" ధర్మచక్రంలో పత్రీజీ "

 

నా పేరు భారతి. నేను, మా ఫ్యామిలి తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో నివసిస్తున్నాం. నేను పరమహంస యోగానంద పుస్తకం "ఒక యోగి ఆత్మకథ" చదివాను. ఆ పుస్తకం ద్వారా ధ్యానం నేర్చుకోవాలన్న తపన పెరిగింది. అంతకుముందు "బ్రహ్మకుమారి సంస్థ" యొక్క పుస్తకాల ద్వారా "నేను 'ఆత్మ'ను" అని తెలుసుకున్నాను. కానీ స్వంత అనుభవంలేదు.

తిరుపతి స్పిరిచ్యువల్ సొసైటీ మాస్టర్ శ్రీనాథ్, రజనీ మేడమ్ ద్వారా ధ్యాన పరిచయం జరిగింది. వాళ్ళు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ పుస్తకాలు కొన్ని సేలంకు పంపించారు. సేలం పిరమిడ్ మాస్టర్ శంకర్‌లాల్ వాళ్ళ ఫ్యామిలీ ధ్యానంలో నాకు ఎంతో సహాయాన్ని అందించారు. అప్పటినుంచి నా ధ్యాన సాధన తీవ్రతరం అయింది. ధ్యానంలో రావడానికి ముందు నేను పూర్తిగా అనారోగ్యంగా వున్నాను. ధ్యానం చేయడం ప్రారంభించినప్పటి నుంచి సంపూర్ణ ఆరోగ్యం పొందాను.

జనవరి 2006 లో ఆటో నుంచి దిగుతూండగా క్రింద పడ్డాను. నా తలకు దెబ్బ తగిలింది. డాక్టర్ దగ్గరకు వెళ్తే న్యూరో సర్జరీ చేయాలన్నారు. నా భర్త బలవంతం మీద మందులు తెచ్చుకున్నా... వాటిని వాడలేదు. నాకు మాత్రం ధ్యానంలోనే తగ్గుతుందని నమ్మకం వుంది. ప్రతిరోజూ నాలుగు గంటలు ధ్యానం చేసాను. ఒకరోజు ధ్యానంలో నాకు తల భాగంలో కందిపప్పు గింజ సైజులో ఎరుపుగా మచ్చ కనిపించి .. అది ఎవరో బయటకు తీసేసినట్లుగా ... అనిపించింది. అప్పటినుంచి నేను చాలా ఆరోగ్యంగా, ఆనందంగా వున్నాను.

ధ్యానంలో నా మొదటి అనుభవం భారతదేశ జాతీయ పతాకం మీద ఉన్న ధర్మ చక్రంలో పత్రీజీ కనిపించారు. తర్వాత ఒకరోజు ధ్యానంలో హిందూ, ముస్లిం, క్రైస్ట్ యొక్క సింబల్స్ ఒక పతాకంపై కనిపిస్తూ మధ్యలో పత్రీజీ కనిపించారు. దానిని చూసి "మతాలన్నీ వేరు అయినా మనుష్యులంతా ఒక్కటే" అనిపించింది. నేను సేలంలోని స్కూల్స్, అనాథ ఆశ్రమాలు, కోర్ట్, మరి పండ్ల వ్యాపారం చేసుకునే వాళ్ళతో సహ ఎవరు కనిపించినా ధ్యానం నేర్పిస్తున్నాను. ప్రతిరోజూ కనీసం ఇద్దరు, ముగ్గురుకైనా ధ్యానం చెప్పకపోతే ఎంతో అసంతృప్తిగా వుంటోంది అందరికీ ధ్యానం గురించి నేర్పిస్తూ తెలియనిది తెలుసుకుంటూ, తెలిసింది అందరికీ చెబుతూ పత్రీజీ అడుగుజాడల్లో నడుస్తూ వర్తమాన జన్మ ఆఖరు జన్మ చేసుకోవాలనుకుంటున్నాను.

 

భారతి
సేలం

Go to top