" గొప్ప యాత్ర మానససరోవర ధ్యానయాత్ర "

పవర్‌ఫుల్ వైబ్రేషన్స్ ... అన్ లిమిటెడ్ హ్యాపీనెస్


నా పేరు శారద. గత పది సంవత్సరాల నుంచి నేను మెహదీపట్నంలో వుంటున్నాను. గత పదహారు సంవత్సరాల నుంచి నేను ధ్యాన మార్గంలో వున్నాను. బ్రహ్మకుమారి మెడిటేషన్‌లో 1990 నుంచి వున్నాను .... నాకు గౌతమబుద్ధుడు అంటే చాలా, చాలా ఇష్టం. తనకంటూ ఎలాంటి బాధలు లేకున్నా ప్రపంచంలో రోగాల్ని, శోకాన్ని, దుఃఖాన్ని చూసి చలించి "ఈ దుఃఖానికి కారణం ఏంటి?" అని సత్యశోధన చేసిన గొప్ప వ్యక్తి. వారు నేర్చిన టెక్నిక్స్‌లో హీలింగ్ - విపస్సన - ఆనాపానసతి స్టెప్ బై స్టెప్‌గా నేనూ 2000 సంవత్సరం నుంచి సాధన చేస్తూ ఎన్నో అద్భుతమైన అనుభవాలను స్వయంగా అనుభవించటం జరిగింది.

చేవెళ్ళలో మాకు మామిడి తోట వుంది. అక్కడ ఒక గుడిసెలా నిర్మించి దాన్లో ధ్యానం చేసేదాన్ని. నేను వారానికి రెండు మూడుసార్లు దాన్ని విజిట్ చేయటం జరుగుతూండింది. నాకు ఏ మెడిటేషన్ సెంటర్లోనూ కలగని దివ్య అనుభూతి ఆ స్థానంలో ధ్యానం చేస్తున్న సమయంలో కలిగేది. జనవరి 2006లో సడన్‌గా సుడిగాలిలా వచ్చి నా కళ్ళ ముందే ఆ గుడిసె ఒక గొడుగులా లేచి కింద పడింది.

అప్పటివరకు లేని అలజడి నాలో ఏదో కలిగింది. "అక్కడ తిరిగి ఏదన్నా మెడిటేషన్ రూమ్ నిర్మించాలి" అని సంకల్పించి "మామూలు రూమ్ ఎందుకు కట్టాలి? పిరమిడ్ నిర్మిస్తే ఎనర్జీ లెవల్ బాగుంటుంది కదా." అని అనిపించింది. "లోకల్‌గా కూడా పదిమందికీ ఉపయోగపడుతుంది" అనిపించింది. పిరమిడ్ ఇంజనీర్ మధుసూదన్ గారిని కన్సల్ట్ చేశాను.

వారి గైడెన్స్‌తో మార్చిలో మొదలుపెట్టి జూన్‌లో పూర్తి చేయటం జరిగింది. పిరమిడ్ పేరు 'దివ్యశక్తిక్షేత్రం'. ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు విచ్చేయగా మన పత్రీజీ గారి చేతుల మీదుగా దివ్యశక్తి క్షేత్రానికి ప్రాణప్రతిష్ట చేయటం జరిగింది.

ఆ కార్యక్రమం అంతా చాలా అద్భుతంగా జరిగింది. వచ్చిన ధ్యానులకు, బయటనుంచి వచ్చిన వారికి కూడా దివ్యానుభూతులు కలిగాయి.

నా జీవితంలో ఈ సంవత్సరంలో అనుకోకుండా జరిగిన మరో గొప్ప యాత్ర మానససరోవర ధ్యానయాత్ర. జూలై 3 వతేదీ బెంగుళూరు నుంచి పత్రీజీ గారి ఆశీస్సులతో బయలుదేరాం.

"అందరూ ఊహించుకుని భయపడేంత కఠినమైన యాత్ర ఏమీ కాదు" అని నా స్వానుభవంతో చెబుతున్నాను. కాకుంటే ఫిజికల్ ఫిట్‌నెస్ వుండాలి. లేనివారు ప్రికాషన్స్ తీసుకోవాలి. సదా ధ్యానంలో నిమగ్నమై వుండాలి.

న్యాలం నుంచి శ్వాస మీద ధ్యాస ఉంచనవసరంలేదు. అదో ఆటోమెటిగ్గా వుంటుంది. ఎందుకంటే అక్కడి నుంచే ఆక్సిజన్ లెవల్ తగ్గుతూ వస్తుంది. అక్కడి వాతావరణానికి మన శరీరం అలవాటుపడాలి. అందరి ధ్యాస ఒక్క శ్వాస మీదే వుంటుంది. అక్కడ ఇంక వేరే పని కూడా లేదు చక్కగా ఉదయం 4.00 గంటలకు అన్నీ మన దగ్గరకు వచ్చేస్తాయి. టీ, బ్రేక్‌ఫాస్ట్ వగైరాలు స్వీకరంచటం, శరీరాన్ని 'టయోటా' లో చేరవేస్తే చాలు ధ్యానంలో వున్న యోగులు గమ్యాన్ని సునాయాసంగా చేరుతారు.

అయితే ధ్యానులు కానివారికి అదో నరకంలా, క్షణ క్షణం ఒక గండంలా భావించటం జరుగుతుంది. 9 వతేదీ ప్రయాంగ్ నుంచి బయలుదేరాక 10.30కి లంచ్ చేశాం (లోకల్ టైమ్ 12.30వుంటుంది). అక్కడి నుంచే నా శరీరం దూదిపింజలా తేలిపోయింది. చెప్పలేని ఆనందం. "70 కిలోమీటర్లు వుంటుంది మానససరోవరం" అన్నారు. అయితే ఆ పవర్‌ఫుల్ వైబ్రేషన్స్, అన్‌లిమిటెడ్ హ్యాపీనెస్ అనేది నేను నాన్‌స్టాప్‌గా మూడుగంటలు ఎంజయ్ చేయటం జరిగింది. మధ్యాహ్నం ౩.౦౦ గంటలకు సరోవరం చేరుకున్నాం. మాటల్లో వర్ణించలేని అద్భుతమైన ఆనంద తరంగాలు. అప్పటివరకు చాలామంది అంటే 70% సిక్‌నెస్‌తో సఫర్ అవుతున్నవారు సైతం ఆనందపరవశులై అందరి మోహాలు చెప్పలేనంత వర్ణించలేనంత దివ్యానుభూతికి వశులయ్యారు.

అందరూ చిన్నపిల్లల్లా స్వచ్ఛంగా కల్మషం లేకుండా ఒక ఆటలో గెలిచిన, విజయాన్ని పొందిన ఫీలింగ్. దారిపొడవునా ప్రయాణంలో రకరకాల బాధలు .. వాళ్ళ మనస్సు, శరీర సహకారాల మీద ఆధారపడి వున్నవారు అక్కడకు చేరాక అందరి ఫీలింగ్ ఒక్కటే.

ఒకవైపు సహజసిద్ధమైన కైలాస పర్వతం నేచురల్ పిరమిడ్‌లా సాక్షాత్కారం. మరోవైపు అస్తమించే సూర్యకిరణాల వెలుగులో అద్భుతమైన సరోవరం. ఆకుపచ్చ, పసుపుపచ్చ, నీలం రంగుల్లో మెరిసే సరోవర జలాలు. సరోవర పరిక్రమ చేసుకుని వెహికిల్స్ నుంచే నైట్ హాల్ట్ గెస్ట్‌హౌస్ చేరాం.

అందరూ అలసిపోయి వున్నారు. నేనైతే రాత్రికి సరోవరంలో అద్భుతమైన కనువిందు చేసే నక్షత్రాల ఆగమనం "పౌర్ణమి రోజయితే 33 కోట్లమంది దేవతలు వస్తారు" అని విన్నాను. 6.00 గంటల నుంచి 10.00 గంటల వరకు కాస్త రిలాక్స్ అయ్యి 10.00 గంటల నుంచి కంటిన్యువస్ మెడిటేషన్‌లో కూర్చున్నాం. గెస్ట్‌హౌస్ ముందు వర్షం ఏకధారగా పడుతోంది. 12.00 వరకు కూర్చుని వైల్డ్ డాగ్స్ తిరుగుతాయని చెప్పేసరికి రూమ్స్‌లోకి వెళ్ళి కూర్చుని 2.00 వరకు ధ్యానం చేశాం. అందరూ కుక్కలు ఇకరావని నిశ్చయించుకుని నిద్రపోయారు. నేను మాత్రం ఏకాగ్రతగా ధ్యానంలో కూర్చున్నాను. 3.00 గంటలకు మాతోబాటు వచ్చిన 'రాములమ్మ' అనే 75 సంవత్సరాల వృద్ధురాలు దాహం, దాహం అని అడుగుతూంటే ఆమెని సరిగా పడుకోబెట్టి సేదతీరాక తిరిగి ధ్యానంలో కూర్చున్నాను.

కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగు. అర్ధంకాలేదు. సరోవరంపై ఒక బీమ్‌లా కాంతిపుంజం. అనంతమైన, అద్భుతమైన వెలుగు ... అలా నీళ్ళలోకి వెళ్ళి మళ్ళీ పైన సాక్షాత్కారం. నా శరీరం అంతా కంపిస్తూ వుంది. తట్టుకోలేని శక్తి అన్నివైపుల నుంచీ నన్ను కవర్ చేస్తున్న దివ్యానుభూతి .. మాటల్లో వర్ణించలేను. ఉదయం 4.00 గంటల వరకు అలానే ధ్యానం చేస్తూ వున్నాను. తర్వాత కొంతసేపు విశ్రాంతి. ఉదయం 9.00 గంటలకు సరోవర స్నానం. జీవితంలో ప్రతి మనిషీ ఒక్కసారైనా సరోవర స్నానం చెయ్యాలి. ఆ నీళ్ళు భరించలేనంత ఎముకలు కొరికేంత చల్లగా వున్నాయి. సేమ్‌టైమ్ ప్రపంచంలో ఎక్కడా లేనంతా కాస్మిక్ ఎనర్జీ, దివ్యశక్తి ... ప్రాణశక్తి .. .ఇంకేదో ఆ జలంలో వుంది. అది నేను తనివితీరా అనుభూతి చెందాను. ఆ అనుభవం మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకున్నా అవే తరంగాలు నా శరీరం అంతా వ్యాపిస్తున్నాయి.

స్నానం అయ్యాక డార్చన్ చేరాం. అక్కడి నుంచే కైలాస పరిక్రమ ప్రారంభమవుతుంది. వాతావరణం సరిగా లేకపోవటం వలన పరిక్రమ వెళ్ళలేకపోయాం. వర్షాలు ఎక్కువుగా పడుతున్నాయి.

అనుకున్న ప్రకారం కాక మూడురోజులు ముందుగా ఖాట్మండు చేరుకున్నాం... క్షేమంగా, మాతోబాటు వెహికిల్స్‌లో ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్ పయనించి మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుని గమ్యాన్ని చేర్చారు. వెళ్ళే టైమ్‌లో రిసార్ట్ నుంచే రఘురామ్ గారు చెప్పారు. "ఇక్కడి నుంచే శరీరం తపస్సు చేస్తుంది" అని.

చిన్న, చితకా ఇబ్బందులు, దారిలో ఆటంకాలు వచ్చినా అందరూ చక్కటి ధ్యానంతో అన్ని సమస్యల్నీ అవలీలగా దాటుకుని క్షేమంగా గమ్యాన్ని చేరాం. తమ జీవితకాలపు కలను, సరోవర స్నానాన్ని సాకారం చేసుకోవటం. తిరిగి క్షేమంగా ఇళ్ళు చేరటం. నిజంగా మాస్టర్స్ అద్భుతమైన సహకారం మరువలేనిది.

ఎన్నోసార్లు మా వెహికిల్స్‌లో పత్రీజీ గారిని చూడటం జరిగింది. వారి ప్రేమ, ఆశీస్సుల బలంతో అందరం ఆనందంగా ఇళ్ళకి చేరాం.

నా అనుభూతి అందరితో పంచుకుంటున్నాను .. అంటే ఈ ఇన్సిపిరేషన్‌తో ప్రతిమనిషీ ఒక్కసారి అయినా మానస సరోవర యాత్ర చెయ్యాలని సంకల్పం చేసి దాన్ని సాకారం చేసుకోవాలని.

 

T.శారద
22, స్వాతిగృహ అపార్ట్‌మెంట్స్
S.B.I. కాలనీ, మెహదీపట్నం, హైదరాబాద్

Go to top