"ఆనందం కన్నా బాధ్యత గొప్పది"

ధ్యానరత్న శ్రీమతి Ch.స్వర్ణలత గారితో... ఇంటర్వ్యూ

 

నేనూ, నా శ్రీమతి శ్రీవాణి ఈ నెల 10వ తేదీన ధ్యానప్రచారం కోసం కృష్ణాజిల్లాలో పర్యటించాం. వుయ్యూరు, మచిలిపట్నం, పామర్రు, విజయవాడలోని కేర్ సెంటర్స్‌ని సందర్శించాం. కేర్ సెంటర్స్‌లో వారు చేస్తున్న కార్యక్రమాలు మరి వారి అనుభవాలు, ఆధ్యాత్మిక విషయాలు గురించి మాట్లాడుకున్నాం.

వుయ్యూరు పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న అవార్డు గ్రహీత శ్రీమతి Ch.స్వర్ణలత గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ చేయడానికి కూడా ఒక కారణం వుంది. వారిని కలవడానికి నా శ్రీమతి, నేనూ వెళ్ళాం. అప్పుడు వారి ఇంటిపైన వున్న అతీషా రూఫ్‌టాప్ పిరమిడ్‌లో ధ్యానం చేస్తున్నప్పుడు మేడమ్‌ని ఇంటర్వ్యూ చెయ్యమని నాకు ఒక మెస్సేజ్ వచ్చింది.

మేడమ్ ఏం అడగాలో, ఎలా ఇంటర్వ్యూ చెయ్యాలో తెలీదు. జూన్ 13 వ తేదీ రాత్రి ఇదే విషయం ఆలోచిస్తూ పడుకున్నాను. నిద్రలో సుమారు అర్థరాత్రి 1.30 సమయంలో పత్రిసార్ కనిపించారు. దూరంగా కొంతమంది ఒక కేంప్‌ఫైర్ చుట్టూ కూర్చుని వున్నారు. పత్రిసార్ మూడు కర్రలు తీసుకుని ఆ మంట దగ్గరకు వెళ్ళి వాటిని వేడిచేసి నా దగ్గరకు వచ్చి చేతి మీద వరుసగా మూడు వాతలు పెట్టారు. అవి 1. ఆత్మ, 2. జ్ఞానం, 3. విద్య.

ఈ మూడు నువ్వు అడగవలసిన విషయాలు అని చెప్పారు. ఇదీ నాకు జరిగిన అనుభవం. ఇదే నా మొదటి ఇంటర్వ్యూ కూడా....

- ధూళిపూడి చంద్రశేఖర్, హైదరాబాద్


చంద్రశేఖర్ : ధ్యానరత్న అవార్డు తీసుకున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు.

స్వర్ణలత : థ్యాంక్స్.

చంద్రశేఖర్ : మీరు ధ్యానరత్న అవార్డు తీసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు?

స్వర్ణలత : సార్ పిలిచారు. ఏంటా నా పేరు పిలిచారు అని అనుకుంటూ నెమ్మదిగా వెళ్ళాను. నాకు ముందుగా ఏమీ తెలియలేదు, ఎవరికి ఏది జరగాలో, ఎవరికి ఏం ఇవ్వాలో ఆయనే నిర్దేశిస్తూ వుంటారు. అసలు నిజానికి నేను చేయాల్సింది ఇంకా ఎంతో వుంది.

చంద్రశేఖర్ : మీ స్వపరిచయం

స్వర్ణలత : మైనేని మధుసూదన్, జయలక్ష్మి గార్ల ప్రథమ పుత్రికను. ముగ్గురు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, మాతాతగారు గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. చలసాని మల్లిఖార్జునరావు. వ్యాపారాన్ని వదిలేసి స్వాతంత్ర్య సమరంలోకి వెళ్ళారు. నేను M.A.(English).M.A (Economics), M.Ed/ చేసి 1974లో చలసాని తిలక్ గారిని వివాహం చేసుకున్నాను. మాకు ఇద్దరు సంతానం. ఆదిత్య, గౌతమ్. గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నాను.

చంద్రశేఖర్ : మీకు ధ్యాన పరిచయం ఎలా జరిగింది?

స్వర్ణలత : 1997లో పత్రిసార్ ధ్యానం క్లాస్ పామర్రులో జరిగింది. దాని గురించి మా స్కూల్‌కి ఒక పాంప్లెట్ వచ్చింది. దానిని చూసి మరికొంతమంది టీచర్స్‌తో కలిసి క్లాస్‌కు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళుమూసుకుని శ్వాసను గమనిస్తూ కూర్చోమన్నారు. కూర్చున్న ఒక సెకండ్‌కే "పత్రిసార్ పక్కన బుద్ధుడు వున్నారు. ముందు ఒక గార్డెన్ వుంది. ఆ గార్డెన్ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాను". అది నాకు వచ్చిన ధ్యానానుభవం. ఆ అనుభవాన్ని సార్‌కి చెప్పాను. క్లాస్ ముగించి వెళ్ళేటప్పుడు సార్ "మీలో ధ్యానం ఎవరికైనా నచ్చితే, అది అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే అందరికీ చెప్పండి" అని చెప్పి వెళ్ళిపోయారు.

చంద్రశేఖర్ : ధ్యానంలోకి రాకముందు, వచ్చిన తరువాత మీలో కలిగిన మార్పు?

స్వర్ణలత : ప్రతి విషయం పట్లా స్పష్టత, అవగాహన పెరిగాయి. ఎలాంటి పనైనా, ఎంతటి క్లిష్టమైన పరిస్థితినైనా సావధానంగా డీల్ చేయగలుగుతున్నాను. వ్యక్తిగత పరస్పర అవగాహనలు, మానవ సంబంధాలు మెరుగుపడ్డాయి. లోపలి నుండి మార్పు వస్తేనే మనిషి యాటిట్యూడ్‌లో మార్పు వస్తుంది. లోపలి నుంచి మార్పు ఎలా వస్తుంది? నిరంతర ధ్యాన సాధన వల్ల. నాది అనే స్వార్ధం అధిగమించటానికి ధ్యానంలోకి అడుగుపెట్టాను. అంతకుముందు అందరినీ చూసి మనుష్యులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు అని విచారపడేదాన్ని. ధ్యానంలోకి వచ్చిన తరువాత ఎవరైనా కాని వారి బుద్ధి అనుసారం, వారి కర్మ ప్రకారం ప్రవర్తిస్తారు అని తెలుసుకుని ఇతరుల గురించి బాధపడటం మానేసాను.

చంద్రశేఖర్ : పత్రీజీ గారి సాంగత్యంలో మీరు ఏం నేర్చుకున్నారు?

స్వర్ణలత :నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ట్రెక్కింగ్ పెట్టారు. ఆ సమయంలో తీవ్రమైన రక్తస్రావం అయ్యేది. ఎక్కడైనా చచ్చిపొయ్యేదే కదా అని చెప్పి ... మా బాబుని తీసుకుని ట్రెక్కింగ్‌కి వెళ్ళాను. దారిలో కర్నూలు పిరమిడ్‌కి వెళ్ళటం జరిగింది. అక్కడ రాత్రి ధ్యానంలో కూర్చుని వుండగా ముగ్గురు మాస్టర్స్ వచ్చి నా వెన్నుపాముని నిమిరారు. ఆ ఉదయమే నాకు రక్తస్రావం ఆగిపోయింది. ఇదే విషయాన్ని పత్రిసార్‌తో రాత్రి నాకు ధ్యానంలో ఇలా జరిగింది అని చెప్పాను. ఆ సమయంలో పత్రిసార్ నువ్వూ నేను స్నేహితులం అని చెప్పారు. అప్పటివరకు ఆయనను గురువుగా భావించాను. కానీ, అప్పటినుంచి పత్రిసార్, నేను ఒక్కటే అనుకుంటున్నాను. ఆరోజు నుంచి పత్రిసార్‌ని స్నేహితునిగా భావిస్తున్నాను.

చంద్రశేఖర్ : ఆత్మ ... జ్ఞానం... విద్య .... వీటిని గురించి వివరించండి?

స్వర్ణలత :

ఆత్మ

నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఒకసారి పత్రిగారు ఇప్పుడు నువ్వు చనిపోతావా? అని అడిగారు. ఆ చనిపోతాను. అని చెప్పాను. ఒకసారి బాగా ఆలోచించుకో అని అన్నారు. నేను అనే 'వ్యక్తిత్వం' గానీ, నాది అనే 'ఉనికి' గానీ నాకు లేవు. నా లోపలే నాకు సముద్రాలు, నదులు, కొండలు అన్నీ కనిపించాయి. వీటన్నింటినీ కలిపివుంచేదాన్నే 'ఆత్మ' అంటారు. ఏదైతే మనందరినీ కలిపి వుంచుతుందో అదే 'ఆత్మ'.

జ్ఞానం

దైతే మనం అనుభూతి పొందుతున్నామో అదే 'జ్ఞానం'. పరిస్థితులను బట్టి రియాక్షన్స్ రావచ్చు. అయితే, ఎవరికి వారు నేనే కరెక్ట్ అని అనుకుంటారు. ఒకరిని అనటం వలన మన బుద్ధి బయటపడుతుంది. ఏం జరుగుతోందో, ఎందుకు జరుగుతోందో చూస్తూ వుండటమే 'జ్ఞానం'. ఇదంతా ఉనికిలోని భాగం. మనకు తెలియనిదాన్ని గురించి మాట్లాడకపోవడం, ఎటువంటి ఊహాగానాలు చేయకపోవడమే 'జ్ఞానం'.

విద్య

కనిపించిన ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడమే 'విద్య' అంటే. ఒక విషయం పట్ల లక్ష్యం వుండి ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడమే 'విద్య'. మనకున్న పరిధిలో, మనకున్న అవకాశాలను ఉపయోగించుకుంటూ, నేర్చుకుంటూ, నేర్చుకున్నదానిని అందరికీ నేర్పడమే ఎడ్యుకేషన్ లేదా 'విద్య' అంటే్.

చంద్రశేఖర్ : ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు మర్చిపోలేని సంఘటన ఏది?

స్వర్ణలత : సుమారు రెండు సంవత్సరాల క్రితం తిరుపతిలో ధ్యానమహోత్సవాలు జరుగుతున్న సమయంలో గుడివాడ రాజకుమారి మేడమ్ వాళ్ళ అమ్మాయి పెళ్ళి జరిగింది. ఆ పెళ్ళికి వెళ్ళవల్సివచ్చి ధ్యానమహోత్సవాలకు నేను మిగతా మాస్టర్స్ వెళ్ళలేకపోయాం. తరువాత వెళ్ళి పత్రిసార్‌ని కలిసి విషయం చెప్పాను. అప్పుడు సార్ నాతో ఇలా అన్నారు "ఆనందం కంటే బాధ్యత గొప్పది". సార్ చెప్పిన ఈ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.

చంద్రశేఖర్ : మీకు బెంగుళూరు పిరమిడ్‌లోని ఏదైనా ఓ అనుభవం?

స్వర్ణలత : వర్ధమాన మహావీరుడిని మనలో వశపరచుకున్నాం. విశ్వంలో జరిగే ఏ పరిణామాన్నైనా సరే విశ్వాలయంలో కూర్చుని మనం వీక్షించవచ్చు. ధ్యానంలో బాగా గాఢ స్థితిలోకి వెళ్ళిపొయ్యాను.

చంద్రశేఖర్ : చివరిగా ధ్యానులకు, మాస్టర్స్‌కు మీరిచ్చే సందేశం?

స్వర్ణలత : త్రికరణశుద్ధితో పనిచేయాలి అనుకున్నప్పుడే మనలోపలి మెస్సేజ్ వస్తుంది. మన ఎదుగుదల విశ్వంలో ... పత్రిసార్‌తో ... లయమై వుంది. ఆయన దగ్గర నుంచి శక్తి తీసుకునే మనం ఎదుగుతున్నాం. ఏదో మనం సొంతంగా చేస్తున్నామనో, సొంతంగా ఎదుగుతున్నామనో అనుకోవటం మాయ. ఆయన చేసే ప్రతి పనిలోనూ మన ఎదుగుదల వుంది. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. కనుక ప్రతి పిరమిడ్ మాస్టర్ త్రికరణశుద్ధితో పనిచేయాలి.

మీరు ఇచ్చిన సమాధానాలు, మీ అనుభవాలు పిరమిడ్ ధ్యానమిత్రులందరికి ఆదర్శం కావాలి.

థ్యాంక్స్ మేడమ్.

Go to top