" సెల్‌ఫోన్ ద్వారా .. ధ్యాన ప్రచరం "

 

నా పేరు పాండురంగస్వామి " SMSగోపి" గా మీకందరికీ సుపరిచితుడిని. ఒక రోజు నా స్నేహితుడు శ్రీనివాస్ ప్రోద్బలంతో మా ఫ్యాక్టరీలో ధ్యానం క్లాస్ .. సామర్లకోట ప్రసాద్ గారిచే జరిగినప్పుడు హాజరైన నాకు ధ్యానం మీద చాలా ఆసక్తి కలిగింది. తరువాత పది రోజులకే పత్రిగారు మా ఊరు జూనియర్ కాలేజీకి వచ్చారు.

ఫిబ్రవరి 2009 న శివరాత్రి రోజు గొల్లలమామిడాడ పిరమిడ్‌లో నా స్నేహితుడు శ్రీనివాస్‌తో కలిసి ధ్యానం చేసాను. ఒక గంటలో చాలా అనుభూతి కలిగింది. " నేను చేయవలసింది ఎంతో వుంది ; అందుచేత నాకు ఈ అనుభూతి వచ్చింది " అని నిర్ణయించుకున్నాను.

అప్పటినుంచి కొంతకాలంపాటు ప్రతి ఆదివారం ఒక్కొక్క మాస్టర్‌తో మా ఇంట్లోనే క్లాస్ నిర్వహించాను. ఉద్యోగరీత్యా నాకు రాత్రి పగలు ఫ్యాక్టరీలో పనులు వుండడం వలన మా ఊర్లో ప్రతి నెల రెండవ అదివారం జరిపే ఒకరోజు క్లాస్‌తో తృప్తిపడాల్సి వచ్చింది.

అయితే ఉద్యోగరీత్యా నాకు బయటకు రావడానికి వీలుపడదు కనుక.. ఏదోవిధంగా ప్రజలకు సేవచేసి ప్రజలందరినీ జ్ఞానులుగా మార్చాలి, శాకాహారులుగా మార్చాలి " అనే సంకల్పంతో, దృఢనిశ్చయంతో మాస్టర్లందరికీ పత్రీజీ కార్యక్రమాలు తెలియజేసి అందరినీ ఏకత్రాటిపైకి తీసుకురావాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ లోని అందరి ఫోన్ నంబర్లు సంపాదిస్తున్నాను. ఈ రోజుల్లో సెల్‌ఫోన్ చేతిలో లేని మనుష్యులను చూడడం దాదాపుగా అసాధ్యం .. కాబట్టి ఆ ప్రసారమాధ్యమాన్నే ఈ ధ్యానప్రచార ఆయుధంగా మలచుకుని .. నా ప్రయత్నం చేస్తున్నాను.

మొదట మా ఊరికి దగ్గరగా వున్న కార్యక్రమాల గురించి తెలియపరుస్తూ మెల్లమెల్లగా .. ఆంధ్రప్రదేశ్, చెన్నై, బెంగళూరు వరకు ప్రతిరోజూ ధ్యానం క్లాసుల గురించి అందరికీ నేను నా ఉద్యోగం చేసుకుంటూనే సునాయాసంగా పంపగలుగుతున్నాను. మొదట్లో చాలామంది వ్యతిరేకంగా మాట్లాడినా .. నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్లను నమోదు చేయించుకుంటున్నారు.

దీని నిమిత్తం అయిన ఖర్చంతా నేను భరిస్తూ పగలు సెల్‌ఫోన్ ద్వారా, రాత్రిపూట ఇంటర్‌నెట్ ద్వారా అందరికీ అందజేయ గలుగుతున్నాను. అందరికీ నెట్ ద్వారా, ఈ- మెయిల్ ద్వారా తెలుగులో కూడా పంపించాలని కృషి చేస్తున్నాను.

ప్రతి నెలా పత్రీజీ టూర్ ప్రోగ్రామ్ " ధ్యానాంధ్రప్రదేశ్ " ద్వారా సేకరించి .. 2,3 తేదీలలో అందరికీ అందజేస్తాను. ఇప్పటికి నేను 3,000 పైన నంబర్లు సేకరించాను. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో 12,000 నంబర్లు సేకరించవలసి వుంది. ఆంధ్రప్రదేశ్‌లో అందరు మాస్టర్లతో నేను ఎవ్వరినీ కలవలేదు. అయినా అందరూ ఫోన్‌లో పరిచయంతో మాట్లాడుతున్నాం. " ధ్యానాంధ్రప్రదేశ్ " ద్వారా గత మూడు సంవత్సరాల పుస్తకాలు చదివి అందులోని చాలా సెల్ నంబర్లు సేకరించాను. ఎన్నో పుస్తకాలు చదివాను ( ఒకయోగి ఆత్మకథ, రాంపా - మరణం లేని మీరు, సేత్ విజ్ఞానం, నక్షత్రమిత్రులు, మీ అరోగ్యం మీ చేతుల్లో వుంది, ఆనందం, మీ జీవితం మీ చేతుల్లోనే వుంది, జీవితం ఎన్నో ఎన్నో చదివాను).

సూక్ష్మశరీరయానం, మొదటి రెండవ నెలలోనే చేయగలిగాను. ధ్యానం ద్వారా నా BP నార్మల్‌కు వచ్చింది. ఎంతో సంతోషంగా వున్నాను. దేశంలోని అందరికీ సంపూర్ణ ధ్యానప్రచారం చేయాలనే సంకల్పంతో వున్నాను. అందరి పేరున " ఈ -మెయిల్ " ద్వారా ఎక్కువ సమాచారం ఆయా భాషలలో అందించాలనే దీక్షతో వున్నాను. ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉండటంతో అందరి ఆస్ట్రల్ మాస్టర్స్ ఆశీర్వాదంతో నా దీక్ష సఫలం చేయగలననే పూర్తి విశ్వాసంతో వున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ తమ ఈ -మెయిల్ అడ్రస్, సెల్ నంబర్, పేరు, ఊరు జిల్లాతో నాకు తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాను.

 

గోపి
ఫోన్ : 94401 03834
E-mail : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it., This email address is being protected from spambots. You need JavaScript enabled to view it., This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Go to top