" ‘ ధ్యానమహాచక్ర’ ద్వారా మా జన్మలు ధన్యంకాబోతున్నాయి "

 

" మొండివాడు రాజుకంటే బలవంతుడు " అని సామెత. అంత మొండివాడు, మొరటువాడు, ఏదైనా విశ్వసిస్తే ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడేవాడు " నెక్కల్లు అబ్బూరి వెంకటేశ్వరరావు " కలెక్టర్‌తో అయినా, SP తో అయినా, మంత్రితో అయినా ఏ జంకూ గొంకూ లేకుండా వారి క్యాబిన్‌లోకి వెళ్ళి ధైర్యంగా ధ్యానం గురించి పిరమిడ్ గురించీ, శాకాహారం గురించీ వివరించి చెప్పి రాగల సాహసి. ఎవ్వరికీ భయపడనివాడూ, లొంగనివాడూ బ్రహ్మర్షి పత్రీజీ యొక్క దివ్యాకర్షణకు లొంగిపోయాడు. పత్రిజీ నచ్చిన, మెచ్చిన ఈ " అబ్బూరి " తన ధ్యాన సాధనతో ఎంతో సాధించుకున్నాడు. ఎంతోమందికి బోధించారు. " అమరావతి ధ్యాన మహాచక్రం " బృహత్ కార్యక్రమంలో " శ్రీ వెలగపూడి లక్ష్మణరావు " గారి తర్వాత ముఖ్యపాత్ర అబ్బూరి వెంకటేశ్వరరావు గారిదే. వీరి ఫోన్ నెం. +91 98485 955093

మారం శివప్రసాద్


మారం : మీ గురించి, మీ కుటుంబం గురించి చెప్పండి అబ్బూరి గారు ..

అబ్బూరి : నా పేరు అబ్బూరి కోటేశ్వరరావు. గుంటూరు జిల్లా " నెక్కలు " గ్రామం. మా తండ్రిగారు గోపయ్య. తల్లి సుబ్బాయమ్మ. మా శ్రీమతి కృష్ణకుమారి. మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దబ్బాయి మనోజ్‌కుమార్ .. ఇంజనీరింగ్ చేసి MBA చేయడానికి అమెరికా వెళ్ళాడు. చిన్నబ్బాయి హరిబాబు .. ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. నా వయస్సు 38 సంవత్సరాలు.

మారం : మీరు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలోకి ఎప్పుడు వచ్చారు?బ్రహ్మర్షి పత్రీజీని ఎప్పుడు కలిశారు ?

అబ్బూరి : 2003 డిసెంబర్ 13 న బ్రహ్మర్షి పత్రీజీ నెక్కలు వచ్చి పిరమిడ్‌కు శంఖుస్థాపన చేశారు. 27' X 27' పిరమిడ్ కట్టమని చెప్పారు. ఆ తర్వాత ఆయన వెంట కారులో గుంటూరు వెళ్ళాను.

పిరమిడ్ శంఖుస్థాపన కంటే ముందు నేను ధ్యానం చేయలేదు. " గురువు అంత గొప్పవాడైతే .. నెక్కల్లు రమ్మను. క్లాసు పెడదాం " అన్నాను మా ఆవిడతో. నా కంటే ఒక సంవత్సరం ముందు నుంచే ఆవిడ ధ్యానం చేయడం మొదలుపెట్టింది. నేను ధ్యానంలోకి రావడానికి కూడా నా భార్యే కారణం. పిరమిడ్ నిర్మాణం మొదలయ్యే వరకు నేను ధ్యానం చేయలేదు. అయితే " పిరమిడ్‌లో ధ్యానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందవచ్చు" అని కొంతమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ద్వారా నాకు అంతకుముందు తెలిసింది. మరి పత్రీజీ శంఖుస్థాపన చేయడం, వెనువెంటనే నిర్మాణం మొదలుపెట్టడం జరిగిపోయాయి. గుర్తుచేసుకుంటే ఇప్పటికీ అది ఆశ్చర్యమే.

మారం : పిరమిడ్ కట్టకముందు మరి కట్టిన తరువాత మీలో కలిగిన మార్పులు ? మరి మీ అనుభవాలు ?

అబ్బూరి : పిరమిడ్ నిర్మాణం నా జీవితంలో పెనుమార్పులను తీసుకువచ్చింది. పిరమిడ్ కట్టకముందు, ధ్యానం చేయకముందు జీవితంలో తెలిసీతెలియక కొన్ని తప్పులు చేశాను. ప్రాపంచిక జీవితంలోనే వున్న నాకు, పిరమిడ్ కడుతూన్నప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలిసింది. ధ్యానం వలన, పిరమిడ్ వలన కలిగే ఉపయోగాలు తెలిశాయి. ధ్యానం చేస్తూ, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటూ, ధ్యానం బోధిస్తూ, మన జీవితంలో ఎన్నో అనుభవాలు పొందుతూ, పంచుతూ, ధ్యానప్రచారం చేస్తూ, ప్రస్తుతం మన లైఫ్ టర్నింగ్ పాయింట్ అద్భుతంగా వుంది. ఇప్పుడు వ్యవసాయ భూమిని కౌలుకు ఇచ్చి పూర్తికాలం ధ్యాన ప్రచారం చేస్తున్నాను.

నేను పిరమిడ్ కట్టిన తర్వాత ధ్యాన ప్రచారం కోసం ఉదయం ఆరుగంటలకు బయలుదేరి గుంటూరు వెళ్ళి ఎంతోమంది గొప్పవారి పరిచయాలు చేసుకుని ధ్యాన ప్రచారం చేసి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి రావడం అలవాటు చేసుకున్నాను. గత ఐదేళ్ళుగా నేను చేస్తున్న పని ఇది. ఎంత గొప్పవారివద్దకైనా వెళ్ళి వారితో పరిచయం చేసుకుని, కలెక్టర్. SP, MLA. మంత్రి అయినాసరే వారితో ఏ మాత్రం మొహమాటం లేకుండా మాట్లాడటం అనేది నాకు జన్మజన్మల సంస్కారంగా వస్తూన్న వెన్నతో పెట్టిన విద్య. అది ఇప్పుడు వరమైంది. అలా ధ్యాన ప్రచారంతో పాటు పిరమిడ్‌లో తెల్లవారుజామున చేస్తూ 4.00 గంటల నుంచి 7.00 గంటల వరకు కూర్చుని ధ్యానం చేయడం నాకెంతో ఇష్టమైన విషయం. ఇలా ధ్యానం చేస్తూ, ధ్యానప్రచారం చేస్తూ నేను ఎన్నెన్నో దివ్యానుభూతులను పొందాను. ఎన్నో ఎన్నెన్నో. మాటల్లో చెప్పలేను. పత్రీజీ నా వెంట వుండి నన్ను నడిపిస్తున్నారు. నా శ్వాస, ఆఖరి శ్వాస ఉన్నంతవరకు ధ్యాన ప్రచారం చేస్తూనే వుంటాను. ఇదే నా సంకల్పం. నాకు ధ్యానంలో ఎన్నో చెప్పలేనన్ని విజన్స్ వచ్చాయి.

మారం : నెక్కల్లు పిరమిడ్ కట్టిన తర్వాత యాక్టివిటీ ఎలా వుంది ? పిరమిడ్ అందరినీ బాగా ఆకర్షిస్తోందని విన్నాను.

అబ్బూరి : నా కైతే పరమానందంగా వుంది. దూరాభారం నుంచి ఈ పిరమిడ్ గొప్పతనం గురించి తెలిసి ప్రజలు బాగా రావడం మొదలుపెట్టారు 2006 నుంచే. " హీలింగ్ పిరమిడ్ " గా పేరు తెచ్చుకుంది మా పిరమిడ్. మాస్టర్స్ ద్వారా నేను " ఈ పిరమిడ్‌‍లో బాగా హీలింగ్ జరుగుతోంది " అని తెలుసుకుని అందరికీ చెప్పడం ప్రారంభించాను. " పిరమిడ్ అంటే ఏంటి ? ధ్యానం మామూలుగా చేయడానికీ, పిరమిడ్‌లో చేయడానికీ తేడా ఏంటి ? " అనుభవపూర్వకంగా మాస్టర్స్ ద్వారా తెలుసుకున్నాను. వచ్చేవారందరికీ కూడా ఈ విషయం అర్థమవుతూ, వారు ఒక్కొక్కరు నోటితో చేసే ప్రచారం బాగా పుంజుకుంది. ధ్యానాసక్తిపరులు బాగా వస్తున్నారు. ఫలితాలు అద్భుతంగా వున్నాయి.

మారం : మరి ఎంతో శ్రమించి పిరమిడ్ కట్టారు. దాని ప్రక్కన పెద్ద హాల్ వేశారు. మళ్ళీ గత సంవత్సరం పైన మొదటి అంతస్తు మొత్తం స్లాబ్ వేసి అందరూ పడుకునే ఏర్పాటు మరి అసెంబ్లీ అయి ధ్యాన ప్రవచనానికి ఐదువందలమంది అనుకూలంగా కూర్చునేట్లుగా స్లాబ్ వేశారు. బాగానే ఖర్చు అయ్యుంటుంది. మరి మీరొక సన్నకారు రైతు. ఇదంతా నిర్మించడం ఎలా సాధ్యమైంది ?

అబ్బూరి : ఉన్న వనరులతోనే అద్భుతంగా చేస్తున్నాం. హీలింగ్ బాగా జరుగుతుందని అందరికీ తెలియ జేయాలని ఎంతో ప్రయత్నం మొదలుపెట్టాను. ఒక HIV పేషంట్ ఇక్కడ చాలారోజులు వుండి నయం చేసుకున్నాడు. ఒక మెంటల్ డిప్రెషన్ కేసుపై ప్రయోగం చేశాం. సక్సెస్ అయింది. చాలామంది ఆస్ట్రల్‌గా ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నెలా మూడురోజులు ముగ్గురు సీనియర్ మోస్ట్ మాస్టర్స్‌తో క్లాసు చెప్పిస్తున్నాం. ఆ క్లాసుల టైమ్‌లో ప్రతిరోజూ రెండు నుంచి మూడువందలమంది పైగా వస్తున్నారు. అంతేకాకుండా ప్రతి పౌర్ణమికి విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి K.V రావు మాస్టర్ తన స్వంత ఖర్చుతో వచ్చి రెండురోజులు పౌర్ణమి ధ్యానం క్లాసు తీసుకుంటున్నారు. అలాగే ఎవరైనా సీనియర్ మాస్టర్ గుంటూరు వచ్చారంటే వారితో నెక్కల్లులో కూడా క్లాస్ చెప్పించడం జరుగుతోంది. ఆదివారాలు ఎవరో ఒక మాస్టర్ వస్తారు. ఇంత మారుమూల పల్లె నెక్కల్లు గ్రామం పిరమిడ్ వల్ల ప్రఖ్యాతి చెందింది అంటే అది అతిశయోక్తి కాదు. సత్యం.

ఈ ధ్యాన ఆశ్రమానికి బ్రహ్మర్షి పత్రీజీ తల్లిదండ్రుల పేర్లు " సావిత్రీ రమణారావు పిరమిడ్ ధ్యాన ఆశ్రమం " అని పేరు పెట్టాం. అందరికీ ఉచిత భోజన ఏర్పాట్లు చేశాం. పిరమిడ్ కట్టకముందు " నువ్వు పిరమిడ్ కట్టు .. డబ్బు నేను ఇప్పిస్తాను " అన్నారు పత్రీజీ. ఆ తర్వాత హాల్ క్రిందా పైనా కూడా వేయడం జరిగింది. కానీ పత్రీజీని డబ్బు అడగడం జరగలేదు. ఇదీ ధ్యాన మహిమ. అలాగే ధ్యానం వలన మిత్రత్వం నేను సొసైటీలోకి వచ్చిన తర్వాత మా గుంటూరు ప్రసిడెంట్ లక్ష్మణరావు గారి స్నేహం.

2008 ఫిబ్రవరి 8 వ తేదీన శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారు .. " ఒక రైతు చిన్న గ్రామమైన నెక్కల్లులో పిరమిడ్ కడుతున్నాడు " అని తెలిసి వచ్చి చూసి 27'X 27' పిరమిడ్ కడుతూండడం చూసి ఆశ్చర్యపోయారు. ఆయన ఈ పిరమిడ్ విలువ తెలిసి ఈ చిన్న గ్రామంలో నిర్మించబడుతున్న ఈ పిరమిడ్ నిర్మాణానికి ఇరవైవేలు ఆయన వంతుగా ఇచ్చి సహకరించారు. మరి పిరమిడ్ నిర్మాణానికి ఇరవైవేలు ఆయన వంతుగా ఇచ్చి సహకరించారు. మరి పిరమిడ్ నిర్మాణ సమయంలోనైతేనేం, నేను ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడైతేనేం నేను తెలిసీ తెలియక ఎవరినైనా ఒక మాట అంటే ఆయన ఎప్పటికప్పుడు సవరించేవారు. " అలా కాదమ్మా ఎదుటివాళ్ళను మనం ఏమైనా అంటే వాళ్ళ నెగెటివ్ మనం తీసుకున్నవాళ్ళం అవుతాం " అని చెప్పారు ఆయన. ఎప్పటికప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ఆ మాట నాకెంతో మేలు చేసింది, ఉపకరించింది. శ్రీలక్ష్మణరావు గారి ద్వారా, రోజుకు ఆరేడు గంటలు ధ్యాన ప్రచారం చేయడం వల్ల, పత్రీజీ సాంగత్యం వల్ల నేనెంతో జ్ఞానం పొందాను. ఇక ప్రతి నెలా ఈ మూడురోజుల వర్క్‌షాప్ వల్ల ఎంతో ఉపయోగం కలిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమందితో పరిచయాలు పెరిగాయి.

గుంటూరు జిల్లాలో ఏ మాస్టర్ ఎక్కడికి వచ్చి వెళ్ళినా ఆ ఖర్చులన్నీ భరించేది దాదాపుగా శ్రీ లక్ష్మణరావు గారే. వారు ప్రత్యేకంగా ఒక కారు ఏర్పాటుచేసారు దీనికోసం. జిల్లాలో అన్ని సెంటర్లు తిరగటం, సెంటర్లు లేనిచోట సెంటర్లు ఏర్పాటు చేయడం, ఆయా ఊళ్ళలో నలభైరోజుల క్లాసులు ఏర్పాటు చేయడం, మాస్టర్లను తీసుకెళ్ళడం మేమిద్దరం శరవేగంగా చేస్తున్నాం. మరి ఎంతో బిజీగా వుండి కోట్ల వ్యాపారం చేస్తూన్న మా ప్రెసిడెంట్ లక్ష్మణరావు గారు రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు మాస్టర్లను వెంటేసుకుని నాలుగైదు క్లాసులు కూడా చెప్పిస్తున్నారు. నా కంటే ఎక్కువగా ధ్యానప్రచారం చేస్తున్నారు. నేను క్లాసులు ఏర్పాటు చేయడం, ఆయన మాస్టర్లను తీసుకెళ్ళడం ఇలా గుంటూరు జిల్లా పూర్తిగా " ధ్యాన గుంటూరు జిల్లా " గా మారుతోంది. ముందురోజు నిర్ణయించుకున్న ప్రకారం ఆ రోజు క్లాసును చేస్తాం. ప్రతిరోజూ ఇది మా ఇద్దరి పూర్తికాలవు ధ్యానప్రచార కార్యక్రమం.

2006 డిసెంబర్ 13 న బ్రహ్మర్షి పత్రీజీ నెక్కల్లు పిరమిడ్ ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు వరకు రోజు రోజుకూ నాలో కలిగిన ఆత్మ ఎదుగుదల ఎంతో ఎంతెంతో ముఖ్యంగా ఎన్నో ఊళ్ళలో జరిగిన, జరుగుతున్న మండల అదే నలభైరోజుల ధ్యాన కార్యక్రమాలు మాకు ఇద్దరికీ ఎంతో తృప్తిని కలిగిస్తున్నాయి.

మారం :2010లో " ధ్యాన మహాచక్రం " అమరావతిలో జరపాలనే నిర్ణయం గురించి తెలియజేయండి.

అబ్బూరి : పత్రీజీ గొప్ప గొప్ప కార్యక్రమాల గురించి ముందునుంచే అందరితో చర్చిస్తూ వుంటారు. " మరి 2010 లో ఎక్కడ ధ్యాన మహాయజ్ఞం " వేదికపై బ్రహ్మర్షి పత్రీజీ ప్రసంగిస్తూ " ఇప్పటికి పదకొండు ధ్యాన మహాయజ్ఞాలు పూర్తయ్యాయి. ఇకపైన అన్నీ ‘ ధ్యాన మహాచక్రాలు ’ వుంటాయి. మొదటి ధ్యాన మహాచక్రం అమరావతి పుణ్యక్షేత్రంలో గుంటూరు జిల్లాలో శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారి నేతృత్వంలో జరుగుతుంది. ఈ విషయాన్ని లక్ష్మణరావు గారు ప్రకటిస్తారు " అని చెప్పారు. లక్ష్మణరావు గారు మహదానందంతో ఇదే విషయాన్ని వేదిక పైన ప్రకటించారు.

" రోజుకు లక్షమంది తక్కువ లేకుండా వస్తారు అమరావతికి; అలా ఏర్పాట్లు చేయాలి ; ఆలోచించుకో " అని పత్రీజీ లక్ష్మణరావు గారితో చెప్పారు. " ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. నేను సిద్ధంగా వున్నాను " అని లక్ష్మణరావు గారు గురువుగారికి విన్నవించుకోవడం జరిగింది. ఆ తరువాత మరి బ్రహ్మర్షి పత్రీజీ " అమరావతిలో పదకొండురోజుల కార్యక్రమం 2010 డిసెంబర్ 21 నుంచి 31 వరకు " అని నిర్ణయించి ప్రకటించారు. మరి లక్ష్మణరావు గారు ఏ మాత్రం వెనుకాడక ఈ నిర్ణయానికి అంగీకరించారు.

" రోజు ఒక లక్షమంది ఉదయం 4.00 గంటల నుంచి 7.00 గంటల వరకు ధ్యానం చేయాలి " అనేది బ్రహ్మర్షి పత్రీజీ చిరకాల వాంఛ. దానికి తగ్గట్లుగానే మేము ఏర్పాట్లు మొదలుపెట్టాం. లక్షమందికి తగ్గకుండా వస్తారని, దానికి తగిన స్థలాన్ని ఈ జనవరి 4 వ తేదీనే తీసుకుని ఆ స్థలానికి ఒక సంవత్సరం అద్దె కూడా కట్టేశారు లక్ష్మణరావు గారు. స్థలం బాగుచేయడం కూడా జరిగింది. మార్చి 11 వ తేదీన పత్రీజీ అమరావతి వచ్చి చూసి ఆ స్థలాన్ని O.K చేశారు.

ఇక ఈ మహా కార్యక్రమంలో భాగంగా మొదట అమరావతి పట్టణాన్ని ధ్యానమయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇంతకుముందు వున్న కేర్‌సెంటర్ స్థానంలో మళ్ళీ క్రొత్తగా ఒక ఇల్లు తిసుకున్నాం. మొన్న పత్రీజీ వచ్చినప్పుడు ఈ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. రోజుకు ఇరవైమంది మాస్టర్లు అమరావతిని ధ్యానమయం చేయడానికి సిద్ధమయ్యారు.

మారం : శ్రీశైలంలో రెండువేల రూములు, వంద హాల్స్ ఉన్నందువల్ల రోజుకు ఇరవై నుంచి ముప్ఫైవేలమంది వస్తే కూడా అక్కడ వసతి ఏర్పాట్లు కుదిరాయి. మరి అమరావతిలో రెండువందల రూములు కూడా లేవు. రోజూ ఒక లక్షమంది వస్తే వసతి కోసం ఏం ఏర్పాట్లు చేస్తున్నారు ??

అబ్బూరి : అమరావతి చుట్టుప్రక్కల " ధరణికోట " ఇంకా చాలా గ్రామాలు వున్నాయి. " కాలచక్ర " చేసినప్పుడు ఆ నిర్వాహకులు చుట్టుప్రక్కల గ్రామాలన్నింటిలో ఇళ్ళను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మేము కూడా ప్రతి ఇంటివారినీ అభ్యర్థించి అనేక ఇళ్ళు పదిహేనురోజుల కోసం తిసుకుంటాం. అంతేకాక రెండు నుంచి మూడు నెలల ముందుగానే ప్రతి ఇంటికీ ధ్యానం చెప్పి " మా ఇంట్లో పదిమంది వుండండి, మా ఇంట్లో పాతికమంది వుండండి " అని వారితోనే చెప్పించేట్లుగా ధ్యాన ప్రచారం చేస్తాం. ఇక్కడ " ధ్యాన మహాచక్రం " కోసం దాదాపు ఇరవై ఎకరాల భూమి తీసుకున్నాం. అందులో ఒక ఏడెనిమిది ఎకరాల్లో ఎన్నోవేలమందికి వసతి ఏర్పాట్లు చేస్తాం. జూన్ నుంచే రెండు మూడు వందల బాత్‌రూమ్‌లు నిర్మాణం మొదలుపెడుతున్నారు లక్ష్మణరావుగారు సిద్ధంగా వున్నారు కదా సంపదను సద్వినియోగం చేస్తూ ఈ " ధ్యాన మహాచక్రం " కోసం. రాజు తలచుకుంటే ఇంక ధ్యానయజ్ఞాలకు కొదవేముంది ?

మారం : చుట్టుప్రక్కల గ్రామాల్లో వున్న ప్రతి ఇంటినీ ఉపయోగించుకుంటారా ? అందరూ ఇస్తారా ? ఏం ధైర్యం, ధ్యానంతో దేన్నైనా సాధించవచ్చనా ? అంత విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారా మీరు రోజుకు లక్షమందికి ?

అబ్బూరి : అమరావతిలో రెండువందల రూములు వున్నాయి. అన్నీ తీసుకుంటాం. అమరావతిలో మరి చుట్టుప్రక్కల గ్రామాల్లో ప్రతి ఇంటికీ, ప్రతి మనిషికీ ధ్యానం చెబుతాం, చేయిస్తాం. ప్రతిఒక్క ఇంటి యజమానినీ ఒప్పించి, వసతి ఇప్పించుకుంటాం. " ధ్యానం వల్ల ఏమైనా సాధించవచ్చు " అని నేర్పి, చేయించి చూపించారు పత్రీజీ మనకు. దాన్ని నేను, లక్ష్మణరావు గారు పూర్తిగా పాటించాం.

నేను మహా ముదురును. నాలాంటి మహాముదురే ధ్యానం వల్ల మృదువుగా మారితే మిగతావాళ్ళ విషయం చెప్పేదేముంది. అన్ని కాలేజీలు, స్కూళ్ళు, హాళ్ళు, కళ్యాణమండపాలు ఏవైతే అమరావతిలో మరి చుట్టుప్రక్కల వున్నాయో అన్నిటినీ, అందరినీ ఒప్పించుకుంటాం. ఇప్పించుకుంటాం. ఏర్పాటు చేసుకుంటాం. ఒక లక్షమంది ఏంటి .. ఇంకా పదివేలు పాతికవేలు ఎక్కువమంది వచ్చినా మేము సముదాయించుకుంటాం. మాతో అవుతుంది, అంతే. లక్ష్మణరావు గారు స్టేజ్, షెడ్డు కోసం చేసే ఆలోచనలు చూస్తూనే " అమ్మో, ఇంత పెద్దదా " అనిపిస్తోంది.

ఒక ప్రణాళిక ప్రకారం గ్రామాల్లో నలభైరోజుల సెషన్స్ మండల ధ్యాన కార్యక్రమాలు మొదలుపెట్టాం. అలాగే ప్రతి గ్రామంలో చేస్తాం. అమరావతి ప్రాంతాల్లో రైతులకు ధ్యానం బోధించడం మొదలుపెట్టాం. అలాగే ప్రతి గ్రామంలో చేస్తాం. అమరావతి ప్రాంతాల్లో రైతులకు ధ్యానం బోధించడం మొదలుపెట్టాం. " ధ్యాన వ్యవసాయం " ఎలా వుంటుంది .. పొలాల్లో రైతులు మరి రైతు కూలీలు ధ్యానం చేయడం వల్ల ఎలా ఎక్కువ పంటలు పండించవచ్చునో .. వాళ్ళకు నేర్పడం మొదలుపెడుతున్నాం. ధ్యానం వల్ల పొందే ఆత్మశక్తితో దేన్నైనా సాధించవచ్చని రైతులకు తెలియజెపుతాం. అలాగే " సేంద్రియ వ్యవసాయం " గురించి కూడా వివరిస్తాం.

గుంటూరు జిల్లాలో జూన్ 15 నుంచి ప్రభుత్వ వర్గాల ద్వారా జూలై 31 లోపు ప్రతి గ్రామంలో ధ్యాన ప్రచారం పూర్తి చేస్తాం. ఇలా గుంటూరు జిల్లాలో జూలై 31 లోపు " ధ్యాన గ్రామీణం " పూర్తిచేస్తాం. అలాగే గుంటూరు జిల్లాకు పొరుగు జిల్లాలైనవి కృష్ణా, నల్గొండ, ప్రకాశం జిల్లాలు. అమరావతి ధ్యాన మహాచక్రాన్ని పురస్కరించుకుని ఈ సరిహద్దు జిల్లాలు కృష్ణా కోసం జక్కా రాఘవరావు గారినీ మరి ప్రకాశం జిల్లా కోసం సిద్ధా సూర్యప్రకాశరావు గారినీ, నల్గొండ జిల్లా కోసం కృష్ణారెడ్డి, డా|| వేణుగోపాల్, శివకుమారి, దామోదర్‌రెడ్డి, సాగర్, సతీష్‌లనూ సంప్రదించి జూన్ 15 నుంచి జూలై 31 లోపు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నల్గొండ జిల్లాల్లో పూర్తిగా ప్రతి గ్రామం ప్రభుత్వ వర్గాల సహకారంతో ధ్యానమయం అయ్యేలా కృషిచేస్తాం.

జనవరి 4 వ తేదీన ధ్యానంలో నేను ముందుగానే డిసెంబర్‌లో జరిగే " ధ్యాన మహాచక్రం " ఎలా జరుగుతుంది అనే విజన్‌ని సినిమా లాగా చూశాను. రోజూ లక్షమంది పైగా ధ్యానులతో ఈ కార్యక్రమం జరగబోతోంది. " అమరావతిలో ధ్యాన మహాచక్రం " అని పత్రీజీ ప్రకటించగానే " , మా జన్మ ధన్యమైంది " అని అర్థమైంది. " నేను జీవన్ముక్తి పొందుతున్నాను " అని ఆత్మానందం కలిగింది.

ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు గ్రాండ్ మాస్టర్లు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నవాళ్ళు గుంటూరుకు పిలిచినప్పుడల్లా వచ్చారు. ఇంకా ఎంతోమంది రెడీగా వున్నారు .. పిలిస్తే చాలు గుంటూరు జిల్లాలో దూకడానికి. వచ్చిన ప్రతి మాస్టర్‌నూ మేము ఉపయోగించుకుంటాము. ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకుంటాం. గుంటూరు జిల్లాలోని ప్రతి గ్రామం తిరుగుతాం ప్రతి వేదికనూ ఉపయోగించుకుని ధ్యాన ప్రచారం చేస్తాం.

ఒక్క గుంటూరు జిల్లా నుంచే యాభైవేలమంది రావాలనే ఆకాంక్ష మాది. లక్ష్మణరావు గారి ఆకాంక్ష ఇది.

బ్రహ్మర్షి పత్రీజీ అనుమతితో .. రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటిరోజు ప్రారంభ కార్యక్రమానికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటాం. అలాగే ఇతర నాయకులూ, మా జిల్లా మంత్రులు, MLA లు. ఇలా పదకొండురోజులు పదకొండుమంది పెద్దలు వచ్చేట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు మా ప్రెసిడెంట్ లక్ష్మణరావు.

ప్రతిరోజూ ఒక అద్భుత సాంస్కృతిక కార్యక్రమం కళ్ళుమిరుమిట్లు గొలిపేలా " న భూతో న భవిష్యతి " అన్నట్లుగా ఈ " ధ్యాన మహాచక్రం " తన జీవితకాలమంతా గుర్తుండిపోయేలా చేయాలని తన సర్వశక్తులనూ వినియోగిస్తున్నారు గుంటూరు జిల్లా పిరమిడ్ మాస్టర్లు. బ్రహ్మర్షి పత్రీజీ అడుగడుగునా మమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఎప్పటికప్పుడు సూచనలు ఇప్పటినుంచే ఇస్తున్నారు.

అందరూ " ఔరా " అని ముక్కు మీద వేలు వేసుకునేలా నిర్వహిస్తాం మేము " ధ్యాన మహాచక్రం " కార్యక్రమాన్ని.

మారం : " ధ్యానాంధ్రప్రదేశ్ " గురించి చెప్పండి.

అబ్బూరి : గుంటూరు జిల్లాలో ప్రతి ధ్యాని ఇంట్లో " ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ " వుండాలి. క్రమంగా ప్రతి ఇంట్లో కూడా " ధ్యానాంధ్రప్రదేశ్ " మ్యాగజైన్ వుండాలి. ఇది ఒక ప్రేరణగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని పిరమిడ్ మాస్టర్స్ కృషి చేయాలి. ఇది నా సంకల్పం. " ధ్యానాంధ్రప్రదేశ్ " మాసపత్రిక ప్రతి ఇంట్లో వుండడం వల్ల మ్యాగజైన్‌ను పట్టుకుని చూస్తే చాలా చదవాలనిపిస్తుంది ఎవరికైనా. చదివిన ప్రతివారికీ " ధ్యానం చెయ్యాలి " అనిపిస్తుంది. అంత గొప్ప పత్రిక ఇది. పత్రీజీ ఎనర్జీ " ధ్యానాంధ్రప్రదేశ్ " లో అణువణువునా వుంది.

మారం : శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారి గురించి, వారి కుటుంబం గురించి చెప్పండి.

అబ్బూరి : గుంటూరు జిల్లాలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌కు దొరికిన ఒక " కోహినూర్ వజ్రం " శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారు. నాలుగేళ్ళలో ఈ జిల్లాలో ఇంత ధ్యాన ప్రచారం .. అంతా ఆయన పుణ్యమే. ఒకప్పుడు ఈ జిల్లా ఎలా వుండేదో ఈ నాలుగేళ్ళలో ఎంత ధ్యానప్రచారం జరిగిందో చూస్తే తెలుస్తుంది. ఆయన అన్నిరకాలుగా ధ్యానప్రచారం కోసం పరుగెత్తుతున్నందు వల్ల మేమంతా ఆయన వెంట పరుగెత్తుతున్నాం. పత్రీజీ చెబుతారు

చూడండి " తన్ - ధన్ - మన్ " అని. ఆయన అలా తన జీవితాన్ని ధ్యానప్రచారానికి అంకితం చేస్తున్నారు. ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నారో కానీ ఈ జన్మలో గుంటూరు జిల్లా ధ్యానమయం కావడానికి కంకణం కట్టుకున్నారు.

ఇక వారి " శ్రీమతి ఉషా మేడమ్ ". వారు తమ ఇంట్లో పిరమిడ్‌కు వచ్చిన వారందరికీ ధ్యానం చెప్పి, బోధించి, కూర్చోబెడతారు. మరి లక్ష్మణరావు గారు ప్రతిరోజూ మాస్టర్లను భోజనాలకూ, టిఫిన్లకూ పిలుచుకు వస్తారు. పెద్ద మాస్టర్లు ఇతర ఊళ్ళ నుంచి వచ్చే ముఖ్యమైన మాస్టర్లు ఎవరు వచ్చినా వాళ్ళింట్లోనే ఉంచుకుని, వారి వెంట లక్ష్మణరావు గారు పూర్తి సమయం కేటాయించి తమ కార్లో క్లాసులకు తీసుకెళుతూంటె చిరునవ్వు చెరగకుండా వండిపెట్టి, వడ్డించి, వసతి కలగజేస్తారు శ్రీమతి ఊషా లక్ష్మణరావు. ఆమె ఎంతో దొడ్డది. అలాగే వారి అబ్బాయిలు తమ తండ్రి పూర్తి సమయాన్ని ధ్యాన ప్రచారం కోసం కేటాయించేలా తాము పూర్తి బాధ్యతలు తీసుకున్నారు.

మారం : పత్రీజీ గురించి చెప్పండి.

అబ్బూరి : ఆయన మామూలోడు కాదు. మహాపురుషుడు. బ్రహ్మర్షి, ఇంక ఆపైన ఏమేం పెద్ద పేర్లు చెబుతారో నాకు తెలియవు. అవన్నీ ఆయనే. నేను తెలుసుకున్న రీతిలో అద్భుతమైన గురువు. " నేను పిరమిడ్ కట్టడానికి డబ్బులేవి ? " అంటే " నువ్వు కట్టు నేనిస్తాలే " అన్నారు. పిరమిడ్ పూర్తయింది. నేను ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ ఆయన్ని ఆ విషయం కూడా అడగలేదు. నేనే క్రిందా పైన పదిలక్షలు పెట్టి కట్టించాను. అది ఒకప్పుడు. ఇవాళ గురువు అంటే ఏమిటో తెలుసుకున్నాను. సత్యం అంటే ఏమిటో అర్థమైంది. ఆయన ఎందుకు రాత్రింబవళ్ళు తిరుగుతున్నారో అర్థమైంది. ఆయన లాగా తిరగాలనీ, ధ్యాన ప్రచారం చేయాలనీ తెలుసుకున్నాను. శ్రీశైలంలో పత్రీజీ ఒక్కరే .. రోజూ పాతిక ముప్ఫైవేలమందిని కంటిచూపుతో శాసించారు. క్రమశిక్షణలో కూర్చోబెట్టారు. గంటలు, గంటలు ధ్యానం చేయించారు. రేపు అమరావతిలో కూడా రోజూ లక్షమంది పైనే వస్తారు. వారందరినీ అలాగే శాసిస్తారు. క్రమశిక్షణలో కూర్చోబెడతారు. ధ్యానం చేయిస్తారు. ఎంతో వినిపిస్తారు.

" గురువు ఎవరూ లేడు ", " నీ శ్వాసే నీ గురువు ", " యద్భావం తద్భవతి " అని బోధించారు. " అప్పో దీపో భవ " అన్నారు. ఈ సూత్రాలు చాలు ముక్తి పొందడానికి. ఇవాళ కలకత్తాలో వుంటే రేపు చండీఘడ్‌లో వుంటారు. ఒకరోజు న్యూజెర్సీలో వుంటారు. ఆ తర్వాత రోజు అమరావతిలో వుంటారు. ఈ జన్మకు మన వరం, మన అదృష్టం .. బ్రహ్మర్షి పత్రీజీ ..

మారం : ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులకూ, పిరమిడ్ మాస్టర్లకూ మీ సందేశం ?

అబ్బూరి : ప్రతి పిరమిడ్ మాస్టర్ ధ్యాన సాధన చేయాలి. ధ్యాన ప్రచారం ముమ్మరంగా చేయాలి. 2012 తరువాత అయినా, ఎప్పుడైనా సరే .. ధ్యానం చేసేవాడికి, చెప్పేవాడికి ఏ భయమూ ఉండదని బోధించాలి. ప్రతి ఒక్కరూ " ధ్యానాంధ్రప్రదేశ్ " పుస్తకం ప్రతి ఒక్కరికీ చూపించి, సంవత్సర చందా కట్టించి, ప్రతి ఒక్కరికీ, ప్రతి ఇంటికీ అందేలా ఒకరికి పదిమంది తద్వారా ధ్యానం చెప్పేలా, బోధించేలా చూడాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్ తమ ఇంటిపైన ఒక పిరమిడ్ కట్టుకుని అందరూ కట్టుకునేలా చూడాలి.

Go to top