" ప్రత్యేక ఇంటర్వ్యూ ... శ్రీమతి స్వర్ణమాలా పత్రిగారితో "

 

గురుపౌర్ణమి సందర్భంగా మన గురుపత్ని ద్వారా 'పత్రిసార్' గురించి మరింత లోతుగా అధ్యయనం చేసి మాస్టర్లకు అందించాలను చేసిన ప్రయత్నమే పత్రి మేడమ్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ.

వారి సహచరిణిగా, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీకి వెన్నుముఖగా ఆ తల్లి పడిన కష్టాలు ఎన్నెన్నో, ఒక మహాయోగి జీవితంలో వారి కుటుంబాలు ఎంతో ఘర్షణకు లోనవుతాయి అనడానికి 'పత్రి మేడమ్' జీవనయాత్ర గొప్ప ఉదాహరణ. సత్యహరిశ్చంద్రుడు, శ్రీరాముడు, బుద్ధుడు ... ఇలా మహానుభావులైన వారి పత్నుల జీవితాలు కష్టాలకు పుట్టిళ్ళు అనడంలో అతిశయోక్తి లేదేమో. ఈ సాధ్వీమణిని దాదాపు నాలుగు గంటల పాటు చేసిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో ఆ మేడమ్ వదనంలోని హావభావాలను వర్ణించడానికీ, ఆమె ఫీలింగ్స్‌ను మాటల్లో వ్రాయడానికీ ఈ కలం చాలదు. వారి జీవితం ఒక సుదీర్ఘ పోరాటం. ఆమె జీవితమే ఓ దివ్యసందేశం. ఆ తల్లికి శతకోటి ప్రణామాలు.

మారం శివప్రసాద్


మారం : "ఆధ్యాత్మిక మార్గంలోకి పత్రీజీ రాకముందు వారి బిహేవియర్ ఎలా ఉండేది?"

స్వర్ణమాలా పత్రి : "బిహేవియర్ దాదాపు ఇలాగే ఉండేది. స్పిరిచ్యువాలిటీ టచ్ లేనట్లే అనిపిస్తుంది... ఇప్పుడు ఆలోచిస్తూంటే, చాలా ముభావంగా వుండేవారు. ఎక్స్‌ట్రావర్ట్ కాదు. ఇంట్రొవర్ట్. అంతర్ముఖుడు. మిత భాషి. 'సుధా మేడమ్' తెలుసుకదా ... వారి అక్కగారు ... ఆవిడ అడుగుతూ ఉండేది మా పెళ్ళైన కొత్తల్లో .. 'కనీసం మీరిద్దరైనా క్లోజ్‌గా మాట్లాడుకుంటారా?' అని."

మారం : "మీది లవ్ మ్యారేజ్ అని సార్ చెప్పారు. అసలు మీ పరిచయం ప్రేమగా ఎలా మారింది? పెళ్ళెలా అయ్యింది?"

స్వర్ణమాలా పత్రి : "ఆయన సోదరుడు ప్రొఫెసర్ వేణు వినోద్ గారు మా స్వంత అక్క భర్త. మా బావగారు వరంగల్‌లో ఉద్యోగం చేసేవారు. అప్పుడు మా అక్కయ్య గర్భవతి. హైదరాబాద్‌లో మా ఇంట్లో ఉండేది. ఏదైనా అవసరం వస్తుందేమోనని, రాత్రిళ్ళు పడుకోవడానికి పత్రిగారు మా ఇంటికి వచ్చేవారు. ఆయన 'I.A.S.' కి ప్రిపేర్ అయ్యేవారు. నేను ఇంటర్ రెండవ సంవత్సరం చదివేదానిని. చిన్న వయస్సు. ఆయన సివిల్స్‌కి ప్రిపేర్ అవుతూ, నన్ను ప్రశ్నలు అడగమనే వారు. నేను అడిగేదాన్ని. ఆ విధంగా మా పరిచయం పెరిగింది. క్రమంగా ఒకరోజు ఒక పేపర్ మీద 'ఐ లవ్ యూ - ఐ వాన్ట్ టూ మ్యారీ యూ' అని వ్రాసి ఇచ్చి నా అభిప్రాయం చెప్పమన్నారు. నేనేమీ సమాధానం చెప్పలేదు. మా పెళ్ళి మా అక్కా, బావ గార్లకు ఇష్టం లేదు ... చాలా కారణాల వల్ల. ఒక రోజు ఇద్దరం వెళ్ళి మా అమ్మ కాళ్ళకి నమస్కారం పెట్టాం. 'మీరు సరే నంటే మేం పెళ్ళి చేసుకుంటాం' అన్నారు ఆయన మా అమ్మతో. అలా నా చిన్న వయస్సులోనే పత్రిగారితో నా పెళ్ళి అయ్యింది.

మారం : "పత్రీజీలో ఆధ్యాత్మికమైన భావాలు ఎప్పుడు, ఎలా మొదలయ్యాయి?"

స్వర్ణమాలా పత్రి : "నాకు తెలిసి, ఆయన చిన్నప్పటి నుంచే చాలా పుస్తకాలు చదివేవారు. ఎప్పుడూ చేతిలో ఏదో ఒక పుస్తకం ఉండేది. సిటీలైబ్రెరీకీ వెళ్ళి, ఎన్నో పుస్తకాలు చదివేవారు. చిన్నప్పటి నుంచి జేబులో వివేకానందుడి పోటో ఉండేదని మా అత్తగారు, మా వదిన సుధ గారు చెప్పేవారు.

"అనంతపూర్‌లో E.I.D. ప్యారీ కంపెనీలో పనిచేసే 'రామచెన్నారెడ్డి' అనే ఆయన ఫ్రెండ్, కోలీగ్ ధ్యానం చేసేవాడు. ఆస్ట్రల్ ట్రావెల్ చేసేవాడు. అతని ద్వారా ధ్యాన పరిచయం జరిగింది. "రామచెన్నారెడ్డి గారు ఇచ్చిన లోబ్‌సాంగ్ రాంపా వ్రాసిన 'యు ఫర్ ఎవర్' పుస్తకం (తరువాత 'మరణం లేని మీరు' గా తెలుగులో అనువదించబడింది) చదివిన తరువాత 'ఓవర్ నైట్' మారిపోయారు. 1979 లో, ఆ తరువాత, తరచుగా వెళ్ళే సినిమాలు, షికార్లకు తీసుకెళ్ళటం కాస్తా బంద్. ఆయన ప్రపంచం వేరే అయింది. పుస్తకాలు చదవడం మరింత ఎక్కువయింది. నన్నూ చదవమనేవారు. పుస్తకాలు చదివేదాన్ని. కానీ, ధ్యానం చేసేదాన్ని కాదు."

మారం : "మరి వారు ఎంత సేపు ధ్యానం చేసేవారు"

స్వరణమాలా పత్రి : "నాకు ఆయన మరీ ఎక్కువుగా ధ్యానం చేసినట్లు అనిపించలేదు. మరింత సైలెంట్ అయిపోయారు ... రెబల్ అంటే ఒక కమ్యూనిస్ట్ లాగా అయిపోయారు. ఎంతో అథారిటీగా మాట్లాడేవారు స్పిరిచ్యువాలిటీ మీద, ఎంతో స్ట్రాంగ్‌గా, ఎంతో తెలిసినట్లుగా, జన్మజన్మలుగా తెలిసివున్నట్లుగా"

మారం : "సదానందయోగితో పత్రీజీ పరిచయం ఎప్పుడు, ఎలా జరిగింది?"

స్వర్ణమాలా పత్రి : "రామచెన్నారెడ్డి గారి గురువు (పేరు తెలియదు) ఆయనకు కలలో కనబడి, కర్నూలులో ఫలానా లాడ్జిలో ఒక మహా గురువు వున్నాడు, వెళ్ళి కలవమని ఆయనకు సందేశం ఇచ్చారు. ఆయన వారి స్వప్న అనుభవం పత్రిగారికి చెప్పారు.

"1981 జనవరి ఒకటవ తేదీన రామచెన్నారెడ్డి గారు, పత్రిగారు, మరొక మిత్రుడు వెంకటరత్నం ముగ్గురూ కలసి వెతుక్కుంటూ కర్నూలు పెద్ద మార్కెట్ దగ్గర వున్న రాఘవేంద్ర లాడ్జిలో ఒక చిన్న రూమ్‌లో సదానందయోగి గారిని కలిశారు. ఆ తరువాత పత్రిగారు ఆయనను తరచు కలిసేవారు. క్యాంపు నుంచి వస్తే చాలు ఆయన దగ్గరకు పరిగెత్తేవారు. ప్రతిరోజు ఆయనకు భోజనం ఇంటి నుంచి తీసుకెళ్ళేవారు. వారు క్యాంప్‌లకు వెళ్ళినపుడు నేను భోజనం తీసుకెళ్ళేదాన్ని."

మారం : "సదానందయోగి గారి గురించి మరికొంత వివరణ ఇవ్వండి"

స్వర్ణమాలా పత్రి : "ఆయనంటే నా కస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే మా వారు ఎక్కడ సన్యాసుల్లో కలిసిపోతారో అని. అసలే ఎప్పుడూ మౌనంగా వుండేవారు కాస్తా, ధ్యానం చేయడం మొదలుపెట్టిన తరువాత మరింత ఎక్కువుగా మౌనంగా అయిపోయారు. మరి ఇలాంటి యోగులను కలిస్తే, నిరంతరం వారి సహవాసం చేస్తే ఇంకేమైనా ఉందా సన్యాసుల్లో కలిసిపోరా? దానికి తోడు మాకు ఇద్దరూ ఆడ పిల్లలే. ఇది కూడా నేను ఎక్కువ భయపడడానికి ఒక కారణం. నా కిష్టం వున్నా లేకున్నా వారికి భోజనం తీసుకెళ్ళే దానిని, పత్రిగారు క్యాంప్స్‌కి వెళ్ళినప్పుడు ... 'ఎప్పుడో ఒకప్పుడు నువ్వే దారిలోకి వస్తావులే' అనేవారు సదానందులు."

మారం : సదానంద యోగి ఎలా వుండేవారు?

స్వర్ణమాలా పత్రి : "సదానందులు చాలా సింపుల్ వ్యక్తి. కళ్ళు బ్రౌన్‌గా వుండేవి. పీచుగడ్డం, సన్నగా, పొడుగ్గా వుండేవారు. అసలు నాకు ఆయన మాటలు అర్థమయ్యేవి కావు. ప్రాచీన సంస్కృత భాషాలాగా ఉండేవి ... ఆయన వాడే పదాలు. మితంగానే మాట్లాడే వారు. ఆయన పదిమాటలు మాట్లాడితే, పత్రీజీ ఒక్క మాట మాట్లాడేవారు. ఆయనకు ఎంతో సేవ చేసేవారు. స్వయంగా టీ, కాఫీ, సిగరెట్లు తెచ్చి పెట్టేవారు. సదానందయోగి దగ్గర కూర్చుంటే ఎంతో 'కూల్'గా ఉండేది. అప్పుడు అర్థం కాలేదు. కానీ, తరువాత ఎప్పుడో అర్థమయ్యింది ఆయన వైబ్రేషన్స్ అద్భుతం అని. ఎంతో హాయిగా ఫీలయ్యేదాన్ని వారి సాన్నిధ్యంలో."

మారం : "ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది"

స్వర్ణమాలా పత్రి : "ఆయన ఎవరో, ఎక్కడ నుంచి వచ్చారో, ఎప్పుడు ఎక్కడ, ఎన్ని సంవత్సరాలు ఉన్నారో అప్పుడప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం లెక్క వేస్తే, ఆయనకు 150 సంవత్సరాలు పైన అని తేలింది. మరి పత్రిసార్ చెప్పిన ప్రకారమైతే ఆయనకు 2000 సం|| పైనే. యేసుప్రభువు సమకాలికులు అని అర్థం అవుతుంది. మా తమ్ముడు ద్వారకా తన ధ్యానంలో తన గత జన్మ గురువు సదానందయోగి అని తెలుసుకున్నాడు."

మారం : "వారు ఎప్పుడు దేహత్యాగం చేశారు? ఎక్కడ చేశారు? వారి గురించి ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయా?"

స్వర్ణమాలా పత్రి : "సదానందయోగి మరణించడానికి నెలరోజుల ముందే తాను ఫలానా రోజు శరీరం విడిచిపెడతానని చెప్పారు. కర్నూలుజిల్లా బనగానపల్లి దగ్గరలోని నందవరంలో తాను సమాధి కాబోయే స్థలం కూడ తానే సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన మరణించే సమయానికి రెండు మూడురోజుల ముందు నందవరంలో ఒక తాపీ మేస్త్రీకి, ఆయనను సమాధి చేసిన పొలం దగ్గర కనిపించారట. ఆ తాపీ మేస్త్రీ, అప్పుడు కట్టెలు కొట్టుకునే ఒక కూలి. స్వామీజీ .. అదే సదానందయోగి .. మరణించిన తరువాత, వారి భౌతిక కాయాన్ని నందవరం తీసుకెళ్ళినప్పుడు, 'అరే... నాకు ఈయన మూడురోజుల ముందు ఇదే స్థలంలో కనిపించారు అటు ఇటు తిరుగుతూ' అని ఆ రోజు వారి భౌతిక కాయాన్ని తెచ్చిన వారికి చెప్పారని ఆ తాపీ మేస్త్రీ నన్ను కలిసినప్పుడు చెప్పాడు. సదానందయోగి 1983లో మే 22 వతేదీన కర్నూలులోనే భౌతిక కాయాన్ని వదిలివేసారు."

మారం : "మరి 2000 సంవత్సరాలు జీవించిన యోగి, పత్రీజీని కలిసిన రెండున్నర సంవత్సరాల లోపే మరణించారంటే, కారణం చెప్పగలరా?"

స్వర్ణమాలా పత్రి : "నేననుకోవడం... అరేబియా నుంచి భారతదేశం వచ్చిన ఆయన మా వారిని అన్వేషిస్తూ కర్నూలు వచ్చారేమోనని. వీరు వారిని కలిసిన తరువాత, తన సర్వశక్తులూ పత్రిగారికి ధారపోసి ఆయన వెళ్ళిపోయారేమోనని."


మారం :
"అంటే సదానందుల శక్తి పొందినందువల్లనే పత్రిగారు ఇంత గొప్పవారయ్యారనుకోవచ్చా"

స్వర్ణమాలా పత్రి : "సదానందయోగిని కలుసుకోకముందే పత్రిగారు ఎంతో జ్ఞాని అనీ, వారికి సబ్జెక్ట్ మీద ఎంతో కమాండ్ ఉండేదనీ చెప్పాను కదా. ఎంతో జ్ఞానం వున్న పత్రిగారు, మరింత జ్ఞానవంతులయ్యారని చెప్పవచ్చు."

మారం : "పత్రీజీ ప్రవర్తన అప్పట్లో ఎలా ఉండేది?"

స్వర్ణమాలా పత్రి : "ఒక నరసింహస్వామి లాగా, విశ్వామిత్రుని లాగా, దూర్వాసుని లాగా, పరశురాముని లాగా ఉండేవారాయన. పెళ్ళయిన మొదటి అయిదేళ్ళలో ఎంతో ఆత్మీయంగా ఉన్న నాకు ఆయనతో మాట్లాడాలంటే భయం వేసేది.

మారం : "ఆయనలో మైత్రేయబుద్ధుడు 'వాకిన్' అయిన విషయం సందర్భం, స్థలం గురించి చెప్పండి?"

స్వర్ణమాలా పత్రి : "1982 లో అనుకుంటాను... మా చిన్నమ్మాయి కూడా పుట్టింది. ఒకరోజు హైదరాబాద్ వెళ్ళి కర్నూలుకు కంపెనీ ఆడియో విజువల్ వాన్‌లో వస్తున్నారు. జడ్‌చెర్ల దగ్గర వాన్ ఆక్సిడెంట్ అయింది. 'అప్పారావు' అనే కంపెనీ డ్రైవరు బండి నడుపుతున్నాడు. ఇతర కోలీగ్స్ కూడా వేన్‌లో ఉన్నారు. వేన్ టైర్ పంక్చర్ అయ్యి, వేన్ స్కిడ్ అయి, మూడు పల్టీలు కొట్టి గోతిలో పడింది. ఎవ్వరికీ దెబ్బలు తగిలినట్లు లేదు. అందరూ మెల్లిగా పైకి వచ్చారు. ఈయన తప్ప. ఈయన కోసం అందరూ చూస్తే, కదలిక లేకుండా కనబడ్డారట. భయపడి ఏడుస్తూ దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పారావుతో అన్నారట... 'ఎందుకు ఏడుస్తారు? పైన ఇంకా బాగుంది' అని చెప్పారట. మరునాటి ప్రొద్దుటికి కర్నూలు ఇంటికి వచ్చారు.

"అప్పటి నుంచి వారి ప్రవర్తన ఇంకా మారిపోయింది. బాగా ఎత్తుకు తగినట్లుగా పుష్ఠిగా వుండేవారు కాస్త క్రమంగా బాగా సన్నబడ్డారు. ఇక ముఖం ఎంతగా మారిపోయిందో ఈ ఆర్టికల్‌లోఇచ్చిన ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది కదా. ఆ తరువాత తరువాత మాటల్లో అర్థమయ్యింది ... ఆయనలో మాస్టర్ 'వాకిన్' అయ్యారని. అయితే, ముందటి ఛాయలు మాత్రం మిగిలాయి. అనుభూతులు ఉన్నాయి. కానీ, తేడా చాలా వుంది."

మారం : "1992 సంవత్సరంలో ఉద్యోగానికి రిజైన్ చేసిన తరువాత పత్రీజీ ప్రవర్తన ఎలా వుండేది? మీరు ఎలా ఫీలయ్యారు?"

స్వర్ణమాలా పత్రి : "రిజైన్ చేసిన తరువాత మూడురోజులు చాలా మౌనంగా వున్నారు. ఎవ్వరితో మాట్లాడలేదు. నేను చాలా భయపడ్డాను. వారి ఆఫీస్ ఫ్రెండ్స్ సుబ్బారావుగారు, నాగార్జునరెడ్డి గారు వాళ్ళను పిలిపించాను. పాల్, ప్రకాష్, న్యూటన్, యుగంధర్, రంగా వీళ్ళను కూడా పిలిచాను. ఐనా నాకు ఆరాటం తగ్గలేదు. "వెళ్ళి పిరమిడ్‌లో రాత్రి 1.00 నుంచి వేకువజామున 3.00 గంటల వరకు అనుకుంటాను, అలాగే ధ్యానంలో కూర్చున్నాను.

" ' నీ హజ్బెండ్ ఒక మిషన్ కోసం పుట్టాడు. ప్రకృతి నీకు అన్ని విధాలా సహకరిస్తుంది. మీ ఆయనకు నువ్వు సహకరించు' అని ఎవరో నాకు ముమ్మార్లు సందేశం ఇచ్చారు. నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఉదయమే మా వారితో చెప్పాను. 'మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయండి' అని. అప్పటినుంచి ఆయన విరివిగా ధ్యాన ప్రచారం మొదలుపెట్టారు."

మారం : "సదానందయోగి గురించి ఎంత విన్నా వినాలని వుంటుంది. వారు ఇచ్చిన సందేశాలు మీరు గుర్తుంచుకున్నవి ఒకటి రెండు చెప్పండి."

స్వర్ణమాలా పత్రి : "ఈయన సదానందయోగిని ఒక్క ప్రశ్నకూడా అడిగేవారు కాదు. వారిపట్ల ఎంతో వినయంతో, ఎంతో విధేయతతో వుండేవారు. వారి ఎదుట ఎంతో మౌనంతో వుండేవారు. ఆయనకు సదానందయోగి చెప్పిన కొన్ని నాకు గుర్తున్నవి:

"వచ్చింది కాదనరాదు, రానిదానిని కోరరాదు.

వస్తే వచ్చిందని మురిసిపోకూడదు,

పోతే పోయిందని ఏడవకూడదు"

"మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చు"

"ఇలా ఎన్నో చెప్పేవారు. సదానందయోగి ఒక మహా మహనీయయోగి, మహావతార్ బాబాజీ లాగా. ఎవరైనా సరే మహనీయుల గొప్పతనం వారు జీవించి వున్నప్పటి కంటే కూడా వారు మరణించిన తర్వాత, మరింత ఎక్కువుగా అవగతమవుతుందేమో"

మారం : "సదానందయోగి మరణించినప్పుడు మీరు ఏమనుకున్నారు? జీవించి వున్నప్పుడు ఏమనుకున్నారు?"

స్వర్ణమాలా పత్రి : "ఆయన వున్నప్పుడు ఆయన విలువ తెలియలేదు. చెప్పాను కదా, ఆయన జీవించి వున్నప్పుడు మాత్రం పత్రిగారు మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోతారో అని తరుచూ భయం కలిగేది. ఎందుకంటే నేను చిన్నతనంలోనే నా తండ్రిని పోగొట్టుకున్నాను. నాకు ఇద్దరూ కూతుళ్ళే. వాళ్ళకు కూడా తండ్రి ఎక్కడ దూరం అవుతారోనని నాకు భయం కలిగేది."

మారం : "పత్రిసార్ ఒక నరసింహస్వామి లాగా, పరశురాముడి లాగా వుండేవరు అని చెప్పారు కదా, మరి మీరు ఎందుకు ఓర్చుకున్నారు? ఎదురుతిరగాలని అనిపించలేదా?"

స్వర్ణమాలా పత్రి : "అసలు నాకు అలాంటి ఊహే వచ్చేది కాదు, ఎప్పుడో తప్ప. చిన్నవయస్సులో పెళ్ళి అయింది. తర్వాత పిల్లలు పుట్టారు. 'నేను, నా భర్త, నా పిల్లలు' అనే ఆలోచన తప్ప వేరే ఊహలే వచ్చేవి కాదు."

మారం : "మీ గతజన్మలు మీరు చూసుకున్నారా?

స్వర్ణమాలా పత్రి : "1984 ఒకసారి ఊజా బోర్డ్ వేశాం. 'గాల్డ్' అనే అమెరికన్ వనిత. 'నా ముందు జన్మలో ఈవిడ నా తల్లి' అని తెలిసింది. ఇంకొక జన్మలో నన్నొక సిద్ధుడు ఎత్తుకుపోతే, ఒక వృద్ధురాలు పెంచి, నాకు హీలింగ్ విద్య నేర్పింది. ఈ జన్మలో కూడా నేను మంచి హీలర్‌ని. ఆ జన్మలోని హీలింగ్ విద్య ఈ జన్మలో కంటిన్యూ అయిందేమో"

మారం : "మీరు పత్రీజీలో గమనించిన అద్భుతాలు ఎన్నో వుంటాయి కదా, వాటిలో మీకు గుర్తున్నవి చెప్పండి"

స్వర్ణమాలా పత్రి : "కర్నూల్లో వున్నప్పుడు ఒకరోజు రాత్రి మధ్యలో మెలకువ వచ్చింది. లేచి చూస్తే ఈయన బదులు కాశిరెడ్డి నాయన కనిపించారు. భయపడ్డాను. మళ్ళీ ఆ భయంతో చూస్తూ వుంటే మళ్ళీ ఈయన కనిపించారు.

"హాంకాంగ్ నుంచి ఇండియా వస్తున్నాం. ఎయిర్‌పోర్ట్‌లో వెయిట్ చూస్తే చాలా ఎక్కువ వుంది. మళ్ళీ బ్యాంకాక్‌లో కూడా షాపింగ్ చేసాం. నేను భయపడుతున్నాను చెకింగ్ గురించి. 'ఏమీ అవదులే' అన్నారీయన. బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్‌లో నా హ్యాండ్‌బ్యాగ్ లగేజీ కలిపి వెయిట్ చూస్తే కూడా వెయిట్ సరిపోయింది. చక్కగా వచ్చేశాం ఏ ఇబ్బందీ లేకుండా.

"పత్రి గారే ఒకసారి చెప్పిన మాట. వారు ఒకచోటికి ట్రెయిన్‌లో వెళ్తున్నారు. సైడ్ బెర్త్ దొరికింది. ఈయన బాగా పొడవు కదా. ఆ సీట్లో ఆయన కాళ్ళు పూర్తిగా చాపుకుంటే కూడా ఇంకాస్త స్థలం మిగిలి వుంది. ఈయన ప్రొద్దున లేచి చూస్తే సీట్ మామూలుగా వుంది.

"బుద్ధపౌర్ణమికి ముందు ఒకనెల బెంగుళూరులో వున్నాను కదా, అప్పుడు బెంగుళూరు వెళ్ళడానికి ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. అప్పుడు ఈయన ఊళ్ళో లేరు. అది నడిరాత్రి వుంది. అలసిపోయి వున్నానేమో ఇంట్లో బాగా నిద్రపోయాను. లేవలేకపోయాను. ఫ్లైట్ టమ్ అవుతూంటే, ఊళ్ళో లేకపోయిన ఈయన 'బెంగుళూరు వెళ్ళాలి. ఫ్లైట్ టైమ్ అవుతోంది' అని తట్టిలేపారు.

"గోవాలో బీచ్‌లో వర్షం వస్తోంది. ఆయన రాళ్ళగుట్టల వద్ద కూర్చున్నారు. బాగ పైకి వచ్చిన అల ఆయన చుట్టూ మాత్రం వదిలి, ఆయన చుట్టూ పరచుకునిపోయింది. ఆ సమయంలో మీరు అక్కడ వున్నారు గుర్తుందా."

మారం : మిమ్మల్ని ధ్యానం చెయ్యమని పత్రీజీ అన్నప్పుడు మీరు ఎంతసేపు ధ్యానం చేశారు? ఏ సంవత్సరంలో?"

స్వర్ణమాలా పత్రి : "మొట్టమొదట్లో పత్రిగారు ధ్యానం చెయ్యమని చెప్పినప్పుడు నేను ధ్యానం చెయ్యలేదు. వారు చెప్పి వూరుకున్నారు. మా తమ్ముడు 'ద్వారకనాథ్' ధ్యానం చేసేవాడు, ఈయన చెప్పిన మీదట, ధ్యానం చేయకముందు మెటీరియలిస్టిక్‌గా, ఎగైనెస్ట్‌గా వుండేవాడు కాస్తా ధ్యానం చేసిన తరువాత ఒక్కసారిగా మారిపోయాడు. ఎన్నో ఆస్ట్రల్ ట్రావెల్స్ చేసేవాడు. 'ఆరా' చాలా బాగా చూసేవాడు. ఆస్ట్రల్ ట్రావెల్‍లో ఒకసారి గంగ పుట్టిన స్థలం కూడా చూసి వచ్చాడు వాడు.

"ధ్యానంలో వాడి ఎదుగుదల చూసి, నమ్మి, నేను 1985 సంవత్సరంలో ఒకరోజు మొట్టమొదటిసారిగా ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల దాకా ధ్యానం చేశాను. అలా మూడు నెలలు లాంగ్ సిట్టింగ్స్ వేసాను. ఎంతో స్ట్రగుల్ అయ్యాను కూడా. చెవుల్లో తలల్లో, వ్రేళ్ళలో వేడిగాలి, నీళ్ళు వచ్చేవి డిస్టర్బ్ అవబోతే, 'లేవవద్దు' అని వినపడేది. కుండలినీ ఎక్స్‌పీరియన్స్ కూడ అప్పుడే అయింది. కుండలినీ ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు చల్లటి బ్రీజ్ ఫీలయ్యాను.

మారం : "మీ కుండలినీ ఎక్స్‌పీరియన్స్ గురించి వివరించండి?"

స్వర్ణమాలా పత్రి : "ఒక కాంతివేగస్థితి నుంచి ఒక టన్నెల్ లోకి వెళ్తూన్న అనుభూతి. 'రోలర్ కోస్టర్' లాగా లోపల ఎక్స్‌పీరియన్స్. టన్నల్ లోంచి బయటకు వస్తున్నాను. అక్కడక్కడ దీపాలు వున్నాయి. ఎవరెవరో కనిపిస్తున్నారు. టన్నల్ లోంచి బయటకు వచ్చాను. అక్కడ గొప్ప వెలుగు. నేనెంతో బల్బ్ అయిన అనుభూతి. యూనివర్స్ అంతా నేనే అయివున్నాను. మళ్ళీ నా ఉనికి కూడా నాకు కనిపిస్తోంది. సహస్రారం టచ్ అయిన అనుభూతి. అక్కడ ఆ సహస్రారంలో నేను నివసించిన అనుభూతి."

మారం : "ధ్యానంలో కానీ, ఇతరత్రా కానీ ఇతర గొప్ప అనుభవాలు చెప్పండి."

స్వర్ణమాలా పత్రి : "మేము హైదరాబాద్ విద్యానగర్‌లో వుండేవాళ్ళం అప్పుడు. మా ఇంటి కరెంటు బిల్లు ఎప్పుడూ 200 యూనిట్లు దాటలేదు. కానీ ఓ నెల 770 యూనిట్లు వచ్చింది. అప్పట్లో, ఇప్పటిలాగా స్పాట్ బిల్లింగ్ కాదు కదా. పుస్తకంలో నోట్ చేసుకుని వెళ్ళేవాళ్ళు. '770 యూనిట్లు కాకూడదు; 200 యూనిట్లు దాటడానికి వీల్లేదు' అని నాలో నేను అనుకుని నిద్రపోయాను. తెల్లారి లేచి, మీటర్ చెక్ చేశాను. '200 యూనిట్లు' లోపే వుంది. అది ఎంతో ఆనందాన్నిచ్చింది. 'ధ్యానంతో మనం దేన్నైనా సాధించగలం' అని అర్థమయ్యింది.

"ఒకసారి కర్నూలు నుంచి నేను ఒక్కదాన్నే హైదరాబాద్‌కు బస్సులో వస్తున్నాను. అప్పుడు టికెట్ నలభైఐదు రూపయలు. కండక్టర్ దూరంలో వున్నాడు. నేను పర్సులోంచి డబ్బు తీస్తున్నాను. 50 రూపాయల నోటు తెరచివున్న విండో లోంచి గాలికి ఎగిరిపోయింది. నా దగ్గర ఇంక డబ్బులేదు. 'నా డబ్బు నా విశ్వానికి ఇచ్చాను ... ఎవరూ నన్ను టికెట్ అడగకూడదు' అనుకుని కూర్చున్నాను. కండక్టర్ నన్ను టికెట్ అడగలేదు. హైదరాబాద్‌లో దిగి ఇల్లు చేరుకున్నాను. ఈయనకు తర్వాత చెప్తే నవ్వుతున్నారు. ఇలా ఎన్నో లీలలు."

మారం : "ఒక ధర్మపత్నిగా, ఒక గురుపత్నిగా మీ డిఫరెంట్ రోల్స్ చెప్పండి"

స్వర్ణమాలా పత్రి : "మా పెళ్ళయిన కొత్తలో మూడవ మనిషి మా ఇంటికి వస్తే చిరగ్గా వుండేది. మా పక్క మీద ఎవరైనా కూర్చుంటే నాకు ఇబ్బందిగా వుండేది. ఎవరికైనా వండి పెట్టవలసి వస్తే చాలా కోపం చేసుకుని అయిష్టంగా వుండేదాన్ని. ఆయన అప్పుడు ఉగ్రరూపం ధరించేవారు. వంట సరిగా రాని నేను, చేసి పెట్టడానికి ఇష్టపడని నేను, క్రమంగా అత్యంత మందికి అత్యంత ఇష్టంతో అత్యంత రుచిగా చేసి పెట్టే స్థితికి వచ్చాను. ఆవిధంగా ... ఆయనకు అనుకూలంగా ... నన్ను నేను మలచుకోవడానికి కనీసం పది సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఇంటికి ఎవరొచ్చినా చాలా క్యాజువల్‌గా అనిపిస్తోంది. అలా ఆయన నన్ను క్రమంగా మార్చుకున్నారు.

మారం : "మీ అమ్మాయిల గురించి చెప్పండి"

స్వర్ణమాలా పత్రి : "నాకు ఇద్దరూ ఆడపిల్లలు కనుక, నేను చాలా ప్రొటెక్టివ్‌గా పెంచాను. వాళ్ళు కూడా నా సంజ్ఞలను గుర్తించి, జాగ్రత్తగా మసులుకునేవారు. చిన్నప్పటి నుంచి ఎంతో మెచ్యూర్డ్‌గా వుండేవారు. నేను పడే ఇబ్బందులను చూసి వాళ్ళు చాలా నేర్చుకున్నారు. మానసికంగా ఎంతో ఎదిగారు. పత్రీజీ కూడా ఎంతో డిటాచ్‌డ్‌గా వున్నా, పిల్లలను చాలా చక్కగా చూసుకునేవారు."

మారం : "మీ అత్తమామల గురించి, మీ అక్క, బావ గార్లు అదే వారి అన్న, వదినల గురించి, ఇతర కుటుంబసభ్యుల గురించి వివరిస్తారా?"

స్వర్ణమాలా పత్రి : "మా అక్క, బావ గార్లే పత్రీజీ అన్నా వదినలు. మీకు తెలుసుకదా. ఆయన తానుగా నిర్వహించవలసిన బాధ్యతలు కూడా ఒక గృహిణిగా నేను ఎంతో సమర్ధంగా నిర్వహించాను. వారి తల్లి, తండ్రి అంటే మా మామగారు, అత్తగారు, ఆడపడుచుల వారిని ఎంటర్‌టెయిన్ చెయ్యడం, వాళ్ళ అవసరాలు నేను చాలా బాగా గమనించుకున్నాను. మా మామగారు, మా వారి మేనత్త వీరిద్దరికీ మతిస్థిమితం లేకుండా వుంది. మా వదిన సుధా గారు M.B.B.S. బెంగుళూరులో చేస్తూ వుంటే, మా అత్తగారు రెండు సంవత్సరాలు బెంగుళూరులో వున్నారు. మరొకసారి ఆరునెలలు అమెరికాలో వున్నారు. ఈ సమయాల్లో మతిస్థిమితం లేని వీరిద్దరినీ నేను ఎంతో చక్కగా గమనించుకున్నాను. ఈయనకేమో నిరంతర క్యాంపులు. ఎన్ని సంవత్సరాలు ఎంత ఘర్షణ పడ్డానో నాకు తెలుసు... మా వారికి తెలుసు... ఆ సృష్టికర్తకు తెలుసు. నా జీవితంలో చాలా వరకు ఘర్షణను గురించి ఇంకా చక్కగా తెలిసిన వ్యక్తి మా వదిన సుధా గారు మాత్రమే. మిగతా కుటుంబసభ్యులందరూ యధాశక్తి ఎగతాళి చేసినవారే, అందరూ శక్తిమేర రాళ్ళు విసిరినవారే."

మారం : "ఇప్పుడు పత్రిసార్ స్థాయిని చూస్తే గర్వంగా అనిపిస్తుందా"

స్వర్ణమాలా పత్రి : "ఒకప్పుడు ఆయన పడిన ఆవేదన, ధ్యాన ప్రచారం మొదలు పెట్టక ముందు, మొదలుపెట్టిన తరువాత కుటుంబ సభ్యుల దగ్గర ఆయన పొందిన అవమానాలు, ఘర్షణలు అన్నీ నేనూ ఆయనతో సమానంగా అనుభవించినదాన్ని. చిన్నప్పటి మరి ఆయన యవ్వనస్థితిలో ఆయనకు వారి వల్ల కలిగిన మానసిక గాయాల నుంచి క్రమంగా వారు ఆధ్యాత్మిక గురువుగా ఎదిగారు. ఇప్పుడు ప్రపంచంలోని గొప్ప గురువులలో ఒకరిస్థాయి ఆయనది. ఇంత గొప్ప ఆధ్యాత్మిక గురువుగా ఆయన కీర్తింపబడుతున్నప్పుడు, నాకు నిజంగానే, సహజంగానే గర్వంగా వుంది.

"వారు చేస్తున్న ధ్యాన ప్రచారం, ఆయన పడే శ్రమ, తిరిగే తిరుగుడు, వెచ్చిస్తున్న సమయం చూస్తే, 'అమ్మో, ఒక మానవమాత్రుడికి ఇది సాధ్యమా' అనిపిస్తుంది.

"అనితర సామాన్యమైన మానవసేవ ఆయన చేస్తున్నది. ఏదీ చేసానని చెప్పరు. ఎక్కడా గొప్పలు చెప్పుకోరు. ధ్యానం గురించి తప్ప, తన గురించి ఆయన తాను చెప్పుకునే సందర్భాలు అరుదు. అసలు తాను తన గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటే ఒక భారతం లాంటి కావ్యం వ్రాయవచ్చేమో. 'న భూతో న భవిష్యతి' అనే స్థాయి వ్యక్తి వారు. 'ఇంతటి వారు నా భర్త' అని చెప్పుకోవడం ఖచ్చితంగా గర్వకారణమే.

మారం : "మీరు ఒంటరితనం బాగా ఇష్టపడతారు ఎందుకని? మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?"

స్వర్ణమాలా పత్రి : 1991 లో కర్నూలు కేంద్రంగా మొదలైన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఇప్పుడు కేవలం పదిహేను సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు వెయ్యి శాఖలుగా విస్తరించింది. నిన్ననే చెప్పారు ఆస్ట్రేలియాలో వున్న పత్రి గారు "మెల్‌బోర్న్ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఏర్పడింది" అని. వీటన్నింటినీ వెనక నుంచి గమనించవలసిన పెద్ద బాధ్యతలను నిర్వహించడంలో ఎన్నోసార్లు ఎన్నో ఒత్తిడులకు లోనయ్యాను.

ఎన్నో సెంటర్ల నుంచి మరెన్నో విషయాల గురించి ఎన్నో ఫోన్లు వస్తూంటాయి. ఎంతోమంది మాస్టర్లు ఎన్నో సమస్యలతో వస్తారు. వాటన్నింటి గురించి ఆలోచిస్తూ కూర్చునేదాన్ని. ఎక్కడ ఏ చికాకు వచ్చినా ఎంతో విజ్ఞతతో ఎన్నో విషయాలు పరిష్కరించే మానసిక స్థిరత్వాన్ని క్రమంగా సంపాదించుకున్నాను. వీలైనంత వరకు వారి దృష్టికి వెళ్ళకుండా చూసుకునేదాన్ని. ఈ విషయాలన్నింటిలో నాకు అండగా వున్నది మా అల్లుడు శ్రీను. ఎటువంటి సమస్యకైనా ఏదో ఒక పుస్తకం తీసి చదివి, చక్కటి పరిష్కారం సూచించేవాడు .. అదీ పర్‌ఫెక్ట్‌గా. ఇంకా పరిష్కారం దొరకనప్పుడు రేర్‌గా పత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళేదాన్ని. వారు మరింత పర్‌ఫెక్ట్‌గా క్లారిటీ ఇచ్చేవారు.

ఆ తర్వాత ఎప్పుడు రకరకాల విషయాలూ, చికాకులూ, ఘర్షణలు, వివిధ సెంటర్లలో ఏవో ఒక సమస్యలు ఇలా ఎన్నో భరించవలసిరావడం వల్ల క్రమంగ ఒంటరితనాన్నీ, ఏకాంతాన్నీ ఇష్టపడేదాన్ని. మ్యూజిక్ ... ముఖ్యంగా హిందీ పాటలంటే నాకు చాలా ఇష్టం. ఎంత దూరమైనా కార్లో, రైల్లో ఒంటరిగా ప్రయాణించడం, అదీ మ్యూజిక్ వింటూ ప్రయాణించడం ... అలవాటయింది. అది క్రమంగా ఇష్టమయింది. ఒక రకంగా లోపలా, బయటా కూడా నేను ఏకాంత జీవినే. క్రమంగా సమస్థితి వచ్చింది.

మారం : "ఎవరైనా బాధల్లో ఉన్నవాళ్ళను చూస్తే మీకు ఏమనిపిస్తుంది?"

స్వర్ణమాలా పత్రి : వెంటనే వెళ్ళి క్రియారూపంలో చేతనైన సాయం చేస్తాను.. వాళ్ళు ఎవరైనా కానీ.

మారం : "ఎవరైనా పత్రిసార్ గురించి మూర్ఖంగానో, తప్పుగానో మాట్లాడితే ఏం చేస్తారు?"

స్వర్ణమాలా పత్రి : "దేశ, కాల మానాల్లో మాటపడని వారు ఎవరూ లేరు ... ఉండరు. మాట పడాల్సి వస్తుందని చేయల్సిన కార్యక్రమాలనూ, చెప్పవలసిన బోధననూ మానుకుంటే, పొందవలసింది మళ్ళీ దొరకడానికి కొన్ని జన్మలు చాలవు. కనుక నువ్వు చెప్పదల్చుకున్నది చెప్పడానికీ, చేయదలచుకున్నది చేయడానికీ ఎప్పుడు వెనుకాడవద్దు." ... అని ఒక సందర్భంలో ఆనందునికి బోధిస్తాడు గౌతమబుద్ధుడు. ఆ కాలంలో బుద్ధుణ్ణి, సాయిబాబా కాలంలో సాయిబాబాను నిందించిన వారు లెక్కకు మించి ఉండేవారు. అలాగే పత్రీజీని నిందించేవారు, తప్పుపట్టేవారు చాలానే ఉంటారు. అప్పటికి వాళ్ళకు అర్ధమయ్యేట్లు సమాధానం చెప్పినా, ఆ తర్వాత వారి మూర్ఖత్వానికి నవ్వుకుంటాను. అలాంటివారిని చూస్తే 'ఇన్‌ఫెంట్ సోల్స్' లేదా 'బేబీ సోల్స్' అనిపిస్తూ ఉంటుందంతే.

మారం : "మీరు జీవితంలో చాలా చాలా ఘర్షణలు పడ్డారని నాకు అర్ధమవుతోంది. గొప్పస్థాయి పొందిన యోగుల, పురాణ పురుషుల భార్యలు ఉదాహరణకు సత్యహరిశ్చంద్రుడు, శ్రీరాముడు, గౌతమబుద్ధుడు, రాఘవేంద్రస్వామి, తుకారాం వీరి భార్యలు, ఇప్పుడు మీరు, మహాపురుషుల భార్యలవడం శాపమా? వరమా?"

స్వర్ణమాలా పత్రి : నిస్సందేహంగా వరమే. ఎందుకంటే మహాపురుషులు సహజంగానే జీవన్ముక్తి పొందుతారు. మరి వారి భార్యలు కూడా వారిని అనుసరించి, జీవన్ముక్తి పొందడానికే వారికి ఈ తీవ్ర ఘర్షణలు ఏర్పడుతూ వుంటాయని నాకు అనిపిస్తుంది. ఈ తీవ్ర ఘర్షణలు నాలోని 'నేను', 'నాది' అనేవాటిని చంపేశాయి. ఎవ్వరూ నా వాళ్ళు కాదు - నాకు నేనే - అని అర్ధమయ్యింది. ఏదీ లేని, ఏమీ లేని స్థితికి నన్ను తీసుకెళ్ళింది నా జీవితం. ఇది ఖచ్చితంగా జీవన్ముక్తే.

మారం : "పత్రి గారి పైన మీ అభిప్రాయం?"

స్వర్ణమాలా పత్రి : వారిపై నా అభిప్రాయాన్ని చెప్పగలిగేటంత గొప్పదాన్ని కాదు నేను. అయితే ఒక మహాయోగి 'భార్య' గా జీవించడం చాలా దుర్భరం. అయితే అదే ఒక మాస్టర్ గానో, ఒక ధ్యానిగానో అయితే .. అంటే ఒక 'భార్య'గా కాకుండా, ఒక ధ్యానిగా వారితో జీవిస్తే అంతకంటే ఆనందం ఉండదు. ఎప్పుడూ ఒక భార్యగా ప్రవర్తించానే గానీ, ఒక మాస్టర్‌గా ఆలోచించే అవకాశమే దొరకలేదు. ఎప్పుడూ వచ్చిపోయేవారి సమస్యలే. వాళ్ళ సమస్యల పరిష్కారంతోనే సమయమంతా సరిపోయేది. అయితే ఇందువల్ల పత్రీజీ నుంచి నేను ఎంతో నేర్చుకోగలిగాను. అడుగడుక్కీ నేర్చుకోవడమే అయ్యింది. ఈ విషయంలో ఇప్పుడు మీరున్న స్థితిలో మీ భార్య 'చంద్ర' కూడా ఎంతో నేర్చుకునే ఉంటుంది.

ఇన్ని ఘర్షణల వల్ల, ఇన్ని చికాకుల మధ్య ఎంతో నేర్చుకున్నాను కనుక, నేను ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉండగలుగుతున్నాను .. .ముందు చెప్పినట్లుగా సమస్థితిలో.

మారం : "మీ వారి ప్రక్కన పెద్ద స్టేజీ పైన కూర్చున్నప్పుడు మీ అనుభూతి? మరి ఆ సందర్భాల్లో మీకు కలిగే ఆనందం?"

స్వర్ణమాలా పత్రి : నేను ఒక గొప్ప గురువుగారి భార్యను .. నాది గొప్పస్థాయి .. అని నేనెప్పుడూ అనుకోలేదు. ఆయన ప్రక్కన కూర్చున్నప్పుడు, అదీ పెద్ద స్టేజీ మీద కూర్చున్నప్పుడు కూడా నేనెంతో క్యాజువల్‌గా ఫీలయ్యేదాన్ని తప్ప, నాకు ఒక ప్రత్యేకస్థానం కావాలనో, ఉందనో ఎప్పుడూ అనుకోలేదు. అంటే బహుశా ఆయనతో అందరిలో ఉండడం బాగ అలవాటయ్యింది కనుక స్టేజీ పైన కూడా అలాగే అల వాటయిందేమో

అందరూ మా వారి పట్ల చూపిస్తున్న గౌరవం, భక్తి, ప్రేమ, అభిమానం చూస్తుంటే ఇదంతా ఆత్మల లోపలనుంచి వస్తున్నదని బాగా అర్ధమయ్యింది. ఒక సినిమా ఫీల్డ్, ఒక రాజకీయయ పార్టీ. ఒక గొప్ప స్పోర్ట్ ప్లేయర్, ఒక పారాశ్రామికవేత్త .. ఇలాంటి వాళ్ల మధ్య అన్నీ తాత్కాలిక ప్రయోజనాలు ఆశించే భట్రాజుల పొగడ్తలలాగా వుంటాయి. ఒక 'స్పిరిచ్యువాలిటీ ఫీల్డ్' లో మాత్రమే నిజమైన ఆత్మ నివేదన, ఆత్మానందం కనిపిస్తోంది. ముఖ్యంగా 'పైమా' పిల్లలను చూసిన తర్వాత చిన్నవాళ్ళు పత్రి గారి పట్ల, నా పట్ల చూపిస్తున్న అభిమానం గౌరవం, ఇష్టం చూసి నాకు శరీరం ఆనందంతో చెమరుస్తోంది. ఇది మాటల్లో చెప్పలేనిది, అనుభవైకవేధ్యం మాత్రమే.

గత జీవితంలో నేను పడిన ఆవేదన, అశాంతి, సంఘర్షణ అంతా ధ్యానులను మరింత మందిని, ఇన్ని లక్షల మందిని చూసి తొలగి పోయింది.

ఒక తల్లిగా నా ఇద్దరు పిల్లలతో 'అమ్మా' అని పిలిపించుకుంటేనే ఎంతో ఆనందం కలుగుతోంది కదా. మరి ఇంతమందితో 'అమ్మా' లేదా 'పత్రి మేడమ్' అని పిలువబడుతూన్నప్పుడు కలుగుతున్న ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేను. ఇది నిజంగా మరుపురాని, మరచిపోని నిజమైన ఆనందం.

మారం : "కర్నూలు బుద్ధా పిరమిడ్ నిర్మాణం గురించి విశేషాలు చెప్పండి"

స్వర్ణమాలా పత్రి : 1991 లో కర్నూలు పిరమిడ్ నిర్మాణం మొదలై, 1992 లో పూర్తయింది. అంతకుమునుపు ఏడెనిమిది సంవత్సరాల నుంచే ఈయన, నేను 'పిరమిడ్ల' గురించి ఎన్నో ఎక్స్‌పెరి‍మెంట్స్ చేసేవాళ్ళం. అట్ట పిరమిడ్‌లు చేసి వాటి శక్తిని చెక్ చేసేవాళ్ళం.

ఒకసారి నా కుడిచేతి మీద నూనె పడింది. నేను ఏ మాత్రం ఆలోచించకుండా తెల్లవార్లూ ఒక చిన్న అట్ట పిరమిడ్ క్రింద నా చెయ్యి పెట్టి కూర్చున్నాను. కాస్సేపు బాధను ఓర్చుకున్న తర్వాత చల్లగా అనిపించడం మొదలుపెట్టింది. ప్రొద్దుటికి మంట పూర్తిగా తగ్గిపోయింది. శ్రీ B.V. రెడ్డి గారి సహకారంతో కర్నూలులో బుద్ధా పిరమిడ్ నిర్మాణం మొదలుపెట్టిన తరువాత, మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరివరకూ, నేను పూర్తిగా గమనించాను. కట్టడానికి ముందు మూడు నాలుగు సంవత్సరాల నుంచి "ఇక్కడ ఒక పిరమిడ్ కడితే బావుంటుంది" అని సంకల్పం పెట్టేవాళ్ళం. పిరమిడ్ నిర్మాణం మొదలైన తర్వాత థాట్స్ ఎంత అద్భుతంగా మెటీరియలైజ్ అవుతాయో నేను తెలుసుకున్నాను. దాదాపు ఆ నిర్మాణంలోని ప్రతి అంశాన్నీ, ప్రతి ఇటుకనూ నేను గమనించాను. అక్కడి ప్రతి ఇటుకలో నా వైబ్రేషన్ వుందంటే అతిశయోక్తి లేదేమో. స్లాబ్ వేస్తున్నప్పుడు ... ఈ విధమైన నిర్మాణం ఎక్కడా లేదు కదా .. ఎంతోమంది వచ్చి చూసేవారు ... వారందరికీ వివరించి చెప్పేదాన్ని.

మారం : "పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మొదటి పిరమిడ్ కర్నూల్లోనే కదా. ఇంకా ఏమైనా చెప్పండి."

స్వర్ణమాలా పత్రి : మొదటినుంచి నాకు ఆ పిరమిడ్ కట్టిన తరువాత కింగ్స్ ఛాంబర్ మీద మొట్టమొదట నేనే కూర్చోవాలని అనుకున్నాను. అలాగే పూర్తయిన రోజు రాత్రంతా కూర్చున్నాను. అలా నా కోరిక తీరింది. పిరమిడ్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆయన ప్రతిరోజూ ఒక డ్యూటీ లాగా ఒక పుస్తకం తీసుకుని వెళ్ళి పిరమిడ్ ముందు కూర్చునేవారు. ఎవరైనా వస్తే వారికి ధ్యానం గురించి, అది పిరమిడ్‌లో చేస్తే కలిగే ఉపయోగాల గురించి వారికి వివరించి కింగ్స్ ఛాంబర్ మీద కూర్చోమని చెప్పి వారు ధ్యానం చేసి లేచి వచ్చిన తర్వాత వారి అనుభూతులను వివరంగా అడిగేవారు. ఆయన అనంతపూర్ ... మిగతా ఊళ్ళు .. తిరుగుతూన్నప్పుడు నేను పిరమిడ్‌ను గమనించుకునేదాన్ని.

రఘునాథ్ థియేటర్ ప్రక్కనే ఫ్లాట్స్‌లో మేం వుండేవాళ్ళం. నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా కిటికిలోంచి పిరమిడ్‌ను గమనించేదాన్ని. ఏదైనా కారు ఆగితే ఒక పండగలా భావించి వచ్చిన వారిని గౌరవించి వారికి పిరమిడ్ గురించీ, ధ్యానం గురించీ అంతా వివరించి వారిని పిరమిడ్‌‍లో కూర్చోబెట్టేదాన్ని. మొదట్లో ధ్యానప్రచరానికి ఇంత శ్రమపడ్డాం.

మారం : "ఇంకా ఇంకా వినాలని వుంది. పత్రీజీ కర్నూలు పిరమిడ్ కట్టిన తర్వాత విశేషాలు."

స్వర్ణమాలా పత్రి : 1994 లో ఒకసారి పిరమిడ్‌లో "ధ్యాన నవరాత్రులు" చేశాం. అప్పట్లో అనంతపూర్, కర్నూల్లో మాత్రమే సెంటర్లు వుండేవి. దాదాపు 50 మంది ప్రోగయ్యారు. ఉదయం 4.30 నుంచి 7.00 దాకా, 10.00 నుంచి 12.30 దాకా, మళ్ళీ సాయంత్రం 4.00 నుంచి 7.30 దాకా... అందరినీ .. ఒక్కరిని కూడా విడవకుండా ... కర్ర పట్టుకుని వెంటబడి అందరితో ధ్యానం చేయించేదాన్ని. అందరికీ టిఫిన్లు, భోజనాలు నేనే చేసి పెట్టేదాన్ని. దుర్గాష్టమి, దసరా అక్కడే అద్భుతంగా చేసుకున్నాం. అందరూ కూడా చక్కగా సర్వీస్ చేశారు. ఆయన ఈ ప్రోగ్రామ్ పట్ల మహదానందపడ్డారు. 'సాయిక్రిష్ణ' షర్టు విప్పి తుడిచాడు.

మారం : "మరి ఈ పిరమిడ్ గురించి పత్రీజీ ఫీలింగ్స్?"

స్వర్ణమాలా పత్రి : పిరమిడ్‌ను చూస్తూ అలాగే కూర్చుండిపోయేవారు. బయటికి చెప్పేవారు కాదు కానీ లోలోపల చాలా ఆనందించేవారని నాకు అర్థమయ్యేది. నలుగురు వస్తే చలు "భోజనాలు అందరూ చేశారా లేదా?" అని ఇప్పుడెలా తొందరపెడతారో అప్పుడూ అలాగే హడావుడిపడిపోయేవారు. అప్పుడు ఎలా వున్నారో ఆయన ఇప్పుడు అలానే వున్నారు. అయితే తేడా అల్లా ధ్యానుల సంఖ్యలోనే. 'గొప్పవారు', 'చిన్నవారు' అన్న ఫీలింగ్ ఆయనకు ఎప్పుడూ లేదు. అందరినీ అప్పుడూ ఇప్పుడూ కూడా ఒకేలా చూస్తున్నారు, చూస్తారు. ఇప్పుడు కొన్ని లక్షల, కోట్ల మంది ధ్యానం చేస్తున్నారనే తృప్తి ఎలా వుందో, అప్పుడు క్రొత్తగా నలుగురు వస్తే అంత ఆనందించేవారు.

మారం : "అప్పట్లో వారి వెంట ఎవరెవరు వుండేవారు?"

స్వర్ణమాలా పత్రి : పాల్, ప్రకాశ్, (శౌరి గారి పెద్దకొడుకు), న్యూటన్, యుగంధర్, రంగా వుండేవారు. వారు ధ్యానం చేస్తూ, రకరకాల ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ, పత్రిగారితో రోజుల తరబడి చర్చించేవారు.

మారం : "మరి అంత గొప్ప పిరమిడ్ వదిలి హైదరాబాద్ వచ్చేశారు కదా. ఇప్పుడు అప్పుడప్పుడు కర్నూలు వెళ్ళినప్పుడు కానీ, గుర్తువచ్చినప్పుడు కానీ మీ అనుభూతి ఏమిటి?"

స్వర్ణమాలా పత్రి : కర్నూలు పిరమిడ్... అంటే ... ఎప్పుడూ అది నా స్వంత ఇల్లు అనే అనుభూతే కలిగేది. ఇప్పటికీ గుర్తుకొచ్చినా, ఆ పిరమిడ్‌లో కూర్చున్నా అదే ఫీలింగ్. వారిని అడిగేదాన్ని. . "ఇంత అపురూపంగా దీన్ని కట్టించారు... మనం హైదరాబాద్ వెళ్తే మీరెలా ఫీలవుతారు?" అని. ఆయనన్నారు కదా ... "మన చివరి రోజుల్లో మనమిద్దరం ఇక్కడ వుందాం. ఈ పిరమిడ్‌కి ఎదురుగా ఒక పాక వేసుకుందాం. నువ్వు మిరపకాయ బజ్జీలు చేసి పెడుతూ వుండు, నేను అవి అమ్మి నిన్ను పోషిస్తాను" అన్నారు. అంత అనుభూతి కర్నూలు పిరమిడ్ అంటే.

మారం : "వారి ఫ్లూట్ శిక్షణ గురించి చెప్పండి"

స్వర్ణమాలా పత్రి: హైదరాబాద్ శ్రీ T.చంద్రశేఖరన్ గారు అనే ఫ్లూట్ విద్వాంసులు వద్ద వారు నేర్చుకున్నారు. కాలేజీ నుంచి రాగానే సైకిల్ మీద వెళ్ళి చిలకలగూడాలో ఫ్లూట్ నేర్చుకుని వచ్చేవారు. దాదాపు ఆరు ఏడు సంవత్సరాలు నేర్చుకున్నట్లే. ఇదంతా మా పెళ్ళికి ముందే జరిగింది.

మారం : "డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి వద్ద వీరి సంగీత సాధన గురించి చెబుతారా?’ "

స్వర్ణమాలా పత్రి : 1975 లో వారి ఉద్యోగరీత్యా మేం కర్నూలు వెళ్ళాం. శ్రీ పినాకపాణి గారు గొప్ప గురువులకే గురువు గారు. వారి వద్దకు వీరు ఒకరోజు వెళ్ళి ఫ్లూట్ వాయించి వారి మెప్పు పొంది దాదాపు అయిదు సంవత్సరాలు క్యాంపుకు పోకుండా వున్నప్పుడల్లా ప్రతిరోజూ వెళ్ళి సంగీత సాధన చేసేవారు.

వీరు ఎప్పుడు ఆయనవద్ద ఎదురు మాట్లాడలేదు. శ్రద్ధగా చెప్పేది విని సాధన చేసేవారు. శ్రీ పినాకపాణి గారికి విపరీతమైన కోపం. సరిగ్గా పాడకపోతే ఎంతగా కోప్పడేవారో బాగా పాడితే అంతగా మెచ్చుకునేవారు. గురువులకు విపరీతమైన కోపం వుంటుందని నాకు అప్పుడే తెలిసింది. చిన్న విషయాలను, చిన్న తప్పులను కూడా వారు సహించరు. అందుకే శిష్యులు ఇంత అద్భుతంగా తయారవుతారేమో.

శ్రీ పినాకపాణి గారు చాలా గొప్ప విద్వాంసులు, మేధావి, గొప్ప డాక్టర్. కర్నూలు హాస్పిటల్ సూపరింటెండెంట్ గానూ, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గానూ పనిచేశారు. ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం. వారి భార్య ఊర్లో లేనప్పుడు నేను భోజనం తీసుకెళ్ళేదాన్ని. కొన్నిసార్లు ఆయన వచ్చేవారు. వారి కుటుంబ సభ్యులందరూ నా అన్నాచెల్లెళ్ళ లాగా వుండేవారు. వారి శ్రీమతి కూడా నన్నెంతో అభిమానించేవారు.

మారం : "పత్రీజీ గురువుల పట్ల ఎలా ప్రవర్తించేవారు"

స్వర్ణమాలా పత్రి : 'గురుభక్తి' మాత్రం పత్రి గారు దగ్గర నుంచే నేర్చుకోవాలి. మొదట సంగీత గురువులు చంద్రశేఖరన్ గారు, డాక్టర్ పినాకపాణి గార్లు, తర్వాత మహామహనీయులు శ్రీ సదానందయోగి. గురువు ఎదుట ఎప్పుడూ చేతులు కట్టుకుని నేలవైపు మాత్రమే చూస్తూ నిలబడేవారు. "కూర్చో" అన్నప్పుడు మాత్రమే కూర్చునేవారు.

మారం : "పిరమిడ్ మాస్టర్ల పట్ల పత్రీజీ ఫీలింగ్స్ చెప్పండి"

స్వర్ణమాలా పత్రి : చాలామంది ఆయన వెనకాల ఏమేమో మాట్లాడుతూ వుంటారు. ఏమేమో చేస్తూ వుంటారు. వారికి తెలియకపోవచ్చు. కానీ ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తారు అని ఆయనకు తెలిసినట్లుగా, ఆయన గ్రహించినట్లుగా ఎవ్వరూ గ్రహించలేరు. ఎవరైనా సరే ... వారు ఎన్ని తప్పులు చేసినా, ఆయన వెంటనే రెస్పాండ్ కారు, కృష్ణుడు శిశుపాలుడి పట్ల ప్రవర్తించిన ఓర్పుగా ఎన్ని సంవత్సరాలైనా ఓపిక పడతారు. కానీ సమయం వచ్చినప్పుడు మొత్తం గాలి తీసేస్తారు.

వారిపట్ల మన అనుభవాలు మనం మరిచిపోతామేమో కానీ, ఆయన అస్సలు మరచిపోరు. ఎంతైనా ఓపిక, ఓర్పు వున్నాయి ఆయనకి. ప్రతి ఒక్కరినీ భరించగలిగినంత భరిస్తారు. అయితే, ఆయన వద్ద 'జాలి', 'దయ' అనేవి అస్సలు వుండవు. ఎవరైనా సరే ... ఈ మార్గంలో వున్నారు, ధ్యానం ప్రచారం చేస్తారు... అంటే ప్రాణం పెడతారు. మార్గం తప్పారు ... అంటే వారి ముఖం కూడా చూడారు.

ఎవరు వచ్చినా ఎంతో కొంత ఆయన ఎథిరిక్ బాడీలో డిస్టెర్‌బెన్స్ వుంటుంది. అందుకే ఆయన ఒళ్ళు అంతగా తొక్కించుకుంటారు. నేను అందరికీ చెప్పేది ఒక్కటే... వారు చాలా గొప్ప స్థాయి వున్న యోగి. సద్గురువు. వారి గురువుల పట్ల వారికి వున్న వినయం, భక్తి, శ్రద్ధ వుండడం ఇప్పుడు చాలా కష్టం. అయినా అంత కష్టపడకపోయినా, గురువు పట్ల వినయంతో, శ్రద్ధతో వుంటే ఎవరైనా, ఎంతైనా పొందుతారు. లేకపోతే అంతే సంగతులు. ఎవరూ ఎవరి గురించీ వెనుక మాట్లాడకూడదు. ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. ధ్యానం చెప్పి అందరికీ మార్గదర్శకులు అవ్వాలి. పత్రీజీ ఎంతో శక్తి వున్న మహాయోగి. అస్సలు బయటపడరు. ప్రదర్శించరు. చెప్పుకోరు. అంత గొప్ప గురువు అని గ్రహించడం కష్టం. ఎన్నోసార్లు నేను తెలిసీ తెలియనట్లు మాట్లాడినప్పుడు ఊరికే వుంటారు. సమయం వచ్చినప్పుడు అన్నీ గుర్తుచేసి వదిలిస్తారు. అంత జ్ఞాపకశక్తి. ఒక సహస్రారం మాస్టర్ బోధించాలే తప్ప శక్తులు ప్రదర్శించకూడదు. ఎవరికి వారు గురువు మార్గదర్శకత్వంలో ధ్యానం చేసి, చెప్పి శక్తులు సాధించుకోవాలి అనే విషయం ఆయన ఆచరించి చూపే మహర్షి.

'ప్రత్యేకత' అనేది ఆయన అస్సలు ఇష్టపడరు. ఒకసారి ఒక ఇంట్లో ఒక ఇల్లాలు పంచభక్ష్య పరమాన్నాల లాగా భోజనం చేసి పెట్టి పళ్ళెంలో వడ్డించి ఇచ్చింది. ఆయన దాన్ని తన డ్రైవర్‌కు ఇచ్చి తనకు మామూలు పళ్ళెంలో పెట్టించుకుని తిన్నారు. ఒక ఇంట్లో మేడమ్ నాలుగు కూరలతో భోజనం పెట్టింది. కొసరి కొసరి వడ్డిస్తూ "బాగున్నాయా? బాగున్నాయా?" అని ఎన్నోసార్లు అడిగింది. ఈయన .... "చూడండి మేడమ్, నేను పచ్చడి మెతుకులు పెట్టినా తింటాను. పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా పట్టించుకోను. ఎంత తృప్తిగా, ఇష్టంతో పెట్టారు అన్నది మాత్రమే నేను చూస్తాను. నాకు నచ్చకపోతే వంటింట్లోకి వెళ్ళి నేనే చేసుకుని తింటాను" అన్నారు. అది ఆయన స్టైల్.

ఏదంటే అది ఆయన తినరు. సాత్వికంగా వున్నవే తింటారు. నచ్చితేనే తింటారు. బలవంతంగా ఏమీ తినరు. మితంగా తింటారు. తినడమైనా మానేస్తారు కానీ నచ్చనివి తినరు. ఖచ్చితంగా ఆయనకు నచ్చినట్లు ప్రవర్తిస్తారు. ఎవరి మెప్పు కోసమో "అది బాగుంది, ఇది బాగుంది" అనరు. నిజంగా బాగుంటే ప్రదర్శిస్తారు.

మారం : "జమునాలాల్ బజాజ్ అవార్డు ప్రకటించినప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏమిటి?"

స్వర్ణమాలా పత్రి : ఈ విషయం మా బావ గారికి .. అదే పత్రి గారి అన్నగారికి ... ముందు చెప్పాలని అనిపించింది. మా బావ గారి పేరు వేణువినోద్ పత్రి. భౌతికంగా మా బావ గారిది చాలా పెద్ద స్థాయి. ఆయన ఇండియాలో వున్నప్పుడు, హాంకాంగ్‌లో వున్నప్పుడు, ఇప్పుడు అమెరికాలో కూడా ... ఆయన రంగంలో ఆయన మహా నిష్ణాతుడు. ఎంతో పెద్ద స్థాయి వున్నవాడు. చాలా డిగ్రీలు వున్నవాడు.

మారం : "మీ వారికి, మీ బావ గారికీ వున్న అనుబంధం మరి పత్రి గారి అన్నగారు మరి మీ అక్క భర్త ఒకరే అని చెప్పారు కదా." ఫ్యామిలోలో అనుబంధాలూ, ఘర్షణలూ రెండూ వుంటాయి. వివరంగా తెలియజేయండి."

స్వర్ణమాలా పత్రి : చిన్నప్పటి నుంచి మా వారి పైన బావగారి ప్రెషర్ ఎక్కువ. ఎందుకంటే మా మామగారి ఆరోగ్యపరిస్థితి సరిగ్గా వుండేది కాదు. ఈయన బావగారి వద్దనే వుండి చదువుకునేవారు. వీరికి యుక్తవయస్సు రాకపూర్వం కూడా "ఇది చేయి, అది చేయి; ఇలా చేయి, అలా చేయి" అని వీరిని చక్కగా సరిదిద్దేవారు. "ఇది చదువు, ఇది వాయించు, ఇలా బ్రతుకు, ఈ ఉద్యోగం చేయి" అని పత్రి గారిని బాగా గైడెన్స్‌తో బాటు బాగా ఒత్తిడి చేసినవారు. ఈయన డాక్టర్ కావాలని బావగారికి చాలా కోరిక. ఈయనకు "మెడిసెన్ సీటు రాకపోతే హుస్సేన్‌సాగర్‌లో దూకి చచ్చిపోదామా అని... హుస్సేన్‌సాగర్ దగ్గరికి పోయి, ఆత్మహత్య చేసుకోకుండా వాపస్ వచ్చాను" అని పత్రి గారే ఎన్నో మీటింగుల్లో చాలాసార్లు చెప్పారు కదా. అంతటి వొత్తిడి ఈయన మీద బావగారిది. మా వారు I.A.S.కు అప్పియర్ అయి, రెండుసార్లు రిటెన్ టెస్ట్‌లో పాస్ అయి కూడా ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక M.Sc.(Ag) చేసారు. కోరమాండల్ ఫెర్టిలైజర్స్‌లో చేరారు.

మా పెళ్ళయిన తర్వాత ఈయన పరిస్థితి చాలా దయనీయంగా అయింది. వారికి సరయిన ఉద్యోగం రాలేదని నాకు బలవంతంగా అబార్షన్ చేయించారు. ఆ సంఘటన మా వారిని బాగా కదిలించి వేసింది. బిడ్డలు కావాలా లేదా అనే విషయంలో కూడా నాకు స్వాతంత్ర్యం లేకుండా చేశారు. మేము పిల్లలను కనాలా వద్దా అనేది కూడా మీరు నిర్ణయించేది ఏమిటి? నేను చాలా డిస్టర్బ్ అయ్యాను.

ధ్యాన ప్రచారం వారు మొదలుపెట్టినప్పుటి నుంచి కూడా బావగారు అడుగడుగునా వారిని నిరోధించడానికి ప్రయత్నం చేసినవారే. అయితే బావగారు ఎంత అణగద్రొక్కాలని చూస్తే, మా వారు అంతంత ఎత్తులు ఎదిగారు. ఎన్ని అవమానాలు. ఎన్ని ఆటంకాలు. ఇంట్లో ఎప్పుడూ ప్రతికూల పరిస్థితే. మరి ఈయన రాజీనామా చేసిన తరువాత దాదాపు పెద్ద యుద్ధమే అయ్యింది. ఒక ఇంట్లో ఇద్దరు మేధావులు వున్నప్పుడు ఎవరూ ఎవరికీ తగ్గరు. అయితే ఆధ్యాత్మిక గురువుగా వీరు అన్ని పరిస్థితులనూ ఎదుర్కొన్నారు.

అయినా ఒకరకంగా పత్రి గారి ఆధ్యాత్మిక ఔన్నత్యానికి బావగారు పరోక్షంగా కారణమయ్యారు. అందుకే అవార్డు ప్రకటింపబడిందని తెలిసినప్పుడు మొట్టమొదట బావ గారికే చెప్పాలనిపించింది. నా ఆత్రం ఎలా ఉందంటే వారికి వెంటనే చెప్పాలని అమెరికాకు ఫోన్ చేశాను. అప్పుడు అమెరికాలో సమయం రాత్రి రెండు గంటలు. ఫోన్ లిఫ్ట్ చేస్తే "ఇప్పుడు టైమ్ ఎంతయిందో తెలుసా?" అన్నారు. "ఈ కబురు ముందు మీకే చెప్పాలని అనిపించింది తప్ప మరేవిధమైన ఆలోచన రాలేదు" అన్నాను. మా బావగారు నెట్ ఓపెన్ చేసి ఈ అవార్డును గురించిన పూర్వాపరాలన్నీ తెలుసుకుని ఈ అవార్డు ఇచ్చే సంస్థ పేరు ప్రఖ్యాతులు .. గతంలో ఎవరెవరికి ఇచ్చారు, ఏ స్థాయి వారికి ఇచ్చారు ... తెలుసుకున్నారు. ఆయన నాకు మళ్ళీ ఫోన్ చేసి "ఇది నిజంగానే చాలా గొప్ప అవార్డు" అని చెప్పారు. పత్రిగారికి ఫోన్ చేసి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. మా బావగారు కంగ్రాచ్యులేషన్ చెప్పినప్పుడు నేను పొందిన ఆనందం ఇంతా అంతా కాదు. నా జీవితంలో నిజంగానే ఇది మరుపురాని మధురానుభూతి.

మారం : "ఇంత అత్యున్నతస్థాయికి పత్రీజీ చేరుకున్నారు కదా. మరి మీ వైవాహిక జీవితాన్ని మొదటినుంచి నెమరువేసుకున్నప్పుడు మీ అనుభూతులు?"

స్వర్ణమాలా పత్రి : మా పెళ్ళయిన మొదటి అయిదు సంవత్సరాలు నేను మా వైవాహిక జీవితంలో మరపురాని అనుభూతులు పొందాను. వారు క్యాంపులకు వెళ్ళినా వచ్చిన తరువాత నాతో పూర్తిగా గడిపేవారు. అయితే, ఆధ్యాత్మిక స్థితిలో ఆయనలో ఎక్కువ ఎత్తులు ఎక్కడం మొదలైన తర్వాత .. సహజంగానే .. ఆయన నాకు మానసికంగా దూరం కావడం మొదలయింది. అది మొదట అర్థం కాలేదు. చాలా వేదన వుండేది. ఏమీ చెయ్యలేకపోయేదాన్ని. క్రమంగా డిప్రెషన్‌లో పడిపోయాను. కానీ, సత్యం తెలుసుకుని అర్థం చేసుకున్న తర్వాత, పరిస్థితులకు అనుగుణంగా అడ్జెస్ట్ కావడం మొదలుపెట్టాను.

నన్ను నేను అదుపుచేసుకుని, అందరినీ ఆదరించడం మొదలుపెట్టాను. జీవితంలో, ముఖ్యంగా నాలాంటి స్థితిలోని వారి జీవితంలో ఎన్ని సర్ధుబాటు తప్పదని తెలిసాక నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. వ్యక్తిగతంగా నేను జీవితంలో ఘర్షణలకు లోనైనా, ఈ విశ్వం వికసిస్తుందని అర్థం అయినప్పుడు కలుగుతూన్న బ్రహ్మానుభూతిని నేను మాటల్లో వర్ణించలేను. లెక్కలేనన్ని సంఘర్షణల మధ్య లెక్కలేనంత నేర్చుకున్నాను. మాది పబ్లిక్ లైఫ్. ప్రైవేట్ లైఫ్ కాదు కనుక ఎంతో సర్ధుబాటు చేసుకున్నాను నన్ను నేను. వారు ఎప్పుడు ఊరికి వెళ్తారో, ఎప్పుడు వస్తారో ... 'వస్తారు' అనుకుని రానప్పుడు, 'రారు' అనుకుని వచ్చినప్పుడు ... అంతా సహజంగా అనిపిస్తోంది ఇప్పుడు.

పెద్దమ్మాయికి పెళ్ళయింది. చిన్నమ్మాయి 'M.S.' చేస్తోంది అమెరికాలో. దాని పెళ్ళి తప్ప దేని గురించీ నేను ఆలోచించవలసిన అవసరం లేదు ప్రస్తుతం. సమస్థితి వచ్చింది... ముందు చెప్పినట్లుగా, అంతఃశాంతి మొదలయ్యింది. ఇదీ నేను తెలుసుకున్న, నేర్చుకున్న, జీర్ణించుకున్న, అనుభవిస్తున్న పాఠం, జ్ఞానం, ఆత్మజ్ఞానం, ఆనందం, బ్రహ్మానందం.

మారం : "ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులకు, మరి అశేష ధ్యానులకు, పిరమిడ్ మాస్టర్స్‌కు మీ అమూల్య సందేశం."

స్వర్ణమాలా పత్రి : ముఖ్యంగా పిల్లలకు చిన్నవయస్సు నుంచే పిల్లలు ధ్యానం చేయడం వల్ల వారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత కలుగుతుంది. గ్రాహ్యశక్తి పెరుగుతుంది. మానసిక స్థైర్యం పెరుగుతుంది. "వాట్ టు డు? వాట్ నాట్ టు డు" అనే విషయం తెలుస్తుంది. శారీరక ఎదుగుదలతో బాటు మానసిక ఎదుగుదల పెరుగుతుంది. గృహిణులకు ధ్యానం ఎంతో అవసరం. అయితే ధ్యానం చేస్తూ అందులోనే మునిగిపోకుండా మరింత చక్కగా సంసారాన్ని చేసుకోవాలి. ఉద్యోగస్థురాళ్ళైతే మరింత చక్కగా ఉద్యోగాన్ని చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకోవాలి.

"ధ్యానం చేయడం వల్ల ఎంతో అభివృద్ధి పొందింది వీరి కుటుంబం" ... అని ప్రతి ఒక్కరూ అనుకునేలా అందరూ ప్రవర్తించాలి. ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగినా, అది ఔన్నత్యాన్ని పెంచాలి తప్ప సుపీరియారిటీ ఫీల్ కాకూడదు ఎవ్వరూ. మనం కూడా ఇందులోంచే వచ్చిన వాళ్ళమని గుర్తుంచుకుంటూ సరిక్రొత్తగా ధ్యానం మొదలుపెట్టినవారిని సీనియర్స్ చక్కగా గైడ్ చేయాలి. మనల్ని చూసి ఇతర కుటుంబాలు ఆధ్యాత్మిక కుటుంబాలుగా తయారయ్యేలా ఆదర్శమవ్వాలి. అనవసరమైన భయాలు, ఆందోళనలు వదిలేసి నిర్భయంగా, ధైర్యంగా జీవించాలి. అనవసరమైన సెంటిమెంట్లను సమాధి చేసి, పిరమిడ్ మాస్టర్లు అందరూ ఉన్నతంగా తయారుకావాలి. పత్రి గారి జీవితాశయమైన "ధ్యాన జగత్ - 2012" కోసం అందరూ కృషి చేయాలి.

Go to top