" సహధర్మ చారిణి "


నమస్కారం మేడమ్ ! నా పేరు భవానీ దేవి. సికింద్రాబాద్, రాష్ట్రపతి రోడ్, కేర్ సెంటర్ నుంచి వచ్చాను. పత్రి మేడమ్ గా మీరు మా అందరికీ సుపరిచితులే. మాకు తెలియని "జానకీ స్వర్ణమాలా మేడమ్" గా మీ అలవాట్లు, అభిరుచులు, అభిప్రాయాలు తెలుసుకుని పాఠకదేవుళ్ళకు అర్పితం చేయాలని వచ్చాను.

స్వర్ణమాలా పత్రి : సంతోషం ! ఏం వివరాలు కావాలో అడగండి.

రాజశేఖర్ : పత్రిసార్ కు, మీకు వివాహం ఎప్పుడు జరిగింది?

స్వర్ణమాలా పత్రి : 1974 సం||లో మే నెల 26 వ తేదీన.

రాజశేఖర్ : పత్రీజీ మీకు పెళ్ళికి ముందే పరిచయస్తులా?

స్వర్ణమాలా పత్రి : అవును. పత్రీజీ వేరవరో కాదు. మా రెండో అక్కగారి మరిదిగారు

రాజశేఖర్ : మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళా?

స్వర్ణమాలా పత్రి : ఒక రకంగా ‘కాదు‘ ! మరోరకంగా ‘అవును‘! పత్రిసార్ మా అక్క మరిది కావడంతో చుట్టరికంరీత్యా మా యింటికి వస్తూ వుండేవారు. ఈ రాకపోకల నేపధ్యంలో నెమ్మదినెమ్మదిగా ఆయన నా పట్ల ఆకర్షితులయ్యారు!

రాజశేఖర్ : అది మీకు ఎలా తెలిసింది?

స్వర్ణమాలా పత్రి : తెలుస్తుంది కదా! ఆయన నాతో ఎక్కువ సమయం గడపటానికి ఆసక్తి చూపించేవారు. స్వతహాగా మితభాషి అయినా ఒకటీ .. అరా మాటలు, కల్పించుకుని మాట్లాడటానికి ప్రయత్నం చేసేవారు. ఈ ప్రయత్నాలు కొంచెం శృతి మించేలా కన్పించటంతో అడిగాను "ఏంటి కథ" అని!

రాజశేఖర్ : అప్పుడాయన ఏమన్నారు?

స్వర్ణమాలా పత్రి : నోటితో ఏమి అనలేదు కానీ చేతితో వ్రాసి చూపించారు "ఐ లవ్ యు" అని.

17 ఏళ్ళ లేలేత ప్రాయం నాది. అయినా పెరిగిన సంప్రదాయాల రీత్యా నేను ఒక్కటే ప్రశ్న అడిగాను! "ప్రేమిస్తే సరిపోతుందా" అని. అప్పుడాయన"ఐ వాంట్ టు మ్యారీ యు" అని వ్రాశారు. నేను వెంటనే “యస్" అనేశాను!

రాజశేఖర్ : అంత తొందరగా ‘యస్’ అనేందుకు పత్రిసార్లో మీరు మెచ్చినవి ఏంటి?

స్వర్ణమాలా పత్రి ; పెళ్ళికి ముందు కన్నెపిల్లలు ఏవేవో కలలుకంటూ ఉంటారు. నాకాట్టే పెద్దపెద్ద కలలు ఏమిలేవు కానీ .. "పొడగరి, సొగసరి అయితే చాలు" అనుకునే దానిని. ఆ రెండూ ఆయనలో పుష్కలంగా కన్పించాయి.

రాజశేఖర్ : వెంటనే భాజా, భజంత్రీలు మోగాయా?

స్వర్ణమాలా పత్రి : ఆ .. మోగాయి .. ముందు మావీపు మీద! అటువైపు, ఇటువైపు పెద్దలు ఇరువురూ కూడా సుముఖంగా లేరు. కాని మేమిరువురమూ ఇరుపక్షాల వారికి శతవిధాలా నచ్చచెప్పి వారి ఆమోదం పొందాక పెద్దల సమక్షంలో పెళ్ళి చేసుకున్నాము.

రాజశేఖర్ : సాధారణ భర్తలాగానే మొదటిరోజులలో ఆయన మీరే లోకంగా ఉండేవారా?

స్వర్ణమాలా పత్రి : మా పెళ్ళికి ముందే ఆయనకు మరో ‘పెళ్ళాం’ ఉండేది .. అదే సంగీతం! నిజానికి నాకు సంగీతం పట్ల ఎంతమాత్రం ఆసక్తి గానీ, ఇష్టం గానీ లేవు. "ఈ సంగీతం నా పాలిట ‘సవతి’ లాగా దాపురించింది" అన్పించేది. కానీ ఆయన సంగీతంకు సగం మరి సహధర్మచారిణిని అయిన నాకు సగం .. అలా సమంగా తన జీవితాన్ని పంచేవారు.

రాజశేఖర్ : మీ పుట్టింట్లో, అత్తవారింట్లో ఆధ్యాత్మికత ఎలా వుండేది?

స్వర్ణమాలా పత్రి : మా రెండిళ్ళలో కూడా రాఘవేంద్రస్వామే ఇలవేల్పు. పుట్టుకరీత్యా బ్రాహ్మణులం .. శాఖరిత్యా "మధ్వులం" కావటమే దీనికి కారణం. రెండిళ్ళలో కూడా పూజాకార్యక్రమాలు విరివిగా మరి విధిగా జరిగేవి.

రాజశేఖర్ : భగవద్గీత పారాయణ లాంటివి, ఆత్మసంబంధిత సంభాషణలు ఏమయినా జరిగేవా?

స్వర్ణమాలా పత్రి : అబ్బే వాటి ఊసేలేదు. కానీ పత్రీజీ అప్పటికే భగవద్గీత రెండు, మూడుసార్లు చదివి పూర్తిగా ఆకళింపు చేసుకుని ఉన్నారు. ఆ విషయం అప్పట్లో మాకెవ్వరికీ తెలియదు. మాకు మాత్రం పుట్టినింటా, మెట్టినింటా కూడా గుళ్ళూ, గోపురాలూ, పూజలూ పునస్కారాలే. వీటిన్నింటికీ "ఏకైక వ్యతిరేకి" మా ఆయన! తాను వ్యతరేకి అయినా కూడా నేను ఏ గుడికి వెళ్దామన్నా తీసుకెళ్ళేవారు, నేను దర్శనాంతరం వచ్చేంత వరకూ సహనంగా వీధిలో ఎదురు చూసేవారు. ఒక్కమాట కూడా అనేవారు కాదు.

రాజశేఖర్ : మీ ఆర్థిక పరిస్థితి?

స్వర్ణమాలా పత్రి : ఒక సంవత్సరం వరకు ఈయనకు ఉద్యోగం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొదటి గది ఒక్కదానిలోనే మా కాపురం, వంట ..అన్నీ కూడా. సంవత్సరం తర్వాత కర్నూలు కోరమాండల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం రావడంతో మకాం కర్నూలుకు మారింది.

రాజశేఖర్ : ఉద్యోగం తరువాత పత్రిసార్ మరింత హుషారుగా ఉండేవారా?

స్వర్ణమాలా పత్రి : హుషారు, ఉత్సాహం అన్నవి ఆయనకు ఎప్పుడూ స్వంతం! ఉద్యోగంతో సంబంధం లేకుండా! కానీ ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఇంగ్లీష్, హిందీ తెలుగు భాషలలోని అనేకరకాలైన ఆధ్యాత్మిక పుస్తకాలు అసంఖ్యాకంగా చదివేవారు. 1978 లో మా పెద్దపాప పుట్టింది. ఈ సందర్భంగా పత్రిసార్‌ను వారి అన్నగారు అభినందించగా "పశుపక్షాదులకు సైతం జరిగే ఒక సామాన్యమైన సంఘటన .. నా జీవితంలోనూ జరిగింది. దీనికి అభినందనలు ఎందుకు?" అన్నారట! ఈ ఒక్క వాక్యం చాలు ఆయన అప్పటికే ఆధ్యాత్మికత ఎదుగుదలలో ఉన్నారో తెలుసుకోవడానికి! కానీ మేమెవ్వరము గుర్తించలేకపోయాం. అలా అని ఆయన నన్ను గానీ,పాపను గానీ, సంసారాన్ని గానీ ఏనాడూ నిర్లక్షం చేయలేదు. అప్పుడు, ఇప్పుడు కూడా ఆయనది ఎప్పుడూ మధ్యేమార్గం! 1979 సం|| నుండి ఆయన నోటివెంట సాహిత్యం, సంగీతం అత్మోన్నతికి చెందిన మహాతృష్టమైన మాటలు పుంఖానుపుంఖాలుగా వెలువడటం మొదలై.. రానురాను "మన సుభాష్ పత్రియేనా" అని నాతో సహా అందరికీ అనుమానాలు, ఆందోళనలు .. మొదలయ్యాయి.

దీనికి కారణం చాలాకాలం తర్వాత తెల్సింది .. ’సుభాష్ పత్రి" అనే శరీరాన్ని సంతరించుకొన్న అత్మ తనకు తాను నెమ్మదిగా తప్పుకుంటూ వేల సంవత్సరాల క్రితం నాటి వేదవ్యాసుని లాంటి మహోన్నత ఆత్మకు స్థానం ఇవ్వబోతోందని.

రాజశేఖర్ ; ఆ మహానుభావుని ఆత్మ పూర్తిస్థాయిలో సార్‌ను క్రమక్రమంగా అక్రమించు కొంటున్నపుడు సార్ ప్రవర్తన ఎలా వుండేది?

స్వర్ణమాలా పత్రి : రోజులో చాలా ఎక్కువభాగం మౌనంగా, అంతర్ముఖంగా ఉండేవారు. ఒకరోజు జనవరి 16, 1992 హఠాత్తుగా వచ్చి "ఉద్యోగానికి రాజీనామా చేసాను" అన్నారు. ఈ మాటలు వినగానే నేను అవాక్కయ్యాను. నోరు పెగుల్చు

కుని "అదేంటి?" అంటే "అది అంతే నా ఉద్యోగం ఇది కాదు!" అన్నారు ఇక ఆ రోజు నుంచి ప్రతిరోజూ ఆయన "ధ్యానం".. "ధ్యానప్రచారం" అంటూ నిమిషం ఖాళీ లేకుండా ఇంటింటికీ .. ఎన్నో ఊర్లు కూడా వెళుతూ ఉండేవారు. ఆనాటి నుండి ఇంట్లో దాదాపుగా ఉండేవారు కాదు. ఇంక అక్కడి నుంచి మొదలయ్యాయి నాకు ప్రాపంచిక కష్టాలన్నీ. ఇంటా .. బయటా అందరూ ఆయనను ఏమి అనలేక నన్ను నానామాటలు అనేవారు. వీటన్నిటికీ తోడు ప్రావిడెంటు ఫండ్ రూపంలో సార్‌కు 2లక్షలు వస్తే కొద్దికాలంలోనే దానిలో 25వేల రూపాయలు పెట్టి "Be A Master" అనే పుస్తకం వ్రాసి ప్రింట్ కూడా చేయించారు. మిగిలిన లక్ష్యా డెబ్భై ఐదువేలతో ఇద్దరు పిల్లలతో జీవితం ఎలా బ్రతకాలో తెలియని దుర్భరస్థితి నాది. "మోజుపడి చేసుకున్నావుగా .. అనుభవించు" లాంటి ఎత్తిపొడుపులు ఎన్నిభరించానో ..గుర్తుచేసుకోవటం కూడా యిష్టంలేని నరకం అది.


రాజశేఖర్ : సార్‌ను మరోసారి ప్రాధేయపడి చూడలేకపోయారా?

స్వర్ణమాలా పత్రి : ఆయనకు ఆ రోజులలో ఉత్తి పుణ్యానికే కోపం వచ్చేది! ‘ఊ’ అన్నా కోపమే .. ‘ఆ’ అన్నా కోపమే. దుర్వాసుడే ముక్కుమీద వ్రేలువేసుకునేంత కోపం! స్వతహాగా ఆయన కాస్త కోపిష్టే కాని ఇంత ఎక్కువగా ఎందుకు వచ్చేది .. అనేది నాకు 4 1/2 సం||ల క్రితం ధ్యానంలో తెలిసింది.

రాజశేఖర్ : ఏం తెల్సిందో చెప్పండి!

స్వర్ణమాలా పత్రి : "సుభాష్ పత్రి" అనే దేహం తెచ్చుకున్న ఆత్మ బయటకు వెళ్ళేందుకూ, మరో మహోన్నతమైన ఆత్మలోపలికి వచ్చేందుకూ జరుగుతున్న సంఘర్షణలో ఏర్పడ్డ పరిణామమే .. ఆ కోపం! అది మామూలు సంఘర్షణ కాదు!! దానిని భరించలేక అప్పటి వరకు సిద్ధంగా ఉన్న శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా చివరిక్షణంలో "నేను వెరెవ్వరినీ కాదు, ‘కృష్ణమూర్తి ’ నే" అనేసారు. అలా అనేసి ఆయన "కృష్ణమూర్తి" గానే మిగిలిపోయారు .. కానీ పత్రీజీ దానిని అధిగమించే దశలో ఒక్క కోపాన్ని మాత్రమే ప్రదర్శించి సరిపెట్టుకోగలిగారు!

రాజశేఖర్ : "‘సుభాష్ పత్రి’ అనే సామాన్యదేహంలో అసమాన ఆత్మ ప్రవేశించటం అనేది ఎంతవరకు సాధ్యం" అని కొందరు చర్చనీయాంశం చేయలేదా?

స్వర్ణమాలా పత్రి : చేసేవాళ్ళు చేసారు. కానీ పత్రీజీ తన శరీరంతో తెచ్చుకొన్న ఆత్మ కూడా సామాన్యమైనదేమీ కాదు! అది సామాన్యమైనదే అయితే తాను వెళ్ళటానికి గాని, దివ్యాత్మకు ప్రవేశం యివ్వటానికి గానీ ఎంతమాత్రం యిష్టపడేది కాదు. ఆయనకు ముందునుండే గుళ్ళుగోపురాల మీద ఎంతమాత్రం నమ్మకం ఆసక్తిలేకపోవటం .. వంశంలోనే లేని భగవద్గీత సారాంశం ఆయన హృదయంలో తిష్ట వేసుకోవడం, మొదటి సంతానం కలిగినపుడు ఆయన మాట్లడిన మాట.. ఇవే కాకుండా ఆయనకు యాక్సిడెంట్ అయి అపస్మారకస్థితిలో ఉండి కూడా ఆయన పలికిన పలుకులు ఇవన్నీ కూడా "మొదటి ఆత్మ కూడా గొప్పదే" అన్నదానికి నిదర్శనాలు. ఎందరో ప్రాపంచిక, మరి ఆస్ట్రల్ మాస్టర్ల సంవత్సరాల కృషి, ట్రైనింగ్ కూడా శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారిని వారనుకొన్న స్థితికి చేర్చలేకపోయింది కదా!

రాజశేఖర్ : చాలా మంచి సమాచారం మేడమ్, ‘యాక్సిడెంట్’ అన్నారు అదేమిటి?

స్వర్ణమాలా పత్రి : ఆయనకు ఉద్యోగరీత్యా ఒక Av(Audio Visual) వ్యాన్ అని పెద్దవ్యాను ఇచ్చారు. జనరేట ర్ తో సహా అన్ని సదుపాయాలు ఉండేవి. ఈయన, డ్రైవర్, సబార్డినేట్స్ ప్రయాణం చేస్తుండగా .. పెబ్బేరు సమీపంలో .. హైవేలో .. హఠాత్తుగా వ్యాను అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టింది! అయినా ఎవ్వరికీ పెద్దగా ఏమీ కాలేదు; ఈయన మాత్రం లోపలే ఇరుక్కు పోయారట. కష్టంమీద బయటకు లాగారు డ్రైవర్.. "సార్ చనిపోయారు" అనుకుని ఏడుస్తూంటే కళ్ళు తెరచి "ఎందుకురా ఏడుస్తావ్! పైన కూడా చాలా బాగుంది!" అని చాలా నిర్వికారంగా చెప్పి "అయినా ఇప్పుడేమయ్యింది; నేను బాగున్నాను కదా" అని ఓదార్చారట. అది కూడా అప్పటి ఆయన అతీతస్థితికి నిదర్శనమే.

రాజశేఖర్ : ఆ తర్వాత ఆయన అత్మోన్నతి మరింత పెరిగిందా?

స్వర్ణమాలా పత్రి : "మరింత పెరిగింది" అనటానికి మరో ఉదాహరణ చెప్తాను. ఆయన ఈ అతీతస్థితికి ఎదిగిన తరుణంలోనే మా చిన్నపాప నా కడుపున పడటం, 1982 సం||లో పుట్టడం కూడా జరిగింది. అద్భుత ఆధ్యాత్మికవేత్తకు కూతురిగా పుట్టిన కారణంగా కాబోలు ఈమె లక్షణాలన్నీ కాస్తంగా మానవతీతంగానే ఉండేవి. నేను కూడా 1984లో ధ్యానం మొదలుపెట్టి ముమ్మరంగా చేస్తున్న రోజులవి. నాకు చాలా కొత్తలోనే మొదటిసారిగా జీసస్ దర్శనమిచ్చారు. నిస్సహాయస్థితిలో ఉన్న రోగగ్రస్తులకు ఎలా హీలింగ్ చేయాలో కూడా వివరంగా చెప్పిన కరుణామయుడు ఆయన.

ఆ తర్వాత ప్రతిరోజూ ధ్యానంలో చాల పొడువుగా .. సన్నగా ఉన్న ఒకాయన దర్శనమిచ్చేవారు. ఎవరో తెలిసేది కాదు. ’తొందరలో మనం కలుద్దాం! నీవే నా దగ్గరకు వస్తావ్!" అని చెప్పేవారు.

ఇలా చాలాకాలం జరిగాక కర్నూలు పట్టణానికి 25 కి.మీ.దూరాన, మంచాలకట్ట గ్రామం దగ్గర .. ఒక పాడుబడిన గుడిలో ధ్యానతరంగాలు అద్భుతంగా ఉన్నాయని తెల్సి నేను, నా పిల్లలతో సహా కలిసి అక్కడ ధ్యానం చేసేందుకు వెళ్ళగా .. అక్కడ తటస్థపడ్డారు ఆ పొడువుగా, సన్నగా ఉన్నాయన. అయనే "కాశిరెడ్డి నాయన"గారు! ఆయన తనంతటతాను మమ్మల్ని ఆప్యాయంగా పలుకరించి "ధ్యానం చేద్దాం రండి" అనిపిలిచారు. అతి విచిత్రంగా మా పరిణిత.. రెండోపాప.. తనంతట తాను అయన ప్రక్కన కూర్చుని మొదటిసారిగా సరైన భంగిమలో ధ్యానం చేసింది. అప్పుడు L.K.G. చదువుతున్న వయస్సు దానిది! అప్పుడు ఆయన "అమ్మా! మీ పరిమల ఎంతో పరిణిత చెంది గొప్ప యోగినిగా మారే లక్షణాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి" అని చెప్పటం నాకు మహదానందం కలిగించింది! ఇది 1990 సం||లో జరిగింది!

ఒక సందర్భంలో కాశిరెడ్డి నాయన కర్నూలులో ఎవరింటికో వస్తే నేను వెళ్ళి ఆయనను మా ఇంటికి రమ్మని అడిగాను. "ఇప్పుడు కాదులే అమ్మా" అని నవ్వి ఊరుకున్నారు. ఓ పది రోజుల తర్వాత ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో లోపల తాళం వేసుకొని, తాళం వేసిన గదిలోనే కూర్చొని నేను ధ్యానం చేసుకొంటున్నాను. ఇంట్లోకి ఎవ్వరో వచ్చినట్లు సవ్వడి అయ్యి కళ్ళు తెరచి చూస్తే .. ఎదురుగా కాశినాయన తాత కూర్చొని ఉన్నారు! తాళం కప్పవంక చూస్తే వేసింది వేసినట్లే ఉంది. ఆయన నవ్వి "రమ్మన్నావు -వచ్చాను. ఎలా వచ్చాను అనే ఆలోచన అవసరమంటావా?" అన్నారు. నేను మంచినీరు తెచ్చి ఇస్తే త్రాగి "మంచి ధ్యాన స్థితిలోకి ఎదిగావమ్మా! ఏదీ! మళ్ళీ కూర్చో" అన్నారు. నేను మళ్ళీ కూర్చొని లేచేసరికి లేరు! తాళం కప్ప స్థితి యధావిధే. "సంపూర్ణ సత్యస్థితిలో ఉన్న ఏ యోగీ కూడా ప్రత్యక్షంగా అద్భుతాలు చూపించరు" అని నా ఆత్మ నుంచి నాకు అప్పుడు ఈ సందేశం వచ్చింది. ఇప్పుడు పత్రీజీ ని చూస్తూంటే నా ఆత్మ ఎంత గొప్ప సందేశాన్ని ఇచ్చిందో అర్థం అవుతోంది. ఈనాడు వేలాదిమంది పత్రీజీ వాళ్ళ వాళ్ళ ఇంటికి ఆస్ట్రల్‌గా వచ్చారనీ, ఎన్నెన్నో సందేహాలూ, సలహాలు, సమాచారాలూ, సహాయాలూ, సహకారాలూ ఇచ్చారనీ, అవన్నీ తమకెంతో ఉపయోగపడ్డాయనీ పదే పదే ఫోనుల ద్వారా, ప్రత్యక్షంగా కూడా చెబుతున్నారు!

రాజశేఖర్ : ఇలాంటివి మీరు సార్ దగ్గర ప్రస్తావించేవారా?

స్వర్ణమాలా పత్రి : ఎన్నోసార్లు! కానీ, ఆయన అయితే మౌనం .. లేకుంటే చిన్న నవ్వుతో సరిపెట్టేవారు. ఇప్పుడూ అంతే .. ఎప్పుడూ అంతే!

రాజశేఖర్ : కాశినాయన తాతతో మరింకా ఏమయిన అనుభవాలు ఉన్నాయా?

స్వర్ణమాలపత్రి : లేకేం! ఆంధ్రప్రదేశ్‌లోనే మొదటి పిరమిడ్‌గా కర్నూలు బుద్ధా పిరమిడ్ ‌ను నిర్మించినప్పుడు ఆయన వచ్చి పిరమిడ్ అంతా తిరిగి, లోన కూర్చుని ధ్యానం చేసారు. ఇప్పుడు "సమీర్ బాబా సమాధి" ఉన్న స్థలాన్ని కూడా ప్రశంసించారు. "ఈ ఒక్క పిరమిడ్ .. ముందుకాలంలో రాబోయే వేలవేల పిరమిడ్‌లకు పునాదిరాయి లాంటిదమ్మా" అని భవిష్యద్దర్శనం చేసారు.

రాజశేఖర్ : సార్, ఆయన మాట్లాడుకొనేవారా?

స్వర్ణమాలా పత్రి : వాళ్ళిద్దరిదీ కళ్ళ భాష. కళ్ళతోనే మాట్లాడుకొనేవారు.

రాజశేఖర్ : పత్రీజీకి గురువెవరయినా వుండేవారా?

స్వర్ణమాలా పత్రి : "సదానంద యోగి" నే ఆయన గురువుగా భావించేవారు. గురువుల దగ్గర ఎంత అణుకువగా ఉండాలనేది ‘పత్రీజీ’ దగ్గరే నేర్చుకోవాలి. వారు ఏది చెపుతున్నా కూడా తలపూర్తిగా వంచుకొని వినయంగా, మౌనంగా వినటం.. పాటించటం తప్ప ఒక్కమాట కూడా మాట్లాడేవారు కాదు.

రాజశేఖర్ : సార్‌లోకి ‘వాకిన్’ అయ్యింది అత్యున్నతమైన ఆత్మకదా! ఇంకా ఆయనకు గురువు అవసరమా?

స్వర్ణమాలా పత్రి : భగవద్గీతను అలవోకగా చెప్పిన ఉత్తమోత్తమ ఆత్మ అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా సాందీపుని గురువుగా స్వీకరించాడు. గురుశుశ్రూష కడు వినయంగా చేసాడు. ఎన్‌లైటెన్‌మెంట్‌లో వినయం, అణుకువ అనేవి కూడా భాగాలే. అదే పత్రీజీ కూడా చేసారు. తనకు సంగీతం నేర్పిన గురువులకు కూడా ఆయన ఎంతో సేవచేస్తూ ఎంతోవిధేయుడిగా ఉండేవారు. అలా హద్దులలో ఉండటం, వినయం చూపటం అనేది ఇప్పటివారికి అంతగా తెలియటం లేదు.

రాజశేఖర్ : ఎందరికో, ఎన్ని రకాలుగానో పత్రీజీ ఆస్ట్రల్ సహాయాలు చేసారనేది మాకు కూడా కొన్నివేలమంది చెప్పారు, స్వయంగా మా దంపతులకు కూడా అసంఖ్యాకమైన అనుభవాలు ఉన్నాయి. మరి మీకు అలాంటి అనుభవాలు ఏమయినా ఉన్నాయా?

స్వర్ణమాలా పత్రి : ఒక ప్రక్కనుంచి ఆయన గొప్పతనాలు తెలుస్తూన్నా, నేను చాలా కాలంవరకూ ఆయన్ను "భర్త" గా ఆలోచించటానికే ఇష్టపడేదాన్ని."నన్ను ఎవరు, ఎలా భావిస్తారో వారిని నేను అలానే అనుగ్రహిస్తాను" అన్న గీతా వాక్యానికి అనుగుణంగా ఆయన కూడా కేవలం "భర్త"గానే ప్రవర్తించేవారు. "యద్భావం తద్భవతి” అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెల్సింది.

అలాగే ..పిరమిడ్ గొప్పతనం గురించి తెలిసిన క్రొత్తరోజులలో మేమిరువురం అట్టలతో పిరమిడ్స్ తయారుచేసి టమోటాలు లాంటివి పెట్టి ప్రయోగాత్మకంగా చూసేవాళ్ళం. అవి ఎన్నాళ్ళయినా తాజాదనం తగ్గకుండా ఉండేవి. అప్పుడు అలా ఎన్నో అట్ట పిరమిడ్‌లు తయారుచేసేవాళ్ళం. "ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు" అనే సూక్తికి దృష్టాంతరంగా ఇప్పుడు ఎన్నివందల, వేల పిరమిడ్స్ నిర్మించబడుతున్నాయో మీకూ తెలుసు!

S. రాజశేఖర్ : కేవలం భర్తగానే కాకుండా అద్వితీయ ఆధ్యాత్మికవేత్తగా కూడా మీరెప్పటి నుంచి వారిని ఇష్టపడుతున్నారు?

స్వర్ణమాలా పత్రి : మూడు సంవత్సరాల నుంచి ఆయన్ను పతిగానూ మరి పరమాత్ముని గానూ పూర్తిస్ధాయిలో అర్ధం చేసుకుంటూ ఇష్టపడుతున్నాను ! దానికి ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా ఆయన ఊర్లో లేనప్పుడు చాలాసార్లు “ రేపు ఇది జరుగుతుంది గమనించు “ అని కలలో చెప్పేవారు. అది కరెక్టుగా అలానే జరిగేది. అలాగే ఆయన ఒకసారి హైదరాబాద్ నుండి ఢిల్లీ ధ్యాన కార్యక్రమానికి వెళుతూంటే “ నేను రానా ?” అని అడిగితే “ మరోసారి ఇద్దరమూ వెళ్దాం.. ఇప్పుడు వద్దు “ అన్నారు. నాకు తప్పనిసరిగా ఆ కార్యక్రమం చూడాలనే కోరిక కలిగింది. ఆ రాత్రికే ప్రయాణం. నేను పత్రీజీకి తెలియకుండా అప్పటికప్పుడు ఆయన ప్రక్కసీటు లోనే వచ్చేలా రానూ, పోనూ టికెట్స్, ప్రయాణం ఏర్పాట్లు చేసేసుకుని నిశ్చింతగా మధ్యాహ్నం ఒక కునుకు వేశాను. అప్పుడు సార్ హైదరాబాద్ లోనే ఎవరో ఇంటీలో వున్నారు .. కాస్తంత ఎక్కువ నిద్ర పట్టగానే నా కలలోకి వచ్చి “ నీవు వచ్చేటైం ఇది కాదు ; నా మాట విని మానుకో “ అన్నారు. నాకు ఠక్కున మెళుకువ వచ్చి వెంటనే నా ప్రయాణాన్ని కాన్సిల్ చేసుకున్నాను. సాయంత్రం ఆయన ఇంటికి వచ్చిన తర్వాత “ ఏమిటీ ! కలలోకి వచ్చి మరీ చెబుతున్నారు? “ అని అడిగితే “ మరి ఇలలో చెబితే వినని దానివి కలలోకి వచ్చి చెబితే వింటావనిపించింది .. అందుకే ఇలా .. “ అని తర్వాత మాట మార్చేశారు.

S. రాజశేఖర్ : ఇంకా ఏమయినా చిత్రాలు ?

స్వర్ణమాలా పత్రి : చెప్పానుగా .. ఆయన ఏ అద్భుతం కూడా మనకు కనబడేటట్లు చేయరని. 1991 సం||లో ఒక అపార్ట్ మెంట్ లో ఉండేవాళ్ళం. వినాయకచవితి పండుగ వచ్చింది. “ ఈ వంకతో అందరినీ పిలువు, వాళ్ళు వచ్చాక ధ్యానప్రశస్తి చెబుదాము “ అన్నారాయన. “ సరే “ అని నేను ఒక వందమందిని పిలిచి “ ఈ వందమందీ వస్తే చాలులే .. అక్కడికే గొప్ప “ అనుకుని వందమందికే వంట చేయించాను. అనూహ్యంగా .. ఎవరో దగ్గరుండి తరలించినట్లు .. తరుముతూన్నట్లుగా 700 మంది వచ్చారు. నాకు కాలూ, చేయీ ఆడలేదు. “ ఏదయితే అది అయ్యింది “ అని వడ్డించటం మొదలుపెట్టాం. ఎంతపెట్టినా తరగటం లేదు. 700 మంది తృప్తిగా తిన్నాక నేను ఎంతో ఆశ్చర్యంతో, ఆనందంతో సార్ కు వెళ్ళి చెబితే “ ఏముంది ఇందులో వింత చెందటానికి, అక్షయమైంది అంతే” .. అని చాలా సర్వసాధారణంగా అనేశారు.

***

ఆయన ఏదోయధాలాపంగా అన్నట్లుగా అన్నవి కూడా ఆ తర్వాత రోజులలో ఖచ్చితంగా అయిపోవటం .. అదీ 1990 సం|| నుంచి మరీ ఎక్కువగా గమనించ గల్గుతున్నాను.

***

షిరిడీ ధ్యానయజ్ఞానికి బాగా ముందు .. నన్ను మరో ఇద్దరినీ షిరిడీలో అనువుగా ఉండే ప్రదేశం చూసి సెలెక్టు చేసిరమ్మని ఆయన లుథియానా వెళ్ళిపోయారు. మేం షిరిడీ వెళ్ళగానే బాగా అలిసిపోయి వున్న కారణంగా తలుపు గడియవేసుకుని నిద్రపోయాను .. సడన్ గా మెలుకువ వచ్చి చూస్తే సార్ నా ఎదురుగా కుర్చీ వేసుకుని కూర్చుని వున్నారు. నేను అదిరిపోయి “ ఇదేంటి ! మీరు లుథియానాలో ఉన్నారు కదా ! “ అన్నాను. “ అవును, ఉన్నాను “ అన్నారు. “ మరి ఒకే సమయంలో ఇక్కడ ఎలా “ .. అంటూండగానే ఆయన “ సరే గాని నీ దోసిలి పట్టు “ అన్నారు. నేను పట్టంగానే ఆయన దోసిట్లో ఉన్న విడివిడి ముత్యాలు .. నా చేతిలో దండలా పట్టాయి. నేను అయోమయంలో ఉండగానే .. “ రా ! అలా వెళ్ళివద్దాం ! “ అని నా చేయి పట్టుకున్నారు. వెంటనే ఆయన .. నేనూ గాలిలో తేలిపోవటం మొదలయ్యింది. కొంతదూరం వెళ్ళాక ఒక పెద్ద మట్టిగుహ కన్పించింది. అది మనలోకమో .. కాదో కూడా నాకు తెలియదు. “ ఎన్నో వందల సంవత్సరాలుగా నా స్థిరనివాసం ఇదే, తెలిసిందా “ అన్నారు. ఆ తర్వాత మరి కొంతసేపు గగనవిహారం తర్వాత క్రిందకు చూస్తే షిరిడీ గుడి కనిపించింది. ఆ స్ధలంలో కొన్ని వందల చిన్న చిన్న పిరమిడ్స్ కనిపించాయి. “ ఈ స్ధలం ఏమిటి? .. ఈ పిరమిడ్స్ ఏమిటి ? “ అని అడిగితే “ ఇది మన ధ్యానయజ్ఞం జరగబోయే స్ధలం. ఈ చిన్న చిన్న పిరమిడ్స్, చుట్టూ ముగ్గుతో వేసిన గీతలూ ఆస్ట్రల్ మాస్టర్స్ వేసిన మార్కింగ్స్ “ అన్నారు. ఆ తర్వాత మేమిద్దరమూ కలిసినప్పుడు ఇదంతా చెబితే “ అదంతా అయిపోయింది కదా ! మళ్ళీ దాన్ని గురించి చెప్పుకునేది ఏముంది చెప్పు “ అన్నారు.

***

కొద్దినెలల క్రితం మేమందరం ఈజిప్టు కెళ్ళి ’ గీజా ’ పిరమిడ్ లో రెండు గంటల ధ్యానం చేసినప్పుడు కూడా పత్రీజీ ఎథిరిక్ శరీరం 20,30 అడుగుల ఎత్తుకు పెరిగిపోవడం కూడా చూసాను. ఇలా కొన్ని వందల అనుభవాలు ఉన్నాయి నాకు !

S.రాజశేఖర్ : ఒళ్ళు పులకరిస్తోంది మేడమ్ ! సార్ పుట్టినప్పుడు ఏమయినా విశేషాలు జరిగాయేమో మీకు ఏమయినా తెల్సా ?

స్వర్ణమాలా పత్రి : చక్కగా గుర్తుచేసారు. పుట్టినప్పుడు కాదు కానీ .. ఈయన మా అత్తగారి పొట్టలో ఉన్న సమయంలో మాసిపోయిన బట్టలతో .. తైలసంస్కారం కూడా లేని ఒక ముస్లిం సరాసరి ఇంట్లోకి వచ్చేసారట. “ కనీస మర్యాద కూడా లేకుండా ఈ కులం గాని కులంవాడు ఇంట్లోకి ఎందుకు వచ్చాడు ? తరిమి వేయండి వాడిని “ అని మా మామగారు అరుస్తూ ఉన్నా కూడా .. ఏమాత్రం బెదరక తాపీగా, నింపాదిగా మా అత్తగారి వద్ద కెళ్ళి కూర్చుని “ అమ్మా నీ కడుపున లోకోద్ధారకుడు పుట్టబోతున్నాడు. ఈ ఒక్క ముక్క చెప్పిపోదామని వచ్చాను “ అని చెప్పి ఎంచక్కా వెళ్ళిపోయాడట. ఈ విషయం మా అత్తగారు నాకు ఎన్నోసార్లు చెప్పి మురిసిపోయేవారు .

రాజశేఖర్ : మేడమ్! గత ఎనిమిది సం||లుగా చూస్తూన్నాను. మన సంస్థలోకి ఈనినట్లుగా ఎంతోమంది వస్తున్నారు. అలాగే ఎప్పటినుండో ఉన్నవారిలో కొంతమంది పోతున్నారు. ఈ ‘అయారామ్’ .. గయారామ్’ ల సంగతేంటి?

స్వర్ణమాలా పత్రి : చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అందరూ పొందాలనే అనుకొంటారు అందుకోకుండానే .. అందలం ఎక్కేసామనుకునేవాళ్ళూ.. లేనిగొప్పలు చెప్పుకుంటూ కొన్నాళ్ళు గొప్పగా చెలామణి అయ్యి.. ఆ తర్వాత వారి ముఖం ఎవరూ చూడకపోవడంతో అయిపు లేకుండా పోతారు. మరి కొందరు అందుకునేలోపే నితాంత భ్రమలతో తామెంతో గొప్పవారమనుకొని. అజ్ఞానం వలన క్రిందపడి అర్థంతరంగా పోతారు. కానీ మొదటినుంచీ కూడా వెళ్ళిపోయేవారు పదుల సంఖ్యలో ఉంటే వచ్చేవారు వేలసంఖ్యలో ఉంటున్నారు.

మొట్టమొదటి రోజులలో ఈయన ఎంత కష్టపడ్డారో నేను చెప్పలేను. ఒక్క నా తమ్ముడు ద్వారకానాథ్ కే ధ్యానం నేర్పడానికి వెరసి ఆయనకు మూడు నెలలు పట్టింది! ఇక ఈయన ప్రయాణం ఎక్కడా ఆగలేదు. దీక్ష, నిరీక్ష, నిర్విరామకృషి, నిత్యసత్యమైన ధ్యాన విధానం మరి "అందరూ గొప్పవారు కావాలి" అనుకొనే తపన.. వెరసి ఆ తపస్సు ఈరోజు ఆయనను అత్యున్నత స్థానంలో నిలబెట్టాయి. ఒకరిద్దరితో మొదలయిన ఈ సంస్థ ముప్ఫై సం||లుగా దినదిన ప్రవర్థమానమై లక్షల, కోట్లమందితో.. బెంగళూరు, హైదరాబాద్ లాంటి ఇంకా ఇలాంటి ఎన్నో నగరాలలో నిర్మించిన నిర్మింపబడుతున్న మెగా పిరమిడ్ లతో భువిని స్వర్గసీమ చేస్తోంది. ఇవి జగన్నాథ రథచక్రాలు. ఇవి ఇలా నిరంతరంగా సత్యలోకాల వైపు పరిగెడుతూనే ఉంటాయి. ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా ఈ జగన్నాధ రథం ఆగదు గాక ఆగదు.

రాజశేఖర్ : అద్భుతమైన సత్యం చెప్పారు మేడమ్! మరి మీ కార్యక్రమాలు గురించి చెప్తారా?

స్వర్ణమాలా పత్రి : నాకు ఇప్పుడు సంసార బాధ్యతలు తగ్గాయి. పెద్ద అమ్మాయి పెళ్ళి అయి స్థిరపడితే.. చిన్నమ్మాయి అమెరికా వెళ్ళింది. ఇంక ఇప్పుడే నేను నా సమయం మొత్తాన్ని ధ్యానప్రచారం కొరకు వినియోగిస్తున్నాను. ఎన్నో రాష్ట్రాలకు వెళ్ళి ధ్యానప్రచారం చేస్తున్నారు. అనేక టీవి ఛానెల్స్‌లో ధ్యానకార్యక్రమాలు జనరంజకంగా వచ్చేలా కృషిచేసాను. ఎందరో చూసి ఎంతో సంతోషించారు. ఇంటర్‌నెట్ ద్వారా దాదాపు పది వేల మందిని శాకాహారులుగా చేసాను! "ధ్యానాంధ్రప్రదేశ్", "స్పిరిచ్యువల్ ఇండియా" పత్రికలకు నా వంతు కృషిని నిరంతరం అందిస్తున్నాను. పది రోజులు అండ‌మాన్ లో జైలుకు ఒక్కదాన్నే వెళ్ళి అక్కడి ఖైదీలను ధ్యానులుగా మార్చాను. ఆయన సహధర్మచారిణిగా ఆయనతో సమానంగా కాకపోయినా సాధ్యమైనంత ఎక్కువగా ధ్యానప్రచారం చేస్తునే ఉంటాను. చాలా విషయాలు చెప్పాను. ఇంక చాలంటారా?

రాజశేఖర్ : ప్రస్తుతానికి చాలు మేడమ్! చాలా అద్భుతమైన విషయాలు, ఆనందకరమైన విషయాలు ఆశ్చర్యకరమైన విషయాలు కూడా తెలిశాయి. మీకు చాలాచాలా థ్యాంక్స్. చివరగా ఏదయినా సందేశం?

స్వర్ణమాలా పత్రి : ధ్యానం చేయండి, న్యూఏజ్ స్పిరిచ్యువల్ బుక్స్ చదవండి. "ధ్యానాంధ్రప్రదేశ్", "స్పిరిచ్యువల్ ఇండియా" లాంటి నిజమైన ఆధ్యాత్మిక పుస్తకాలను అమితంగా కొనుక్కుని అపరిమితంగా చదువుకొని నిజమైన సత్యన్వేషకులుగా ఉండి చివరకు సత్యలోక వాసులుగా వర్ధిల్లండి.

 


భవానీ దేవి
సికింద్రాబాద్

Go to top