" సర్వజీవన కారుణ్యం.. సమస్త ప్రాణికోటితో మిత్రత్వం పత్రీజీ వల్లనే సాధ్యం "

 

మారం : నమస్తే మేడమ్ .. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఎలా కలిగింది?

లలితా మేడమ్ : నమస్తే! నేను చాలా చిన్న వయస్సులోనే అనారోగ్యాలకు లోనయ్యాను. నాకు 19వ ఏట పెళ్ళయింది. 23వ సం|| నుంచి అనారోగ్యం ప్రారంభమైంది. మా తల్లిగారు అకస్మాత్తుగా మరణించడం వల్ల ఆ షాక్ ‌లో నాకు చాలా అనారోగ్యాలు వచ్చాయి. చాలా కష్టపడ్డాను. తిరగని ప్రదేశాలు లేవు, ఇండియాలోనూ, అమెరికాలోనూ. "ఇక ఇంగ్లీషు మందులు వద్దు, ఇంకెదో ఉంది" అని నేను అన్వేషిస్తూన్న సమయంలో ఒక స్నేహితురాలి సలహాపై "రైకీ" నేర్చుకున్నాను.

ఆ రైకీ మాస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, "మనకంటే గొప్పశక్తి ఏదో ఉంది"అనే సత్యం తెలుసుకున్నాను.

మా అమ్మగారు గుండెపోటుతో పోయారు. మా అమ్మ పుట్టింటివైపు వాళ్ళు అందరూ గుండెపోటుతోనే పోవడం వల్ల, మా అమ్మ కూడా అలాగే పోవడం వల్ల నాకూ భయంగా ఉండేది, చనిపోతానని. బ్లడ్‌ప్రెషర్, డయాబిటీస్, హార్ట్‌కంప్లైంట్ వీటితో నేను రకరకాల కష్టాలు పడుతున్నప్పుడు, మా బంధువు ద్వారా సుఖబోధానంద క్లాస్‌లకు అటెండ్ అయ్యాను 1997 ప్రాంతాల్లో. ఆ వర్క్‌షాప్‌కు వెళ్ళినప్పుడు స్వామి సుఖబోధానంద అడిగారు ఏంటి మీ ప్రాబ్లమ్?"అని. "మా తల్లిగారి వైపు 40వ బర్త్‌డే చూడలేదు. అందరూ గుండెపోటుతో పోయారు. నాకు ఆ భయం ఉంది!" అన్నాను.

ఆయన నా కళ్ళలోకి చూస్తూ అన్నారు “ మీ తల్లిగారు మరణించినంతమాత్రాన మీరు మరణించాలని ఏమిలేదు. వారసత్వం అనేది ఏదీ లేదు. ఇవన్నీ మనం అనుకుంటున్నవి మాత్రమే. ఎవరి ఆత్మ ఏ ప్రణాళిక తీసుకుని వస్తుందో దాని ప్రకారమే జరుగుతుంది" అని చెప్పారు. వారి వ్యాఖ్యతో నా ఆలోచనా స్థితి మారింది.

సహజంగానే చాలా హుషారువ్యక్తి అయిన నేను సుఖబోధానంద గారి వ్యాఖ్యాలతో ఆలోచనలో పడిపోయాను. నేను "అంజనేయస్వామి" అంటే చాలా ఇష్టపడేదాన్ని. " ఆత్మ " అంటే నాకు పెద్దగా అర్థమయ్యేది కాదు. సుఖబోధానంద గారు చెపుతూంటే వినేదాన్ని. క్రమంగా నా ఆరోగ్యం బాగవడం మొదలయ్యింది. అలా ప్రారంభమయ్యింది నా ఆధ్యాత్మిక జీవితం.

మారం : మరి స్వామి సుఖబోధానంద గారి తర్వాత మరెవరితోనైనా స్పిరిచ్యువల్ మాస్టర్స్‌తో పరిచయం అయ్యిందా?

లలితా మేడమ్ : అవును. ఆమె లూయిస్ హే.. అమెరికాలో! ఆమె నాకొక పెద్ద టర్మింగ్ ఇచ్చింది. "You Can Heal Your Life" అని ఆమె వ్రాసిన పుస్తకాన్ని ఒక ఫ్రెండ్ నాకు ఇచ్చింది. ఆ పుస్తకం "మీ ఆరోగ్యం మీ చేతుల్లో" అని అనువాదం కూడా వచ్చింది కదా. "మూడు నెలల్లో క్యాన్సర్ తో మరణిస్తావు" అని డాక్టర్లు లూయిస్ హే తో చెప్పినప్పుడు, ఆమె "ఇయోవా" (IYOVA) లోని మహేష్ యోగి ఆశ్రమంలో భావాతీత ధ్యానం నేర్చుకుని, ధ్యానం చేసి మూడు నెలల తర్వాత డాక్టర్ల వద్దకు వెళితే వాళ్ళు ఆశ్చర్యపోయారట, "మీ కసలు క్యాన్సర్ లేదు" అని!

నేను U.S.A. లో ఆమె కండక్ట్ చేసే వర్క్‌షాప్‌లో పాల్గొని, ఆ పుస్తకంలో ఆమె ఏం చెప్పిందో అలా జాగ్రత్తగా ఫాలో అయి, ఆ ఇన్‌స్పిరేషన్ వల్ల ఆమె చెప్పిన సాధనల వల్ల చాలావరకు ఆరోగ్యం పొందాను. నా జీవితాన్నే మార్చివేసింది ఆ పుస్తకం!

మారం : మరి "బ్రహ్మర్షి పత్రీజీ" తో మీ పరిచయం ఎలా జరిగింది?

లలితా మేడమ్ : నేను అమెరికాలో చిన్నగా చీరల వ్యాపారం చేసేదాన్ని. మన వాళ్ళ ప్రోగ్రామ్స్, పెద్ద ఫంక్షన్స్‌లో చీరలస్టాల్ పెట్టేదాన్ని. అయితే నాకు బైపాస్ సర్జీరీ అయిన తర్వాత మానేసాను. 2004 సం||లో మా ఫ్రెండ్‌కు ఆఫర్ చేద్దామని అమెరికా వెళ్ళి"TATA" సభలో పాల్గొన్నాను. నేను, మా ఫ్రెండ్ చీరల స్టాల్ లో నిల్చుని ఉంటే, డా|| న్యూటన్, లక్ష్మి న్యూటన్, పత్రీజీ ముగ్గురూ చిన్నగా నడుచుకుంటూ వస్తున్నారు. డా|| న్యూటన్‌తో నాకు ముందే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. న్యూటన్ నాకు పిరమిడ్స్ గురించి, పత్రీజీ గురించి చెప్పాడు. ఆ తర్వాత రెండు మూడుసార్లు న్యూటన్‌తో ఫోన్‌లో మాట్లాడటం జరిగింది. ‘తానా’ లో నన్ను చూసి న్యూటన్ గబగబా నా వద్ద కొచ్చాడు. నన్ను పలకరించి "బ్రహ్మర్షి పత్రీజీ వచ్చారు. పరిచయం చేస్తాను రండి" అన్నారు.

చేతులు పట్టుకుని నడిచి వస్తున్నారాయన. వస్తూ మా స్టాల్ వద్దకు వచ్చారు. న్యూటన్ పరిచయం చేసారు వారికి నన్ను "లలితా మేడమ్" అని. ఆ కళ్ళలోకి చూస్తే ఒక మాయ లాగా అనిపించింది. ఆ ఫీలింగ్ చెప్పడం మాటల్లో సాధ్యమా?! "నమస్కారమండీ"అన్నాను. అయన ప్రతినమస్కారం చేసి, "నాకు మీరు ఎప్పటినుంచో తెలుసు మేడమ్. మీ కోసమే నేను అమెరికా వచ్చింది" అని రెండు చేతులూ పట్టుకొన్నారు. "Electro magnetic rays" విద్యుత్ అయస్కాంత తరంగాలు! అంతే! ఇప్పుడు చెప్పగలుగుతున్నాను ఈ మాట. అప్పుడు అస్సలు అర్థం కాలేదు. ఆ శక్తిని మాత్రం అనుభవించగలిగాను. ఆ సంభ్రమంలోంచి తేరుకోవడానికి కొంతసేపు పట్టింది. ఆయన గ్రేట్ మాస్టర్ అని నాకు తెలుసు.

అయితే "మీరు నాకు తెలుసు. మీ కోసమే వచ్చాను" అన్నప్పుడు "గురువులు వారిలాగే మాట్లాడతారు కాబోలు!" అనుకున్నాను. మొదటి పరిచయం కదా మా స్టాల్ దగ్గర కూర్చుని బుక్స్ ఇచ్చారు.

మారం : పత్రీజీ డెట్రాయిట్ కి వచ్చి, అక్కడ క్లాసు చెప్పారు కదా! ఎలా జరిగింది ఆ క్లాసు?

లలితా మేడమ్ : డెట్రాయిట్‌లో మా అమ్మాయి, అల్లుడు, మరి మా తమ్ముడు రవి ఉంటారు. నాగరాజు అనే పిరమిడ్ మాస్టర్ డెట్రాయిట్‌లో ఉన్నాడు. ఆ అబ్బాయిని కాంటాక్ట్ చేసి, పత్రీజీ ఎప్పుడొస్తున్నారో తెలుసుకొని, హాల్ బుక్ చేసి, బ్రోచర్లు వేయించి మన ఇండియన్ స్టోర్స్‌ల్లో పెట్టించాను. డెట్రాయిట్ లోనే ప్రేమ్‌నాథ్ మాస్టర్ వాళ్ళమ్మాయి స్వప్న, అల్లుడు రమేష్ వద్ద ఉన్నారు. వారూ వచ్చారు పత్రీజీ మీటింగ్‌కి. అలా పరిచయమైంది ప్రేమనాథ్ మాస్టర్‌తో. పత్రీజీ క్లాస్‌కు 20 మంది వచ్చారు. అమెరికాలో అది చాలా పెద్ద సంఖ్య. పత్రీజీ చాలా సంతోషించారు. అక్కడి నుంచి మా అమ్మాయి ఇంటికి భోజనానికి తీసుకెళ్ళాను పత్రీజీ ని.

మారం : మరి ఆ తర్వాత..

లలితా మేడమ్ : "బిల్లీ" అని ఒక మాస్టర్ ఉన్నారు డెట్రాయిట్‌లో! అక్కడ U.S.A లో "అవతార్ కోర్స్" అని ఉంది. "హరిపామర్" అనే గ్రాండ్ మాస్టర్ దాని మూలపురుషుడు. వేలలో ఉంటారాయన అనుయాయులు. ఈ బిల్లీ మిచిగాన్ స్టేట్‌కి ఆ అవతార్ కోర్స్ కి హెడ్. ఆయన పత్రీజీ వచ్చిన రోజు డెట్రాయిట్‌లో లేరు. మరునాడు ఆయన అదే "బిల్లీ" గారు నాకు ఫోన్ చేసి, "మేడమ్! ఇండియా నుంచి ఒక గ్రేట్ మాస్టర్ వచ్చారట కదా. ఆయనను నేను కలవచ్చా?" అని ఆడిగారు. పత్రీజీ, ప్రేమ్‌నాథ్ కూతురు స్వప్న ఇంట్లో ఉన్నారు. పత్రీజీ పర్మిషన్‌తో "బిల్లీ" గారిని తీసుకుని స్వప్న వాళ్ళింటికి వెళ్ళాం. ప్రేమనాథ్, నేను, నా వెంట వచ్చిన అమెరికన్స్. నాగరాజు, ఇతరులు కొందరు చుట్టూ కూర్చున్నాము. పత్రీజీ, బిల్లీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూంటే ఆ సంభాషణ వినడానికి రెండు చెవులూ, ఆ సన్నివేశాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలలేదు. "మీరెంతో గొప్పమాస్టర్" అని పత్రీజీ బిల్లీని ప్రశంసిస్తే, "మీ అంత గొప్ప గురువును నేను చూడలేదు" అని బిల్లీ పరవశం పొందారు పత్రీజీ పట్ల. "తూర్పు మరి పశ్చిమం కలిసాయి" అనిపించింది నాకు. పత్రీజీ తో అది మూడవ కలయికనాది. నాకేం తెలియదు ఇంకా ఆయన గురించి. " మీకోసం నేనొక పాట పాడతాను మేడమ్" అన్నారు పత్రిసార్. అంజనేయస్వామి గురించి పాడారు. నాకు అంజనేయస్వామి అంటే ఇష్టమని పత్రీజీ కి ఎలా తెలుసు?? ఎవరు చెప్పారు???

అంతకుముందు రోజు నేను ఏర్పాటు చేసిన క్లాసులో అందరితో మెడిటేషన్ చేయించిన తర్వాత, నన్ను స్టేజీ పైకి పిలిచారు. నా భ్రూమధ్యం వైపు వ్రేలు పెట్టి, ఇదేంటి మేడమ్?" అని అడిగారు. "‘థర్డ్ ఐ’ సర్" అన్నాను, అస్సలు థర్డ్ ఐ అంటే ఏమో నాకు తెలియదు! ఎలా చెప్పాను??ఆయనకు ఆనందం కలిగి పదినిమిషాలు ఆగకుండా చప్పట్లు కొట్టించారు. మరి నాకు తెలియని విషయాన్ని నేను ‘త్రినేత్రం’ అని చెప్పటం ఏమిటి? మరి ఆయనే చెప్పించారు. మరి ఆ మరుసటి రోజు అంజనేయస్వామి పాట పాడారు. మరి ఎవరు చెప్పారు అంజనేయస్వామి నాకు ఇష్టదైవమని?" "మీరు నాకు బాగా తెలుసు" అని మాటమాటకీ అన్నారు. ఆయన డబ్బు మనిషి కాదు. నా వల్ల ఆయనకు ఒనగూరే పనులు లేవు. ఆయన ఏ పలుకుబడికి సంబంధించిన పనులు అడిగేవారు కాదు. ఇది అంతా మిరాకిల్. ఏం జరుగుతోంది?? ఎవరాయన?? నా గురించి ఎలా తెలుసు?? ఈ వైబ్రేషన్ ఏమిటి ఆయన భ్రూమధ్యంలో చేయి పెట్టగానే?? ఆ స్పర్సకు శరీరమంతా పులకింత ఏమిటి?? అంతా లీల!! ఇదే నాకు అర్థమయింది, "పత్రీజీ చాలా గొప్పవారు" అని మనస్సుకు బాగా తెలిసింది అప్పటికి.

పత్రీజీ బిల్లీనీ, అందరినీ, ప్రేమనాథ్‌నూ మెడిటేషన్‌లో కూర్చోబెట్టారు. అంతా గాఢమైన ధ్యానస్థితిలోకి వెళ్ళిపోయాం. ధ్యానం అయిన తర్వాత అందరూ నా వైపు సంభ్రమంగా చూసారు. తర్వాత బయటికొచ్చాం. నా వెంట వచ్చినవారు ఇంగ్లీషులో అడిగారు నన్ను "పత్రీజీ ఏం పాటపాడారు?" అని. చెప్పాను "హనుమాన్ గురించి పాడారు" అని. "your monkey god!" అన్నారు వాళ్ళు నిశ్చేష్టులై! వాళ్ళంతా మన అంజనేయస్వామిని "మంకీ గాడ్" అని పిలుస్తారు. ఆయన పాడుతున్నప్పుడు, నా ఫేస్‌లో మార్పులొచ్చి, it looks like monkey, నా ముఖంలో మార్పులు వాళ్ళు ప్రస్ఫుటంగా చూసారట "అంజనేయస్వామి" వదనాన్ని! అది ధ్యానం పూర్తయి నేను లేచేవరకు ఉందట! వాళ్ళు అంత సంభ్రమంగా చూడడానికి అదే కారణం. నేను మళ్ళీ థ్రిల్లు! మిరాకిల్ మీద మిరాకిల్! ఇంతకంటే గొప్ప ఎక్స్‌పీరియన్స్ నా జీవితంలో ఇంకేముంటుంది?!!

ఆ క్షణం నుంచి నేను నా రాముడిని ఆయనలో చూస్తూనే ఉన్నాను!

మారం : మీ "ప్రేమజ్యోతి" గురించి చెప్పండి!

లలితా మేడమ్ : నేను అప్పటికే "రైకీ", "ప్రాణిక్ హీలింగ్" మరి "లూయిస్ హే మెథడాలజీ", "అవతార్ కోర్సు", "సుఖబోధానంద కోర్సు" .. ఇవన్నీ చాలా చేసి ఉన్నాను. ఆరేళ్ళు నేర్చుకున్నాను. ఇవన్నీ కలిసి నేను వర్క్‌షాప్స్ చాలానే చేసేదాన్ని U.S.A. లో. వీటిలో ఒక మెడిటేషన్ జతకలిపి చేయాలని అనుకున్నాను. అందుకు ముందు "గైడెడ్ మెడిటేషన్, ఓంకారం" ఇలా మిగతా పద్ధతులే తప్ప. ఇంతసులువైన మన "ఆనాపానసతి" ని గురించి చెప్పిన వారు లేరు! మన ధ్యానంలోకి వచ్చిన తరువాత దీనిని జత చేయాలని అనిపించింది, పత్రీజీ కి నా కోర్సు డిటైల్స్ అన్నీ చెప్పి, ధ్యానాన్ని అందులో జొప్పించడానికి వారి అనుమతిని అడిగాను. ఆయన అన్నీ పరీశీలించి "కరెక్టు మేడమ్! ఇదే చేయాలి మీరు. ధ్యానాన్ని దీంట్లో జతచేసి అందరికీ తర్ఫీదు నివ్వండి" అన్నారు.

వారితో సెలవు తీసుకుని వెళ్ళబోతున్నాను. నా రెండు చేతులూ పట్టుకుని, "మేడమ్! ఇక మీరే నా పెద్ద దిక్కు. మీ సిద్ధాంతాలు ప్రచారం చేయాలి. అయితే ఇక్కడ కాదు ఇండియాలో! మీరు ఉండాల్సింది U.S.A. లో కాదు, ఇండియాలో!! మీకిది చెప్పి, మిమ్మల్ని ఇండియాకు తీసుకెళ్ళడానికే నేను అమెరికా వచ్చాను" అన్నారు. ప్రేమనాథ్ ప్రక్కనే ఉన్నారు. ఇదంతా వింటూ, చూస్తూ.

"మాస్టర్స్ అందరికీ ఇలాగే చెపుతారేమోలే" అనుకున్నాను. మా అమ్మాయి వాళ్ళు నన్ను అమెరికాలోనే సెటిల్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నాకు అప్పటికే గ్రీన్ కార్డ్ ఉంది. అయితే పత్రీజీ దగ్గర నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన నన్ను పట్టుకున్న ఫీలింగ్ వదలలేదు. ఆ స్పర్శ వదలలేదు. ఆ రాత్రి నేను నా చేతులు కలిపి, "నేను ఇండియాకు వెళతాను, అమెరికాలో సెటిలవ్వను" అని నాకు నేను ప్రామిస్ చేసుకున్నతర్వాత, ఆ స్పర్శ వదిలింది. జూలై, 2007 లో చికాగోలో, ఆగస్టులో డెట్రాయిట్‌లో పత్రీజీ కలిసాను. మా అమ్మాయికి చెప్పేసాను. "ప్రొద్దునే నేను ఇండియాకు వెళ్ళిపోతా" నని! నా ఆఫీస్ ఎత్తేసి, అన్నీ ప్యాక్ చేసుకుని, డిసెంబర్, 2004 లో ఇండియాకు వచ్చేసాను! "డిసెంబర్, 2004 సికింద్రాబాద్ ధ్యానయజ్ఞా"నికి కూడా హాజరయ్యాను!

మారం : ప్రేమనాథ్ గారితో మీ పరిచయం?

లలితా మేడమ్ : ప్రేమ్‌నాథ్ గారి సాంగత్యం, పత్రిగారి సాంగత్యం లాగానే ఎంతో అద్భుతం! రెగ్యులర్‌గా కలిసేవాళ్ళం డెట్రాయిట్‌లో. ప్రేమ్‌నాథ్ సాహచర్యంలో చాలా అనుభవాలు రావడం జరిగింది. నేనెప్పుడూ జీవితాంతం ప్రేమనాథ్ ఉపకారం మరిచిపోలేను! అలాగే డాక్టర్ న్యూటన్! న్యూటన్ వల్లనే నేను మొదట పత్రీజీని కలవడం జరిగింది. న్యూటన్ దంపతులు నాకు నా "గాడ్ ఫాదర్ అయిన పత్రీజీ" నీ ప్రేమనాథ్ నూ పరిచయం చేసిన పుణ్యాత్ములు! జీవితాంతం వీరికి ఋణపడి ఉంటాను!

ఆ తర్వాత ప్రేమనాథ్ సార్‌‌ను చాలా చోట్లకుతీసుకెళ్ళాను. ఎన్నో క్లాసులు చేయించాను. ప్రేమ్‌నాథ్ గారి ద్వారా పత్రీజీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. గంటలు గంటలు మేమిద్దరం కూర్చునేవాళ్ళం. ఆయన పత్రీజీ గురించి చెప్పేవారు. నేను మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు వేసి మరింత తెలుసుకునేదాన్ని ప్రేమ్‌నాథ్ ఇంకా చెప్పేవారు. "పత్రీజీ ఎలా స్పిరిచ్యువాలిటీలోకి వచ్చారు? ఇంతగా సంస్థ ఎలా పెరిగింది? ఎంతమంది ఎంత పనిచేస్తున్నారు? ప్రతిదానికి పత్రీజీ ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు? పిల్లలకు స్కూల్‌లో కాని, పల్లెలలో రైతులకు కాని, పట్టణాల్లో, నగరాల్లో సివిలియన్స్ కానీ ఇంత పెద్దఎత్తున ఎలా ధ్యాన ప్రచారం చేస్తున్నారు?.. ఎన్నో ఎన్నెన్నో విషయాలు అత్యంత విశదంగా చెప్పారు ప్రేమ్‌నాథ్.

ప్రేమ్‌నాథ్, U.S.A. లో మేంకలిసిన ప్రతిసారి పత్రిగారి ఔన్యత్యం గురించి, కెపాసిటీ గురించి, ఎనర్జీ లెవెల్స్ గురించి, పత్రిగారి పవర్ గురించి ఎంతో ఎంతెంతో చెప్పారు. అసలు నేను ఇండియాకు తిరిగి వచ్చేసానంటే దానికి కారణం ప్రేమ్‌నాథ్.

అప్పటికే U.S. లో నాకు నా మెథడాలజీలో ఎంతోమంది స్టూడెంట్స్ ఉండేవారు. నాకు ఆఫీస్ ఉండేది. ఎంతోమందిని నేను కౌన్సిలింగ్ చేసేదాన్ని. అసలు నాకు తీరిక ఉండేదికాదు. ఉదయం వెళితే రాత్రికి గాని ఇంటికి వచ్చేదాన్ని కాదు ఒక్కొక్కసారి. అవన్నీ వదిలివచ్చానంటే మహిమ అయీ పత్రీజీగురించి ప్రేమ్‌నాథ్ నాకు వివరంగా బోధించిన వైనం!

మారం : మీ సందేశం ? ఇండియాకు వచ్చిన తరువాత??

లలితా మేడమ్ : ఆధ్యాత్మికత అంటే నా దృష్టిలో పరిపూర్ణ స్వస్థత! ఓవరాల్ హీలింగ్! బాడీ, మైండ్, సోల్- ఆల్ హీలింగ్! ప్రిన్సిపిల్‌డ్ లైఫ్! హ్యాపి లైఫ్! లైఫ్ సైన్స్! చిన్నచిన్న ఆనందాలు కూడా అనుభవించలేని స్థితిలో ఉన్నారు ఇవాళ మనుషులు. ఎంతో ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతూన్నారు. అందరూ అశాశ్వతమైన డబ్బు వెంట పరుగెడుతున్నారు. కానీ పత్రీజీ ఎంత సింపుల్‌గా, చిన్న సాధనలతో పెద్ద ఆనందాలు జీవించే మార్గం మనకు చూపించారు.

ఇక్కడికి వచ్చి మన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ యాక్టివిటీ చూసి, ఒక్కొక్క వింగ్‌ని చూసి నేను పులకించిపోయాను. నమ్మండి. "వీరంతా పనిచేస్తున్నారా? మాటలే మాట్లాడుతున్నారా?" అని నిశితంగా గమనించాను. ఎంతో తృప్తి చెందాను. అందుకే నాకు పత్రీజీ అంటే అంత క్రేజ్! నా శ్రీరాముడు! నా గాడ్ ఫాదర్!

మారం : మన ఇండియన్ స్పిరిచ్యువల్ మాస్టర్స్‌ను అమెరికన్స్ ఎలా చూస్తారు?

లలితా మేడమ్ : మన మాస్టర్స్, మాస్టర్స్ ఆఫ్ ఇండియా అంటే U.S.A. లో చాలా క్రేజ్. మన భగవద్గీత, గాయత్రి మంత్రం పెట్టి నేను పౌర్ణమి ధ్యానాలు చేయించేదాన్ని. రెగ్యులర్‌గా 60 మంది వచ్చేవాళ్ళు. "ఇండియా అంటే ఆధ్యాత్మికత కు పుట్టినిల్లు" అని అభిమానిస్తారు U.S. లో మనల్ని!

అందుకే ఇస్కాన్, మహేష్ యోగి TM, ఇంకా సత్యసాయిసంస్థలు, ఇప్పుడు మన పిరమిడ్ మెడిటేషన్ అందరినీ, అన్నింటినీ అభిమానిస్తారు, ఆదరిస్తారు U.S. లో!!

మారం : మీ ధ్యానప్రచారం గురించి చెప్పండి!

లలితామేడమ్ : మా వారు సాంబశివరావు గారపాటి గారు మద్రాస్‌లో ఫిలిం ప్రొడ్యూసర్‌గా నటుడు కృష్ణగారితో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మాణం చేసారు. మా తమ్ముడు నారాయణరావు ప్రముఖనటుడు. ఇలా ఆనాటి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకున్న పరిచయం వల్ల అక్కడి వాళ్ళందరికీ "అనాపానసతి" ధ్యానప్రచారం చేస్తున్నాను. స్కూళ్ళలో, కాలేజీల్లో మరి అనాధాశ్రమాల్లో కూడా ఈ ధ్యానప్రచారం ద్వారా పిల్లల్లో మానసికంగా ఎన్నో మార్పులు తేగలుగుతున్నాను. ఈ వయస్సులో కూడా జగత్ కళ్యాణం కోసం పత్రీజీ చేపడుతోన్న ఈ కార్యక్రమాలన్నింటిలో పాలుపంచుకుంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది!

మారం : మీ ఊర్లో ఆ మధ్య పిరమిడ్ కట్టించారు మీరు. ఏ ఊరు అది? పిచ్చమ్మ అవధూత గారి గురించి కూడా చెప్పండి!

లలితా మేడమ్ :మాది కృష్ణా జిల్లా "కురుమద్దాలి". వుయ్యూరు దగ్గర్లో. మా తల్లిదండ్రుల ఊరు అది. నాకు ఆ గ్రామంతో చాలా అనుబంధం ఉంది. కురుమద్దాలిలో మేమొక అంజనేయస్వామి గుడి కట్టించాం. నేను ఇండియాకు వచ్చిన తర్వాత పత్రీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు, మా కజిన్ నారాయణరావు వచ్చారు. మాటల్లో పత్రీజీ కృష్ణా జిల్లాలో ఏదో ఊర్లో ప్రోగ్రాం ఉందని చెప్పారు. ఆ ప్రోగ్రాంకు మా ఊరిమీదనే వెళ్ళాలి. నారాయణరావు పత్రీజీ కి చెప్పారు "మా ఊరిమీదనే మీరు వెళతారు" అని; నేను పత్రీజీని కోరాను "సార్! మీరు అక్కడ ఆగండి" అని. ఆ సమయానికి సరిగ్గా నేను కురుమద్దాలి వెళ్ళి, పత్రీజీని మా "హనుమాన్ ఆలయం" వద్ద రిసీవ్ చేసుకున్నాను. పత్రీజీ చూసి "ఇక్కడంతా చాలా బావుంది; ఇక్కడొక పిరమిడ్ కట్టండి" అన్నారు. "ఓకే" అన్నారు వెంటనే. ఆ దగ్గరలోనే "పిచ్చమ్మ గారి అశ్రమం" ఉంది. అక్కడికి కూడా పత్రీజీ వచ్చారు. చాలా సంతోషించారు. పిచ్చమ్మ గారు అవధూత.. ఆమె గురించి "అవధూత పిచ్చమ్మ" అని సెప్టెంబర్ 2009 ధ్యానాంధ్రప్రదేశ్ లో వచ్చింది కదా!

మారం : "అవధూత పిచ్చమ్మ" గారికి మీకు ఏదైనా అనుబంధం ఉందా?

లలితా మేడమ్ : అవధూత పిచ్చమ్మ గారు శరీరాన్ని వదిలేసి వెళ్ళేముందు ఆ పీఠాన్ని మా స్వంత పెద్దమ్మ - మా "అమ్మగారి అక్క" రాజేశ్వరమ్మ గారికి అప్పగించి వెళ్ళింది. "కొసరాజు రాజేశ్వరమ్మ" మా పెద్దమ్మ అన్నీ చూసేది. నాకు నాలుగేళ్ళు వయస్సు ఉన్నప్పుడు, అపుడు మానాన్న గుంతకల్‌లో ఉండేవాడు. సెలవులకు కురుమద్దాలి వెళ్ళినప్పుడు, పిచ్చమ్మ గారి దగ్గరకు నన్ను తీసుకెళ్ళింది. అప్పుడు పిచ్చమ్మ గారు నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని నుదుట విభూది పెట్టి, ఒక అరటిపండు నా చేతిలో పెట్టింది. మా పెద్దమ్మ చెప్పేది నాకు- "వీడు పెద్దవాడు అవుతాడురా! ఎంతోమందికి అన్నం పెడతాడురా!" అని అందట. మా పెద్దమ్మ తనకు అయిదుమంది ఆడపిల్లలు ఉన్నా, నా పట్ల చాలా అప్యాయతగా ఉండేది. పిచ్చమ్మ గారి తర్వాత మా పెద్దమ్మ రాజేశ్వరమ్మ గారు మఠం చూసుకునేది. ‘అన్నపూర్ణ’ లాగా ఉంటూ, ఛానెలింగ్ వల్ల అందరినీ ఆదరిస్తూ చాలా గొప్పదిగా పేరుపొందింది. అవధూతలాగానే జీవించింది, సంసారంలో ఉంటూనే.

మారం : మరి అక్కడ పిరమిడ్ ఎలా తయారయింది ?

లలితా మేడమ్ : పత్రీజీ కురుమద్దాలి వచ్చిన సందర్భంలో, ప్రేమనాథ్ కూడా వచ్చారు. దాదాపు ఆ సమయంలోనే మా బంధువులొకరు మరణిస్తే, అందరు కురుమద్దాలిలో కలుసుకున్నాం. ఆ సందర్భంగా "పిరమిడ్ కట్టాలి" అని చర్చ వస్తే, ఆ పిరమిడ్‌ను నా తమ్ముడు రవి భార్య శారద తమ్ముడు తానే కట్టిస్తానని ముందుకు వచ్చాడు. మాకజిన్ నారాయణరావు ఆధ్వర్యంలో పిరమిడ్ నిర్మాణం జరిగింది. పత్రీజీ "ఆంజనేయ పిరమిడ్" అని నామకరణం చేసారు.

హైదరాబాద్ "ప్రగతి రిసార్ట్స్" రూపకర్తలైన శ్రీ GBK రావు మరి వారి శ్రీమతి వేంకటకుమారి గార్లకు ధ్యానం నేర్పించి వారితో హైదరాబాద్ నగర శివార్లలోనే "చేవెళ్ళ" గ్రామం సమీపంలోని ఈ 1500 ఎకరాల విశాలమైన ఈ రిసార్ట్స్‌లో ‘60 X 60‘ సైజులో అద్భుతమైన పిరమిడ్ కట్టించడం జరిగింది!

మారం : మీకు 65 సం||. మీ వారికి 73 సం||. మరి మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా!

లలితా మేడమ్ : నేను హ్యాపీగా ఉన్నాను. "పదిమందికీ ఏం చేయాలి?" అని ఆలోచిస్తున్నాను. నా జీవితంలో నేను పొందిన ఈ ఆనందాన్ని స్పూర్తితో ఎన్ని లక్షల మందికి ధ్యానం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాను.

మారం : “ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్ మెంట్ ” గురించి మీ అభిప్రాయం చెప్పండి.

లలితా మేడమ్ : చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పత్రిగారి ఆశయాన్ని తమ ఆశయమని ముందుకెళ్ళిపోతున్నారు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మాస్టర్లు, మీరు, ప్రేమ్‌నాథ్, నిర్మల, రమణ, సుబ్బారావు, డా|| న్యూటన్, లక్ష్మీ న్యూటన్, హరికుమార్ ఇలా ఎంతమంది అని చెప్పను! తారాజువ్వల్లా దూసుకెళుతున్నారు మీరంతా. అలాగే మరి యువతీ యువకులు ఎంత చక్కగా వర్క్ చేస్తున్నారు "పైమా" ద్వారా.పత్రీజీ మార్గం చూపించారు. ఆ ప్రవాహం ఆగదు కాక ఆగదు.

అయితే "పైమా" వాళ్ళకు నా విన్నపం ఏమిటంటే, "అనాధశరణాలయాల్లో ఎంతోమంది పిల్లలు ఉన్నారు; వాళ్ళకు ధ్యానం నేర్పండి; మీ మీ సబ్జెక్టుల చదువు నేర్పండి" అని. మళ్ళీ నేను "ధ్యానాంధ్రప్రదేశ్" ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను - అనాధ పిల్లలకి జీవితం మీద ఆశలు కల్పించండి. ఆ అనాధల్లో ఒక ఒబామా, ఒక మహాత్మాగాంధీ, ఒక నేతాజీ, ఒక వల్లభాయ్, ఒక అబ్దుల్ కలామ్, ఒక వివేకానందుడు, ఒక బుద్ధుడు, ఒక రాముడు, ఒక ఆంజనేయుడు, ఒక పత్రీజీ, ఒక ఓషో ఉండవచ్చు. ఆ అనాథల్లోని ప్రతిభను ధ్యానం ద్వారా, భౌతిక విద్య నేర్పడం ద్వారా "పైమా" ఈ రాష్ట్రమంతా బాధ్యత తీసుకోవాలని నా ఆకాంక్ష.

మారం : మీరు, స్వర్ణమాలా పత్రీజీ గారు కలిసి శ్రీలంక వెళ్ళారు. దాదాపు పదిరోజులు కలిసి ఉన్నారు. వారి గురించి మీ కామెంట్?

లలితా మేడమ్ : స్వర్ణమాలా పత్రి ! ఆమె ఒక అద్భుతమైన వ్యక్తి. అంత గొప్ప భర్త లభించిన అదృష్టవంతురాలు, ఉత్తమ ఇల్లాలు. ప్రేమ్‌నాథ్ ద్వారా పత్రీజీ గురించి విన్నప్పుడు, స్వర్ణమాలా గురించి విన్నప్పుడు, "భార్యగా ఉండి ఎన్ని కష్టాలు పడిందిరా బాబూ" అని ఎంతో ఫీలయ్యాను. ప్రాక్టికల్‌గా చూసాను ఆమెను శ్రీలంక యాత్రలో. చాలా గొప్ప వ్యక్తి. తనను చూస్తే నాకు నాకూతురు లాగానే అనిపించింది. ధీరవనిత, గొప్పభార్య, గొప్పతల్లి.

మారం : మీ కుటుంబం గురించి చెప్పండి!

లలితా మేడమ్ : నా భర్త సాంబశివరావు గారు, ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు. పెద్ద కూతురు అనుపమ, అల్లుడు మురళి. U.S.A. లో డెట్రాయిట్‌లో ఉంటారు. అల్లుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వారికిద్దరు కూతుళ్ళు. చిన్నకూతురు లక్ష్మి, భర్త సెంతిల్ కుమార్, తమిళియన్. వాళ్ళు ఇంగ్లండ్‌లో ఉంటారు. ఆయన డాక్టర్, వాళ్ళకొక బాబు, ఇక మా అబ్బాయి రాజశేఖర్ ఇక్కడ ఒక ట్రావెలింగ్ ఏజన్సీలో పనిచేస్తారు. కోడలు రజిత. వాళ్ళకు కవలపిల్లలు భవేష్, భావిక. 2005 మే నెలలో అ పిల్లలు జన్మించారు.

మారం : "ధ్యానాంధ్రప్రదేశ్" పాఠకులకు మీ సందేశం!

లలితా మేడమ్ : "ధ్యానాంధ్రప్రదేశ్" పాఠకులందరూ దాదాపు ధ్యానం చేసేవాళ్ళే అయ్యుంటారు. ఎన్నో అనుభూతులు పొందివుంటారు. వారిలో నేనూ ఒకదాన్ని. నా భాగ్యం కొద్దీ ఇప్పుడు నా అనుభవాలను పంచుకోగలుగుతున్నాను. నా అనుభవజ్ఞానం ద్వారా నేను చెప్పదలుచుకున్నది- "మీలో మీకు నమ్మకం ఉండాలి. ధ్యానం చేసామంటే, "మనలో ఈ విశ్వమంతా ఉందని తెలుసుకుంటే, పత్రిసార్ ను కూడా మనలో చూసుకోవచ్చు. ఎందుకు చూడాలి అంటే, ఆయనను చూడడం వలన మనకు సహాయం లభిస్తుంది. సహాయం పొందలేక, ఇవాళ అందరూ కష్టాలు అనుభవిస్తున్నారు. మరి ధ్యానం వల్ల ఎంతోమంది నాలాగే ఆ సహాయం తప్పకుండా పొంది ఉంటారు. నా కన్నా ఎన్నో అద్భుతాలు చాలామంది గ్రహించి ఉంటారు, ఇవాళే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కూడా. మీరు వచ్చిన లెవెల్లో, ప్రతివారు మరింత ఎక్కువ ధ్యాన ప్రచారం చేయాలి, అది కనీస కర్తవ్యం"

ఇంత అద్భుతమయిన జీవితాన్ని మనం అనుభవించడానికి ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా "పత్రీజీ" ఆస్కారం కలిగించారు. మరి ఆయనను తిరిగి మనం ఏం ఇవ్వగలం ? ఏమీ ఇవ్వలేం. ఏం ఇచ్చినా ఈ ఋణం తీరదు ! మరింత ధ్యానప్రచారం చేయడం ద్వారా మాత్రమే కొంతయినా తీర్చుకోగలం!!

Go to top