" మెల్‍బోర్న్ నుంచి వచ్చాను సార్ "

 

నా పేరు సరోజ గుల్లపల్లి. నేను మెల్‌బోర్న్‌లో గత 13 సంవత్సరాలుగా వుంటున్నాను. నా కుటుంబంలో నేనూ, మా ఆయన హరీష్, మా ఇద్దరు పిల్లలు .. అబ్బాయి నిఖిల్ ... మరి మా అమ్మాయి నవ్య.

వృత్తిరీత్యా నేను ఇంజనీర్‌ని. ఇండియాలో M.Tech చేసి ఇక్కడికి వచ్చాను. మెల్‌బోర్న్‌లో "ఎక్సన్-మొబైల్" అనే ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్‌ప్లొరేషన్ కంపెనీలో ప్రోజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. "ఎక్సన్ - మొబైల్" అన్నది ప్రపంచంలోనే నంబర్ వన్ ప్రైవేట్ కంపెని. అన్ని అంతర్జాతీయ ప్రైవేట్ కంపెనీలలాగానే ఇక్కడ చాలా కాంపిటీటివ్ గానే వుంటుంది ఎన్విరాన్‌మెంట్. నలుగురు మనుషుల పని ఒక్కరితోనే చేయిస్తారు. కనుక వర్క్ లోడ్ ఎప్పుడూ పీక్‌లోనే వుంటుంది. నాది చిన్నప్పటి నుంచి చాలా కాంపెటీటివ్ పర్సనాలిటీ కావడంతో బాగా కష్టపడేదాన్ని వర్క్‌లో ... మంచి పేరు తెచ్చుకోవాలని. పని బాగా చేస్తున్నానని, నాకు ఒకదాని తర్వాత ఒకటి ఛాలెంజింగ్‌గా ఎసైన్‌మెంట్స్ ఇచ్చేవారు. నేను కూడా చాలా కష్టపడి చేసే రకం.

పిల్లలు మెల్‌బోర్న్ లోనే పుట్టారు. ఆఫీస్ పనితో, ఇంట్లో చిన్నపిల్లలతో జీవితం చాలా బిజీ. అలా లైఫ్ సాగుతూన్న రోజుల్లో, ఒక గమ్మత్తైన మలుపు వచ్చింది. 2003 లో నన్ను ఒక ప్రోజెక్ట్‌కి ప్రోజెక్ట్ మేనేజర్‌గా వేసారు. చాలా కష్టమైన ప్రోజెక్ట్. కష్టపడి పనిచేసేదాన్ని. రోజుకి సుమారు పదమూడు గంటలు పనిచేసేదాన్ని. ఆ టైమ్‌లో పై బాస్‌తో భేదాభిప్రాయాలు రావటం మొదలయ్యాయి. నేను ఎంత కష్టపడి పనిచేసినా ఎప్పుడూ అక్కడి నుంచి ఏ పాజిటివ్ ప్రోత్సాహమూ వచ్చేది కాదు.

మొత్తానికి ఏదైతేనేం అక్టోబర్ 2003 నాటికి నా పరిస్థితి ఏమిటంటే, నాకు ఆఫీస్ వాతావరణం చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించేది. అక్టోబర్ మొదటి వారంలో ఆఫీస్ పని మీద అమెరికా వెళ్ళి వెనక్కి వచ్చాక ఆఫీస్‌లో ఇక కూర్చోలేకపోయా. ఇంక అక్కడ వుండాలనిపించలేదు. వెంటనే సెలవు పెట్టి ఇంటికి వచ్చేసా. ఇంట్లో కూడా ఎవ్వరితో మాట్లాడేదాన్ని కాదు. ఏమీ చేయాలనిపించేది కాదు. నన్ను ఈ పరిస్థితిలో చూసి నా భర్త, పిల్లలు చాలా వర్రీగా వుండేవారు. ఆ పరిస్థితిలో వున్నప్పుడు ఓ రోజు వాకింగ్‌కి వెళ్తే మనస్సు కాస్త బావుంటుందని వాకింగ్‌కి బయలుదేరాను. ఎటు వెళ్తున్నానో కూడా తెలీదు. కొంతసేపయ్యాక ఎదురుగా మాకు తెలిసిన తెలుగావిడ "ఝాన్సీ మేడమ్" గారు వస్తూ కనిపించారు. ఆవిడ నన్ను ఆపి, వాళ్ళింటికి పిలిచింది. ఆవిడ అక్కడికి దగ్గరలోనే వుంటున్నారు. ఏమీ ప్రశ్నించక ఆవిడ వెంట వెళ్ళాను.

ఇంటికి వెళ్ళాక ఆవిడ నన్ను ధ్యానం చెయ్యమని అడిగింది. ఇంతకుముందు ఏడాది క్రితం ఎవరింట్లోనో కలిసినప్పుడు ఆవిడ ధ్యానం గురించి చెబుతూంటే విన్నాను. కానీ ఎప్పుడూ చెయ్యలేదు. ఇంక ఆ రోజు ఏమీ మాట్లాడకుండా ఆవిడ చెప్పినట్లు క్రింద కూర్చున్నాను. చేతులు రెండూ దగ్గర పెట్టుకున్నాను. శ్వాస మీద ధ్యాస పెట్టాను. తర్వాత సంగతి నాకు తెలియదు. మళ్ళీ నేను కళ్ళు తెరిచేటప్పుటికి ఆవిడ నాకు ఎదురుగా కూర్చుని వున్నారు. టైమ్ చూసుకుంటే గంటన్నర మెడిటేషన్ చేసానని తెలిసింది. మనస్సు ఎంతో హాయిగా వుంది. అప్పటిదాకా వున్న బాధలేవి లేవు నా మనస్సులో. పిల్లల్ని స్కూల్ నుంచి పికప్ చేసుకునే టైమ్ అయిందని 'ఆంటీ' దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాను. పిల్లల స్కూల్ వైపు నడుస్తూ వుంటే మొత్తం గాలిలో తేలిపోతున్న అనుభూతి. మరుసటిరోజు పిల్లల్ని స్కూల్‌కి పంపి, మళ్ళీ తిన్నగా 'ఆంటీ' దగ్గరికి వెళ్ళి ఆవిడతో పాటు మెడిటేషన్ చేసాను. అప్పుడు ఆంటీ నాకు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ గురించి, బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ గురించి చెప్పారు; నాకు పత్రి గారి కొన్ని క్యాసెట్స్, బుక్స్ ఇచ్చారు.

ఇంటికి వచ్చి నేను విన్న ఫస్ట్ క్యాసెట్ "ముక్తిమార్గం"; తర్వాత "ఆత్మవిజ్ఞానం". అవి నా జీవితం మీద చెరగని ముద్రవేసాయి. ఆ క్యాసెట్స్ నేను ఎన్ని వేలసార్లు విన్నానో చెప్పలేను. ఆ రోజే లైబ్రెరీకి వెళ్ళి పరమహంస యోగానంద వ్రాసిన "ఒక యోగి ఆత్మకథ" పుస్తకం తెచ్చి చదివాను. నా ప్రపంచమే మారిపోయింది. ఆంటీతో కలిసి మెడిటేషన్ చెయ్యటం, లైబ్రెరీకి వెళ్ళి పత్రిగారు చెప్పిన బుక్స్ తెచ్చుకోవడం, చదవడం, లైబ్రెరీ నుంచి రిఛార్డ్ బాక్ గారి, జొనాథన్ లివింగ్‌స్టన్ సీగల్ బుక్ తెచ్చి చదివినప్పుదు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో వర్ణించలేను. ఇంతకుముందు కూడా నేను రెగ్యులర్‌గా లైబ్రెరీకి వెళ్ళేదాన్ని. నాకు పుస్తకాల పిచ్చి వుండేది. కాకపోతే అప్పుడు నేను చదివే పుస్తకాల ఫ్రిక్షన్ బుక్స్, కానీ, ఇప్పుడు గమ్యం ఒక్కటే. అయినా, నా అన్వేషణ వేరు. లైబ్రెరీకి వెళ్ళి నేను స్పిరిచ్యువల్ బుక్స్ కోసమే చూసేదాన్ని. మంచి మంచి ఓషో పుస్తకాల చదివాను.

పిల్లలు సెలవులు వచ్చాయి. నాకు కొంచెం మార్పు ఉంటుందని నా భర్త సెలవులకి బ్రిస్బేన్ తీసుకువెళ్ళారు. మేము తీసుకున్న హాలిడే హోమ్ బీచ్‌కి దగ్గరగా వుండేది. అక్కడికి వెళ్ళినా నా రోటీన్‌లో ఎటువంటి మార్పూ లేదు. మెడిటేషన్, పుస్తకాలు .. నా దినచర్యలో ఒక ముఖ్యమైన భాగం. రోజూ బీచ్‌లో కూర్చుని గంటలకొద్దీ మెడిటేషన్ చేసేదాన్ని. అప్పుడు నాకు కలిగిన అనుభవాలను మరచిపోలేను. ఒకసారి మెడిటేషన్ చేస్తూ ఉంటే నేను స్పేస్‌లో ఉన్నట్లు అనుభూతి, చుట్టూ మిలమిలా మెరుస్తున్న నక్షత్రాలు, మధ్యన నేను. నేను పెట్టిన రెండు నెలలు సెలవు అయిపోయింది. మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసాను. నా భర్త చాలా వర్రీ అయ్యారు ..."ఎలా కుదుటపడతానో వర్క్‌లో" అని. కానీ లైఫ్ చాలా స్మూత్‌గా సాగిపోయింది. వర్క్‌కు వెళ్ళటం, ఇంటపని చేసుకోవటం, మెడిటేషన్ చేసుకోవటం, మంచి స్పిరిచ్యువల్ బుక్స్ చదవటం. చదువుతున్న కొద్దీ ఇంకా పుస్తకాలు చదవాలనే నా తాపత్రయం. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత, ఆంటీతో అప్పుడప్పుడు కలవడమే వీలయ్యేది. అయినా ఫోన్ ద్వారా ఎప్పుడూ టచ్‌లో వుండేదాన్ని. అలా ఒక సంవత్సరం గడిచింది.

ఆఫీస్‌లో మెడిటేషన్ నేర్పడం మొదలుపెట్టాను. నాలో వచ్చిన మార్పు చూసి, మా ఆయన మెడిటేషన్ చేయటం మొదలుపెట్టారు. మా పిల్లలు కూడా వీలైనప్పుడు మెడిటేషన్ చేయడం మొదలుపెట్టారు. ఆంటీని కలిసినప్పుడు ఒకసారి చెప్పారు ఆవిడ ఇండియా వెళ్తున్నారని, 2004 డిసెంబర్‌లో హైదరాబాద్‌లో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ వారి ధ్యాన యజ్ఞం అవుతుందని. వీలైతే నన్ను తప్పకుండా వెళ్ళమన్నారు. అప్పటి నుంచి నాకు రోజూ ఒకటే ఆలోచన. "నేను ధ్యాన యజ్ఞం అటెండ్ అవ్వాలి" అని. నాకు ఎలాగూ ఆ టైమ్‌కు ఇండియా వెళ్ళే ప్రోగ్రామ్ వుంది. ధ్యాన యజ్ఞం డేట్‌కు ఇండియాలో వుండేటట్లు ఫ్లైట్ బుక్ చేసుకున్నాను.

హైదరాబాద్ డిసెంబర్ ధ్యానయజ్ఞంకు వెళ్ళిన మొదటిరోజు చాలా ఆశ్చర్యం, హ్యాపీ అనిపించింది. హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో వేలమంది కూర్చుని ధ్యానం చేస్తున్నారు. నేను ఎక్కడో చివరి వరుసలో కూర్చున్నాను. క్యాసెట్‌లో విన్న పత్రి గారి గొంతు, క్యాసెట్ విన్న ఆయన ఫ్లూట్ ఆరోజు ప్రత్యక్షంగా వినటం జరిగింది. నేను పత్రి గారిని ఇంతకుముందు ఎప్పుడూ కలవలేదు. పుస్తకాలు, ఆయన ఫోటో చూసానంతే. నేను ధ్యాన యజ్ఞం మూడురోజులు అటెండ్ అయ్యాను. మూడవరోజు నాకు వైజాగ్ వెళ్ళే ఫ్లైట్. ఆ రోజు ధ్యాన యజ్ఞం నుంచి వస్తూంటే ఎందుకో చాలా గట్టిగా అనిపించింది. ఒకసారి పత్రి గారిని దగ్గరగా చూడాలని.

పత్రిగారు చుట్టూ అంతమంది. దగ్గరకు వెళ్ళటం ఎలా? వెయిట్ చేసాను. నేను ఆయన దగ్గరికి వెళ్ళానో, ఆయనే నా దగ్గరకు వచ్చారో నాకు తెలియదు. నేను ఆయన ముందు నిలబడి వున్నాను. నా గురించి చెప్పాను. "మెల్‌బోర్న్ నుంచి వచ్చాను సార్. నాకు హ్యాపీగా వుంది ఈ రోజు ఇక్కడ వున్నందుకు" అంతే ... పత్రిగారు నా చెయ్యి పట్టుకుని తీసుకునివెళ్ళి అక్కడ వున్న కుర్చీలో కూర్చోబెట్టారు. పత్రిగారు నా ప్రక్కన వున్న కుర్చీలో కూర్చున్నారు. నా చుట్టూ మనుషులు. అందరూ ఎంతో అభిమానంగా చూస్తూ కనిపించారు. నా కళ్ళ నుంచి ఆనందభాష్పాలు ... మాస్టర్‌ని కలవగలిగానని. పత్రిసార్ నాకు ఎన్నో మంచి పుస్తకాలిచ్చి మనిషిని, కార్‌ను ఇచ్చి నన్ను ఇంటికి సాగనంపారు.

తర్వాత ఎన్నోరోజులు ఇదే తలచుకుంటూ గడిపేదాన్ని. నేను, మా ఆయన ఇద్దరం ఇంజనీర్లం. మెల్‌బోర్న్‌లో మేము ఫైనాన్షియల్‌గా బాగా సెటిల్ అయినా ఇన్నాళ్ళూ నా మనస్సులో ఎప్పుడు ఏదో వెలితిగా వుండేది. "లైఫ్‌లో అన్నీ వున్నాయి... అయితే ఎందుకు ఈ వెలితి?" అనిపించేది. అయితే మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా సెటిల్డ్‌గా, పీస్‌ఫుల్‌గా అనిపిస్తోంది. ఇప్పుడు పత్రిగారు మెల్‌బోర్న్‌కే రావడం, మా ఇంట్లోనే ధ్యానం క్లాస్ జరగడం... ఇంతకన్నా భాగ్యం వుందా?.

2003 సంవత్సరంలో నా లైఫ్‌లో వచ్చిన క్రైసిస్ ఇంత మంచి దారికి, ఇంత మంచి లైఫ్‌కు కారణమవుతుందని ఆ రోజు నేను అనుకోలేదు. ఇప్పుడు ఒకటే తపన నన్ను నేను ఇంకా తెలుసుకోవాలని. నాకు దారి కూడా తెలుసు. "శ్వాస మీద ధ్యాస".

 

G. సరోజ
మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా

Go to top