" మైత్రేయ బుద్ధా స్పిరిచ్యువల్ కేర్ సెంటర్ - సంవత్సర ధ్యానానుభవాలు "


"మనం రిటైరయ్యాం. " నిజమా? కానేకాదు. కేవలం ప్రభుత్వ విధుల నుంచి తప్పుకోవటం మాత్రం జరిగిందంతే. ఇప్పుడే అసలైన స్వేచ్ఛ పొందాము. మానవాళి జీవన స్రవంతిలో ఎందరో మహాత్ములు, మహర్షులు, బ్రహ్మర్షులు పుట్టారు. వారు 'స్వధర్మం' పాటించి, జీవితాలు సార్ధకం చేసుకుని, వారి ప్రబోధాలు, జీవిత సత్యాలు మనకు అందించారు.

కుటుంబ ధర్మం, సంఘ ధర్మం అన్నవి నిర్వర్తిస్తున్నా ... "ఇంతకు మించి ఏదో 'స్వధర్మం' వుంది. అది ఏమిటి?" అని అనుకుంటూన్న సమయంలో ... జగత్తునే ధ్యానమయం చేసి సర్వేజనా సుఖినోభవంతుగా చూడాలనే దృఢమైన, విశాల ఆశయంతో, అందరినీ "మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్" అనే సంబోధనలతోనూ, "అందరూ శాకాహారులు కావాలి" అనే గంభీర గర్జనతోనూ పత్రీజీ చేస్తున్న కృషి మమ్మల్ని ఎంతగానో ఆకర్షించింది.


1988 సంవత్సరం నుంచి ఎన్నో రకాల ధ్యానాలలో కొంత సాధన చేస్తున్నా .... నిరంతరం మనతోనే వుంటూన్న శ్వాసనే సాక్షీభూతంగా గమనించి, మనస్సు శూన్యం చేసుకోవటం, తద్వారా నాడీమండలశుద్ధి చేసుకోవటం ... అందరికీ ఆచరణ సాధ్యమయ్యేలా 2005, ఫిబ్రవరి రాజమండ్రిలో "మైత్రేయబుద్ధా స్పిరిచ్యువల్ ట్రస్ట్" స్థాపించటం జరిగింది. ట్రస్ట్‌లో భాగంగా బ్రహ్మర్షి పత్రీజీ గారిచే 2005, జూలై 19 న "పిరమిడ్ స్పిరిచ్యువల్ కేర్ సెంటర్" ప్రారంభించబడి సరిగ్గా సంవత్సరం అయ్యింది.

"కేర్ సెంటర్"కు ఎన్నో రకాల శారీరక, మానసిక రుగ్మతలతో వున్న పేషంట్స్ వస్తున్నారు. బి.పి., షుగర్ అతి సామాన్యం, ఎక్కువుగా టెన్షన్, నరాల బలహీనత, జీవితంలోని ఆటు పోటుల అర్థం చేసుకోలేక టీనేజ్ లోనే ఆత్మహత్యా ప్రయత్నాలు, కన్‌ఫ్యూజన్‌తో వస్తున్న ప్రతివారినీ ఆదరించి, కౌన్సిలింగ్ చేసి, వారికి ముందుగా రెండు గంటలు జీవితం గురించి, వారి 'స్వధర్మం' గురించి వివరించి, 'ధ్యాన విశిష్టత'ను అర్థం చేసుకునే రీతిలో చెప్తూ, 'ఆధ్యాత్మిక సత్యం' C.D.ని చూపించి, 'ధ్యాన సాధన' చేయించటం జరుగుతోంది. 'జ్ఞాన నవరత్నాలు' వివరిస్తున్నాం. ప్రతిరోజూ ఎందరో వారి వారి వీలుని బట్టి పిరమిడ్ క్రింద ధ్యానం చేసుకోవటానికి వస్తున్నారు. ఎన్నో అనుభవాలు పొందుతున్నారు. విడవకుండా 40 రోజులు ధ్యానదీక్ష కోసం వస్తూంటారు.

2006, ఫిబ్రవరి 18 న బ్రహ్మర్షి పత్రీజీ కేర్ సెంటర్‌ను సందర్శించారు. ఇక్కడ శిక్షణ పొందిన ధ్యానులు వారి అనుభవాలు పంచుకున్నారు. శ్రీమతి గౌతమి 13 సంవత్సరాల నుంచి వున్న మైగ్రెయిన్ వారం రోజుల ధ్యానసాధనతో మటుమాయమైంది. ఇప్పుడు నో టాబ్లెట్స్.

బేగం మేడమ్ అల్సర్‌తో, కడుపునొప్పితో బాధపడుతూండేది. ఆమెకు వింత అనుభూతి, ధ్యానంలో డాక్టర్ ఆపరేషన్ చేసి కడుపులో కణితి తీసివేసినట్లు .. ఇక ఏ నొప్పీ లేకపోవటం ఎంతో సంతోషంగా పత్రీజీతో చెప్పారు. న్యూరోఫిజీషియన్స్ తమ వైద్యంతో కాని కేసెస్, "మెడిటేషన్ ఒక్కటే శరణ్యం" అని కేర్ సెంటర్‌కు పంపిస్తున్నారు. వారికి ధ్యానంలో స్వాంతన కలగడం మరో విశేషం. అందరూ పిరమిడ్ ధ్యానంలో ఎంతో ప్రశాంతతను పొందుతున్నారు. 30 సంవత్సరాల నుంచి గురకతో బాధపడే శ్యామసుందరరావు ధ్యానసాధనతో విముక్తి పొందారు. కొందరి ధ్యానులు ఇళ్ళల్లో వున్న నెగెటివ్ ధోరణి నుంచి క్రమంగా బయటపడుతున్నారు.

దేనికైనా సమయం రావాలంటారు. ఇక్కడ కేర్ సెంటర్లో ధ్యానులు పొందుతున్న అనుభవాలు చూసి మెదట్లో "అంతా 'గ్యాస్'" అనుకునేవారు ... ఇప్పుడు స్వీయ అనుభవం పొందుతున్నారు. ధ్యాన రహస్యాన్ని రెట్టింపు ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు.

ఎప్పట్నుంచో మాంసాహారులుగా వున్నవారు, ఇష్టాపూర్వకంగా శాకాహారులుగా మారుతూండటం ఎంతో సంతోషాన్నిస్తోంది. దేవాలయాలు ధ్యానాలయాలౌతున్నాయి. ఇక్కడ షిరిడీ సాయి ధ్యానమందిరం మాకు చక్కని వీలైన వేదిక. 40 రోజుల ధ్యానయజ్ఞం ట్రస్ట్ మెంబర్ శ్రీమతి తన్నీరు రమాదేవి దిగ్విజయంగా నిర్వహించారు. ఎందరినో ధ్యానం వైపుకు మరల్చారు. 41 వారాలుగా జరుగుతూన్న వారం, వారం సత్సంగాలకు ఎందరినో తీసుకెళ్తున్నాం.

బొమ్మూరు లోని ప్రభుత్వ మహిళా ప్రాంగణంలో శిక్షణ పొందుతున్నవారికి వారం, వారం ధ్యాన పరిచయం, ధ్యాన సాధన చేయించటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాజమండ్రిలోనే ఆంధ్రాబ్యాంక్ వారి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ వారి 45 రోజుల శిక్షణ పొందుతున్నవారిచే రోజూ మెడిటేషన్ చేయిస్తున్నాం. సాయి ధ్యానమందిరంలో ఇప్పుడు ఆరు బ్యాచ్‌లు, రోజూ గంటన్నర ధ్యానం, సత్సంగం జరుగుతున్నాయి. వీటిలో రెండు బ్యాచ్‌లు కేవలం స్త్రీలకే.

ములకల్లంక గ్రామంలో అనూహ్య స్పందన వచ్చింది. అన్ని పల్లెల్లో, ముఖ్యంగా స్కూళ్ళల్లో విద్యార్ధి దశ నుంచే ఈ ధ్యానాన్ని అందించాలని మా దృఢ సంకల్పం. ఈ మా ప్రయత్నంలో శ్రీమతి తన్నీరు రమాదేవి, వారి శ్రీవారు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారు.

మారేడుమిల్లి, తిరుపతి ట్రెక్కింగులకు కర్నూలు, బెంగుళూరు ధ్యానోత్సవాలకు మాతో చాలామంది హాజరయ్యి ఎన్నో అనుభవాలు పొందారు. సీనియర్ మాస్టర్స్ ధ్యానరత్న D.కేశవరావు, తిరుపతి సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామారావు, సత్తెనపల్లి; అదోని ధ్యానరత్న ప్రేమనాథ్ సార్‌లను ఆహ్వానించి నగరంలో కొన్ని కాలనీలలో క్లాసులు ఏర్పాటు చేసాం.

అన్నింటికీ మించి మా చిరకాల వాంఛ మా స్వంత "పిరమిడ్ హౌస్" నిర్మాణం జరగటం ప్రత్యేకంగా సంతోషంగా వుంది.

 

చిట్టూరి. కల్పన, C.S.మూర్తి
రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా
ఫోన్ : +91 94404 83875

Go to top