" ఆరవ కైలాస మానససరోవర ధ్యానయాత్ర "

" శివుని పిలుపు అందితే ఆగుతామా? "

 

2001 వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కైలాస మానససరోవర ధ్యానయాత్రలు జరుగుతూన్న విషయం పిరమిడ్ ధ్యానులందరికీ తెలిసిన విషయమే. ఐదు పర్యాయాలు 'ధ్యాన యాత్ర' ను దిగ్విజయంగా చేసుకుని, ఆరవ కైలాస మానససరోవర ధ్యానయాత్ర కూడా జూలై 3 నుంచి 21 వరకు 32 మంది మాస్టర్స్‌తో దిగ్విజయం చేసుకుని తిరిగిరావడం పిరమిడ్ ఆధ్యాత్మిక చరిత్రలో మరొక సువర్ణధ్యాయం.

2001 మరు 2002 సంవత్సరాలలో నేపాల్ బోర్డర్ వరకూ రైలు ప్రయాణం, తరువాత బార్డర్ నుంచి ఖాట్మండు వరకూ బస్సు ప్రయాణం. అయితే, 2003, 2004, 2005 సంవత్సరాలలో జరిగిన మానససరోవర ధ్యానయాత్రల్లో బెంగుళూరు నుంచి ఖాట్మండు వరకు నేరుగా విమాన ప్రయాణం.

కానీ 2006 లో జరిగిన మానససరోవర యాత్రలో ఖాట్మండు చేరేవరకు ఉత్కంఠ. ఏప్రిల్ 2006 లో విమాన టికెట్లకు సంప్రదిస్తే చావు కబురు చల్లగా చెప్పినట్లు బెంగుళూరు నుంచి ఖాట్మండు వరకు తిరిగే విమానాన్ని నేపాల్ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. ఇక ఎలా వెళ్ళాలో మొదట అర్థం కాలేదు. పోనీ యాత్రను రద్దు చేసుకుందామా అంటే అప్పటికే చైనా, నేపాల్ వారికి ఎక్కువుగా డబ్బులు కట్టడం జరిగింది. వెహికిల్స్‌కు, ఏజెంట్లకు, షెర్పాలకు, టెంట్లకు, గెస్ట్‌హౌస్‌లకు అడ్వాన్స్‌లు ఇవ్వడం జరిగింది. ఏం చేయాలో తోచలేదు. ఏప్రిల్ 14, 2006 రాత్రి ధ్యానానికి కూర్చున్నా. శివుని ఆజ్ఞ అయితే మానససరోవర యాత్ర చేస్తాం. లేదా నిలిపివేస్తాం. ఆ రోజు రాత్రి ధ్యానంలో "ఖంగారు అవసరం లేదు, రేపు ప్రయత్నించు... అన్నీ సక్రమంగా జరుగుతాయి" అన్నారు.

15 వతేదీ విచారించగా బెంగుళూరు నుంచి ఖాట్మండు వరకు విమాన ప్రయాణం ... మొట్టమొదటగా బెంగుళూరు నుంచి ఢిల్లీకి వెళ్ళాలి. అక్కడి నుంచి ఇంకొక విమానంలో ఖాట్మండు వెళ్ళాలి. అలాగే తిరుగు ప్రయాణంలో ఖాట్మండు నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌కు విభిన్న విమానాల్లో రావాలి. "చార్జీ మొత్తం 27,500 రూపాయలు అవుతుంది" అన్నారు. మామూలుగా 15,500 రూపాయలు అవుతాయి. నేరుగా వెళ్ళి నేరుగా రావడం. ఇప్పుడు నాలుగు విమానాలెక్కాలి, అందునా డబ్బు ఎక్కువ, శ్రమ. ఎన్నో సంప్రదింపుల తరువాత నాలుగు విమానాలకు కలిపి ఒక్కొక్కరికి 17,000 రూపాయల నుంచి 18,500 రూపాయిల వరకు కుదిరాయి. ఈశ్వరుని ఆజ్ఞ అయ్యింది. గురూజీ గారి ఆశీస్సులు లభించాయి. ప్రయాణం కుదిరింది.

మామూలుగా జూన్ రెండవ వారంలో మానససరోవర యాత్ర జరుగుతుంది. అలాగే మొదట జూన్ 16, 2006 ప్రయాణం ప్రారంభం తేదీగా నిర్ణయించాం. కానీ అనుకోకుండా నేను మే 30 నుంచి జూన్ 5 వరకు విపరీతమైన శారీరక అస్వస్థతకు గురయ్యాను. పాస్‌పోర్ట్స్ సమయానికి వీసా కోసం పంపడానికి టైమ్ లేదు. పత్రీజీ గారిని అడిగా ... జూలై గురుపౌర్ణమికి మానససరోవరం చేరడానికి ప్లాన్ చేయమన్నారు. అలాగే జూలై 3 నుంచి జూలై 21, 2006 వరకు ప్లాన్ చేసాం.

మొదట అనుకున్నట్లు జూన్ 16 అయితే, మాకు వీసా వచ్చి వుండేది కాదు. జూన్ 9 నుంచి జూన్ 25 వరకు వీసాలు ఇవ్వలేదట. నాకు శారీరక అస్వస్థత కలుగకపోతే జూన్ 16 ఫిక్స్ చేసుండేవాణ్ణి. చాలా సమస్యలు వచ్చుండేవి. నా అనారోగ్యం వల్ల తేదీ మారింది. అన్నీ సుఖంగా జరిగాయి. కారణం లేనిదే కార్యం జరుగదు కదా.

ఇంకొక అద్భుతం. శ్రీమతి శారద హైదరాబాద్ నుంచి వస్తున్నారు. జూలై 3 న బయలుదేరాలి. అయితే జూన్ 30 న వాళ్ళ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. జూలై 2 న బెంగుళూరు చేరాలి. దిక్కుతోచని పరిస్థితి. ఇటు మానససరోవర ప్రయాణం, అటు ఆసుపత్రిలో అమ్మాయి. ఏం చేయాలో తెలియక పత్రి గారిని ఏం చేయాలో అడిగారట. "ఏం పరవాలేదు. మీరు ప్రయాణానికి సిద్ధం అవ్వండి. అన్నీ సక్రమంగా జరుగుతాయి. మానససరోవరంలో చక్కగా ధ్యానం చేయాలి" అన్నారట. వారి అమ్మాయి కూడా "నువ్వు వెళ్ళమ్మా, అన్నీ బాగుంటాయి" అందట. ఒక్కసారి ఆలోచిస్తే ఎవ్వరైనా ఆ పరిస్థితులలో ఎలా వుంటాం? యాత్రకు వెళ్ళేటంత ధైర్యం చేస్తామా? అదీ దేశం కాని దేశం. కానీ శారద గారికి గురువు పైన నమ్మకం. వెంటనే నాకు ఫోన్ చేసారు. "గురువు గారు ఎలా చెప్తే అలా చేయండి... మీరు కూడా ధ్యానే కదా ... ధ్యానం చేస్తే జవాబు దొరుకుతుంది" అన్నాను. చక్కగా ధ్యానం చేసారు, మానససరోవర యాత్ర వెళ్ళి వచ్చారు. మానససరోవరంలో భువి నుంచి దివికి దిగే చైతన్యశక్తిని చూసారు. యాత్ర ధన్యమయింది. యాత్ర ముగించుకుని క్షేమంగా తిరిగి వచ్చారు. ఇది మానససరోవర యాత్రలో జరిగిన మహాద్భుతమే కదా. శివుని పిలుపు అందితే ఆగుతామా?

హైదరాబాద్ శ్రీమతి ఇందిర. ఆవిడకు నాలుగు నెలల ముందే కాలుజారి పడటం. యాత్ర రద్దు చేసుకోవడం. ఇందిర గారికి ఎలాగైనా రావాలనే తపన. కానీ కాలికి ఫ్రాక్చర్ ... జూన్‌లో అయితే రావడం కష్టం. కానీ జూలై నెలకి ఇందిరగారు ధ్యానం చేయడం, కాలు బాగు కావడం, యాత్రకు రావడం నిజంగా అద్భుతం.

70 సంవత్సరాలు పైబడిన శ్రీమతి రాములమ్మ(మహబూబ్‌నగర్), ఓబులమ్మ (ధర్మవరం) వీళ్ళూ బ్రతికి బట్టకట్టడం నిజంగా దైవఘటనే.

ఇవన్నీ ఒక ఎత్తయితే .. నేను శారీరక అస్వస్థత గురైనా కూడా అంత తక్కువ వ్యవధిలో ఖాట్మండుకు వెళ్ళి, చైనా బోర్డర్ 'కొదారి' వరకు వెళ్ళడం, రావడం నిజంగా అద్భుతమే.

ఆరు పర్యాయాలు నాచే కైలాస మానససరోవర ధ్యాన యాత్ర నిర్వహింపచేసిన గురూజీ గారికి, యాత్ర నిర్వహణలో ముందుండి నడిపించిన ఆస్ట్రల్ మాస్టర్స్‌కు కృతజ్ఞతాభిధ్యాన వందనాలు.

2007 సంవత్సరంలో జరిగే ఏడవ .. మరి ఆఖరి .. కైలాస మానస సరోవర ధ్యాన యాత్రలో గురూజీ గారు కూడా వస్తాననడం నిజంగా పిరమిడ్ మాస్టర్స్‌కు ఆనందదాయకం. 2007 లో జరిగే ఏడవ మానససరోవర ధ్యాన యాత్ర కేవలం అంతరంగిక సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్లతో మాత్రమే జరిగే అపూర్వ ధ్యానయాత్ర. పత్రీజీ గారి సాన్నిహిత్యంలో హిమాలయాలన్నీ ధ్యానాలయాయులుగా మారుతాయనటంలో సందేహం లేదు.

నాకు సహాయ సహకారాలు అందిచిన పిరమిడ్ మాస్టర్లందరిఖీ కృతజ్ఞతాభివందనాలు.

 

కంచి రఘురామ్
83, కోలా విధి, తిరుపతి

Go to top