" షిరిడీలో స్వర్ణమాలా పత్రీజీ గారి అనుభవం "

 

బ్రహ్మర్షి పత్రీజీ ఆధ్వర్యంలో 2006, డిసెంబర్ 25 నుంచి 31 వరకు జరగబోయే "ఏడు రోజుల ధ్యానమహాయజ్ఞం" కోసం జరిగే ఏర్పాట్లు పర్యవేక్షించటం కోసం ఆగస్టు 9 వతేదీన స్వర్ణమాలా పత్రి గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ మరికొంతమంది పిరమిడ్ మాస్టర్స్‌తో బస్సులో హైదరాబాద్ నుంచి షిరిడీకి బయల్దేరి ఆగస్ట్ 10 వతేదీ ఉదయానికి చేరుకున్నారు.

ప్రయాణ అలసటతో పత్రి మేడమ్ రూమ్‌లోనే విశ్రాంతి తీసుకుంటూండగా మగత నిద్రలోకి జారుకున్నారు: అప్పుడు ఒక అద్భుత అనుభవం. ఆ అనుభవాన్ని మేడమ్ స్వర్ణమాలా పత్రి గారు ఈ విధంగా వివరించారు :

మగతగా నిద్రలో వున్న నాకు ఎదురుగా పత్రిగారు వచ్చి కుర్చీలో కూర్చుని కళ్ళద్దాలు తీసి ప్రక్కన పెట్టి తన సహజమైన అలవాటులో కూర్చున్నారు. నాకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు పత్రీజీ. 'అదేమిటి మీరు ఇక్కడకు ఎప్పుడు వచ్చారు? రాత్రే కదా నేను బస్సులో నుంచి మీతో లూథియానాకు ఫోన్ మాట్లాడాను' అని అడుగుతూండగా ... 'మన ఇంటికే వచ్చానులే' అని పత్రీజీ సమాధానం ఇచ్చారు. 'ఇదేమిటి మన ఇల్లు హైదరాబాద్‌లో కదా'. అని నేను అడుగుతూంటే, చిరు మందహాసమే సమాధానం. 'నీకు ఒక విషయం చూపిస్తాను చూడు' అంటూ నా చేతిలోకి రంగురంగుల మెరుస్తున్న ముత్యాల పూసలు ఇస్తూంటే అవి నా చేతికి దండగా వస్తున్నాయి.

'ఇదేమిటి?' అని ప్రశ్నిస్తే 'వెనుకకు చూడు' అన్నారు వెనుకకు చూడగా .. పెద్ద గుహ ... దానిలో ఏవో మసకగా రూపాలు. నేను పరిశీలనగా చూస్తూండగా .. 'నీకొకటి చూపిస్తాను పద' అని ప్రయాణం అయ్యారు. నేను అనుసరించాను. మేము ఆకాశంలో నడుస్తూండగా ... క్రిందికి చూపించారు. అది ఓ పెద్ద గ్రౌండ్ ... గ్రౌండ్‌లో అనేక చదరపు పిరమిడ్ ఆకారాలు మార్క్ చేసి ఉన్నాయి. 'అవి ఏమిటి?' అని అడిగాను. 'ఇక్కడే త్వరలో ధ్యానయజ్ఞ కార్యక్రమాలు జరగబోతున్నాయి. మాస్టర్స్ ఆ విధంగా డిజైన్ చేసుకున్నారు' అని తెలిపారు.

"ఇంతలో ఎవరో వచ్చి తలుపు తట్టారు. జరగబోయే ధ్యానయజ్ఞ కార్యక్రమాలను ఆస్ట్రల్ మాస్టర్స్ ఎంతలా ప్రభావితం చేస్తున్నారో ఈ దివ్య అనుభవం ద్వారా నాకు తెలిసింది" అని పత్రి మేడమ్ సంతోషంగా తెలిపారు.

షిరిడీ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి స్థానిక పిరమిడ్ మాస్టర్స్ .. సబితా మేడమ్ బృందం ... ఇప్పటి నుంచే విశేష కృషి చేస్తున్నారనీ, ఏర్పాట్లు చాలా వేగవంతంగా జరుపుతున్నారనీ ఎంతగానో ప్రశంసించారు.

 

స్వర్ణమాలా పత్రీజీ
హైదరాబాద్

Go to top