" సింగపూర్ స్పిరిచ్యువల్ సొసైటీ ఇవాళే పుట్టింది "

 

మారం శివప్రసాద్ : మీ వివరాలు?

శశిధర్ : నా పూర్తిపేరు సామిరెడ్డి శశిధర్ రెడ్డి నా వయస్సు 37. నా భార్య ఉష. మా అమ్మ, ఇద్దరు పాపలు. శ్రియ, సహస్ర. నేను MCA చేసాను. 1997 సం||లో మొదటిసారి సింగపూర్ వెళ్ళాను ప్రాజెక్టు వర్క్‌పై. వాళ్ళు ఉండమనడం, నేనూ అలానే కంటిన్యూ కావడం జరిగింది.

మారం : మీకు "పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్" గురించి ఎప్పుడు, ఎలా, ఎవరి ద్వారా తెలిసింది? మీకు ధ్యానం చేయాలని ప్రేరణ ఎలా కలిగింది?

శశిధర్ : సింగపూర్‌లో "On the Trails of Nalanda" అనే బుద్ధుని కాన్సె‌ప్ట్ మ్యూజియం పెట్టారు. వివిధ దేశాల నుండి బుద్ధుని గురించిన విశేషాలన్నీ సేకరించి చేసిన ఎగ్జిబిషన్ రెండు గంటలపాటు తనివితీర చూసాను నేను. పులకించిపోయాను. "ఒక్క మనిషి ఇన్ని దేశాలవారిని ఉద్ధరించడానికి మార్గం చూపారు. మరి బుద్ధుడు ఒక్కరే ఇలా ఎలా చేయగలిగారు?" ఇలా ఆలోచించిన మీదట నాకు కూడా "ధ్యానం" చేయాలని అనిపించి, ఇంటర్‌నెట్ ఓపెన్ చేసి మెడిటేషన్ పైన ఎన్నో సైట్స్ చూసాను, ఎన్నో సైట్స్ "15 రోజుల కోర్సు", "వారం రోజుల కోర్సు","500 డాలర్లు కట్టాలి", "250 డాలర్ల ఫీజు" ఇలాగ. "అన్నీ చెయలేము కదా" అని చూస్తూంటే "Pss.org" కనబడింది. పత్రిగారి గురించి చదివాను. ధ్యానం ఎలా చేయాలో చదివాను. కేవలం "శ్వాస మీద ధ్యాస" ఇదే ధ్యానం అంటే నేను నమ్మలేదు మొదట. "ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎంతసేపైనా చేయవచ్చు" అంటున్నారు. ‘ఫీజ్’ అనే ప్రసక్తి లేదు ఎక్కడా, "ఇది సాధ్యమేనా" అనుకున్నాను. "అయినా ప్రయత్నం చేద్దాం" అని మూడు రోజులు రోజు అరగంట రాత్రిపూట ధ్యానం చేసాను. ఇది 2008 సం|| ఫిబ్రవరి నెల.

అప్పట్లో నేను మూడునాలుగు ప్రాజెక్టులకు వర్క్ చేస్తున్నాను. స్ట్రెస్, స్ట్రెయిన్ చాలా ఎక్కువుగా ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు, వారానికి ఏడురోజులు ఎగతెరపిలేని పని ఒత్తిడి. "ఇలా చేయాలి, అలా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి" అనే నిరంతర వర్క్‌లోడ్. రాత్రి ఆలస్యంగా రావలసి వచ్చేది. నా భార్య, పిల్లలతో కొంచెం సేపు గడపడానికి కూడా సమయం ఉండేది కాదు.

ఆ మూడురోజులూ మొదటిసారి ధ్యానం చేసినప్పుడు, ఉదయం లేచిన వెంటనే ఏ టెన్షన్ లేదు. చాలా రిలాక్స్‌డ్గా అనిపించింది. మొత్తం ఖాళీ. ఏ ఆలోచనా లెదు. బ్రహ్మాండమైన అనుభూతి అది. నేను మాటలతో వర్ణించలేను. నేనేం చెసాను? “శ్వాస మీద ద్యాస” అన్నారు. ఇదే కదా నేను చేసింది. ఆలోచనలో పడ్దాను. ఆఫీసుకు వెళ్ళాను. పనిచేస్తున్నాను. ఏదో అవసరం ఉంది. దాన్ని ఎవరోవచ్చి చెసి వెళ్ళారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అన్నీ అప్రయత్నంగా జరిగిపోతున్నాయి. అప్పుడు నాకు అర్థమయింది, "ఇది ధ్యానమహిమ" అని. ఇలా నేను కాకతాళీయంగా ధ్యానం చేయడం, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ కి "అడిక్ట్" కావడ జరిగింది.

మారం : ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతూంటే, కొద్దికాలంలోనే మీలో ఎంతో మెచ్యూరిటి కనిపిస్తోంది. అది ఎలా సాధ్యమో వివరించండి!

శశిధర్ : "పిరమిడ్ రేడియో" 24 గం||లు వస్తూ ఉంటుంది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ వెబ్‌సైట్‌లో. ప్రతిరోజు ఇంటర్‌నెట్ "ధ్యానాంధ్రప్రదేశ్" చదవడం, పాత ఇష్యూలు కూడా 2006, 2007, 2008 సం||లవి కూడా. అలాగే ధ్యానుల అనుభావాలు ఎన్నో చూసాను. అలాగే పత్రిసార్ ను కలిసిన తర్వాత వారు చెపితే "మరణం లేని మీరు" చదివాను పదిహేనుసార్లు. అయినా తృప్తి తీర్లేదు. నేను, నా భార్య ఉష చదవడం, విషయాలు పరస్పరం పంచుకోవడం.అది, ఆ పుస్తకం చదువుతూంటే, కళ్ళవెంట నీళ్ళు వచ్చాయి. ఆ తర్వాత శివప్రసాద్ గారిని కాంటాక్ట్ చేసి, పుస్తకాలు తెప్పించుకుని చదివాను.

అయితే ‘నెట్’ లో అంతా చూసిన తర్వాత బెంగళూరు పిరమిడ్‌ను చూడాలని తీవ్రమైన కాంక్ష కలిగింది. అంతలో మా అమ్మ ఇండియా నుంచి వచ్చేటప్పుడు, నా కోరిక మీద ఒక 2X2 పిరమిడ్, కొన్ని క్యాప్స్ తెచ్చింది. ఆ పిరమిడ్ క్రింద కూర్చుని ధ్యానం చేస్తుంటే చాలా తేడా. పిరమిడ్ క్రింద కూర్చుని ధ్యానం నాకెంతో ఆనందాన్నిచ్చింది. కొన్ని రోజుల తరువాత ఒకరోజు గొప్ప అనుభూతి. ఎనర్జీ ఫ్లో అద్భుతంగా వస్తోంది. ఒకటిన్నర, రెండు గంటలు ఏమైందో తెలియదు. ఒక "Flash light" "అద్భుతకాంతి" మొత్తంగా సమాధి స్థితిలో ఒక మెరుపులాగా పైకి వచ్చేసిందా కాంతి

"మరి ఈ 2 x 2 పిరమిడ్‌లోనే ఇంత ఆనందం ఉంటే, మరి "మైత్రేయ బుద్ధ పిరమిడ్" లో ఇంకెలా ఉంటుందో" అని రావాలనిపించి ప్లాన్ చేసుకుని, 2008 సం|| జూన్ లో ఇండియాకు పౌర్ణమి కి "విశ్వాలయం" చేరుకున్నాను. బుద్ధపౌర్ణమి కి రావడానికి నా ప్రాజెక్టు వర్క్ వల్ల కుదరలేదు. ఎట్టకేలకు జూన్ నెలాఖరులో పౌర్ణమికి "మైత్రేయ బుద్ధ పిరమిడ్" రావడం, నాలుగు రోజులు అక్కడ గడపడం జరిగింది. అదొక అపూర్వమైన అనుభూతి. అక్కడికి పౌర్ణమికి చాలామందే వచ్చారు. ఒరిస్సా నుంచి కూడా వచ్చారు. గంటల తరబడి ధ్యానం చేసాను నాలుగు రోజులు కూడా. "ఆత్మాయణం", "నక్షత్రమిత్రులు" ఇలా ఎన్నో పుస్తకాలు కొన్నాను. ధ్యానం, స్వాధ్యాయం రెండూ ఏకకాలంలో బాగా ధ్యానం చేయడం వల్ల, పుస్తకాలు చదవడం వల్ల, సహజంగానే శ్రద్ధ, గ్రహింపు ఎక్కువగా ఉండటం వల్ల సాధ్యమయింది అది.

మారం : "పత్రీజీ" ని మొదటిసారి ఎప్పుడు కలిసారు? ఎక్కడ కలిసారు? మీ మాటల్లో డాక్టర్ న్యూటన్ గారి గురించిన ప్రసక్తి వచ్చింది. మరి డాక్టర్ న్యూటన్ ను కూడా కలిసారా? పత్రీజీ 2008 సెప్టెంబర్‌లోనే సింగపూర్ వచ్చారు. ఎలా సాధ్యమైంది అంత తొందరగా?

శశిధర్ : పత్రీజీ కంటే ముందు నేను డాక్టర్ న్యూటన్ గారిని కలిసాను. "స్టూడెంట్స్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్" అని రెండు రోజుల కోర్స్ అటెండ్ అయ్యాను హైదరాబాద్‌లో, రిగ్రెషన్ చేయించుకోవడం, అక్కడ దాదాపు 50 మంది కలిసారు. వారందరి అనుభవాలు వినడం జరిగింది. ఆ తర్వాత శివప్పకు ఫోన్ చేసి పుస్తకాలు మరిన్ని కావాలని అడిగితే ఆయన "ధ్యానాంధ్రప్రదేశ్" ఆఫీస్‌కు రమ్మన్నారు, వెళ్ళాను. అక్కడే నా భాగ్యం కొద్దీ బ్రహ్మర్షి పత్రీజీ తో పరిచయం కలిగింది. మీరు, నేను కూడా ఆరోజు అక్కడే కలుసుకున్నాం. అంతవరకు పత్రీజీ టీచింగ్స్, క్లాసెస్, బుక్స్ అన్నీ వెబ్‌సైట్‌లోనే. చాలా అద్భుతంగా నెట్‌లో అన్నీ ఇమిడ్చి‌పెట్టారు. ఎంతో సమాచారం ఈ వెబ్‌సైట్‌ను ఆపరేట్ చేసేవారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

నా అనుభవాలు, పత్రీజీ కి అన్నీ వివరించాను విశదంగా. పత్రీజీ అన్నారు - "సింగపూర్ స్పిరిచ్యువల్ సొసైటీ ఇవాళే పుట్టింది" అని. చప్పట్లు కొట్టించారు అక్కడ ఉన్న వాళ్ళందరితో. అప్పుడే పత్రీజీ మలేషియా టూర్ ప్లాన్ చేస్తున్నారు. వెంటనే అందులో భాగంగా "సింగపూర్ టూర్" కూడ కలిపారు.

మారం : మరి పత్రీజీ తో కలిసిన తర్వాత మీ అనుభూతి?

శశిధర్ : "ధ్యానాంధ్రప్రదేశ్" ఆఫీస్ నుంచి నేను పత్రీజీ తో కలిసి వారి ఇంటికి వెళ్ళాను. చాలాసేపు గడిపాను వారితో. సైట్‌లో నేను చదివిన ఎన్నో విషయాలు, ప్రవచనాలు, పుస్తకాల గురించి డిస్కస్ చేసాను. పత్రీజీ అల్లుడు గారు అయిన శ్రీనివాసరెడ్డి గారి ని కూడా అక్కడే కలిసాను. శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎన్నో విషయాలు మరి వారి అనుభవాలను కూడా చెప్పారు. ఇంటర్‌నెట్‌లో నేను విస్తృతంగా గమనించిన విషయాలను హైదరాబాద్‌లో ప్రత్యక్షంగా చూసాను. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ లో ఇంత గొప్ప పని జరుగుతోంది. ఎంతో చేస్తున్నారు. చాలా చాలా సేవ ఎంతోమంది మాస్టర్లు చేస్తున్నారు ఆధ్యాత్మికంగా, మరి ఏ సంస్థా చేయనంతగా. మామూలుగా అందరూ వివిధ ప్రదేశాలకు వెళతారు. నేను మాత్రం పదిరోజులు "స్పిరిచ్యువల్ టూరిజమ్" చేసాను .. "ఆత్మయాత్ర" ఇది. ఇంకొక పిరమిడ్, మరికొన్ని పిరమిడ్ క్యాప్స్ కొని జూలై నెలలో సింగపూర్ వెళ్ళిపోయాను. విశ్వాలయం, మెగా పిరమిడ్ సందర్శన, పత్రీజీ పరిచయం, సింగపూర్ ట్రిప్‌కు పత్రీజీ రావడానికి వెంటనే ఏర్పాట్లు జరగడం అన్నీ ఒక మిరాకిల్‌లాగా జరిగిపోయాయి. మరువలేని మహా అనుభూతులు అవి.

మారం : మరి మీరు జూలై‌లో సింగపూర్ తిరిగి వెళ్ళిపోయారు. పత్రీజీ సెప్ట్౦బర్ 2008 లో వొచ్చారు. పత్రీజీ ప్రోగ్రాం గురించిన ఏర్పాట్లన్నీ జరిగాయా? ఏమేం చేసారు మీరు?

శశిధర్ : నేను రాత్రిపూట ధ్యానం చేసే వాడిని. శని, ఆదివారాల్లో పగలు కూడా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా ధ్యానం చేయకుండా ఉండలేదు. ధ్యాన ప్రచారం కూడా చేసాను పిరమిడ్ క్యాప్‌లు ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, ఇంటికి పిలిచి ధ్యానప్రచారం మొదలుపెట్టాను. పత్రీజీ ప్రోగ్రాం ఫిక్స్ అయింది కనుక దానికి సంబంధించిన గ్రౌండ్ తయారుచేయడం మొదలుపెట్టాను. ఆ మధ్యకాలంలో డా|| న్యూటన్ సింగపూర్ వచ్చారు. సింగపూర్‌లో కొంతమంది ఫ్రెండ్స్‌తో కలిసి ఆయన రూమ్‌కు వెళ్ళాను. న్యూటన్ మా అందరికీ ధ్యానం గురించి విశదంగా చెప్పి, ఒక గంటసేపు ధ్యానం చేయించారు మా అందరితో. అదీ ఒక స్పెషల్‌గా సింగపూర్‌లో నా ఆధ్వర్యంలో జరిగిన మొట్టమొదటి "ధ్యానం క్లాస్" ఒక పన్నెండు మందిమి వెళ్ళాం. "డా|| న్యూటన్ ఒక ఎన్‌లైట్‌న్డ్ గ్రాండ్‌మాస్టర్" అని అర్థమయింది నాకు రెండవసారి.

ఆ తర్వాత మా ఇంట్లో ఒక రూమ్ కేటాయించి, 2 x 2 పిరమిడ్ ఫిక్స్ చేసి ధ్యానం చెప్పడం మొదలుపెట్టాను. నేను "ధ్యానిగా" పుట్టింది వెబ్‌సైట్ వల్ల. మరి నాలా ఎంతోమంది చూస్తూంటారు కదా అని వెంటనే వచ్చిన ఒక ఆలోచనతో "Pssmsingapore.org.com" అని ఒక వెబ్‌సైట్ ప్రారంభించాను. "బ్రహ్మర్షి పత్రీజీ వస్తున్నారు ఫలానా రోజు" అని వెబ్‌సైట్‌లో పెట్టాను. మా ఇంటి వెనకాల ఒక క్లబ్ ఉంది. ఒక 50 మంది కూర్చునే వీలుంది అందులో. డెబ్బై మంది వచ్చారు. నేను అంతమంది వస్తారని అనుకోలేదు. వెంటనే ఇంటికి పరుగెత్తి, బెడ్‌షీట్లు తీసుకువచ్చి క్రింద వేసి కొంతమంది కింద కూర్చున్నాం. చాలా గొప్పగా జరిగిందా క్లాసు. సింగపూర్‌లో 50 మంది వచ్చారంటే చాలా గొప్ప విషయం.

మారం : మీరు "పత్రీజీ" కోసం క్లాస్ 2009 సెప్టెంబర్‌లో కూడా చేసారు కదా. అది ఇంటర్‌నెట్‌లో"లైవ్ ప్రోగ్రామ్" వచ్చింది. 2008 సం||లో కూడా "లైఫ్ ప్రోగ్రామ్" వచ్చింది కదా. ఇది సాధ్యమయింది అంత కొద్దిసమయంలో?

శశిధర్ : నేను ఫ్రెండ్స్‌కి కూడా ధ్యానం గురించి చెబుతూన్నప్పుడు, 2008 సం||లో పత్రీజీ కి సింగపూర్‌లో క్లాస్ ఏర్పాటు చేసినప్పుడు ఒక అమెరికా మిత్రుడికి ధ్యానం చెప్పాను. పత్రీజీ ప్రోగ్రాం గురించి చెప్పాను.అతడన్నాడు -"మరి నువ్వు ఇంత బాగా చేస్తున్నావు. మాకు కూడా చూసే భాగ్యం కలిగింటే ఎంత బాగుంటుంది" అన్నాడు. నాకున్న ఇంటర్‌నెట్ పరిజ్ఞానంతో ఫస్ట్‌టైమ్ సింగపూర్, ఆస్ట్రేలియా, USA, ఇండియా, మలేషియాల్లో పత్రీజీ క్లాస్‌ని ‘లైవ్‘ గా బ్రాడ్‌కాస్ట్ చేయడం జరిగింది. చాలామంచి రెస్పాన్స్ వచ్చింది, అన్ని దేశాల నుంచి కూడా.

మారం : ఇంకా పత్రీజీ క్లాస్ విశేషాలు వివరించండి?

శశిధర్ : ఆ రోజు దాదాపు అందరూ భారతీయులు వచ్చారు. మూడుగంటలు పత్రీజీ ప్రవచనం, ధ్యానం జరిగింది. సింగపూర్ స్టైల్లో, స్ట్రెస్, స్ట్రెయిన్‌లను ధ్యానం ద్వారా ఎలా తొలగించుకోవాలి, జీవితంలో ఆనందంగా ఎల జీవించాలి, ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు. ఇళ్ళు ప్రక్కనే కనుక, మళ్ళీ అందరూ మా ఇంటికి వచ్చారు. 2008 సెప్టెంబర్ 6,7 తేదీలలో రెండురోజులు ఉన్నారు. 7వ తేదీ సోమావారం అయింది.అయినా ఒకరి తర్వాత ఒకరు, ఫ్యామిలీస్, హౌస్ వైఫ్, మదర్స్ చాలామంది వచ్చారు రెండురోజుల్లో బాగా బిజీగా గడిపారు పత్రీజీ ఆ రెండురోజులు కూడా ఎంతో వర్క్ జరిగింది సింగపూర్‌లో. అలా మా ఇంట్లో కంటిన్యూగా ధ్యానం క్లాసులు మొదలయ్యాయి.

"సింగపూర్ నగర-దేశం" చిన్నదే అయినా ప్రపంచవ్యాప్త గుర్తింపు కలిగిన, ప్రాముఖ్యమయిన దేశం. ఇక్కడ అన్ని దేశాల సంస్కృతులు మేళవించి ఉన్నాయి. సింగపూర్‌లో ధ్యానం చాలా అవసరం. అందుకే ప్రతి ఆఫీసులో ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పాలనీ,అందరితో ధ్యానం చేయించాలి అనేది నా "విజన్".

ఈ 2009 సంవత్సరం సెప్టెంబర్ 4, 5 తేదీలు రెండు రోజులు ఉన్నారు పత్రీజీ. ఈసారి మేము "సింగపూర్ తెలుగు సమాజం" వారిని సంప్రదించాం వారు కూడా ఎంతో సంతోషంగా సహాయం చేసారు. ఈసారి మేం పెద్ద హాల్‌నే తీసుకున్నాం. ఒక రెండువందల మంది కూర్చోగల హాలు. ఒక 100 మంది వస్తారని నేను అనుకుంటే, 160 మంది వచ్చారు. ఈసారి వచ్చిన వారిలో చైనీస్, బ్రిటన్స్, తెలుగువారు, తమిళవారు, బెంగాలీస్ నార్త్ ఇండియన్స్ చాలా మంది వచ్చారు. మూడు గంటల క్లాస్, అది మొదటిరోజు.

5, సెప్టెంబర్ రెండవరోజు ఇంకొక మిత్రుడు వచ్చాడు. ఆయన అంతకముందు నన్ను కలిసి ధ్యానం నేర్చుకున్నారు. ఆయన పేరు "డాక్టర్ చంద్రా" తమిళ శాస్త్రజ్ఞుడు. అతడు అక్కడ ఒక లోకల్ కాంట్రాక్టర్ ని పట్టుకుని 4 X 4 పిరమిడ్‌ని 50 డిగ్రీస్ కోణంలో పర్‌ఫెక్ట్‌గా తయారు చేయించారు. Such a practical work. పత్రీజీ ఆ పిరమిడ్ ప్రారంభం చేశారు. చాలామంది గృహిణులు వచ్చారు ఆ రోజు. పిల్లలకు ధ్యానం గురించి చాలా బాగా చెప్పారు పత్రీజీ. ఈసారి కూడా Pssmsingapore.org.com ద్వారా పత్రీజీ ప్రోగ్రాం లైవ్‌గా ప్రసారం చేసాం. మీకందరికీ కూడా ఈ విషయం తెలుసు. చాలామంది ఇండియా నుంచి కూడా ఎంజాయ్ చేసినట్లు నాకు మెయిల్స్ వచ్చాయి. రకరకాల దేశాల వాళ్ళు, వివిధ ప్రాంతాల భారతీయులు పాల్గొనడం ఈసారి పత్రీజీ పర్యటనలోని ముఖ్యాంశం. చైనీస్ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. వీళ్ళంతా సింగపూర్ చైనీస్.

మారం : మరి ఇప్పుడు ధ్యానప్రచారం ఎలా సాగుతోంది? సింగపూర్‌ను పూర్తిగా "ధ్యాన సింగపూర్" గా మార్చాలి కదా;

శశిధర్ : ఈ మధ్యకాలంలో జనాలు రావడం, మా ఇంట్లో నేను ఒక పిరమిడ్ రూమ్ ఏర్పాటు చేసానని చెప్పాను కదా, ఆ పిరమిడ్ కింద కూర్చుని ధ్యానం చేసి వాళ్లు బాగా అనుభవాలు పొందడం, నన్ను పిరమిడ్స్ కావాలని అడగడం జరిగింది. మా ఇంట్లో పెట్టిన పిరమిడ్‌లో నేను చాలా క్రిస్టల్స్ పెట్టి దానిని బాగా శక్తివంతం చేసాను. మాకు పిరమిడ్స్ కావాలని వాళ్ళందరూ అడగడం ప్రారంభించారు. ఇక నేనే ధర్మాకోల్‌తో పిరమిడ్స్ తయారు చేసి ఇప్పటికి ఒక యాభై దాకా అందరికీ ఇచ్చాను. ఎలా చేయాలి అన్న ఆలోచన నాకు వచ్చిన తర్వాత సింగపూర్‌లో ఒక క్రిస్టల్స్ దుకాణం కనపడింది. నాకు పిరమిడ్స్ తయారు చేయాలన్న ఆలోచన వచ్చిన వారం రోజులకు క్రిస్టల్స్ దుకాణం కనపడడం, వాళ్ళు వివిధ రకాల క్రిస్టల్స్ చూపించి, ఇవి ధ్యానానికి ఉపయోగ పడతాయి అని ప్రత్యేకంగా కొన్ని క్రిస్టల్స్ చూపించడం జరిగింది. సింగపూర్ 44 కి.మీ. చదరపు విస్తీర్ణం కలిగిన చిన్న దేశం. నా శక్తిమేరకు, శక్తిని మించి సింగపూర్‌లో ధ్యానప్రచారం చేయడం నా ధ్యేయం.

"ఒక చెవిలో విని ఇంకొక చెవిలో వదలిపెడతారు ఈ మనుషులు" అని ఆలోచించి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ లో ఏం జరుగుతోంది, పత్రీజీ ఏం చెపుతున్నారు అని మన మూవ్‌మెంట్ గురించి ఒక ముఫ్ఫై స్లైడ్స్ వేసాను. పత్రీజీ స్పీచ్ కంటే ముందు. ఆ ప్రెజెంటేషన్ అందరికీ నచ్చింది, పత్రీజీ కి కూడా. ఈ స్లైడ్స్ చేయడానికి కంప్యూటర్స్ మీద నాకున్న అనుభవం, ప్రాజెక్ట్స్ చేయడంలో ఉన్న అనుభవం ఎంతో ఉపకరించింది.

ఇరవై సంవత్సరాలలో పత్రీజీ ఏం చేసారు అనేది, పెద్ద స్క్రీన్‌లో విజువలైజ్ చేసాం స్టేజీ పైన. కేవలం 30 స్లైడ్స్‌లో పత్రీజీ వైభవాన్ని, ఇంత పెద్ద స్పిరిచ్యువల్ మూవ్‌మెంట్ ఆర్గనైజేషన్‌ను ప్రెజెంట్ చేయగలిగాం. అలాగే ఇంటర్‌నెట్ మీద చేసిన లైవ్ షో ప్రపంచవ్యాప్తంగా singaporepssm.org.com లో చూపించాం. పత్రీజీ సింగపూర్‌లో ధ్యానం చేయించినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది USA లో, బెల్జియంలో, Uk లో, ఆస్త్రేలియాలో, మలేషియాలో, కెనడాలో, న్యూజీలాండ్‌లో .. అన్నిచోట్లా మాస్టర్లు అదే సమయానికి ధ్యానం చేసారు. ఆ సమయంలో అందరూ లైవ్ చూస్తూలైవ్‍గా ధ్యానం చేసారు వారు ఉన్న స్థలంలో. గొప్ప అదృష్టం ఇది. మనం ఊహించుకోవచ్చు ఈ ప్రపంచవ్యాప్తంగా జరిగిన ధ్యానంలో ఎంత శక్తి వికసించి అయిఉంటుందో.

"అందరికీ ఈ ధ్యాన సమాచారం తీసుకువెళ్ళాలి, ఎలా?" అనే ప్రేరణకు కారణం నా ఉద్యోగం. ఎందుకంటే మా ఉద్యోగంలో ఇంటర్‌నెట్ ప్రాధ్యానం చాలా ఎక్కువ. వివిధ దేశాల్లోని నా ప్రాజెక్టు కాంటాక్ట్స్ చేస్తున్నప్పుడు నాకు ఈ ఐడియా ఫ్లాష్ అయ్యింది. నా స్లైడ్ షో మరి లైవ్ బ్రాడ్‌కాస్టింగ్ చూసి పత్రీజీ పరమానంద భరితులయ్యారు. వివిధ దేశాల ధ్యానులకు చెప్పారు కూడా.

పత్రీజీ సింగపూర్ నుండి న్యూజీలాండ్ వెళ్ళిన తర్వాత నా ప్రస్తుత ఇండియా ప్రోగ్రాం కన్‍ఫర్మ్ అయ్యింది. న్యూజీలాండ్‌లోని పత్రీజీ కి ఫోన్ చేసి నేను మాట్లాడాను. "సర్, నేను బెంగళూరు గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచ్యువల్ సైంటిస్ట్స్ కి వస్తున్నాను" అని. పత్రిసార్ GCSS లో నన్ను కూడా ఒక స్లైడ్ షో ప్రెజెంటేషన్ ఇవ్వమన్నారు. అలాగే ఇచ్చాను. పత్రీజీ చాలా సంతోషించారు కూడా. ఈ పని అలా పూర్తయింది.

మారం : మీ విజన్ ఏమిటి "2012 ధ్యానజగత్" పట్ల?

శశిధర్ : సింగపూర్‌లో ప్రతి ఇంటినీ 2011 లోపు హైస్పీడ్ ఇంటర్‍నెట్‌తో అనుసంధానం చేస్తున్నారు. ఇప్పుడు copper optics ఉంది, త్వరలో Fiber optics పెడుతున్నారు. మన 8 way Highways లాగా, 6 line, 8 line, 12 line అలా హైస్పీడ్ ఇంటర్‌నెట్ కనెక్షన్స్ వల్ల fast information passing అయ్యేలా చేస్తున్నారు. Singapore will become face to Spirituality on Technology side -ఇది నా భవిష్యత్ ప్రణాళిక. "ధ్యానజగత్" కు ఎంతో ప్రాముఖ్యం కలిగించేలా Singapore is the Spiiritual Gateway to West గా అవ్వాలి. ఇది నా విజన్.

1997 లో నే మొదటిసారి సింగపూర్ వెళ్ళినప్పుడు 15 రోజుల ప్రాజెక్టు వర్క్ కోసం వెళ్ళాను. అక్కడివాళ్ళు కోరడం వల్ల అక్కడే ఫ్యామిలీతో పాటు సెటిల్ అయిపోయాను. బహూశా "ధ్యానజగత్ - 2012" కోసమే నేను సింగపూర్‌లో ప్లాన్ చేయబడ్డాను అనిపిస్తోంది. ఇక్కడ స్థిరపడిన నేను ఇక్కడే ఉండిపోయి సింగపూర్ ప్రజలందరికీ, అలాగే ఎన్నో దేశాల్లోని నా కాంటాక్ట్స్‌కి, ఫ్రెండ్స్‌కి "ఆనాపానసతి" ని ప్రచారం చేయడం నా తక్షణ కర్తవ్యం.

మారం : శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞానికి ఈ డిసెంబర్‌లో మీరు వస్తున్నారా?

శశిధర్ : ధ్యాన మహాయజ్ఞాలు ఇప్పటికి పదిజరిగాయని తెలుసుకున్నాను. చదివాను. నేను సింగపూర్ వెళతాను ఒక వారంలోపు. నెట్ మీద "శ్రీశైలం ధ్యానమహాయజ్ఞం" గురించి అందరికీ వివరిస్తాను. ధ్యాన మహాయజ్ఞాల ప్రాముఖ్యతను అందరికీ తెలియజేస్తాను. నేను రావడానికి ప్రయత్నిస్తాను. మరి కొంతమంది వచ్చేట్లుగా ప్లాన్ చేస్తాను.

మారం : పత్రీజీ గురించి ఇంకా మీరేం చెప్పాలనుకుంటున్నారు?

శశిధర్ : నేను ఈ‘లైవ్’ షో చేసినప్పుడు, ఎంత ఆనందించానో పత్రీజీ క్లాసుకు జయలక్ష్మీ గార్డెన్స్‌లో అటెండ్ అయినప్పుడు అంత ఆనందించాను. ఇండియాలో.. అదీ "ఆంధ్రప్రదేశ్" లో.. చూసినప్పుడు, ఇక్కడ అంతా పూర్తయినట్లు అనిపిస్తోంది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ పాత్ర. ఇక మిగిలిన ప్రపంచానికి చేరడమే మిగిలింది.

"బ్రహ్మర్షి పత్రీజీ" ఆయన ఒక ఆధ్యాత్మిక మహాసముద్రం, ఒక గొప్ప దార్శనికుడు, నిరంతర పారిశ్రామికుడు ఇతరులతో పోలిక చేయడం కాదు కానీ మొత్తం ప్రపంచంలోనే "పత్రీజీ" ఒక్కరే జనాల దగ్గరికి ఇంత దగ్గరగా, ఇంత పూర్తికాలం వెళుతున్నారు.

"ధ్యానంచేయి శ్వాస మీద ధ్యాస పెట్టు -శాకాహారం తీసుకో. పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుని స్వస్థుడవుకా" అంటూ నెలలో 30 రోజులు తిరిగి, ప్రజల్లోకి వెళుతూన్న స్పిరిచ్యువల్ మాస్టర్ ఒకప్పుడు బుద్ధుడు - ఇప్పుడు పత్రీజీ మాత్రమే.

మారం : ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులకూ, కొత్తగా ధ్యానంలోకి వచ్చేవారికీ, ధ్యానప్రచారం చేయాలి అనుకునేవారికీ ఏం చెప్పాలనుకుంటున్నారు?

శశిధర్ : కొద్దికాలంలోనే నైనా నేను గ్రహించిన వాస్తవాలు ఎన్నో. ధ్యానం చేయకముందు ఏ సంఘటనలు జరిగినా సుఖం, దుఃఖం, టెన్షన్, అనారోగ్యం. మనం ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నాం అర్థం కాని స్థితిలో ఉంటున్నాం. ఏదీ ఆలోచించకుండానే సడన్‌గా రియాక్ట్ అవుతూ, మనలను మనం నష్టపరుచుకుంటూ ఉంటాం.

మరి ధ్యానం చేసిన తర్వాత, ‘ఎరుక’ తో జీవిస్తాం, రియాక్ట్ అవ్వాలా వద్దా అనే ఎరుకతో జీవిస్తూ సందర్భసహితంగా రియాక్ట్ అవుతూ ఉంటాము. ధ్యానం వల్ల కలిగే అతిముఖ్య ప్రయోజనం ఇది. ఈ శ్వాసను గమనించమని పత్రీజీ మనకు చెపుతున్నారు. "బయట ఏమిలేదు అంతా మనలోనే ఉంది; జనాలు మారలేదు; జనాల పట్ల నేను మారాను".. ఇది నేను తెలుసుకున్నాను .. అదే మీకూ చెపుతున్నాను.

ఇంత త్వరగా నేను ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులకు నా ఇంటర్వ్యూ ఇవ్వగలిగే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు! 2006 సం|| నుంచి పాత ధ్యానాంధ్రప్రదేశ్‌లలోని మహామనుషుల ఇంటర్వ్యూలన్నీ చదివి ఎంతో ప్రేరణ పొందాను.ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులందరికీ నా ప్రమాణాలు. థ్యాంక్యూ మారం శివప్రసాద్ గారూ థ్యాంక్యూ పత్రీజీ.

 

శశిధర్ రెడ్డి
సింగపూర్

Go to top