" ఉత్తర భారత్ ధ్యానప్రచార యాత్రలో నా అనుభవాలు "

"ధ్యానం చేసేవారికి వైరాగ్యం లేదు. వైభోగమే వైభోగం." అని పత్రీజీ ఎన్నో సందర్భాలలో అంటూ ఉంటే ... ఏమో అనుకున్నాను. కానీ ఆ వైభోగం ... నిజమై నన్నే వరిస్తే ... నేను పొందిన ఆనందం, ఆత్మానుభవం అమోఘం ... అనిర్వచనీయం...

పత్రీజీ పరిచయ భాగ్యం కలిగిన తొమ్మిది సంవత్సరాలలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో నేను అనేక కార్యక్రమాలలో 'ఉడతాభక్తి' గా .... నా శక్తి మేరకు చేతనయింతగా పాల్గొని, అనేక అనుభవాలు, అనుభూతులు పొందాను. జీవితాంశంలో అగ్రగామిగా నిలిచాను.

గత తొమ్మిది సంవత్సరాలుగా పొందిన అనుభూతి ఒక ఎత్తు అయితే ... 2006 ఆగస్టు 1 నుంచి 16 వ తేదీ వరకు .. భారతదేశ రాజధాని ఢిల్లీ నుంచి ఉత్తర భారతదేశ ధ్యానప్రచారంలో పాల్గొని నేను పొందిన అనుభవం మరో ఎత్తు.

హిమాలయ పర్వతప్రాంతం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం అయితే ధ్యానజగత్ నిర్మాత, మైత్రేయ బుద్ధ అంశంలో అనంతమైన జ్ఞాన తరంగాల తేజంతో నిండిన మార్మిక యోగి బ్రహ్మర్షి పత్రీజీ గురు సాంగత్యంలో 16 రోజుల ఉత్తరభారత ధ్యానప్రచార యాత్ర నా జీవితంలో క్రొంగత్త కాంతులు నింపింది.

ధ్యానప్రచార యాత్రలో ఎక్కడకు వెళ్ళినా అపురూప సాదర స్వాగతాలు. అద్భుతమైన సౌకర్యాలు. "మీ సేవ చేయడానికే మేం ఉన్నాం" అన్నంతగా ఇక్కడి ధ్యానులు మాపై చూపిన శ్రద్ధాశక్తులు, వారు చూపిన ప్రేమాభిమానాలు పొందే అర్హత పొందడానికి కారణం నేను 'పిరమిడ్ మాస్టర్'గా ఇక్కడకు రావడమే. 'పిరమిడ్ మాస్టర్' పదవికి అలాంటి గౌరవం తీసుకువచ్చారు పత్రీజీ.

" పత్రీజీతో ప్రయాణం .. ఓ ... దివ్య అనుభవం "

కాలాతీత, దూరప్రాంతాలకు ... గమ్యాలకు చేరాలంటే పత్రీజీతో ప్రయాణం చేస్తేనే సుసాధ్యం. ప్రయాణ సమయంలో మధురమైన సుస్వర గీతాలను, అద్భుతమైన సంగీత రాగాలను వినిపిస్తూ ప్రకృతితో మనల్ని మమేకం చేస్తూ ... ప్రతి ప్రదేశం యొక్క ప్రాముఖ్యతను, చరిత్రను వివరిస్తూ ... ఆడిస్తూ .. లాలిస్తూ, పాడిస్తూ ... సమయం తెలియని ప్రయాణంలో గమ్యాలకు చేర్చడంలో సిద్ధహస్తులు పత్రీజీ.

ఆగస్టు 3 వతేదీన ఢిల్లీలో బయలుదేరి మూడు రాష్ట్రాలు సరిహద్దులు దాటి మా ప్రయాణం సాగుతోంది. పత్రీజీ చెబుతున్న కాన్సెప్ట్స్ వింటూ ఆనందిస్తూ నేను మరో లోకంలో విహరిస్తున్నాను. మా ప్రయాణం జాతీయరహదారి నెం.1 నుంచి జాతీయ రహదారి నెం.22 తీసుకుని "కల్కా" వైపు ప్రయాణం సగుతోంది.

" 'దేవభూమి'లో ప్రవేశిస్తున్నాం"

చిన్న చిన్న వర్షపు జల్లులు పడుతూండగా చిరుగాలులు వీస్తూండగా .. పత్రీజీ చూపుడువ్రేలు చూపిస్తూ .. "అదిగో చూడండయ్యా వాటిని" అన్న మాటలు వింటూ మా చూపులు అటువైపు మరలి మా నోటమాట రాలేదు. ఆశ్చర్యం .. అద్భుతం... ఆనంద పరవశం... సౌందర్య మనోహర దృశ్యం... అవే ఆధ్యాత్మిక శిఖరాలు ... హిమాలయపర్వతాలకు .. అతిసమీపంలో వున్నాం ... " 'దేవభూమి' లో ప్రవేశిస్తున్నాం" అన్న ఆలోచనలతో ఆనందంలో మునిగిపోయాం. "ఎలా ఉన్నాయి హిమాలయశ్రేణుల తొలకరి కొండలు?" అన్న పత్రీజీ మాటలకు కృతజ్ఞతాపూర్వక నవ్వులే మా సమాధానం.

"హిమాలయశ్రేణుల తొలకరి కొండలు"

మానవుని అద్భుత జ్ఞాన సంపద మోడరన్ టెక్నాలజీతో 'రోప్ వే' పర్వత శిఖరాల్లో నిర్మించిన హోటల్‌తో అనుసంధానం ఓ ప్రక్క... మరో ప్రక్క కృషినే నమ్ముకున్న హరిత విప్లవ వీరులు సాగు చేసుకున్న పోడు వ్యవసాయ క్షేత్రాలు ఎంతో సౌందర్యంగా ఉన్నాయి. మరోవైపు పర్వతశ్రేణులలో రైల్వే నేరోగేజ్, రోడ్‌తో సమాంతరంగా నిర్మాణం మహాద్భుతం.

పెద్ద, చిన్న జలపాతాలు వాటిని మించిన ఎత్తులో వృక్షసామ్రాజ్యం ... రంగురంగుల పక్షులు ... పర్వతశ్రేణులలో కనుచూపు మేరలో కళాత్మక ఇండ్ల నిర్మాణం వీరి ప్రత్యేక జీవనశైలిని ప్రతిబింబిస్తుంది. వీటినన్నింటినీ చూస్తూ ... మైమరుస్తూ మా ప్రయాణం జోరుగా సాగుతూండగా వెనుకకు చూస్తే అప్పుడు తెలిసింది .. మేం "మేఘాల పందిరి"లో విహరిస్తున్నామని.

"ఆకాశం క్రింద భూలోకం ... ఆకాశం పైన దేవలోకం .. మనం ఇప్పుడు దేవలోకంలో ఉన్నామయ్యా ..." అన్న పత్రీజీ మాటలతో మళ్ళీ నేను ఈ లోకంలోకి వచ్చాను. మరికొంతసేపు ప్రయాణం తరువాత "క్రిందికి దిగుదాం; కారు ఆపండి" అంటూ పత్రీజీ వాహనం దిగి రోడ్ ప్రక్కగా శిఖరం వైపు వెళ్ళారు. చుట్టూ వున్న పర్వతశ్రేణులను పరిశీలిస్తూంటే ఒకచోట ఆకాశం, పర్వతాలు, కలిసిపోయినట్లుగా వున్నాయి. జోరుగా పొగమేఘాలు పర్వతాలపై తిరిగాడుతుండగా సాయంత్రం వేళ సూర్యకిరణాలు వాటిపై పడి అవి బంగారు 'పిరమిడ్ రూపం' లో దర్శనం ఇచ్చే అనుభవం మాకే సొంతం.

"సిమ్లా ... దేవభూమి రాజధాని"

సంధ్యా సమయంలో పర్వతశ్రేణులకు రంగురంగుల బొమ్మలు అతికించినట్లుగా, ఊహలకే అతీతంగా అత్యంత సుందరమైన నగరం "సిమ్లా". సముద్రమట్టానికి 7,300 అడుగుల ఎత్తులో నిర్మించబడ్డ హిమాచల్‌ప్రదేశ్ రాజధాని "సిమ్లా". మేఘాలు పర్వతశ్రేణులతో పెనవేసుకున్న ఆధునిక జీవన విధానం .. ఘనచరిత్ర గల అపురూపమైన నగరం సిమ్లాలో పత్రీజీ ధ్యాన ప్రచారం తారాస్థాయిలో జరిగింది. ఆర్మీ ఉన్నతాధికారులకు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు జరిగిన ధ్యాన శిక్షణతో "ధ్యాన హిమాచల్‌ప్రదేశ్" కార్యక్రమాన్ని ప్రారంభించారు.

"సోలన్"

చిరుజల్లులు, చల్లని చలిగాలులు ఆస్వాదిస్తూ హిమాలయాలలో మరో ముఖ్య నగరం "సోలన్" చేరుకున్నాం. "మనం ఆంధ్రప్రదేశ్‌లోనే వున్నామా?" అన్న అనుమానం కలిగింది నాకు. ఇక్కడ జరిగిన ధ్యాన కార్యక్రమాల జోరు, జనం హోరు చూసి, ఇక్కడి నుంచే పత్రీజీ ధ్యాన హిమాచల్‌ప్రదేశ్ కార్యక్రమాలు వ్యాప్తి చెందాలని భావిస్తూ "సోలన్ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ" స్థాపించి మరి కేర్&స్టడీ సెంటర్ ప్రారంభించడం గొప్ప విషయం.

హిమాచల్‌ప్రదేశ్‌లో దిగ్విజయంగా ధ్యానం క్లాసులు నిర్వహించి హర్యానా రాష్ట్రంలోని "అంబాలా" నగరం వైపు మా ప్రయాణం మార్గమధ్యంలో మొఘల్ చక్రవర్తుల విహార "పింజోర్" గార్డెన్‌ను ఒకగంటా సందర్శన తీయని అనుభూతిని మిగిల్చింది.

"ధ్యాన పంజాభ్"

పంజాబ్ రాష్ట్రం నలుమూలలా .. అంతా లూథియానా, జలంథర్, ఫిరోజ్‌పూర్ మరి పంజాబ్ గ్రామ ప్రాంతాలలో .. విస్తారంగా, విశేషంగా పత్రీజీ ధ్యానం క్లాసులు, సభలు నిర్వహించారు. వాటన్నింటిలో పాల్గొనడం నిజమైన అనుభవం.

"చండీఘర్"

చండీఘర్‌లో ప్రసిద్ధ రాక్ గార్డెన్, కాక్టస్ గార్డెన్ లను పత్రీజీతో సందర్శించడం గొప్ప అనుభవం. మేం ఢిల్లీ నుంచి బయలుదేరిన క్షణం నుంచి తేదీ, టైమ్ ఎన్నిరోజులు గడిచాయో నాకు తెలియనంత సంతోషంలో వుండగానే తిరిగి ఢిల్లీ చేరాం.

"కృష్ణ"

ఆగస్టు 16 శ్రీకృష్ణ జన్మాష్టమి. నేను జీవితంలో ఎన్నటికీ మరువలేనిరోజు. ఎందుకంటే... ఉదయం 10.00 గంటలకు హైదరాబాద్ నుంచి మారం శివప్రసాద్ గారి నుంచి ఫోన్ వచ్చింది.

నేను ఫోన్ తీసి పత్రీజీకి "మారం లైన్‌లో వున్నారు సార్" అని ఇచ్చాను .. వారి మాటలలో శ్రీకృష్ణుని గురించి పత్రీజీ ఇలా వివరించారు.

"కృ" - అంటే చేయడం అని అర్థం,

"ష్ణ" - అంతే తినడం అని..."

"అష్ట ఐశ్వర్యాలు సంపాదించి, అష్ట సిద్ధులు భోగిస్తున్నవాడే కృష్ణుడు. పుట్టి సాధించలేదు .. సాధించే పుట్టాడు కృష్ణుడు. అందుకే అష్టమినాడు జన్మించాడు."

శ్రీకృష్ణుని కాన్సెప్ట్ వింటూ నేను నిద్రలోకి జారిపోయాను. సమయం మధ్యాహ్నం 2.00 గంటలు కావస్తూంది. "భోజనం రెడీ రావయ్యా, నందా," అన్న పత్రీజీ పిలుపుతో డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరాను. పత్రీజీ స్వయంగ అష్ట రుచులతో తయారుచేసిన వంటలు మాకు కొసరి కొసరి వడ్డిస్తూంటే "కృష్ణుడు పుట్టినరోజు కృష్ణుడే స్వయంగా వచ్చి పార్టీ ఇచ్చినంత" ఆనందంగా ఘుమఘుమలాడుతున్న వంటకాలను నాలో పొంగుతూన్న ఆనందాన్ని కలిసి ఆరగించాను. జీవితానికే అపురూపమైన కానుకగా స్వీకరించాను.

"ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి"

ఒక అనుభవాన్ని ... ఎక్స్‌పీరియన్స్‌ను పొందడంతోనే అది పరిపూర్ణంకాదు . . అది సరియైన సమయంలో సరైన వారి దగ్గర ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి... అనుభవాన్ని వ్యక్తపరచడం ద్వారానే అది పరిపూర్ణం అవుతుందన్న పత్రీజీ మాటలను గుర్తుచేసుకుంటూ .. నేను ఈ టూర్‌లో పొందిన అనుభవాలను మీ ముందు వివరించడం ద్వారా నేను మరింత ఆనందాన్ని, ఆత్మానుభవాన్ని పొందానని ఆనందంగా తెలుపుకుంటూ ... ప్రతి పిరమిడ్ మాస్టర్ జిల్లా, రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి విస్తృతంగా పర్యటించి ధ్యానప్రచారంలో పాల్గొని, అందరికీ అనుభవాలు పంచుతూ "2012 నాటికి ధ్యాన జగత్" బృహత్ కార్యక్రమాన్ని విజయవంతంగా సాధించాలని కోరుకుంటూ ...

ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించిన స్పిరిచ్యువల్ ఇండియా శ్రీ A.V.సాయికుమార్ రెడ్డికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేసుకుంటున్నాను.

 

- నందప్రసాద్,
శ్రీకాకుళం

Go to top