" ధ్యానం ద్వారా యూనివర్సిటీ ర్యాంక్ "

 

నా పేరు అమాం యశోదరాణి. మాది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. ప్రస్తుతం నేను B.Tech మూడవ సంవత్సరం చదువుతున్నాను. మా నాన్నగారు అమాం సింహాచలం. అమ్మ అనురాధ. మాది మధ్యతరగతి కుటుంబం. మాకు ధ్యానం గురించి మా మేనమామ బండి శ్రీనివాసరావు గారి ద్వారా తెలిసింది. నాకు మొదట్లో ధ్యానం గురించి పెద్దగా నమ్మకం లేదు. మా ఇంట్లో పిరమిడ్‌ను వుంచారు. మా తల్లిదండ్రులు ధ్యానం చేసేవారు. కానీ నాకు నమ్మకం కుదరక నేను చేసేదాన్ని కాదు. ధ్యానం చేస్తే ఏది అనుకుంటే అది జరుగుతుందనీ, జరగబోయేది ముందే తెలుస్తుందనీ ధ్యానులు కూడా నాకు తమ అనుభవాలు చెప్పేవారు. అయినప్పటికీ నేను నమ్మలేదు.

మా వాళ్ళ ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండేవారు. ఇలా ఎంతమంది చెప్పినా, ఎన్ని మార్పులు జరిగినా నాకు నమ్మకం కుదరలేదు. విచిత్రంగా నా జీవితంలోనే అనేక మార్పులు జరిగాయి. నేను యావరేజ్ స్టూడెంట్‌ని. మేము ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో పిరమిడ్ కొన్నాం. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం కూడా నాకు మార్కులు మామూలుగా వచ్చాయి. కానీ పిరమిడ్ కొన్న తరువాత నుంచి నా మార్కుల్లో మార్పులు వచ్చాయి. " ఎంత ? " అంటే .. ఇక అప్పటినుంచి నేను క్లాస్ ఫస్ట్.

అప్పుడు " పిరమిడ్ ఇంట్లో వుంటేనే ఇంత ప్రభావం వుంటే, ఇక ధ్యానం చేస్తే ? " అనిపించింది నా మనస్సుకి. వెంటనే ధ్యానం చేయటం ప్రారంభించాను. ఇక అప్పటినుంచి నా జాతకం మారిపోయిందనే చెప్పాలి. అన్నిటిలోనూ ఫస్ట్. ఇక అప్పటినుంచి నా జీవితం విజయాల బాటలోనే నడుస్తుంది. అప్పటినుంచి మా ఇంటిల్లిపాది మాంసాహారం మానేసాము. పూర్తి శాకాహారులుగా మారిపోయాం. నా జీవితంలో ఇంకొక మధురానుభూతి వుంది. అది ధ్యానం ద్వారా లభించింది నా పూర్తివిశ్వాసం. నాకు యూనివర్సిటీ ర్యాంక్ వచ్చింది. యావరేజ్ స్టూడెంట్‌కి యూనివర్సిటీ ర్యాంక్ వచ్చింది. యావరేజ్ స్టూడెంట్‌కి యూనివర్సిటీ ర్యాంక్ అంటే మామూలు విషయం కాదు. నాకు సంఘంలో పేరు ప్రతిష్టలు రావటానికి పిరమిడ్ కారణం. నాకు మానసిక శాంతి, చురుకుదనం అన్నీ పిరమిడ్ ద్వారా లభించాయి.

ధ్యానం వలన అనేక లాభాలు వున్నాయి. చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. మానసిక ఆందోళనలు, ఒత్తిడులు తొలగి, మనశ్శాంతి లభిస్తుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. నిత్యజీవితంలో ఎదురయ్యే అన్నిరకాల సమస్యలను పరిష్కరించే వివేకం ప్రాప్తిస్తుంది. దైనందిన జీవితంలో చురుకుదనం పెరుగుతుంది. విద్యార్థులకు అద్భుతమైన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, తెలివి, ప్రతిభ అభివృద్ధి చెందుతాయి. ఎవరెవరు ఏ ఏ రంగాలలో వున్నారో వారు ఆయా రంగాలలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తారు. బుద్ధికుశలత, చక్కటి నిర్ణయశక్తి, స్థిరత్వం, సమయస్పూర్తి, విచక్షణాజ్ఞానం, అవగాహన, శక్తిసామార్థ్యాలు మరి ఆత్మజ్ఞానం సంప్రాప్తిస్తాయి.

నా అనుభవాలు అక్షరరూపాన్ని దాల్చటానికి కారణం .. నా లాగా మొదట్లో చాలామంది యువత ధ్యానశక్తిని నమ్మక పోవడమే. అయితే నా జీవితంలో అనూహ్యమైన మార్పులు జరిగినట్లుగానే అందరి జీవితాలలో జరగాలనీ, అందరూ పుర్తి శాకాహారులుగా మారండి. మీ జీవితాన్ని మార్చుకోండి. అసలు ధ్యాన సాధనను మించిన వ్యక్తిత్వ వికాస శిక్షణ యువతకు లేదు గాక లేదు.

 

A. యశోదరాణి
పశ్చిమగోదావరి జిల్లా
సెల్ : +91 90324 31119

Go to top