకూ, అక్కచెల్లెళ్ళకూ ధ్యానం గురించి చెప్పి వాళ్ళను కూడా ధ్యానం చేసుకోమని .. నేను పొందిన ఆనందం వాళ్ళు కూడా పొందాలని చెప్పాను. ఆ రోజు నుంచి ఇప్పటివరకు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నాను. నాతోపాటు మా వారు కూడా చేస్తారు. ఆయన సమాజసేవ ఎక్కువగా చేస్తారు. అలాగే ధ్యానానికి సంబంధించి ఎవరైనా ఏవైనా పనులు చెప్తే చేస్తారు. షాప్‌కి వచ్చినవారందరికీ ధ్యానప్రచారం చేస్తారు. నాకు కూడా ఈ విషయంలో ఎక్కడికి వెళ్ళాలన్నా సహకరించేవారు.

కర్నూలులో " లక్ష్మీపురం జగన్నాధగట్టు " మీద మూడురోజులు వున్నాను. ఆ మూడురోజులు ప్రకృతిని ఆనందిస్తూ, " ప్రకృతిలో వుంటే ఆలోచనారహిత స్థితిలో వుంటాం " అన్న సంగతి అర్థమైంది. జగన్నాధగట్టు తల్లి ఒడిలాగా అనిపించింది. పౌర్ణమి ధ్యానానికి ఒకరోజు గట్టు మీద వున్నాను. ఆ రోజు చాలా ఆనందంగా వుంది.

 

V.విశాల
శ్వర్య అపార్ట్‌మెంట్స్,ఫ్లాట్ నెం. 207, నెహ్రూనగర్, కర్నూలు
ఫోన్ : +91 94402 90181

Go to top