" ఆరా విలువ తెలిసింది "

 

నా పేరు జయచంద్ర. వయస్సు 21 సంవత్సరాలు. తిరుపతి లో నేను ఇంజనీరింగ్ పైనల్ ఇయర్ చదువుతున్నాను. 2005 సంవత్సరం నుంచి నేను ధ్యానం చేయటం మొదలుపెట్టాను. ధ్యానం చేస్తున్నప్పటి నుంచీ ఏకాగ్రత పెరిగి, బాగా చదువుతున్నాను. ఒకరోజు శనివారం 'మహతి'కి వెళ్ళాను. అక్కడ కంచి రఘురామ్ గారు క్లాస్ చెబుతున్నారు. ధ్యానం ఎలా చెయ్యాలో చెప్పి ధ్యానం చేయించారు.

సెప్టెంబర్ 7, 2006 శ్రీ వేంకటేశ్వర ధ్యాన మందిరం మహతి సెల్లార్ బయట నేను ... సంగీతబాబు గారు ఇంకా ఇద్దరు పిరమిడ్ మాస్టర్లు కలిసి ధ్యానానుభవాలు గురించి చర్చిస్తున్నాం. అప్పుడు 40 అడుగుల ఎత్తు నుంచి పెద్ద శబ్దంతో పెద్ద పెద్ద సిమెంట్ రాళ్ళు మా చుట్టూ పడ్డాయి. కొద్ది క్షణాల వరకు నాకు ఏమీ అర్థం కాలేదు. "భూకంపం ఏమైనా వచ్చిందేమో?" అనుకున్నాను. నా ప్రక్కనే స్కూటర్ నిలిపి వుంది. స్కూటర్ అద్దంపై రాయి పడి పగిలిపోయింది. పది అడుగుల దూరం నుంచి రాయి పడితేనే తల పగిలి రక్తం వస్తుంది. అలాంటిది నలభై అడుగుల ఎత్తు నుంచి రాళ్ళు పడితే ఖచ్చితంగా తల పగిలి అక్కడే చనిపోయేవారం.

"మా చుట్టూ రాళ్ళు పడి మా పైన పడకపోవటం ఏంటి?" అనిపించింది. ఆ రోజు పౌర్ణమి. పౌర్ణమి క్లాస్ అలిపిరి పాదాల మెట్ల దగ్గర పెట్టారు. నేను "ఏ శక్తి మమ్మల్ని కాపాడింది?" అని థాట్ పెట్టి ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చున్న తర్వాత నాకొక సందేశం వచ్చింది. "మిమ్మల్ని మీ యొక్క 'ఆరా' కాపాడింది. మీ యొక్క ఆరా చాలా శక్తివంతమైనది... ఎందుకంటే మీరు ధ్యానులు కనుక. మీ యొక్క ఆరా ఎటువంటి నెగెటివ్స్‌ని మీ దగ్గరకు రానీయదు. అందువల్లే మీ తల పైకి వచ్చిన రాళ్ళు మీ పైన పడకుండా మీ యొక్క ఆరా శక్తి దానిని ప్రక్కకు తోసేసింది" అని.

నాకు ఇప్పుడు మరో జన్మలో జీవిస్తున్నట్లు వుంది. రాళ్ళు పడటం చూసినవారంతా "మీ టైమ్ బాగుంది. అందుకే బ్రతికారు" అన్నారు. నాకనిపించింది "మా టైమ్ బాగుండి బ్రతకలేదు .. మాయొక్క ధ్యానశక్తే మమ్మల్ని కాపాడింది" అని.

 

S. జయచంద్ర
తిరుపతి

Go to top