" నాకు హిస్నోఫీలియా ఎలర్జీ తగ్గిపోయింది "

 

 

నా పేరు రవీంద్ర. నన్ను 'రవి' అని పిలుస్తారు. ఇన్‌ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఆస్ట్రేలియా బ్రాంచ్‌‍లో సీనియర్ క్యాడ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. జూలై 2005 నుంచి ఆస్ట్రేలియాలో వుంటున్నాను.

1996 లో ఆంధ్రజ్యోతి వీక్లీ మ్యాగజైన్‌లో "ఆహారం - ఆలోచన" గురించిన ఆర్టికల్‌లో శాకాహారం మంచి ఆలోచనలను కలిగిస్తుందని చదివాను. అప్పటినుంచి శాకాహారమే తీసుకుంటున్నాను. 1996 లో తమిళనాడులో పనిచేసేవాడిని. అక్కడ నాతో పాటు పనిచేసిన సీనియర్ ఇంజనీర్ నేను ఒక రూమ్‌లో వుండేవాళ్ళం. ఆ ఇంజనీర్ .. శ్రీ హర్షవర్ధన్‌రెడ్డి గారు రోజూ ఉదయాన్నే కళ్ళు మూసుకుని కూర్చునేవాడు.

ఒకరోజు "నాకు కూడా నేర్పించండి" అని అడిగితే "గురువు ద్వారా నేర్చుకోవాలి. అంతేకానీ నేను చెప్పకూడదు" అన్నారు. ఎలాగైనా తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఒకరోజు ఆయన చదివే పుస్తకం తీసి చదివాను. ఆ పుస్తకం షిరిడీ సాయిబాబా గురించి ఎక్కిరాల భరద్వాజ గారు వ్రాసింది. అందులో "షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం" అన్న బాబా మాటను ఆచరించి తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో రెండుసార్లు షిరిడీ వెళ్ళాను.

1999 లో సిద్ధ సమాధి యోగా చేశాను. SSY ద్వారా దానికి సంబంధించిన పదజాలం అంతా తెలుసుకున్నాను. SSY దాని తర్వాత ఫేజ్‌లు చేయడం ద్వారా మనసా వాచా కర్మణా కుండబ్రద్దలుకొట్టి మాట్లాడడం నేర్చుకున్నాను. నేను హైదరాబాద్‌లో వున్నప్పుడు ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవడమే పనిగా వుండేది. నా చుట్టూ వుండేవాళ్ళకన్నా మరిన్ని ఎక్కువ రంగాలలో నాకు పరిచయం వుండేది. క్రొత్త మిత్రులు, క్రొత్త అనుభవాలు, విభిన్న వ్యక్తులు, విభిన్న రంగాలన్నింటికీ పోవడం మూలంగా నా ఆలోచనా పరిధి విస్తృతంగా పెరిగింది.

హైదరాబాద్‌లో రామకృష్ణమఠం, సుందరచైతన్యానంద, గణపతి సచ్చిదానంద, యోగదా సత్సంగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఫాలున్ గాంగ్, మాస్టర్ మా .. లాంటి చాలా చోట్లకు వెళ్ళి తెలుసుకున్నాను. అలాగే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ గురించి "D.శ్రీనివాసరావు" అనే ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను. అమీర్‌పేటలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ "G.విజయలక్ష్మి" మేడమ్ ద్వారా ఆనాపానసతి ధ్యానం నేర్చుకున్నాను.

నాకు హిస్నోఫీలియా ఎలర్జీ తగ్గిపోయింది. క్రమపద్ధతిలో ఆలోచించడం అలవాటయింది. మాట్లాడే ప్రతి పదం యొక్క అర్ధాన్ని ఫీలవుతూ, అర్ధం చేసుకుంటూ మాట్లాడడం నేర్చుకున్నాను. దానివల్ల నా ఇన్‌ట్యూషన్ బాగా బలపడుతూ వస్తున్నది. ఎన్నోసార్లు నా లోపల అకస్మాత్తుగా వచ్చే ఐడియాస్/కాన్సెప్ట్స్/ఫార్ములాస్ కి నేనే ముగ్ధుడనై పోతూంటాను. కొన్ని గంటలపాటు పదేపదే వాటిని జీర్ణించుకుంటూ గడుపుతూ వుంటాను. అలాంటి ఏదైనా అవగాహన కలిగించే విషయం నా అంతట నాకు తట్టినప్పుడు నాకు నేను చాలా ఎనర్జిటిక్‌గా ఫీలవుతూంటాను. నాలో చాలా సామర్ధ్యం వుందనిపించేది.

ఇలాంటివి నా మీద, నా భావాల మీద పూర్తి నమ్మకాన్ని పెంచాయి. అలా రోజు రోజుకీ బలపడుతూ వస్తున్నాను. ఇలా తెలుసుకున్న విషయాలను ఆచరించి చూడటం వల్ల మరింత పరిపక్వస్థితిని పొందుతున్నాను. అలా తెలిసినవి అందరికీ చెప్పడం వల్ల వాళ్ళకి సరైన దిశని చూపగలుగుతున్నాను. అలా నా చుట్టూ వున్న పరిసరాలను ప్రభావితం చేస్తున్నాను. నా చుట్టూ వున్న వాళ్ళందరూ నేను ఆ విధంగా మాట్లాడటం కోసం ఎదురుచూస్తూ వుండటం గమనించాను.

నేను మాట్లాడుతున్నప్పుడు ఆఫీస్ లోనూ బయటా ఎంతోమంది స్ఫూర్తి పొందుతూ వుండటం వాళ్ళలో నేను గమనిస్తూ వుంటాను. అలా జరుగుతున్నందుకు నా లోపల తృప్తి గానూ మనశ్శాంతి గానూ వుంటుంది. ఇదే నాలో నిరంతరం జరుగుతూ వుంటుంది. ప్రస్తుతం "పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ ఆస్ట్రేలియా మూవ్‌మెంట్" పనిలో నిమగ్నమై వున్నాను.

పదిహేనురోజులు పత్రీజీ గారితో కలిసి తిరిగే భాగ్యం ఇండియాలో దక్కలేదు నాకు ... కానీ ఇక్కడ దక్కింది. ధ్యానాంధ్రప్రదేశ్ మిత్రులందరికీ నా వందనాలు.

 

రవీంద్ర
మెల్‌బోర్న్

Go to top