" నా గురించే నేను "

 

నా పేరు తేలిక రాము.

నేను గత మూడు సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. గత రెండు సంవత్సరాల నుండి ధ్యాన ప్రచారంలో పాల్గొంటున్నాను.

ఒకసారి నా స్నేహితుని ఇంట్లో ధ్యానం చేస్తూండగా... ధ్యానంలో కూర్చున్న కొద్దిసేపటికి దూరంలో ఎవరో ఒకతను ధ్యానముద్రలో ఉండి ధ్యానం చేస్తూ కనిపించాడు. "ఎవరా?" అని దగ్గరకు వెళ్ళి చూస్తే అది నేనే. ఆశ్చర్యం అనిపించింది. మళ్ళీ "నేను ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాను?" అని చూస్తే నా గురించే నేను ధ్యానం చేస్తున్నాను.

ఈ విషయాన్ని కొత్తగూడెం పిరమిడ్ మాస్టర్ రంగా గారికి చెబితే "ఉపనిషత్తుల, వేదాల ... మరి అన్ని మతగ్రంథాల ... సారాంశం అదే కదా" అన్నారు. మన మీద మనకు ఎరుక లేకపోతే ఎప్పుడూ మన ఆలోచనలు మన చుట్టూ ఉన్న సమాజ ధోరణి మీదకు మళ్ళించి మనలను మనం అర్థం చేసుకోము. ఇతరుల దోషాలను వెతుకుతూ లేని సంతృప్తి పడుతూ లేని వెలితిని పొందుతూ ఉంటాము. ఈ వెలితి మనల్ని వెన్నక్కి తీసుకుపోతుంది.

2003 జూన్ 30 న కొత్తగూడెంలో జరిగిన ధ్యానశిక్షణా కార్యక్రమంలో బ్రహ్మర్షి పత్రీజీ గారికి J.V.V.రంగారావు గారికి మధ్య సంభాషణ ఇలా జరిగింది.

పత్రీజీ : "ఇంకా మీరు బుద్ధుడు ఎందుకు కాలేదు?"

రంగారావు గారు : "నాకు ఇంకా భగవత్ కృప దొరకలేదు."

పత్రీజీ : "భగవత్ కృప కాదు. ముందు మీ కృప మీకుండాలి. అప్పుడు బుద్ధుడు అవుతారు." నిజంగా ఇది చాలా గొప్ప సంభాషణ.

తొట్టపల్లి శాంతి ఆశ్రమంలో ఒకచోట సైన్‌బోర్డ్ మీద ఇలా ఉంటుంది" సంస్కర్తలు కావాలి. ఇతరుల కొరకు కాదు తమ కొరకే".

ఒకసారి ఓషోకి అతని శిష్యులకి మధ్య జరిగిన సంభాషణ.

ఓషో శిష్యుడు: "పవిత్రుడు అంటే ఎవరు?"

ఓషో : "ఇప్పుడు మనం అడవిలో నుంచి ప్రయాణిస్తున్నాం. మనం నగరం చేరుకునే లోపు రాత్రి 1-2 గంటలవుతుంది."

ఓషో చెప్పడం పూర్తికాకుండానే ...

ఓషో శిష్యుడు : "ఈ రాత్రి మనకు ఆతిథ్యం ఇచ్చినవాడేనా పవిత్రుడంటే?"

ఓషో : "కాదు, అంత రాత్రివేళ తలుపుతడితే ఆ ఇంటి యజమాని తిట్టడం ప్రారంభిస్తాడు."

ఓషో శిష్యుడు : "ఆహ, ఆ ఇంటి యజమానేనా పవిత్రుడంటే?"

ఓషో : "కాదు. అంత రాత్రివేళ తలుపు తడితే యజమాని తిట్టినా, నీలో ఎటువంటి భావనా లేకపోతే నువ్వే పవిత్రుడివి."

ఓషో "జీవిత రహస్యాలు" పుస్తకంలో నాకు చాలా నచ్చిన విషయం ఏమిటంటే మనం ఇతరుల చేతిలో చక్కగా ఇమిడిపోతాయట. వాళ్ళ పొగడ్తలకు పొంగిపోయి సంతోషపడతాం, వాళ్ళ విమర్శలకు బాధపడి దుఃఖపడిపోతాం. మనలో మనం మనతో మనం బ్రతకం. మన మీద మనం ఎరుకతో జీవించాలంటే 'ధ్యానం' అవసరం.

ధ్యానం ద్వార భౌతికమైన అనారోగ్య విముక్తియే గాక అజ్ఞానం నుండి విముక్తి పొందవచ్చు. ప్రతిఒక్కరికీ ధ్యానం యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది.

"2500 సంవత్సరాల తర్వాత మానవునికి ధ్యానం అవసరం పెరుగుతుంది" అని బుద్ధుడు చెప్పాడు.

నేను ఒక స్వామీజీ బోధనలు రెండు సంవత్సరాలు పొంది తీరా ధ్యాన పద్ధతి చెప్పే సమయానికి ఒక విషయంలో స్వామీజీతో ఏకీభవించకపోవటంతో ఆ స్వామీజీ ధ్యానాన్ని ఇవ్వటానికి నిరాకరించారు. ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్ గారి ద్వారా ఈ పద్ధతి తెలుసుకుని గత మూడు సంవత్సరాల నుంచి ఎన్నో అనుభవాలు సంపాదించుకున్నాను. చాలా అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడగలిగాను.

కొత్తగూడెంలోని "మహాభోధి పిరమిడ్" విశిష్టమైనది. నేను పొందినది, తెలుసుకున్నది ఇతరులు కూడా పొందాలన్నదే నా ధ్యేయం. నేను మా కొత్తగూడెం పిరమిడ్ మాస్టర్లు కలిసి నెలలో కనీసం 1,000 మందికి ధ్యానం నేర్పించాలన్న లక్ష్యంతో కొనసాగుతున్నాం.

 

తేలిక రాము
కొత్తగూడెం
ఫోన్ : +91 92904 11455

Go to top