" మానస సరోవర ధ్యాన యాత్ర దిగ్విజయం "

" మనవారికి ఎలాంటి ఇబ్బందీ కలుగదు "

 

జూలై 3 వ తేదీ 32 మంది మాస్టర్స్‌తో ఆరవ కైలాస మానససరోవర ధ్యాన యాత్ర బెంగుళూరు నుంచి ప్రారంభమైంది. బ్రహ్మర్షి పత్రీజీ బెంగుళూరు విమానాశ్రయంలో అందరినీ పలకరించి, ఆశీర్వదించి వీడ్కోలు పలికారు. యాత్ర నిర్వహిస్తున్న కంచి రఘురామ్, మరి వారి అబ్బాయి ప్రేమసాయి, మాతో చైనా నేపాల్ బోర్డర్ ' కొడారి ' వరకు వచ్చి మాకు వీడ్కోలు పలికి వెనుదిరిగారు.

' జంగ్మూ ' లో ఇమ్మిగ్రేషన్ పూర్తిచేసుకుని, జూలై 5 వ తేదీ సాయంత్రానికి ' న్యాలం 'లో గెస్ట్‌హౌస్ చేరుకున్నాం. 6 వతేదీ న్యాలంలో ప్రయాణానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేసి అందరం హాయిగా విశ్రాంతి తీసుకున్నాం. 32 మందిలో ఇద్దరు 70 సంవత్సరాల వారు ... ' రాములమ్మ ', ' ఓబులమ్మ' ... ఆక్సిజన్ అందక విపరీతమైన అనారోగ్యం పాలయ్యారు. వెంటనే మాతో వస్తున్న డాక్టర్ మరి గైడ్ వారికి కృత్రిమ ఆక్సిజన్ అందించారు. 7 వ తేదీ ఉదయం అందరం తయారై ' సాగా ' ప్రయాణానికి సిద్ధమయ్యాం. వీరిరువురు అనారోగ్యంగానే వున్నారు. అయినా "మనవారికి ఎలాంటి ఇబ్బందీ కలగదు" అనే సత్సంకల్పంతో బయలుదేరి సాయంత్రానికి 'సాగా' చేరుకున్నాం.


ఆక్సిజన్ అందక అందరం కొంత అసౌకర్యంగా వున్నాం. ఇంతలో డాక్టర్ మరి గైడ్ నా దగ్గరకు వచ్చి "వారిరువురి పరిస్థితి బాగాలేదు, ఏం చెయ్యమంటారు? వాళ్ళిద్దరినీ తిరిగి పంపివేస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. లేకుంటే అందరి ప్రయాణం ఆగిపోతుంది. వెంటనే నిర్ణయం తీసుకోండి" అని చెప్పారు.

నాకు ఏమీ తోచలేదు. ఇక చేసేది ఏమీ లేక దిగులుతో ధ్యానంలో కూర్చున్నాను. వెంటనే ఆస్ట్రల్‌గా కైలాస పర్వతం చేరుకున్నాను. అక్కడ శివుడు, పార్వతి, బ్రహ్మర్షి పత్రీజీ, బుద్ధుడు, రాముడు, ఆంజనేయస్వామి అందరూ వేడుక జరుపుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు. శివ మాస్టర్ నన్ను చూసి "ఏంటి దిగులుగా వున్నావు" అని అడిగారు.

"మీ దగ్గరకు రావడానికి ఎంతో వ్యయ ప్రయాసలతో మేము వస్తున్నాం. మాలో ఇద్దరు అనారోగ్యంతో వున్నారు. మా యాత్ర సజావుగా సాగేది కష్టంగా వుంది" అన్నాను.

" మేమంతా వుండాగా నీకెందుకు దిగులు? మాతో కలిసి నువ్వు కూడా డ్యాన్స్ చెయ్యి " అన్నారు. నేను ఒప్పుకోలేదు. వెంటనే శివ మాస్టర్, రాములవారి వేపు చూసి "మీ యాత్ర సజావుగా సాగటానికి ఆంజనేయస్వామిని ఇన్‌ఛార్జ్‌గా ఇస్తున్నాం. ఇకమీదట నువ్వు నిశ్చింతగా వుండు. యాత్ర పూర్తి అయ్యేవరకూ, అందరూ మీ మీ ఇళ్ళకు చేరేంతవరకూ ఆంజనేయస్వామి మీకు అండగా వుంటారు" అని చెప్పారు. వెంటనే అక్కడి నుంచి ఒక తేజోవంతమైన వెలుగు మేము బస చేసిన లాడ్జి అంతటా ఆవరించింది.

ఉదయం లేచి అందరం రెడీ అవుతున్నాం. రెండు రోజులుగా నడవలేని స్థితిలో వున్నవారు ఉదయాన్నే లేచి మాకంటే ముందుగా రెడీ అయ్యారు. ఆరోగ్యంగా వున్నారు. వాళ్ళను చూసి నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. యాత్ర నిలిచిపోతుందేమో అనే పరిస్థితులలో ధ్యానంలో మాస్టర్స్ కనబడి మనకు అండగా నిలబడ్డారు అనేదానికి నిదర్శనమే ఈ సంఘటన.

8 వతేదీ ప్రయాంగ్, 9 వ తేదీ మానససరోవరం చేరుకున్నాం. ప్రయాణంలో అలసట, ఆక్సిజన్ కొరత, సమయానికి భోజనం లేకపోవటం ఇవన్నీ లెక్కచేయక ఎప్పుడెప్పుడు కైలాస పర్వత దర్శనమా అని ఎదురుచూస్తున్న మాస్టర్స్‌కు మానససరోవరం సమీపించగానే ఎంతో ఆనందంతో జీపులు దిగి కైలాస పర్వతాన్నీ, మానససరోవరాన్నీ చూసి ఆనందపరవశులయ్యారు. రాత్రి మానస సరోవరం సమీపంలో వున్న గెస్ట్‌హౌస్‌లో బస చేసాం. రాత్రి 3.30 గంటల వరకు అందరం ధ్యానం చేసాం.

రాత్రి 12.30 గంటల సమయంలో మా రూమ్‌లో వెలుగు ప్రకాశించింది. అనంతరం 1.30 గంటల సమయంలో ఆకాశం నుంచి పెద్ద వెలుగు మానససరోవరం లో దిగి కాసేపటికి మానస సరోవరం నీటిలో నుంచి ఆ వెలుగు కిరణాలు కైలాస పర్వతం వైపు పయనించాయి. అంతవరకు ధ్యానంలో వున్నవారు మరి ఈ సన్నివేశం చూడాలని ఎదురుచూసిన వారందరూ ఆనంద పరవశులయ్యారు.

ఉదయం మానససరోవరంలో పవిత్ర స్నానమాచరించి 'డార్చన్'కు ప్రయాణమయ్యాం. 10 వతేదీ సాయంత్రం 4.00 గంటలకు డార్చన్ చేరుకున్నాం. మరుసటిరోజు కైలాస పర్వతం పరిక్రమ ప్రారంభమవుతుంది. దానికి కావలసిన ఏర్పాట్లు కోసం చైనీస్ గైడ్ ప్రయత్నం చేస్తున్నాడు. మేము ధ్యానంలో కూర్చున్నాం. నాకు ధ్యానంలో శివ మాస్టర్ కనిపించి "మీరు 'పరిక్రమ'కు రావద్దు" అని చెప్పాడు. రాత్రి 11.30 గంటలకు చైనీస్ గైడ్ నా దగ్గరకు వచ్చి "పోనీస్ దొరకడం లేదు కాబట్టి పరిక్రమకు ఎవరైతే నడిచి వెళ్ళగలరో వారినే తీసుకువెళతాం" అన్నాడు. అందరూ నిద్రపోయారు ... "ఉదయం మాట్లాడదాం" అని చెప్పి పంపాను.

11 వ తేదీ ఉదయం అందరం లేచి రెడీ అయ్యాం. అంతలో చైనీస్ గైడ్ వచ్చి "రాత్రి కైలాస పర్వతం ప్రాంతంలో వర్షం ఎక్కువుగా కురిసి కొండలు జారిపడ్డాయి. ఉదయాన్నే 'పరిక్రమ'కు వెళ్ళిన గ్రూపు కూడా తిరిగి వచ్చేస్తోంది. పరిక్రమకు ఎవరినీ అనుమతించడం లేదు" అని చెప్పాడు. రాత్రి శివ మాస్టర్ ధ్యానంలో చెప్పిందే నిజమైంది. పరిక్రమ బేస్ క్యాంప్ వరకైనా వెళ్దామని అందరం జీపులలో బయలుదేరి వెళ్ళాం. కైలాస పర్వత సమీపంలో 'యమద్వారం' అనే ప్రదేశం వుంది. అక్కడ దిగి అందరం ధ్యానం చేసాం. నేను ధ్యానంలో కైలాస పర్వతానికి అభిషేకం జరగడాన్ని చూశాను. కైలాస పర్వతంపై ఒక తెల్లటి శివలింగాన్ని చూశాను.

తిరుగు ప్రయాణంలో 14 వతేదీ సాయంత్రానికి ఖాట్మండు చేరుకున్నాం. 16 వ తేదీ ఉదయం బయలుదేరి బుద్ధుడి జన్మస్థలమైన 'లుంబిని' చేరుకున్నాం. 17 వతేదీ ఉదయం లుంబిని లోని ముఖ్యప్రదేశాలను చూసుకుంటూ బుద్ధుడు పుట్టిన స్థలంలో వున్న రాతిని భద్రపరచిన గది వద్ద ధ్యానం చేశాను. ఇప్పటికీ అక్కడి నుండి వైబ్రేషన్స్ వెదజల్లుతోంది. ఎంతసేపు చేసినా ఎంతో ప్రశాంతంగా ఇంకా ఇంకా ధ్యానం చేయాలనే కోరిక కలిగింది. 17 వతేదీ సాయంత్రానికి తిరిగి ఖాట్మాండు చేరుకున్నాం. 18 వతేదీ ఉదయం ముక్తినాథ్ ప్రయాణం దారిలో 'మనకామన' శక్తిపీఠంకు రోప్‌వేలో వెళ్ళి మనకామన ఆలయ దర్శనం చేసుకుని, ధ్యానం చేసి తిరిగి సాయంత్రానికి పొక్రాన్ చేరుకున్నాం. 19 వతేదీ ఉదయం హెలికాప్టర్‌లో ముక్తినాథ్ చేరుకున్నాం. ఎత్తైన కొండల నడుమ విష్ణు, లక్ష్మీదేవి, సరస్వతి ఆలయం, ఆలయం చుట్టూ 108 తీర్థాలు, ఇదివరకెప్పుడూ చూడని గొప్ప పవిత్ర ప్రదేశం ముక్తినాథ్. ప్రక్కనే వున్న జ్వాలాముఖి దర్శనం తర్వాత తిరిగి పొక్రాన్ చేరుకుని 20 వతేదీ ఉదయం ఖాట్మండ్‌కు విమానంలో చేరుకున్నాం.

21 వ తేదీ ఖాట్మండ్ నుంచి తిరిగు ప్రయాణం... ఖాట్మండ్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు పట్టణాలకు మన మాస్టర్స్ చేరుకోవాలి. ఖాట్మండులో 4.00 గంటలకు బయలుదేరవలసిన విమానం ఆలస్యమైంది. వెంటనే అక్కడ వున్న ఆఫీసర్‌తో సంప్రదించాం.

ఆయన వెంటనే ఢిల్లీకి ఫోన్‌లో మాట్లాడి "మీకు ఎలాంటి ఇబ్బందీ కలగదు, అన్నీ సక్రమంగా జరుగుతాయి. మీకు ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఢిల్లీ నుంచి నాతో ఫోన్‌లో మాట్లాడండి" అని విజిటింగ్ కార్డ్ ఇచ్చారు. విమానం 5.45 గంటలకు బయలుదేరింది. లేటైనందున మూడు ప్రదేశాలకు వెళ్ళే విమానాలు మేము ఢిల్లీ చేరేలోపే బయలుదేరే అవకాశం వుంది. విమానంలో ఎయిర్‌హోస్టెస్ తో విషయం వివరించాం. ఆమె పైలెట్‌కు చెప్పి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు సమాచారం అందించారు. ఎయిర్‌హోస్టెస్ మళ్ళీ మా వద్దకు వచ్చి "మీకు ఎలాంటి ప్రాబ్లమ్ వుండదు. మీకు అన్నీ అనుకూలంగా జరుగుతాయి" అని చెప్పింది.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగాం. ఇమ్మిగ్రేషన్ దగ్గర రద్దీ ఎక్కువుగా వుంది. మా హడావుడి చూసి తోటి ప్రయాణీకులు ప్రక్కకు తప్పుకుని, మమ్మల్ని ముందుగా పంపించారు. ఇంకొంచెం ముందుకు వచ్చాం. ఇద్దరు ఎయిర్‌పోర్ట్ ఆఫీసర్స్ మమ్మల్ని చూసి "మీరేనా ఫోన్ చేయించిన గ్రూపు? త్వరగా రండి. ఇప్పటికే ఆలస్యం అయింది. మీకోసం డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుకు వెళ్ళడానికి టాక్సీలు ఏర్పాటుచేశాం, రండి" అని మమ్మల్ని టాక్సీలలో తీసుకెళ్ళారు. మేము వెళ్ళేలోగా కౌంటర్స్ అన్నీ ఖాళీగా వున్నాయి. మేం తప్ప మిగిలిన ప్రయాణీకులంతా బోర్డింగ్ పాస్ తీసుకుని విమానం ఎక్కి కూర్చున్నారు. మన మాస్టర్స్ వెంటవెంటనే బోర్డింగ్ పాస్ తీసుకుని హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు విమానాలలో ఎక్కాం. మూడు విమానాలు దాదాపు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరాయి. అందరం సురక్షితంగా వారి వారి పట్టణాలకు చేరుకున్నాం.

మాకోసం విమానాలు ఆగాయంటే చిన్న విషయం కాదు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు విమానాలు ఆలస్యం అంటే మాటలా? విమానం ఎక్కిన తర్వాత ప్రోగ్రాం అంతా ఒకసారి రివ్యూ చేసుకున్నాను. అప్పుడు గుర్తుకొచ్చింది ఇదంతా మన గొప్పతనం కాదు, ఆంజనేయస్వామిని మన గ్రూపుకు ఇన్‌ఛార్జ్‌గా ఇచ్చారు కాబట్టి, ఆంజనేయస్వామి ప్రతిక్షణం మాకు అండగా వుండి ప్రతి విషయంలోనూ, ప్రతి కార్యక్రమంలోనూ మాకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా కాపాడారు. మమ్మల్ని సురక్షితంగా వారి వారి ఇంటికి చేర్చారు.

ఆరవ కైలాస మానస సరోవర ధ్యానయాత్ర అత్యంత వైభవంగా, దిగ్విజయంగా ముగిసింది. ఈ యాత్రలో 32 మంది మాస్టర్స్ ప్రతి విషయంలో బాగా సహకరించారు. ముఖ్యంగా V.నవీన్ చంద్, శ్రీమతి అపర్ణ, D.దామోదర్, G.చంద్రశేఖర్ రెడ్డి, S. త్యాగరాజన్, శ్రీమతి రాజేశ్వరి, A.రమేష్‌బాబు, R. వెంకటాచలం, శ్రీమతి T.శారద... ఇంకా మిగిలిన మాస్టర్స్ అందరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

పత్రిసార్‌తో ఖాట్మండు నుంచి ఫోన్‌లో మాట్లాడినప్పుడు "నీకు అప్పజెప్పిన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించావయ్యా" అన్నారు. కార్యక్రమం గురించి వివరించకముందే "హలో గురూజీ" అన్న వెంటనే అన్న మాటలివి. అంటే పత్రి గారికి ప్రతి విషయం మనం ఎక్కడవున్నా, ఏం చేసినా తెలుస్తుంది అనేదానికి నిదర్శనమే ఈ సంఘటన.

పత్రీజీ ఆశయసాధనలో నా వంతు భాగంగా సార్ చెప్పిన పనిని చేయడమే నా భాగ్యంగా భావిస్తూ ధ్యాన ప్రచారంలో పత్రిసార్ చెప్పిన జిల్లాలో పర్యటిస్తూ అందరినీ ధ్యానులుగా మార్చటం కోసం ప్రయత్నిస్తున్నాను.

మనమందరం కలసి అతిత్వరలో ధ్యాన జగత్తు సాధిద్దాం. రండి, కదలిరండి, లోకకళ్యాణం కోసం కృషి చేద్దాం, సాధిద్దాం.

 

D. కేశవరాజు
తిరుపతి
ఫోన్ : +91 94400 77359

Go to top