" ఆఖరి శ్వాస వరకు .. ఇదే ఆనాపానసతి "

 

S. రాజశేఖర్ : నమస్కారం శారదా మేడమ్. నా పేరు రాజశేఖర్. పిరమిడ్ స్పిరిచ్యువల్ కేర్ సెంటర్, R.P. రోడ్, నుంచి వచ్చాను. "చేవెళ్ళ"లో మీ ధ్యానప్రచార కార్యక్రమాలను విని ముగ్ధుడనై ఆ వివరాలను మన ధ్యానులందరికీ అందించడానికి వచ్చాను.

శారదా మేడమ్ : మా స్వస్థలం నెల్లూరు జిల్లా దామరమడుగు. సుశీలమ్మ గోపాలరెడ్డి గార్ల సంతానంగా 1967 సం||లో జన్మించాను. 1984 లో నర్సారెడ్డి గారితో వివాహం జరిగింది.

S. రాజశేఖర్ : మీరు "నివేదిత ఫౌండేషన్" అని పెట్టారు గదా

శారదా మేడమ్ : ‘నివేదిత’ మా ఏకైక అమ్మాయి పేరు. 1988 సం||లో జన్మ తీసుకుంది వివేకానందుని విజ్ఞానం మీద ఏర్పడిన అభిమాన గౌరవాల వలన ఆమెకు ఆ పేరు పెట్టుకున్నాం.

S. రాజశేఖర్ : మీ వారు ఏం చేస్తూంటారు?

శారదా మేడమ్ : వారు కాంట్రాక్ట్ రంగంలో ఉండేవారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్‌బర్గాలో వ్యాపారీత్యా 1985 సం|| నుండి 1995 సం|| వరకు ఉన్నాము.

S. రాజశేఖర్ : మీ ఆధ్యాత్మిక జీవితం గురించి?

శారదా మేడమ్ : ఆధ్యాత్మికతకు అసలు అర్థం చాలామందికి తెలియనట్లే మా కుటుంబీకులకూ, నాకూ కూడా తెలియలేదు. మా అమ్మ, నాన్న చిన్నప్పటి నుంచే రాజరాజేశ్వరి అమ్మవారిని ఇష్టదైవంగా భావిస్తూ పూజించేవారు. నేను కూడా 1990 సం|| వరకు వారి బాటలోనే పయనించేదాన్ని.

1990 సం|| లో నేను కాకతాళీయంగా "బ్రహ్మకుమారీ సంస్థ" గురించి విన్నాను. ఆ సం|| మే అక్టోబర్ 9వ తేదీన ఆ సంస్థలో చేరాను. వారు ఒక ఎర్రజ్యోతి మీద దృష్టి కేంద్రీకరించి ధ్యానం చేయమనీ .. లేక భ్రూమధ్యంపై దృష్టిపెట్టి కూర్చోమని చెప్పేవారు. మన శరీరంలోని చైతన్యశక్తియే ఆత్మ అని, ఆ ఆత్మను పదిలపరుచుకొన్న పాత్రే మన శరీరమనీ ఇక్కడ తెలుసుకున్నాను. ఈ సంస్థలో కొన్నాళ్ళు అలా సాధన చేసిన తర్వాత కూడా నా మనస్సు అస్థిరంగానే ఉండేది. "ఇంకా నేర్చుకోవలసింది ఏదో ఉంది" అనిపించేది కానీ అది ఏమిటో తెలిసేది కాదు.

ఈ అన్వేషణలో భాగంగానే నేను ‘రైకీ’ నేర్చుకోగలిగాను ‘రైకీ’ అంటే అర్థం ‘విశ్వశక్తి’ అని. ఈ మాట నాకు బాగా నచ్చింది. "ప్రాపంచికశక్తి కంటే విశ్వసక్తి అనంతమైనది కదా" అని బ్రహ్మకుమారీ ధ్యానంతో పాటు రైకీ కూడా చేసుకునేదాన్ని. రైకీలో మానసిక శక్తి కంటే శారీరకశక్తిని ఎక్కువ పొందగలిగాను. యోగాశక్తితో చెట్లమీద, చీమల మీద, మరి ఇతర ప్రాణుల మీద కూడా ఎన్నెన్నో ప్రయోగాలు చేసేదాన్ని. చాలావరకు మంచి ఫలితాలు వచ్చేవి.

నా మూడవ అడుగు "సుదర్శన క్రియా" యోగం. "ఈ మూడడుగులతో వామనుడిలా అన్ని లోకాలు ఆక్రమించుకోవచ్చు అనుకున్నాను" కానీ ఆ ఆశ అడియాసే అయ్యింది. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ లో పాజిటివ్ థింకింగ్ మాత్రం నేర్చుకోగలిగాను.

అన్నిరకాల శారీరక మానసిక ఆధ్యాత్మికత అద్భుతాలను ఆధించాలని పట్టుదలతో ధ్యానంలో కూర్చుంటే ఆ ఆత్మధ్యాన సాధనలో ఎందరో మహానుభావులు కన్పించారు కానీ ఎప్పుడు కన్పించని బుద్ధ భగవానుడు కన్పించారు. ఒక పెద్ద మబ్బుతెర తొలిగినట్లయింది. అసలు నాకు చిన్నప్పటి నుంచి బుద్ధుడు అంటే ఎంతో యిష్టం అయినా బుద్ధుని "ఆనాపానసతి" గురించి తెలియదు.

1999 సం||లోనే "పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ" అని ఒకటి ఉందని తెలుసు;అయినా నా దృష్టి అటు మరలలేదు. కర్మ కాలిపోయేవరకు కర్తవ్యాన్ని గుర్తించలేమేమో కదా మరి.

S. రాజశేఖర్ : మరి మన పిరమిడ్ సంస్థలోకి ఎలా, ఎప్పుడు వచ్చారు?

శారదా మేడమ్ : 2502 సం||లో చేవెళ్ళ గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో 21 ఎకరాలు ముందు భవిష్యత్తులో ధ్యానం ద్వారా కొన్నివేల మందికి ఇహలోక సౌఖ్యాలు అందించాలనే ఉత్తమ ఆశయంతో కొన్నాం. ముందు ఈ స్థలంలో ఒక "hut పిరమిడ్" నిర్మించాము. 2506 సం|| వరకు దానిలోనే నేను, నా భర్త మరి నివేదిత మరి కొంతమంది మిత్రులు, కుటుంబసభ్యులు ఆనాపానసతి ధ్యానం చేసుకునేవాళ్ళం. ఆశ్చర్యకరంగా నేను అంతకుముందు ఏనాడూ పొందని ప్రశాంతత లభిస్తూ ఉండేది. అయితే 2506 సం||లో ఈ hut పిరమిడ్ కూలిపోయింది.

ధ్యానానికి అయినా భవనానికి అయినా సరైన పునాది ఉండటం అవసరమనిపించి 2506 సం||లో స్పిరిచ్యువల్ ఇండియా ఆఫీసుకి వెళ్ళి మల్లిఖార్జున గారిని కలవటం- ఆయన పిరమిడ్ మధుసూదన్ గారిని పరిచయం చేయటం 12 X 12 వ్యాసార్థంలో పిరమిడ్ కట్టేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో శ్రీ సాయికుమార్ రెడ్డి గారి నీ, పూల రాజేశ్వర్ గారి కలిసి పత్రీజీ ని పరిచయం చేయమని కోరగా "సార్ కు ఎవ్వరినీ, ఎవ్వరూ పరిచయం చేయనక్కరలేదు. మీకు ఆయన అపరిచితులే గాని, సార్‌కు మీరు. అందరూ కూడా సుపరిచితులే, మీరే పరిచయం చేసుకోండి" అన్నారు. ధైర్యం చేసి నేనే పరిచయం చేసుకుని అన్ని వివరాలు చెప్పాను. "ప్రారంభోత్సవానికి నేను రానా? భలే వారు మీరు" అని నవ్వి జూన్ 26, 2506 రోజున ప్రారంభోత్సవం చేసి నాతో వచ్చిన వారందరితో ధ్యానం చేయించారు, "దివ్యశక్తి పిరమిడ్" అని నామకరణం చేసారు.

ఇంక అక్కడ నుంచి నాకు ఒక్కొక్క సత్యం తేటతెల్లమవటం ప్రారంభమయ్యింది. "నా జీవితంలోనైనా, ఎవరి జీవితంలోనైనా వచ్చే కష్టాలు ‘శిక్షలు’ కావు .. ‘శిక్షణలు’" అని అర్థమయ్యింది. కరెక్టుగా నేను ఈ సత్యాన్ని మనసా-వాచా- కర్మణా విస్తారంగా హస్తగతం చేసుకున్న సమయంలో మా నివేదిత తన ఈ ప్రాపంచిక జీవితం నుంచి అస్తమించింది. ఒక తల్లిగా నా మనస్సు తల్లడిల్లినా.. విచలితురాలినైనా .. మన ధ్యానసాధన ఫలితంగా అనతికాలంలోనే తేరుకున్నాను. ఆస్ట్రల్ మాస్టర్స్ ఆమె దేహం వదిలేస్తూందనే భావన ఆమె దేహం వదలకముందే నాకు కలిగేల చేసి నన్ను మానసికంగా కొంతవరకు సన్నద్ధం చేయటం కూడా తేరుకుంటానికి ఒక కారణం.

అంతేకాదు. మన ధ్యానసాధన వలన తెలుసుకున్న అనేక సత్యాలు జ్ఞప్తికి వచ్చాయి. ప్రతి చర్యకు ఏదో భౌతిక కారణం కన్పడినా .. దేహం అనిత్యమైనదనీ, ఆత్మ నిత్యసత్యమైనదనీ, చైతన్యమయం అని .. నిరంతరం ఎన్నో దేహాలలో ప్రవేశిస్తూ తన ప్రగతిని పెంచుకుంటూ జన్మజన్మకూ మరింత ప్రకాశవంతంగా ప్రజ్వరిల్లాలనే సాధనలో నిమగ్నమవుతుందనీ ‘నివేదిత’ వాస్తవానికి ఆమె - నా వాస్తవానికి నేను ‘సృష్టికర్తలం‘ అనీ .. బంధాలు భౌతికంగా ఎంతబలమైనవిగా కనపడినా ఎవరి జీవితం వారిదని, ఎవరు వ్రాసుకుని వచ్చింది వారు అక్షరాలా పాటించటానికి ప్రయత్నిస్తారనీ నిశితంగా విశదమైంది.

"19 సం||లకు ఆమె వచ్చిన పని పూర్తయింది కాబోలు, వెళ్ళిపోయింది" అని సమాధానం పడ్డాను. మామూలు వాళ్ళు ఎవ్వరూ ఇంత తొందరగా ఈ గాయాన్ని మరువలేరు. మరవగలగటానికి కారణం మన ధ్యానమే. "ధ్యానం ద్వారా జ్ఞానం సంపాదించిన ఏ వ్యక్తీ కూడా దుఃఖంలో మునిగిపోరు. ‘శుభాశుభపరిత్యాగి’ గా ఉంటారు" అనే సత్యాన్ని ఈ సంఘటన ద్వారా నేను కొంతవరకు జీర్ణించుకోగలిగాను. అన్ని కష్టసుఖాలు మన ఆత్మోన్నతికి సోపానాలే.

S. రాజశేఖర్ : ఇంత తొందరగా మీరు స్వస్థత పొందటం చాలా గొప్ప విశేషం మేడమ్, ఇది మీ మానసిక ధైర్యాన్ని .. మరి ఆత్మప్రగతిని నిరూపిస్తోంది. పత్రిసార్ తో మీ సాన్నిహిత్యం?

శారదా మేడమ్ :పత్రిసార్’ తో నా ప్రాపంచిక సాన్నిహిత్యం అంతంత మాత్రమే. కానీ ఆయన నా కళ్ళలోకి సూటిగా చూస్తున్నప్పుడు .. సూర్యచంద్రులను మించిన వేగంతో నా లోనికి అపారమైన శక్తి ప్రవహించేది. ఆయన నిరాడంబరత, స్నేహశీలత్వం .. పిసరంతైనా లేని ధనా‌పేక్ష.. అందరిపట్ల సమాదరణ .. అన్ని మతాల పట్ల సమత్వం .. ఎల్లలు లేని కరుణ.. ప్రేమ, సత్యాన్ని చెప్పటానికి ఏమాత్రం వెరువక, కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్పటం .. ఎదుటివారిలో ఏ వ్యతిరేక భావాలు ఉన్నా నిర్మోహమాటంగా అప్పటి కప్పుడు ఖండిచడం .. తన దగ్గర ఉన్న జ్ఞానాన్నంతా అరమరికలు లేకుండా కుండపోతలాగా కురిపించటం ఇంకా ఎన్నో ఎన్నెన్నో.. నన్ను వివశురాల్ని.. పరవశుల్ని చేసాయి. నాకు ఇంక ఆఖరిశ్వాస వరకు ఇదే ఆనాపానసతి .. ఇదే అధ్యాపకుడు కూడా, ఈయనే జీవించి ఉన్న భగవంతుడు!!

S. రాజశేఖర్ : సార్‌ను మీరు ‘గురువు’ గా భావిస్తున్నారా?

శారదా మేడమ్ : గురువుగా భావిస్తున్నాను. స్నేహితుడుగా ప్రేమిస్తున్నాను. ఎన్నెన్నో సంస్థలకు వెళ్ళినా, ఏ అధిపతి దగ్గర పొందని గురుత్వం, మిత్రత్వం కూడా ఇక్కడే పొందాను. మరి ఇంకెక్కడా పొందలేనని కూడా తెల్సింది.

S. రాజశేఖర్ : మన ధ్యానపద్ధతులు ఎలా ఉన్నాయి?

శారదా మేడమ్ : ఏ షరతులూ లేని ధ్యానం మనది. ఇతర అన్ని ధ్యానాల కంటే అతి సులువైనదీ, విలువైనదీ "ఎప్పుడయినా" "ఎక్కడయినా" అనేది అన్నింటికంటే అందరికీ ప్రశంసనీయమైనది, ఆచరణీయమైంది కూడా; నేను మన ఆనాపానసతి ధ్యానానికి ముందు కూడా కొంతవరకు ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేసేదాన్ని గాని .. ఇప్పుడున్నంత ఎక్కువగా మునుపెన్నుడూ లేదు. అన్నింటికంటే చెప్పుకోతగినది, కృష్ణతత్వం. సినిమాలలో చూసామేమో ఆ సమస్త విశ్వం నాలో నిండిపోయి కనపడింది. నేను వేరు, కృష్ణుడు వేరు కాదు. ఇద్దరమూ ఒక్కటే అనే అలౌకిక ఆనందం మొదలయ్యి "కృష్ణుడు ఒక వ్యక్తి కాదు ‘ఒక శక్తి’ పుట్టిన ప్రతి మనిషిలోనూ ఉన్న నిగూడ విశ్వశక్తి" అని అర్థమైంది. ఈ అనుభవం నా మొత్తం ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నతమైన, అనిర్వచనీయమైన నాకు అత్యంత అవసరమైన మధురానుభూతి. మరపురానిది-మరువలేనిది.

మొదటి నుంచీ "అన్ని సంస్థల నుండి ఎన్నెన్నో నేర్చుకోవాలనే తపన తపస్సు మన ధ్యానం వలన .. మన పత్రీజీ వలన ఫలించాయి" అని గట్టిగా చెప్పగలను. "సంసారంలోనే నిర్వాణం" అనే మన ఒక నినాదం సమస్త సృష్టికే ఒక మంగళతోరణం. మిగతా గురువుల ప్రబోధాలు మనస్సుపరంగా ఒంటబట్టాయి. కానీ పత్రీజీ ప్రబోధాలు ఆత్మపరంగా అంటసాగాయి. "దీనికి కారణం అందరి గురువులు కంటే పత్ర్రిసార్ ప్రతిమాటా ఆయన చేతిలో కూడా ప్రతిఫలించటం వల్లనే. ప్రాక్టికల్ గురువాయన".

ఆత్మప్రగతిని కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వెనుకంజ లేక ముందు ప్రయాణం అనునిత్యం సాగించే వారంటే వారికి వల్లమాలిన అభిమానం. నేను ఆయన పరిధిలోకి ప్రవేశించిన తర్వాత ప్రశ్నలు వేయటం మానివేసాను. ఎవరి ప్రశ్నకు సమాధానం వారి దగ్గరే లభ్యమవుతుందనే సత్యం అభ్యాసంలో పెట్టగలిగాను. మొన్న ఆ మధ్య వచ్చిన వరదలు ముందే నాకు తెలిసాయి.

S. రాజశేఖర్ : సార్‌తో మరింతా ఏమైనా అనుభవాలు ?

శారదా మేడమ్ : మొదటిసారి పత్రిసార్ ఇంటికి వెళ్ళినప్పుడు పత్రి మేడమ్ ఎంతో ఆదరంగా కాఫీ తీసుకువచ్చి ఇచ్చారు. నేను కాఫీ, టీలు త్రాగను. ఆ మాట చెప్పటానికి మొహమాటపడుతూన్న సమయంలో సార్ "ఆమె కాఫీ, టీ లాంటివి త్రాగరు. పాలు, పళ్ళరసాలు లాంటివి త్రాగుతారు; ఆమెను బలవంతం చేయవద్దు" అన్నారు. ఇదే నాకు చాలా ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కూడా కలిగించింది. ఆ తర్వాత భోజన సమయంలో ఆయన స్వయంగా వడ్డించటం, కొసరి కొసరి తినిపించటం, "ఆ రాజరాజేశ్వరికి కూడా ఇంత మమకారం ఉంటుందా?" అని అనుమానం వచ్చేంతలా మురిపించింది.

S. రాజశేఖర్ : మీ "నివేదిత ఫౌండేషన్" లక్ష్యాలు ఏమిటి?

శారదా మేడమ్ : మేం కొన్న 21 ఎకరాలలో, అయిదు ఎకరాలు ధ్యాన కార్యక్రమాల కొరకే వినియోగించటానికి కృతనిశ్చయమై ఉన్నాం. 1000 మంది హాయిగా కూర్చుని మెడిటేషన్ చేసుకునేందుకు వీలుగా ‘జీవనవేదం’ అనే నామకరణంతో పెద్ద హాలు నిర్మించనున్నాం. అలాగే 500 మందికి అత్యంత సౌకర్యంగా వసతి ఏర్పాటు చేసాము.

S. రాజశేఖర్ : భవిష్యత్ కార్యక్రమాలు ఏమిటి?

శారదా మేడమ్ : నా దృష్టిలో మహిళలు మణిరత్నాలు, యువకులు విరబూస్తున్న పుష్పాలు. దురదృష్టవశాత్తు ఈ ఇద్దరికీ సరైన ప్రాధాన్యత లభించటం లేదు. యవసాధికారత - మహిళా సాధికారతకు ప్రాముఖ్యత నివ్వటం .. ‘పెద్దపీట’ వేయటం మా ప్రథమ కర్తవ్యం. కేవలం ఈ రెండువర్గాలు కాకుండా అన్ని వయస్సుల వారినీ కుల, మతం, జాతి వైషమ్యాలు లేకుండా 10-15 రోజుల శిక్షణ ఇచ్చి ఆనాపానసతి ధ్యానం నేర్పటం, పాజిటివ్‌గా సంతోషంగా, బ్యూటిఫుల్‌గా జీవిస్తూ సరైన విలువలతో కూడిన నవ సమసమాజాన్ని నిర్మించటమే మా ప్రధానలక్ష్యం.

మా నివేదిత పుట్టిన 11/2 సం|| నుండే నాకు ఆమె నుండీ ఇలాంటీ సందేశాలు గైడెన్స్‌గా వస్తూ ఉండేవి. ఇన్నాళ్ళకు "ఆమె ఆత్మ ప్రేరేపితమా" అన్నట్లు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. కోటిమందిని మా వంతుగా శాకాహారులుగా మార్చటం మా ఆశయాలలో ఒకటి. మంచి విత్తనం వేస్తే మంచి పంట, మంచి పనిచేస్తే మంచిఫలితం వచ్చే తీరుతాయి కదా.

నివేదిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో "పిరమిడ్ సొసైటీస్ మూవ్‌మెంట్", పైమా మెంబర్స్ అందరూ కలిసి చేవేళ్ళ మండలం యావత్తూ "శ్వాస మీద ధ్యాస మండలం" గా, "శాకాహార మండలం" గా మార్చటానికి కంకణం కట్టుకున్నాం. ఈ కంకణదీక్ష సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభించాం. ఈ కార్యక్రమం జయప్రదం కావటానికి‘శివ’, ‘జగన్’ మొదలుగాగల యువసైన్యం ఉరకలు పెడుతూ ఉత్సాహం చూపుతున్నారు.

ఈ మధ్యకాలం స్వైన్‌ఫ్లూ అవగహన సదస్సు కలెక్టురు, సబ్ కలెక్టర్ గార్ల ఆధ్వర్యంలో జరిగింది. ఎందరో డాక్టర్లు ఆహ్వానితులుగ వచ్చారు. మన పైమా మెంబర్స్ వెళ్ళి "మాకు ఒక అరగంట ధ్యాన కార్యక్రమానికి కేటాయించండి" అని అడగటం, వాళ్ళు ఒప్పుకోవటం .. అరగంట కాస్తా, గంట గంటన్నర అయినా కూడా ఎవ్వరూ కాదనకపోవటం, అవాక్కయి వినటం వాళ్ళకే ఆశ్చర్యం కలిగిస్తే, మాకూ మా వాళ్ళకు ఆశ్చర్యం, ఆనందం కలగా పులగంగా కలిగాయి. ధ్యానమహిమ అలాంటిది మరి, సబ్‌కలెక్టర్ ఎంతో ఆనందభరితులై "మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ మీరు ధ్యాన కార్యక్రమం పెట్టినా నేను పర్మిషన్ ఇస్తాను" అని చెప్పటం పరాకాష్ట.

చేవెళ్ళ మండలంలో 15 గ్రామాలు మరి శంకరపల్లి మండలం అన్ని కాలేజీలలో ధ్యానపరిచయం చేయటం వాళ్ళ సత్సంగ కార్యక్రామాలలో మన ధ్యానాన్ని కూడా చొప్పించటం మన విశేష విజయం. చేవెళ్ళ మండలం నుండి శ్రీశైల ధ్యాన యజ్ఞాని కి పైమా వాళ్ళ సహకారంతో 5,000 మందికి తక్కువ లేకుండా తీసుకువస్తాము.

S. రాజశేఖర్ : చాలా విషయాలు చెప్పారు మేడమ్, ఈ మార్గంలో మీకేదయినా సరిక్రొత్త ఆలోచన ఉందా?

శారదా మేడమ్ : రాజకీయ నాయకులు, టీచర్లు, రక్షణ వ్యవస్థ, న్యాయవ్యవస్థ, డాక్టర్లు, విలేఖరులు, సంఘాన్ని ఎక్కువగా ప్రభావితం చేయగల్గిన ప్రతిభావంతులు. వాళ్ళ వాళ్ళ వృత్తులకు వాళ్ళు సరైన న్యాయం చేయగలిగేలా మన సమస్త శక్తులు ఉపయోగించి ప్రపంచాన్ని ప్రగతిపథంలో నడిపించాలనేది నా ఆలోచన, అభిమతం కూడా

S. రాజశేఖర్ : చివరిగా మీ సందేశం

శారదా మేడమ్ : "ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టిపనులు" మనకు చేతనయినంత చేయటం ద్వారా ప్రపంచంలో పరివర్తన సాధించగలం. దానికోసం నా భావాలతో ఏకీభవించే సేవాతత్పరులకు ఇదే నా ఆహ్వానం. తనువు, మనస్సు, ధనం, సహాయం, సమయం ఏది ఎంత వీలయితే అంత ఎక్కువ ఇక్కడ వినియోగించటం కొద్ది సమయంలోనే పత్రిసార్‌కి "ధ్యానజగత్తు" ను బహుమతిగా అందించటానికి ప్రయత్నించటం మన కనీస విధిగా భావించాలి.

ఏ రోజుకు ఆరోజే "ఇదే నా చివరిరోజు; ఈ రోజే నా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలి" అనే ఎరుకతో ప్రతిక్షణం జీవిస్తే ప్రతి ఉషోదయం మనపట్ల స్వర్ణోదయంగా మారి తీరుతుంది నా జీవితమంతా మన ధ్యానసేవకే అంకితం. మీరందరూ కూడా ఇదే ఆశయంతో అప్రమత్తంగా ఉండాలనే నా సందేశం.

 

S. రాజశేఖర్

Go to top