" నూతన యుగానికి ఆరంభం "

 

స్టుడియో-N : "నమస్కారం పత్రిగారూ! ‘2012 యుగాంతం’ గురించి వివిధ దేశాల్లో పత్రికల ద్వారా, మీడియా ద్వారా రకరకాల కథనాలు వినపడుతున్నాయి. దీనివల్ల ప్రజల్లో కూడా ఎన్నో భయాందోళనలు కలుగుతున్నాయి. మరి దీని గురించి మీ వివరణ ఏమిటి?"

బ్రహ్మర్షి పత్రీజీ : " అసలు మనం ఈ ‘యుగాంతం’ అనే పదాన్ని గురించి ముందు తెలుసుకుందాం. ఒకటి చెప్పండి మీరు.. ఒక శిశువు పుట్టినప్పుడు తాను ఇప్పుడు ఉన్న శైశవదశ నుంచి క్రమంగా ఎదుగుతూ ఎదుగుతూ బాల్యదశకూ, ప్రౌఢదశకూ మరి అదే విధంగా వృద్ధదశకూ చేరుకుంటుందా లేదా? మరి అలా ఆ క్రమంలో ఒక దశ నుంచి ఇంకోదశకు వెళ్ళడానికి ఏమైనా ఒక ‘నిర్ణీత తేది’ కానీ, ‘సమయం’ కానీ ‘నిశ్చయం’ చేసుకుంటుందా? ఇది పరిణామక్రమంలో భాగంగా a regular on-going process మాత్రమే. అలాగే భూమి కూడా నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది. ఇప్పుడు అది తన బాల్యదశను దాటి యౌవనదశలోకి అడుగిడుతోంది. దీనికొక ఖచ్చితమైన తేదీ ఏదీ నిర్ణయించబడలేదు. ఇలా మెల్లమెల్లగా జరిగే ఈ పరిణామక్రమంలో భూమిపై ఉన్న వాళ్ళంతా కూడ ఒకానొక మానసికస్థాయి నుంచి దూరమయి వేరొక మానసిక స్థాయికి ఎదుగుతారు. దీనికి మనం సంతోషించాల్సింది పోయి ‘యుగాంతం’ అనే పదం వాడటం శుద్ధ తప్పు."

స్టుడియో-N : "అంటే 2012 లో అనేక ఉత్పాతాలూ, రక్తపాతాలూ అవీ జరుగుతాయని కథనాలు వస్తున్నాయి కదా.."

బ్రహ్మర్షి పత్రీజీ : "అదే మరి నేను చెప్తున్నాను! అవి ఎప్పుడు లేవు చెప్పండి?| ఇప్పుడు మాత్రం ఉత్పాతాలూ, రక్తపాతాలూ లేవా? అయితే భూమి ఇప్పుడు ఒక అత్యున్నతమైన శక్తిక్షేత్రంలోనికి వెళ్తోంది! ప్రతి 13,000 సంవత్సరాలకొకసారి భూమి ఒక ఫోటాన్ బ్యాండ్ ఎనర్జీలో ప్రవేశిస్తూ ఉంటుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్లు, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్లు సూర్యుడు కూడా తన సౌరకుటుంబంతో "Alcyone" అనే ఒక "invisible నక్షత్రం" చుట్టూ పరిభ్రమిస్తున్నాడు. అలా ఒక భ్రమణం చేయడం అన్నది 26,000 సంవత్సరాలు పడుతుంది. అలాగే "Alcyone" కూడా తన కుటుంబంతో పాటు "గెలాక్టిక్ సెంటర్" చుట్టూ తిరగడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు అంతా ఒక అత్యున్నత శక్తిక్షేత్రంలోనికి ప్రవేశిస్తూ ఉన్నది. ఈ "Alcyone" అనే నక్షత్రం పాలపుంత యొక్క ప్రధాన కక్ష్యమీద ఫిక్స్ అయి ఉంది. ఇదంతా భూమ్మీద వున్న భౌతిక పదార్థ శాస్రజ్ఞులకు తెలియదు."

స్టుడియో-N : "అయితే అప్పుడు భూమి మీద ఇప్పుడున్న వేడి కంటే కూడా ఎక్కువ వేడి రావడానికి అవకాశం ఉందా?"

బ్రహ్మర్షి పత్రీజీ : " ‘వేడి’ కాదు! అది ‘ఎనర్జీ’. అంటే ‘శక్తి’. అది నిరంతరంగా ఎక్కువవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రాథమికంగా ఎనర్జీ శాతం ఎక్కువవుతూ ఉంటుందో అప్పుడు మనం ఏ పనిచేసినా ఇంకా దానికి ఆ ఎనర్జీ తోడయి ఆ పని ఇంకా వేగవంతంగా జరుగుతుంది. అది ‘పాజిటివ్’ కానీండి మరి ‘నెగెటివ్’ కానీండి. ఇదివరకు వంద సం||రాల్లో మెల్లమెల్లగా జరిగిన మార్పు, ఇప్పుడు దాదాపు పది సం||ల్లోనే అతివేగవంతంగా జరిగిపోతోంది కదా. దాని ఫలితాలు కూడా మనకు ఇంకా వేగంగా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇలా భూమిపై వేగంగా పెరుగుతోన్న శక్తిస్థాయి డిసెంబర్ 21, 2012 కల్లా తారాస్థాయికి చేరబోతోంది"

స్టూడియో-N : "అలా చేరినప్పుడు ఉత్పాతాలు లాంటి వేమైనా"..

బ్రహ్మర్షి పత్రీజీ : "అసలు అలాంటివేమీ ఉండవు! 2012 డిసెంబర్ 21 తేదీ కూడా ఆ తరువాత వచ్చే డిసెంబర్ 22వ తేదీ లాగా చాలా కూల్‌గా, కామ్‌గా అతి సాధారణంగా గడిచిపోతుంది. విశ్వప్రణాళికలో ప్రతి ఒక్కటీ ‘ఇది ఇలాగే జరగాలీ’ అనే ఖచ్చితమైన నియమావళి ఏమీ ఉండదు."

స్టూడియో-N : " మరి భూకంపాలు, సునామీలు వస్తాయనీ, మంచుకురిగి సముద్రమట్టాలు పెరుగుతాయనీ.."

బ్రహ్మర్షి పత్రీజీ : "ఇవన్నీ జరుగుతాయనీ, లేదా జరుగవనీ కూడా ఏమీ చెప్పలేం. అయితే అది మనం ఇప్పుడేం చేస్తూన్నామో అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనందరి యొక్క వర్తమాన మనోభావాలూ, ఆహారాలూ, వ్యవహారాల మీద అది ఆధారపడి ఉంటుంది."

స్టూడియో-N : "మరి నోస్ట్రడామన్, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు ఇంచుమించు అదే టైమ్ కల్లా ఉత్పాతాలు జరుగుతాయనీ, భారీగా జననష్టం జరుగుతుందనీ వ్రాసారు."

బ్రహ్మర్షి పత్రీజీ : ‘ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆత్మజ్ఞాని నోస్ట్రడామస్ సుమారు 500 సం|| క్రితం భవిష్యద్దర్శనం చేసి అది రాసారు. మరి ఇప్పుడు అది అలాగే జరగాలని శాస్త్రమేమి లేదు. కొన్ని మార్పులూ చేర్పులూ జరగొచ్చు లేదా ఇంకెలాగన్నా జరగొచ్చు అంతేకానీ ఖచ్చితంగా ఫలానా కట్టడం కూలుతుంది, ఫలానా ప్రదేశంలో ఏదో జరుగుతుంది అనే ఊహాగానాలన్నీ ఒట్టి పిచ్చిచేష్టలు! భవిష్యత్తు ఎప్పుడైనా బంగారుమయంగా ఉంటుంది! మీ బాల్యం కంటే ఇప్పుడు యౌవ్వనం ఇంకా బాగుందా లేదా? అలాగే భవిష్యత్తు కూడా ఇంకా ఎంతో బావుంటుంది!!

"సరే, ఒకవేళ అందరు చచ్చిపోతారంటున్నారు కదా. చచ్చిపోతే ఏమవుతుందిట??? ఇంతకంటే అందమైన లోకాలు ఇంకా చాలా ఉన్నాయి.. హాయిగా వెళ్ళి అక్కడ ఉండవచ్చు! "హతో వా ప్రాప్యసి స్వర్గం" అన్నారు కదా శ్రీకృష్ణపరమాత్ములవారు! ఇలా ఈ 2012 లు ఇంకో రెండువేలు రానీండి. నో ప్రాబ్లమ్! కనుక ఇలాంటివన్నీ తట్టుకోవాలంటే మరి ముందునుంచే ధ్యానం చేయాలి. ఎందుకంటే ఇదొక్కటే మనల్ని అన్నింటికీ సంతోషింపచేస్తూ ద్వంద్వాతీత స్థితిలో, ఉంచి జీవితాన్ని ఒక సుందరకాండలా మార్చేస్తుంది."

స్టుడియో-N : " అయితే ‘ధ్యానం’ ద్వారా వచ్చే శక్తితో ‘ఇవన్నీ తట్టుకోవచ్చు’ అంటారు."

బ్రహ్మర్షి పత్రీజీ : "తట్టుకోవటమేంటీ .. ఏకంగా ఆడుకోవచ్చు! అందుకే దీని గురించి వాల్మీకీ చెప్పాడు; వ్యాసుడు చెప్పాడూ; బుద్ధుడు చెప్పాడు.. మరి గొప్పవాళ్ళందరు చెప్పారు. మనమే మర్చిపోయాం. ఇక ఈ పరిణామక్రమంలో భాగంగా ఇప్పుడది తప్పనిసరై కూర్చుంది. కనుక పనికిమాలిన ఆలోచనలు నివారించడం, జంతువుల పాలిటి ఉత్పాతాలైన మాంసభక్షణను నిలిపివేయడం ఇప్పుడు చాలా అవసరం. జంతువులకు మనం ఉత్పాతాలు కలుగజేస్తూ ఉంటే ప్రకృతి మనకు ఉత్పాతాలను కలుగజేస్తూ ఉంటుంది. సృష్టిలో మనకో న్యాయం, ప్రకృతికో న్యాయం కాదు కదా.. మరి ఇలా ఇటువంటి నిర్మాణాత్మకమైన ఆలోచనలు రావాలంటే ధ్యానం చేయాలి. నోస్ట్రడామస్, వీరబ్రహ్మేంద్రస్వాములు చెప్పిన భవిష్యద్దర్శనాలను పదే పదే ఉటంకించడం కంటే వారి లాగా ధ్యానం చేయడం చాలా,చాలామంచిది! ధ్యానస్థితిలో లేకపోతే భూమి మెల్లమెల్లగా హయ్యర్ ఎనర్జీ జోన్‌లోనికి వెళ్ళిపోతోంది కనుక ఆ 100%ఎనర్జీని తట్టుకోవడానికి ఎంతో గొప్ప గొప్ప వాళ్ళమనుకునే వాళ్ళు కూడా బెంబేలెత్తిపోతారు."

స్టూడియో-N : " మరి ధ్యానం చేయని వారి పరిస్థితీ.. మాంసభక్షణ చేసే వారి పరిస్థితీ ఏంటీ?"

బ్రహ్మర్షి పత్రీజీ : "ఏముందీ ఇంక .. త్రుంచివేయబడతారు. ఇందులో సందేహమేమీ లేదు. చక్కగా ప్రకృతి సిద్ధాంతాలను అర్థం చేసుకుని జీవిస్తే ఏమీ కాదు. అందుకే నేను అన్నీ వదిలేసి ఈ మార్గంలోకి వచ్చాను. ఈ రోజు లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఈ పనిలోనే ఉన్నారు."

స్టుడియో-N : "చాలామంది ‘ధ్యానం కుదరటం లేదు’ అంటూంటారు కదా మరి రకరకాల ధ్యానపద్ధతుల్లో ఏది మంచిది అంటారు?"

బ్రహ్మర్షి పత్రీజీ : "రకరకాల ధ్యానపద్ధతులు రకరకాల ఫలితాలనిస్తాయి. ఒక్క బుద్ధప్రబోధిత ఆనాపానసతి అన్నదే 100% అత్యుత్తమమైంది. కాబట్టి అది మాత్రమే సరియైనది. హాయిగా కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. సినిమాలు, టీవీలు కదలకుండా గంటలు గంటలు చూస్తారు. మరి ధ్యానమెందుకు చేయరట?? మనకేది ముఖ్యమో అది తప్పక చేయాలి. అనగ అనగ రాగమతిశయించినట్లు చేయగ చేయగా ధ్యానం చక్కగా కుదురుతుంది. ఒక రాముడు, ఒక కృష్ణుడు చిన్నపిల్లవాళ్ళలా ఉన్నప్పటినుంచే వాళ్ళ గురువుల వద్ద ధ్యానం నేర్చుకున్నారా లేదా? అలాగే పుట్టిన ప్రతి పిల్లవాడు కూడా చిన్నతనం నుంచే ధ్యానాభ్యాసం ప్రారంభించాలి. పెరిగి పెద్దయేసరికి వాళ్ళు చక్కటి ఆత్మస్థితిలో స్థితప్రజ్ఞులుగా వెలుగొందుతారు. ఇటువంటి ఆత్మజ్ఞానికి అసలు ఉపద్రవాలనేవి ఉండవు."

స్టూడియో-N : "చాలా మంది యోగులు ‘కుండలినీ’ అనీ, ‘చక్రాలు’ అనీ అంటూంటారు కదా .. మరి మీరేమంటారు?"

బ్రహ్మర్షి పత్రీజీ : "నేను అనను.. నా అనుభవం చెప్తారు. ఎందుకంటే సరియైన ధ్యానం చేస్తే.. ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి. మనం అంటే కంటికి కనబడే ఈ ఒక్క శరీరమే కాదనీ.. ఏడు శరీరాల సముదాయమనీ.. తెలుస్తాయి. అదే పిరమిడ్‌లో కూర్చుని ధ్యానం చేస్తే ఇంకా మూడింతలు ఎక్కువశక్తిని పొందుతాము. సూక్ష్మశరీరయానాల ద్వారా శారీరకస్థితి నుంచి బయటబడి ఆత్మసాక్షాత్కారం కూడా పొందుతాము."

స్టూడియో-N : "మీరు మొదలుపెట్టిన ఈ ధ్యాన ఉద్యమం వల్ల అందరూ ధ్యానం చేస్తే రాబోయే యుగం ఎలా ఉంటుంది?"

బ్రహ్మర్షి పత్రీజీ : " అద్భుతంగా ఉంటుంది! కోటానుకోట్ల మంది ధ్యానం చేసి శక్తిస్వరూపాల్లా, ఆత్మాస్వరూపాల్లా రూపొంది ప్రపంచమంతా ‘ధ్యానజగత్’ గా మారి పరిపక్వ స్థితప్రజ్ఞాన బ్రహ్మనందంతో అలరారుతూ ఉంటుంది! ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాయి. అయితే ఒక్క పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మాత్రమే ధ్యానంతో బాటుగా శాకాహారానికి కూడా చాలా ప్రాముఖ్యాన్నిస్తూ విశేషమైన కృషి చేస్తోంది! కాబట్టి ఇది 100% చక్కటి ఫలితాలను ఇస్తోంది. భయపడాల్సిన పనేం లేదు. కొత్తశక్తితో ఉరకలేసే రాబోయే అద్భుత నూతనయుగానికి ఇది ఆరంభం మాత్రమే. ఇక్కడ ఏం జరిగినా అది రూపాంతరమే కాబట్టి మనందరం దానిని అహ్వానించాలి"

స్టుడియో-N : చాల సంతోషం సార్! మా అందరి మనస్సుల్లో ఉన్న ఎన్నెన్నో సందేహాలకు చక్కటి వివరణలిచ్చారు. థ్యాంక్యూ!"

Go to top