" సూక్ష్మలోక సందేశాలు "

నా పేరు హనిత.

28-2-2010 నా ధ్యాన జీవితంలో అద్భుతమైన రోజు. ప్రకాశం జిల్లాను ధ్యాన వెలుగుతో ముంచెత్తుతున్న మహోన్నత వ్యక్తి శ్రీనివాస్ మాస్టర్ గారు చీరాలలో ధ్యాన వార్షికోత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. ఆ సందర్భంలో D.కేశవరాజు, తిరుపతి గారు చీరాల రావడం జరిగింది. నాకు సోదరతుల్యలు అశ్వాపురం కృష్ణ గారు కేశవరాజు గారిచే మా ఇంట్లో క్లాస్ నిర్వహింపజేశారు. నా అదృష్టవశాత్తు నేను ఊహించని విధంగా అరవైమందికి పైగా ధ్యానులు వచ్చారు.

కేశవరాజు గారి అద్భుతమైన సందేశామృతంలో తరిస్తున్న తరుణంలో ముత్యాలపేటకి చెందిన అంజలి గారు సార్ నుంచి జాలువారుతున్న అమృతతరణిలో లీనమైపోయారు. ఆమె గాఢమైన ధ్యాన స్థితికి చేరుకున్నారు. ఆమెకు శివుడు పులిచర్మం కట్టుకున్న చిన్న శివునిగా, ఒక శివలింగానికి పెద్ద నాగుపాము చుట్టుకుంటున్నట్లుగా దర్శనమైంది. పెద్ద పామును చూడగానే ఆమెకు భయం కలిగిందట. " నేను ఆత్మను, భయం నన్ను ఏమీ చేయదు " కేశవరాజు గారు ఆమెను " ఇంకా సూక్ష్మశరీరయానం చేస్తారా ? " అని అడిగారు. ఆమె " చేస్తాను " అన్నారు. ఆ క్షణంలోనే మళ్ళీ ఆమె గాఢ ధ్యానంలోకి వెళ్ళి సూక్ష్మశరీరయానం చేసారు. ఆమె చవిచూసిన అద్భుతమైన అనుభవాలను చూద్దాం. కేశవరాజు గారు ప్రశ్నిస్తే ఆమె చెప్పిన సమాధానాలు :

కేశవరాజు గారు : అంజలి, ఎక్కడ వున్నారు ?

అంజలి : బంగారుకాంతులు వెదజల్లే కాంతిలోకంలో వున్నాను. నా రూపం నాకు వెలుగుగా కనిపిస్తోంది.

సార్ : అ కాంతిలోకం ఎలా వుంది ?

అంజలి : అబ్బో, చాలా ఎనర్జీగా వుంది, పొంగిపోతోంది. ఇక్కడ గొడుగులాంటి చిన్న చిన్న పిరమిడ్స్ వున్నాయి. ఒక్కో పిరమిడ్‌లో ఒక్కో మాస్టర్ వున్నారు. ఒక పిరమిడ్‌లో బుద్ధుడు కనిపిస్తున్నాడు.

సార్ : బుద్ధుని సందేశం తీసుకోండి?

అంజలి (బుద్ధ) : " ఇంకా బాగా ధ్యాన ప్రచారం చేయాలి. 2012 లో ప్రళయం రాకూడదు, అందరూ రక్షించబడాలి అంటే అందరూ బాగా ధ్యానం చేయాలి. "

సార్ : మాంసాహారం అందరూ మానేస్తారా ?

అంజలి (బుద్ధ): " వాళ్ళ భావనను బట్టి మానేస్తారు. మాంసాహారం తింటే మందులు లేని రోగం వస్తుంది. అప్పుడు మానేస్తారు లేదా చనిపోతారు. "

సార్ : ధ్యానానికి పిలుస్తూంటే అందరూ రావడం లేదు ఎందుకు ?

అంజలి (బుద్ధ) : "వాళ్ళ అజ్ఞానం, అది పోతేనే ధ్యానానికి వస్తారు. "

సార్ : " అజ్ఞానం పోవాలి అంటే ఏం చేయాలి ? "

అంజలి(బుద్ధ) : " అది మీ పత్రిసార్ చేస్తారు. "

అప్పుడు ఆమెకు బుద్ధుడి ప్రక్కనే పత్రిగారు కనిపించారు. " నేను కనిపిస్తూంటే గమనించవేం ? " అంటూ పత్రిసార్ బుద్ధుడిలో కలిసిపోయారని చెప్పారు ఆమె, తరువాత " మహావీరుడు కనిపిస్తున్నారు " అని చెప్పారు.

సార్ : మహావీరుడిని అడగండి " ఏం చేయమంటారు అని ? "

అంజలి(మహావీర): " అందరూ ధ్యానం చేయండి, ధ్యానప్రచారం చేయండి. ధ్యాన ప్రచారంలో వున్న అందరికీ ఇదే ఆఖరిజన్మ ". ఇప్పుడు ఆంజనేయస్వామి కనిపిస్తున్నారు.

సార్ : వారి సందేశం తీసుకోండి.

అంజలి(ఆంజనేయస్వామి): " అందరికీ శక్తిని ఇస్తాను. సూక్ష్మలోకాలలో వున్న మాస్టర్స్ అందరూ అందరికీ సహాయం చేస్తారు " అని ఆకాశంలో ఎగిరిపోయారు.

సార్ : ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు ?

అంజలి : ముళ్ళకిరీటంతో జీసస్ కనిపిస్తున్నారు. ప్రేమమయుడో. " ప్రేమతో హీలింగ్ చేయి " అంటూన్నారు.

సార్ : " ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు ? "

అంజలి : సరస్వతీ దేవి.

సార్ : " ఏమంటున్నారు ? "

అంజలి(సరస్వతి): " హంసని పట్టుకోండి. నేను మీకు జ్ఞానం ఇస్తాను. (హంస అంటే శ్వాస)

సార్ : ఆ, ఎవరు కనిపిస్తున్నారు మీకు ?

అంజలి : లక్ష్మీదేవి.

సార్ : చీరాలలో 100X100 పిరమిడ్ కడతామా? ఎక్కడ కడతాం? సముద్రతీరంలో కడతామా ?

అంజలి(లక్ష్మీదెవి) : " చీరాల పరిసరాలలో పది నుంచి ఐదు కిలోమీటర్ల లోపు పొలాల్లో 80X80 పిరమిడ్ కడతారు. పెద్ద పిరమిడ్ కనిపిస్తోంది."

సార్ : " ఎవరు కడతారు ? ఎప్పుడు కడతారు ? "

అంజలి(లక్ష్మీదేవి) : " వ్యాపారస్థులు కలసి కడతారు ; బుద్ధపౌర్ణమి తరువాత పిరమిడ్ కడతారు. "

సార్ : మరి పిరమిడ్ మాస్టర్స్‌కి లక్ష్మీకటాక్షం కూడా వుంటే ఇంకా కార్యక్రమాలు త్వరగా పూర్తి చేయగలం కదా.

అంజలి(లక్ష్మీదేవి) : " మీకు సరస్వతీ కటాక్షం(జ్ఞానం) తో పాటు లక్ష్మీకటాక్షం కూడా వుంటుంది. మా మాస్టర్స్ సహాయం మీకు ఎప్పుడూ వుంటుంది. "

ఇలా మాస్టర్స్‌తో సంభాషణ పూర్తి అయిన తరువాత ఆమెకు చీరాల పట్టణం (ప్రళయం) నీటితో మునిగిపోతున్నట్లుగా కనిపించి మళ్ళీ నీళ్ళు వెనుకకు వెళ్ళిపోయాయి. దానికి కారణం " 14-2-2010 నుంచి 1-3-2010 వరకు ధ్యాన ఆరోగ్య సప్తాహం. వార్షికోత్సవాలు జరుగుతూ వేలాదిమంది అఖండ ధ్యానం చేయడం వల్ల ఘోరవిపత్తు నుంచి చీరాల రక్షించబడింది అని మాస్టర్స్ చెబుతున్నారు " అని అంజలి చెప్పారు. ఇదే విషయం భూమిపై నడుస్తున్న దైవం పత్రిగారి ప్రియతమ శిష్యురాలు వరలక్ష్మి గారు 27-2-2010 న చీరాల వార్షికోత్సవంలో " ఈ రోజు పన్నెండు గంటలకు చీరాల జలప్రళయంతో తుడిచిపెట్టుకు పోవాల్సింది. ఇక్కడ శ్రీనివాస్ గారు మీ చేత ఈ అఖండ ధ్యానాలు చేయించడం వల్ల మీరే మీ పట్టణాన్ని కాపాడుకున్నారు " అని చెప్పారు.

ఇదేరోజున సాయంత్రం వార్షికోత్సవాల సభలో కేశవరాజు గారు ఈ విషయాలన్నీ చెప్పారు. వెంటనే వ్యాపారస్థులు వేమా ఆదిశేషు గారు స్పందిస్తూ సభాముఖంగా 80X80 పిరమిడ్‌కి స్థలాన్ని విరాళంగా ఇచ్చారు.

" అందరూ పిరమిడ్స్ కట్టించాలి " అన్న పత్రీజీ ఆదేశం ఓ సందేశంగా, ఒక అవసరంగా తీసుకుని అందరి చేత కట్టించాలి అని తపన పడుతున్నాను. మా ఇంట్లో మహాద్భుతంగా మాస్టర్స్ సందేశాలు ఇవ్వడం, చీరాలలో అత్యద్భుతంగా 80X80 పిరమిడ్‌కి అంకురార్పణ జరగడం అనేది ధ్యానశక్తిని చాటి చెబుతోంది. భాష లేదు వ్రాయడానికి. ఈ ఆనందాన్ని వ్యక్తపరాచడానికి మాట దొరకడం లేదు చెప్పడానికి.

 

ఘంటా హనిత
విఠల్‌నగర్, చీరాల

Go to top