" నేను మీకు సదా క్షత్రియుడను "

" ఇతరులకోసం బ్రతుకువాడు మహాత్ముడు "

"G.శివరామనాయుడు గారితో మారం శివప్రసాద్ గారి ఇంటర్వ్యూ"

 

మారం : మీ తొలి గురువు ఎవరు?

శివరామనాయుడు : నా తల్లి. నా తల్లి ఒకప్పుడు చాలా పరిమిత స్వభావం కలదిగా వుండేది. మా నాన్నగారు అద్వైత సిద్ధాంతాన్ని గురించి ఆమెకు ఎప్పుడూ చెప్పేవారు. మా అమ్మకే కాదు .. ఊర్లో వారందరికీ చెప్పేవారు. పదే పదే చెప్పిన మీదట మా అమ్మ క్రమంగా మారి ఆధ్యాత్మికత్వాన్ని అలవరచుకుంది. తరువాత ఆమె నాకు ఆధ్యాత్మికత గురించి నూరిపోస్తూ నన్ను ఆధ్యాత్మికత వైపు ఆకర్షింపబడేలా చేసింది. ఇందుకు తోడు మా పెద్దమ్మ ... నాకు రెండు అద్భుతమైన భాగవత పద్యాలు నేర్పింది... ఆమె నా మలి గురువు.

శుకుడు పరీక్షిత్తుకు చేసిన బోధ :

ఏను మృతుండనౌదునటంచు ఎంతయు భయంబు మనంబులోపలన్ పొందకుము

మానవనాధ ధాత్రిన్ గల జీవులందరకు మరణము తథ్యము గాన

హరిన్‌తలంచుమిక మానవనాధ

పొందెదవు మాధవలోకనివాస సౌఖ్యముల్

ప్రహ్లాదుడూ చండామార్కుల ఆశ్రమంలో ఇతర రాక్షస విద్యార్ధులకు నేర్పిన ఉదంతం :

సంసారమిది బుద్ధిసాధ్యము

గుణ, కర్మ ఘణబద్ధ అజ్ఞాన కారణంబు.

కలవంటిది ఇంతియోగాని నిక్కముగాదు

సర్వార్ధములు మనస్సంభవములు

స్వప్నజాగరములు సమములు

గుణశూన్యుడగు పరముని గుణాశ్రయంబున

భవివినాశంబు వాటిల్లినట్లుండు పట్టిచూడలేవు బాపలార.

మారం శివప్రసాద్ : "ఖగగోళశాస్త్రం గురించి ఎప్పుడూ ఆలోచించేవాడిని" అన్నారు. "'ప్రపంచం ఎలా పుట్టింది?' అనే సందేహం పీడించేది" అన్నారు. దీనికి మీకు ఎక్కడ సమాధానం దొరికింది?

శివరామనాయుడు : పత్రీజీ సంగీత గురువైన డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు కుమారుడు డాక్టర్ రాఘవ తిరుపతిలో నా స్నేహితుడు. ఆ పరిచయంతో నన్ను రాఘవ వారి తండ్రి పినాకపాణి గారి దగ్గరకు తీసుకువెళ్ళాను. ఆయన వద్ద నాకు కొంత స్వాంతన దొరికింది. "అనంతమైన విజ్ఞానాన్ని నువ్వు తెలుసుకోదలచుకున్నప్పుడు నీకున్న అతి ముఖ్యమైన అర్హత జ్ఞానం. కాబట్టి ముందుగా నీ జ్ఞానాన్ని పెంచుకో. దాన్ని కర్మ ద్వారా కానీ, భక్తి ద్వారా కానీ, జ్ఞానం ద్వారా కానీ, యోగసాధన ద్వారా కానీ .. దేంట్లోకైనా ఒక దాంట్లోకి ఆ రంగస్థలానికి పో. థియరీ వద్దు అభ్యాసం చెయ్యి" అన్నారు. అలా నాలో ఎంతో జిజ్ఞాసను కలిగించారు. ప్రపంచాన్నీ, సృష్టినీ గురించిన నా ఆలోచనా తీవ్రత కొంత తగ్గింది. కొంత స్వాంతన కలిగింది.

ఆ విధంగా నా జ్ఞానసాధన మొదలయింది. విపరీతంగా సాహిత్య పుస్తకాలు చదివేవాడిని. విశ్వనాథ సత్యనారాయణ పుస్తకాలంటే చెవికోసుకునేవాడిని. భారత, భాగవత, రామాయణ, భగవద్గీత, ఉపనిషత్తుల లాంటి ఎన్నో పురాణ పుస్తకాలు చదివేవాణ్ణి. శ్రీ పినాకపాణి గారు చెప్పిన వాటిల్లో నాకు 'కర్మయోగం' నచ్చింది. బేసికల్‌గా సివిల్ ఇంజనీర్‌ను కనుక కన్‌స్ట్రక్షన్‌లో విశేషంగా కృషిచేశాను. డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి దగ్గర దొరికిన కొంత స్వాంతన మరికొంత కాలానికి కరిగిపోయింది.

ఆ తర్వాత యూనివర్శిటిలో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేసినప్పుడు తెలుగు ప్రొఫెసర్ తుమ్మపూటి కోటేశ్వరరావు గారితో తరుచూ విశ్వనాథ వారి రచనలపై చర్చించేవాడిని. ఒకరోజు నాలోని ప్రశ్నను మళ్ళీ వారికీ వేశాను. అదే ... " 'ఈ ప్రపంచం ఎప్పుడు, ఎందుకు, ఎలా పుట్టింది?' ఈ ప్రశ్న నన్ను తొలుస్తూ, నాలో అంతులేని వ్యాకులత కలిగిస్తోంది" అని చెప్పాను. వారు నన్ను విష్ణు సహస్రనామ స్తోత్రం చదవమన్నారు. దాదాపు నాలుగు వత్సరాలు విష్ణుసహస్రనామ స్తోత్రం చేశాను. ఆ కాలంలో కలిగిన ప్రేరణతోనే నా భవన నిర్మాణ వృత్తిని సీరియస్‌గా కొనసాగించాను. దీన్ని గుర్తించి సత్యసాయిబాబా నన్ను పిలిపించి పుట్టపర్తిలో వారి కన్‌స్ట్రక్షన్స్ చెయ్యమన్నారు.

మారం : "వారు మిమ్మల్ని ఎప్పుడు పిలిపించారు?"

శివరామనాయుడు : 1985 లో సత్యసాయిబాబా 60 వ జన్మదిన సందర్భంగా పిలిపించారు. ఆ సమయంలో అక్కడ నిర్మాణాలు చాలా హెవీగా వుండేవి. నా గురించి, నా కన్‌స్ట్రక్షన్ నైపుణ్యం, స్పీడ్ తెలిసి, పిలిచి నాకు కాంట్రాక్ట్ వర్క్స్ ఇచ్చారు.

మారం శివప్రసాద్ : సాయిబాబా గారితో మీకు దగ్గరి పరిచయం వుండేదా? వారితో మీకున్న అనుబంధం ఎలాంటిది?

శివరామనాయుడు : పుట్టపర్తిలో నాలుగున్నర సంవత్సరాల్లో, అప్పట్లోనే దాదాపు కోటిరూపాయల వర్క్ చేశాను. ఇప్పటి వాల్యూస్‌తో ఐతే అది దాదాపు పదికోట్ల పైగా అవుతుంది. అయితే క్రమంగా L&T వాళ్ళు 1990 ప్రాంతంలో పుట్టపర్తిలో వర్క్స్ టేకప్ చేయడం వల్ల బయటకు రావలసి వచ్చింది. సాయిబాబా గారితో బాగా దగ్గరి పరిచయం. రోజూ వారిని కలిసే మహాభాగ్యం నాకే దక్కింది. మొట్టమొదట "నేను ఓ కాంట్రాక్టర్‌ని. ఆయన నా యజమాని" అనే భావం. క్రమంగా ఒక ఇన్సిడెంట్‌తో ఆయన దివ్య స్వరూపాన్ని గ్రహించగలిగి ప్రేమతత్వం ఏమిటో తెలుసుకున్నాను.

1985 ఫిబ్రవరిలో వారు నాకు దాదాపు 33 లక్షల రుపాయల వర్క్ ఇచ్చారు. అది టైమ్ బౌండ్ వర్క్. అక్టోబర్‌లో పూర్తి చేయవలసి వచ్చింది. నవంబర్‌లో బాబా వారి 60 వ జన్మదినోత్స్వం. పని స్పీడ్‌గా చేశాను. అక్టోబర్‌కు పూర్తయ్యింది. కానీ ఆశించిన నాణ్యత ఫినిషింగ్‌లో రాలేదు. నాకు నేను నా పనిలో 60 నుంచి 65 శాతం మార్కులు వేసుకున్నాను. బాబా వారు 1985 అక్టోబర్‌లో నిర్మాణ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు, వారికి పూలదండ వేసి, సత్యం చెప్పాను ... "అనుకున్నంత అందంగా ఫినిషింగ్ వర్క్ చేయలేకపోయాను" అని.

అప్పుడు వారు అన్నమాట నాలో ఎంతో మార్పును తెచ్చింది. వారు ఏమన్నారంటే "బంగారూ , నాకు నీ మనస్సు ముఖ్యం. నీపని కాదు" అన్నారు. అంతవరకు వున్న "ఆయన యజమాని, నేను కాంట్రాక్టర్" అనే భావన తొలగిపోయింది. ఆయనొక మానవతీత మహనీయుడని తెలుసుకున్నాను. ఆయన ప్రేమ భావానికి కరిగి, నా వ్యక్తిగత అహంకారం తొలగింది. దాదాపు వారికి సరెండర్ అయిపోయాను.

మారం శివప్రసాద్ : ఆ తర్వాత ఎలా పనిచేశారు? వారితో మీ ఇతర అనుభూతులను వివరించండి.

శివరామనాయుడు : వారికి దాదాపు సరెండర్ అయినా కూడా, నాలో ఇంకా కొంత అహంకారం మిగిలి వుంది. 1988 లో "త్రయీ బృందావన్" బెంగుళూరు వైట్‌ఫీల్డ్స్ రెసిడెన్సీలో స్వామీ వారితో ఒక వారం ఉండే భాగ్యం కలిగింది.

ఒకరోజు వారి పాదాల దగ్గర కూర్చున్నాను. మళ్ళీ నాలో తీరని జిజ్ఞాసతో కూడిన అదే ప్రశ్న ... "ఈ ప్రపంచం ఎందుకు? ఎలా పుట్టింది?" అని. దానికి బాబా "బంగారూ, 'A,B,C,D' లు నేర్చుకోకుండా 'B.A.' పరీక్ష వ్రాయగలవా? " అన్నారు. ఒక్కసారిగా నా ప్రశ్నలోని లోతు అర్థమై నాకు జ్ఞానోదయం కలిగింది. వారి అనంత జ్ఞాన విస్తృతి అర్థమయింది.

మారం శివప్రసాద్ : మీ అభిరుచులు?

శివరామనాయుడు : మొదటిది నా వృత్తి అయిన సివిల్ ఇంజనీరింగ్. ముఖ్యంగా స్ట్రక్చర్స్. ఎటువంటి నిర్మాణమైనా నేను అంచనా కంటే తక్కువ వ్యయంతో నిర్మించగలను. రెండవతి నా ఆధ్యాత్మిక ప్రవృత్తి - అదే ధ్యాన ప్రచారం. మూడవది సంగీత సాహిత్యాలు అంటే అపారమైన గౌరవం. అవంటే చెవి కోసుకుంటాను. నాల్గవది అగ్రికల్చర్. చాలా బాగా వ్యవసాయం చేస్తాను నేను. నాకు 32 ఎకరాల పొలం వుంది.

మారం శివప్రసాద్ : పత్రీజీతో మీ తొలి సాంగత్యం?

శివరామనాయుడు : 1992 సంవత్సరం. ఒకరోజు .. నేను బెంగుళూరులో వైట్‌ఫీల్డ్స్‌లో వున్నప్పుడు మా ఇంటి నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది. నా భార్య చెప్పింది "ఎవరో 'సుభాష్ పత్రి' గారట... మీతో మాట్లాడాలని అడుగుతున్నారు" అని. అనంతపురంలో ఆధ్యాత్మిక సంపన్నులు ఎవరైనా మా ఇంటికి రావడం, మా ఆతిథ్యం స్వీకరించడం, ఆధ్యాత్మిక చర్చలు జరగడం పరిపాటి. ఎందుకంటే ప్రముఖ సివిల్ ఇంజనీర్‌గా, ఆర్కిటెక్ట్‌గా అనంతపురంలో నాకు చాలా పేరుంది. దానికి తోడుగా సత్యసాయిబాబా దగ్గర నాలుగైదు సంవత్సరాలు క్లోజ్‌గా వున్నవాణ్ణి. ఆధ్యాత్మిక జీల్ వున్నవాణ్ణి. నేను నా భార్యకు చెప్పాను "వచ్చేవారం కలవమని చెప్పు; నేను బెంగుళూరు నుంచి రావడానికి ఆలస్యం అవుతుంది" అని. వారం తర్వాత పత్రిసార్ మా ఇంటికి వచ్చారు. అప్పటి నుంచి ఆయన ప్రతి శనివారం సాయంత్రం అనంతపురం రావడం, మళ్ళీ ఆదివారం రాత్రి కర్నూలు తిరిగి వెళ్ళిపోవడం ఆనవాయితీ అయ్యింది. పత్రిగారు ప్రతివారం ఒక పుస్తకం ఇచ్చి చదవమనేవారు. అన్నీ పాశ్చాత్య రచయితల ఇంగ్లీష్ పుస్తకాలే. నేను చదవకపోతే, బలవంతంచేసి చదివించేవారు. శనివారం వచ్చినప్పుడు ఒక పుస్తకం ఇచ్చి మళ్ళీ వారం వచ్చేలోగా పూర్తిచేయాలని చెప్పేవారు. ఆ విధంగా ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు చదివాను. మా మధ్య రాత్రిళ్ళు, తెల్లవారేవరకూ ఆధ్యాత్మిక చర్చ జరిగేది. మేము రాత్రులంతా చదరంగం ఆడేవాళ్ళం. ఉదయాన్నే షటిల్ బాడ్‌మింటన్ ఆడేవాళ్ళం. విస్తారంగా సంగీతం వినేవాళ్ళం. పత్రిగారు ఎడతెరపిలేకుండా కాన్సెప్ట్స్ చెప్పేవారు.

మారం శివప్రసాద్ : వారి గురించి మీరు ఏమనుకునేవారు?

శివరామనాయుడు : నాకు అనిపించేది ... "ఈయనకు ఒకింత ఫార్వర్డ్ కంట్రీస్ మొగ్గు వుందేమో" అని. అయితే ఒకసారి వేదాలపై చర్చ జరిగినప్పుడు షడ్దర్శనాల గురించి .. శిక్ష, మీమాంస, నిరుత్తం, ఛందస్సు, లక్షణం, అలంకారం .. నేను మాట్లాడాను. ఆయన వీటి గురించి అమూలాగ్రంగా వివరించారు. అప్పుడు నాకు అర్థమైంది అది అనంతమైన లక్షణాలున్న మహాజ్ఞానస్వరూపమని. అప్పుడు చెప్పాను పత్రి గారికి .. "నేను మీకు సదా క్షత్రియుడను" అని.

మారం శివప్రసాద్ : వారు మీకేమైనా బాధ్యతలు అప్పజెప్పారా?

శివరామనాయుడు : అవును, "నా మిషన్‌లో నీయొక్క పాత్ర పిరమిడ్లు కట్టించడం" అని ఆదేశం. అంతే, రెండవ ఆలోచన లేకుండా ఉరవకొండ లోబ్‌సాంగ్‌ రాంపా పిరమిడ్‌తో మొదలుపెట్టి విజయవాడ 18 వ పిరమిడ్ కట్టాను. అనంతపూర్ లోని అగస్త్య పిరమిడ్ 60'X60' నేను కట్టించిన అత్యంత పెద్ద పిరమిడ్. ఇంతేకాక మరెన్నో పిరమిడ్స్‌కి ప్లాన్స్ ఇవ్వడం జరిగింది. అయితే నేను డ్రాయింగ్ చేసిన ఖర్చులు మాత్రమే తీసుకున్నాను, ఫీజు వేటికి తీసుకోలేదు. త్రికరణశుద్ధిగా చేసిన ధ్యానసేవ ఇది. నాకెంతో ఆనందాన్నిచ్చిన మహాకార్యం.

మారం శివప్రసాద్ : మీ క్లాసుల్లో చక్కటి పద్యాలు, ఎంతో లోతైనా సాహిత్యపు టచ్ వుంటాయి. వీటికి మూలం ఏమిటి? తెలుగులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారా? సాహితీ పరిశోధన చేశారా? పురాణాల నుంచి, రామాయణ, భారత, భాగవతాల నుంచి, ఉపనిషత్తుల నుంచి, భర్తృహరి లాంటి మహాకవుల కావ్యాల నుంచి జాలువారిన జ్ఞాన మాధుర్యాన్ని, ప్రజ్ఞానపు లోతులను ఎలా చెప్పగలుగుతున్నారు?"

శివరామనాయుడు : నాకు తెలియకుండానే నేను చేసిన ధ్యానసేవ వల్ల నాలో ఎప్పటికప్పుడు కలుగుతున్న ప్రేరణే వీటికన్నిటికీ మూలం. మహానుభావులెందరో ఎన్నో లక్షలవేలసార్లు చెప్పిందే పత్రీజీ అతి సులభంగా అందరికీ అందేలా చెబుతున్నారు. వీరి ద్వారా మనం పొందుతున్న జ్ఞానం మనకు వేదాల నుంచీ, పురాణాల నుంచీ, ఇతిహాసాల నుంచీ వచ్చింది, అని నా అభిప్రాయం. వాటిని స్టడీ చేయడం వల్ల, ప్రేరణ వల్ల నాకు అందుతున్న వాటిని నేను నా ప్రవచనాల్లో అందరికీ పంచుతున్నాను. ఇది ఆ మహనీయుడు పత్రీజీ సాంగత్య మహత్యం, ధ్యానప్రచార ఫలం.

మారం శివప్రసాద్ : మరి మీలో ఎంతోకాలంగా తొలుస్తున్న ప్రశ్న అదే... "ఈ సృష్టి ఎప్పుడు? ఎందుకు? ఎలా ఉద్భవించింది?" అని అడిగారా పత్రీజీని.

శివరామనాయుడు :ఆ. అడిగాను. వారి సాంగత్యం కలిగిన కొన్ని నెలల తర్వాత ఆయన చిరునవ్వు నవ్వారు. అంతే. అప్పుడర్ధమయింది "నేనింకా అజ్ఞానంలో వున్నాను" అని. ఎందుకంటే సమాధానం లేని ప్రశ్నలు కొన్ని వుంటాయి అని. స్వానుభవంతో మాత్రమే వాటిని గురించి అర్థం చేసుకోగలమని.

మారం శివప్రసాద్ : మీ సుదీర్ఘ ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎంతోమంది స్వామీజీలను చూశారు. సత్యసాయిబాబాతో కూడా ఎంతో సన్నిహితంగా వున్నారు. చివరికి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలో స్థిరపడ్డారు. మీ ఫైనల్ ఒపీనియన్?"

శివరామనాయుడు : ఈ ఆధునిక యాంత్రిక యుగంలో .. ఈ ఒరవడిలో ... ప్రజలకు తగినట్లుగా ... సత్యాన్ని ధ్యానం ద్వారా ఫాస్ట్‌గా, సింపుల్‌గా, స్ట్రెయిట్‌గా, స్థిరంగా అరటిపండు ఒలిచి పెట్టినట్లు బోధిస్తున్నారు పత్రిసార్. ఊరూరా, వాడవాడలా, ఇంటింటికీ, ప్రతి వ్యక్తి ముందుకు ప్రపంచమంతా ధ్యాన సౌరభాన్ని అందిస్తున్న ఏకైక గురుసార్వభౌముడు ఒక్క పత్రిసారే. ఇదీ ఆయన పట్ల నాకున్న ఒపినీయన్. ఆయన బాహ్యం వేరు. అంతరం వేరు. చాలా జాగ్రత్తగా తరచి తరచి చూస్తేనే ఆయన సహజమైన అంతఃరూపం అర్ధమవుతుంది.

మారం శివప్రసాద్: ఇటీవలే రిటైర్ అయ్యారు కదా. మీ తదుపరి కార్యక్రమాలు?

శివరామనాయుడు : నేను రిటైర్ కాకముందు నుంచీ గత నాలుగు సంవత్సరాలుగా పల్లెసీమలో ధ్యాన ప్రచారం చేస్తున్నాను. భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. పల్లెల సౌభాగ్యమే దేశ సౌభాగ్యం. అయితే ఈ ఆధునిక జీవిత మోజులో ప్రజలంతా పల్లెల్లో నిరాశ, నిస్పృహల్లో తేలియాడుతున్న పరిస్థితుల్లో వారిలో ఉత్సాహాన్ని రేకెత్తించి, చైతన్యాన్ని ధ్యానం ద్వారా మేలుకొలిపి వారిలో జ్ఞానమనే ఊపిరిని పోయడం ద్వారా వారి నిరాశా నిస్పృహలను దూరం చేయడమే నా లక్ష్యం. పాటలు, పద్యాలు, ఇతిహాసాలు బేస్ చేసుకుని, వారిని మేలుకొలిపి ధ్యానాన్ని జోడించి బోధిస్తూ, వారు ఆనంద జీవన మార్గంలో సాగేట్లుగా తయారుచేయడమే నా గమ్యం. ఇదే నా మిషన్. పత్రీజీ ఆదర్శాన్ని ధ్యాన, జ్ఞాన బోధను ఇలా ప్రచారం చేయడానికే నా జీవితం అంకితం.

మారం : మీ కుటుంబం, ప్రెజెంట్ ఆక్టివిటీ?

శివరామనాయుడు : ఇద్దరు పెళ్ళయిన కూతుళ్ళు. ఇద్దరు ఉద్యోగం చేస్తున్న పెళ్ళికాని కుమారులు. 'ఆక్టివిటీ' అంటే అనంతపూర్‌లో మరింత ధ్యాన ప్రచార కోసం సాహిత్యం, పద్యాల ద్వారా నా ధ్యాన క్లాసులు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి క్లాసులు పెట్టాం. ఇంకా ఎన్నెన్నో.

మారం శివప్రసాద్ : "ధ్యానానికి సంబంధించిన రెండు మూడు పద్యాలు ఇస్తే మహాభాగ్యం."

శివరామనాయుడు :

సీ. కరణంబులు అఖిలోపకరణంబులు గాగ

ప్రాణంబులు వుపచార భటులు గాగ

గంగా ప్రముఖ నదులు జలంబులు గాగ

షట్కమలములు పుష్పములు గాగ

జఠరాగ్నిహోత్రముల్ ధూపములు గాగ

జీవకళలు దీపములు గాగ

నందితానందంబు నైవేద్యము

రవిశశులు జ్యోతులు హారతులు గాగ

 

తే: అంగదేవాలయమున సహస్ర ఫణి పీఠమున

శాంతి జనకజోపేతుడై చెలగు శ్రీరామ

నర్చించుచుండ ఆధ్యాత్మవిదులు

ఈశ్వరప్రణిధానమంద్రు

"అన్ని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఈ ప్రపంచమంతటికీ జ్ఞాన, కర్మేంద్రియాలు కాగా, పంచప్రాణాలు ఉపచారం చేసే సేవకులు కాగా, సంపూర్ణ నాడీమండల వ్యవస్థ ప్రాణధార అయిన నీరు కాగా, ఆరు చక్రములు పుష్పాలు కాగా, మనలోని ప్రాణశక్తి ధూపం కాగా, మనలోని చిత్కళలు (జీవకళలు) దీపాలు కాగా, నీలో కలిగే ఆనందమే నైవేద్యం కాగా, కనులు జ్యోతులు, హారతులు కాగా, శరీరమనే దేవాలయమందు వేయిపడగలు విప్పిన సహస్రారం కాగా, శాంతి అనే తత్వం నుంచి పుట్టిన సీత అను భూజాతను స్వీకరించిన ఆత్మరాముని అర్చిస్తూంటే ఆధ్యాత్మి విదులు ఈశ్వరప్రణిధానం పొందెదరు కదా."

- "భారతీయ ఆధ్యాత్మిక తత్వం" నుంచి

మారం శివప్రసాద్ : "ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులకు మీ సందేశం?"

శివరామనాయుడు : తనకోసం బ్రతుకువాడు మనిషి. ఇతరులకోసం బ్రతుకువాడు మహాత్ముడు.

థాంక్ యూ

Go to top