" మాంసాహారం, పూజలు మానివేసాను "

 

నా పేరు సుశీల. ధ్యానంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు అయింది. నేను ఈ ధ్యానంలోకి రావటానికి కారణం మా వారి చెల్లెలు దుర్గామణి. అప్పటి నుంచి ఇంట్లో ధ్యానం చేసుకునేదాన్ని.

ఒకరోజు స్వర్గీయ రామజోగేశ్వరరావు గారి ఇంటికి నేను మా ఇంటి దగ్గర కుమారి గారు వెళ్ళాం. ఆ సార్ రాఘవరావు గారి దగ్గరకు వెళ్ళమని చెప్తూ "అక్కడ క్లాసులు కూడా జరుగుతాయి" అని చెప్పారు. ఆ తరువాత అక్కడకు వెళ్ళాం. రాఘవరావు గారు "ఎక్కడ నుంచి వస్తున్నారు?" అని అడిగారు. "భవానీపురం నుంచి" అన్నాం. "భవానీపురంలో పిరమిడ్ వుంది" అన్నారు. అది ఎక్కడ అని తెలుసుకుంటే మా ఇంటికి దగ్గర్లోనేవుంది. నా అదృష్టం. అప్పటి నుంచి ఇంట్లో ఒక గంట పిరమిడ్‌లో ఒక గంట ధ్యానం చేసుకోవటం మొదలుపెట్టాను.

నాకు మోకాలు నొప్పి వుండేది. చాలా బాధపడేదాన్ని, గ్యాస్ట్రిక్ ట్రబుల్ తలనొప్పి కూడా ఉండేవి. ధ్యానం మొదలుపెట్టిన ఐదు నెలలకే అవన్నీ తగ్గిపోయాయి. ఒకరోజు పిరమిడ్‌లో ధ్యానం చేస్తూ వుండగా నా మోకాలులో ఆపరేషన్ జరిగినట్లు అనిపించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ నొప్పీ లేదు. ఇప్పుడు ఎంత దూరమైనా నడవగలను ... ఎన్ని మెట్లైనా ఎక్కగలను. ఏ డాక్టరూ తగ్గించలేనటువంటి మోకాలునొప్పి ధ్యానశక్తితో తగ్గించుకోగలిగాను.

ఎన్నో దేవాలయాలు తిరిగి ఎన్నో కళ్యాణాలు, ఎన్నో పూజలూ చేసినా అప్పుడు లేనటువంటి ఆరోగ్యం ఆనందం ఇప్పుడు పొందుతున్నాను. ధ్యానంలోకి వచ్చిన కొద్దిరోజులకే మాంసాహారం, పూజలు మానివేయటం జరిగింది. విజయవాడలో ధ్యానయజ్ఞం జరిగిన ఏడురోజులూ ఆ కార్యక్రమానికి వెళ్ళాను.

నేను ధ్యానంలోకి వచ్చిన ఆరు నెలలకి మా వారు శరీరాన్ని వదిలిపెట్టటం జరిగింది. అప్పుడు నేను చాలా ధైర్యంగా వుండగలిగాను. మా అమ్మాయి పద్మజ కూడా అప్పటికి రెండు నెలల నుండి ధ్యానం చేస్తోంది. తను కూడా ధైర్యంగా వుండటమే కాక వచ్చిన బంధువులకు కూడా "ఏడవవద్దు" అని చెప్పటం జరిగింది.

నాకు ఈ ధ్యానం నచ్చటానికి కారణం పత్రీజీ గారు. ఎప్పుడూ "మైడియర్ ఫ్రెండ్స్, మైడియర్ గాడ్స్, మైడియర్ మాస్టర్స్" అని చెప్తూ వుంటారు. " బుద్ధుణ్ణి, కృష్ణుణ్ణి, జీసస్‍ని ఆదర్శంగా తీసుకుందాం వాళ్ళు ఏం చెప్పారో, ఏం చేసారో అదే మనమూ చేద్దాం " అని చెప్తారే తప్ప "నేనే గురువుని" అని ఎప్పుడూ చెప్పరు.

ఒకసారి నేను మా డాబాపైకి వెళ్తున్నప్పుడు ఇనుపచువ్వ కాలికి తగిలి బోర్లా పడిపోయాను. అప్పుడు ఒక నిమిషం నా పళ్ళు విరిగాయేమో అనుకున్నాను. కానీ ఏమీ కాలేదు. ఆరు నెలల క్రితం మరుగుతున్న నీళ్ళు నా మోచేతి క్రిందవరకూ పడ్డాయి. అప్పుడు చల్లని నీళ్ళలో చేతిని పెట్టాను. బొబ్బ రాలేదు కనీసం కమిలినట్లు కూడా లేదు. తరువాత ఒక క్లాసుకి వెళ్ళినప్పుడు క్లాసులో "పిరమిడ్ మాస్టర్స్‌కి ఆస్ట్రల్ మాస్టర్స్ ఎప్పుడూ తోడుగా వుంటారు" అని చెప్పారు. అప్పుడు నాకర్ధమైంది నాకు ఏమీ ఎందుకు కాలేదో.

ఒకసారి ధ్యానంలో వుండగా నా నోట్లో నుండి ఏదో దారాలు లాగా చాలాసేపు నేను తీసుకున్నట్లు అనిపించింది. ఆ విషయం ఒకరిని అడిగితే " ఇన్ని రోజులూ మీరు తిన్న మాంసాహారం గానీ మరి ఏ ఇతర చెడు అయినా గానీ మీకు మీరే తీసివేసుకున్నట్లు " అని చెప్పారు.

ప్రతిరోజూ రెండు మూడు గంటలు ధ్యానం చేస్తాను. బంధువులకి గానీ, స్నేహితులకి గానీ ఎవరు కలిసినా సరే ధ్యానం గురించే చెప్తూ వుంటాను. "జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం" ... జ్ఞానంతో మన కర్మలనీ తగ్గించుకోవచ్చు. అది డబ్బుతో కొనేది కాదు ఎవరి ద్వారా వచ్చేది కాదు. మనకు మనం సంపాదించుకోవాలి. అది ఈ ధ్యానం ద్వారానే సాధ్యం.

 

T.సుశీల
విజయవాడ

Go to top