" నాకు ఇష్టమైన విధంగా జీవిస్తున్నాను "

 

నా పేరు సుగుణ. నేను గత పది సంవత్సరాలుగా " పుట్టపర్తి " లో ఉంటున్నాను. పధ్నాలుగు సంవత్సరాలుగా ఆనాపానసతి ధ్యానం చేస్తున్నాను.

నాకు ఇద్దరు పిల్లలు. వారి పెళ్ళిళ్ళు అయి జీవితంలో స్థిరపడ్డారు. మా వారి మరణం తర్వాత నేను పుట్టపర్తిలో స్థిరపడ్డాను. నేను " జిడ్డు కృష్ణమూర్తి అభిమాని " అయిన మా మేనమామ వద్ద పెరిగాను. మా ఇంట్లో పూజలు వుండేవి కావు. మా మావయ్య ఆలోచనల ప్రభావం నాపై చాలా వుండేది. ఎన్నో పుస్తకాలను చదివేదాన్ని. హిమాలయాల్లో ధ్యానం చేసే యోగులను గురించిన పుస్తకం చదివి వారిని చూడాలని అనుకునేదాన్ని.

పెళ్ళయిన తర్వాత మావారి ఉద్యోగరీత్యా ఇండియాలో చాలా చోట్ల తిరిగే అవకాశం కలిగింది. " రాధాస్వామి బ్యాస్ " గురువు గారైన " మహారాజ్ చరణ్‍సింగ్ " గారి సత్సంగానికి వెళ్ళి 18,000 మందిలో నేను కూడా ఒకదానిగా ఉపదేశం తీసుకున్నాను కొంతకాలం తర్వాత ఆయన " మీకు వేరే గురువు కనిపించి గైడెన్స్ ఇస్తారు " అని చెప్పారు. పత్రిసార్‍ను చూశాక " మాహారాజ్ గారు చెప్పిన గురువు ఈయనే " అనిపించింది.

నాలో నామజపం అప్రయత్నంగానే జరుగుతూ వుండేది. ఒక సంవత్సరం తర్వాత అమ్మాయి పుట్టింది. అప్పుడు డాక్టర్లు కొద్ది క్షణాల్లో చనిపోతాననీ, ఏమైనా చెబుతాననీ మా అమ్మను దగ్గరికి పిలిపించారు. నాకు అన్నీ బాగా గుర్తున్నాయి కానీ ఏమీ చెప్పాలి అనిపించలేదు. తరువాత కొద్దిక్షణాల్లో బ్రతికే అవకాశం కనిపించి డాక్టర్లు జాగ్రత్తగా చూసుకున్నారు. ఒక సత్సంగి నాతో వారం రోజులున్నారు, సూక్ష్మరూపంలో. ఆయన మద్రాసులో ఉన్నారని అర్థమైంది కానీ ఎప్పుడూ భౌతికంగా కలిసిన వ్యక్తి కారు. తర్వాత మద్రాసుకు ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు ఆయన్ని కలిశాను. ఆప్పుడు నాకు ఆలోచనలతో దూరంగా ఉన్నవారికి సందేశం పంపి వారి సమాధానాలు అందుకోవచ్చని అర్థమైంది. కొద్దినెలలు గడిచాక చావుని గురించిన అనుభవం, శరీరం నుండి ఎక్కడెక్కడికో వెళ్ళే అనుభవం, వెలుగులో తామరపూలు కనిపించాయి. నామజపం వల్ల ఏవో జరుగుతున్నాయని తప్ప ఇంకేమి అర్థం కాలేదు.

" డివైన్ లైట్ " అనే పుస్తకాన్ని చదివి అందులోని నియమ, నిబంధనలు పాటించడం మొదలుపెట్టాను. అయితే మనస్సు, మాట, చేతల పొంతన లేక చాలాకాలం అసంతృప్తికరమైన జీవితం సాగింది.

1996 సంవత్సరంలో " ఆనాపానసతి ధ్యానం " మొదలుపెట్టిన నెల రోజుల్లోనే నాకు నా పట్ల విపరీతమైన ధైర్యం వచ్చింది. నాకు ఇష్టమైన విధంగా జీవించడం ప్రారంభించాను. రాంపా పుస్తకాలు, రజనీష్ పుస్తకాలు చదవడం మొదలుపెట్టగానే ఒక సబ్‌మెరీన్ కమాండర్ కలలో కనిపించి రెండురోజుల తర్వాత భౌతికంగా కనిపించి " యు ఫర్ ఎవర్ " పుస్తకాన్ని ఇచ్చారు. చనిపోయిన వ్యక్తి ధ్యానంలోనూ, భౌతికంగానూ కనిపించారు. కొన్నిరోజులు ధ్యానంలో ఆలోచనలు అందించి, నా ఆలోచనలు అందుకునేవారు. ఇది విన్న పుట్టపర్తి వారు కూడా ధ్యానం ప్రారంభించి మూడునెలలు శ్రద్ధగా చేశారు.

నేను 2006 సంవత్సరంలో " షిర్డీ ధ్యాన ప్రచార బ్యాచ్ " తో ఆరునెలలు వున్నాను. అనంతపురం లక్ష్మీ గారు మరి అనంతపురం జిల్లా ఇతర మాస్టర్ల సహకారంతో పుట్టపర్తిలో మూడురోజుల ధ్యానయజ్ఞం జరిపించాము.

" పుట్టపర్తి " లో రెండు పిరమిడ్లు వున్నాయి. ఆలోచనలు సాకారం కావడం, గమనించిన నేను నన్ను, నా ఆలోచనలను గమనిస్తూ జీవితంలో ఎదురుపడే అందరికీ ధ్యానాన్ని పంచుతూ జీవిస్తున్నాను.

ఆనాపానసతిని ప్రపంచానికి అందించిన పత్రిసార్‌కు భౌతికంగా, గ్రంథరూపంగా జ్ఞానాన్ని నాకు అందించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతాభివందనాలు.

 

B.K. సుగుణ
పుట్టపర్తి

Go to top