" కులమత ప్రసక్తిలేనిదే ఆనాపానసతి ధ్యాన సాధన "

 

నా పేరు చిన్న ఖాసిం.

మాది గుంటూరు జిల్లా నరసరావుపేట. నాకు ధ్యాన పరిచయం నా భార్య "రెహానా" ద్వారా జరిగింది.

నాకు గతంలో బి.పి., షుగర్ మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వుండేవి. కారణం నేను గతంలో మాంసాహారిని. దీనికి తోడు వ్యాపారపరమైన టెన్షన్ నేను ప్రతిరోజూ ఎంతో ఒత్తిడితో సతమతమయ్యే వాడిని.

నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి చిన్నతనం నుంచే అస్తమా వ్యాధితో బాధపడుతూ ఉండేది. ఒక్కోసారి అస్తమా అటాక్ వచ్చినప్పుడు ఆ పాప పడే బాధ.. తల్లిదండ్రులమైన మా గుండెలను పిండేసేది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మేమిద్దరం ఎంతో దుఃఖించేవాళ్ళం. పెద్ద పెద్ద హాస్పిటల్స్‌లో వేలకు వేల రూపాయల వైద్యం చేయించినా లాభం లేకపోయేది.

ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఒకసారి నా భార్య రెహానా..పిల్లలను తీసుకుని స్కూలుకి వెళుతూ దారిలో "ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస".. "ధ్యానం సర్వరోగనివారిణి" అన్న బోర్డు చూసి నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళింది. ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి చేసి విసిగిఉన్న నేను ఆ పిరమిడ్ సెంటర్ నిర్వాహకులు చెప్పింది విని.. "సరే చేద్దాంలే" అని నిర్లిప్తంగా అనుకున్నాను.

కానీ రోజురోజుకీ పాప ఆరోగ్య పరిస్థితితో పాటు నా ఆరోగ్య మరి అర్థిక పరిస్థితులు దిగజారుతూండడంతో మా ఆవిడ పోరు భరించలేక ఆమె తృప్తికోసం "ఓషో పిరమిడ్ ధ్యాన కేంద్రం" నిర్వాహకురాలు "ఝాన్సీ మేడమ్" దగ్గర పిరమిడ్‌ను తీసుకుని వచ్చి మా ఇంట్లో కట్టి .. వాళ్ళు చెప్పినట్లు ఇంట్లో అందరం ధ్యానం చేయడం మొదలుపెట్టాము.

బ్రహ్మర్షి పత్రీజీ సందేశాలతో కూడిన పుస్తకాలు, "ధ్యానం శరణం గచ్ఛామి".. "ధ్యానశాస్త్రం" "అహింస మరి శాకాహారం" "నవవిధధర్మాలు" మరి "ధ్యానాంధ్రప్రదేశ్" మాసపత్రికలను శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాను. "నా అనారోగ్యాలకు మరి నాకు జీవితంలో ఎదురవుతోన్న నా ఆర్థిక కష్టాలకు కారణం.. ఎరుకలేని స్థితిలో గడిపిన నా అనేకానేక జన్మల కర్మ ఫలితాలే .. మరి ఈ జన్మలో నేను చేస్తోన్న మాంసభక్షణే" అన్న సత్యం నాకు అర్థం అయ్యింది. ఆ పుస్తకాలు చదువుతూన్నంతసేపు పత్రీజీ నా ప్రక్కనే వుండి మాట్లాడుతూన్న అనుభూతిని పొందేవాడిని.

ఈ క్రమంలో ఒకసారి మా ఊరిలో వున్న "మైత్రేయ బుద్ధ పిరమిడ్"లో 7 రోజుల ధర్మమహాచక్ర సభలు జరిగినప్పుడు 2వరోజు హైదరాబాద్ పిరమిడ్ మాస్టర్ "ధ్యానరత్న" మారం శివప్రసాద్ గారు వచ్చారు. ధ్యానం క్లాస్ అయిపోయాక నేను, నా భార్య వారితో మాట్లాడుతూ.. "మేము ముస్లిం మతస్థులం కదా, మరి ధ్యానం చేయవచ్చా?"అని అడిగాను.

"మీరు ముస్లిం కనుక మీ అల్లాహ్‌ను మీరు ప్రార్థించుకోండి.. మీ మతాన్ని మీరు అచరించండి కానీ మాంసాహారం మాత్రం తక్షణం మానివేయండి ధ్యానంలో మీరు ఏ మతానికి సంబంధించిన దేవుడిని కూడా తలుచుకోనవసరం లేదు. మీ శ్వాస పై మీ ధ్యాస ఉంచి దానిని అలా గమనిస్తూంటే.. మీ శరీరం అంతా శక్తివంతమై డాక్టర్లు కూడా నయం చేయలేని జబ్బులన్నీ కూడా తగ్గిపోతాయి".. అంటూ మాకు చక్కటి వివరణ ఇచ్చారు. ఇక ఆనాటి నుంచి నేను ఇంకా శ్రద్ధగా ధ్యానసాధన చేయడం మొదలుపెట్టాను..మరి దాంతో నా బి.పి.,షుగర్, టెన్షన్ క్రమంగా నా స్వాధీనంలోకి వచ్చాయి!

ప్రతికూల ఆలోచలన్నీ నా నుంచి తొలిగిపోతూండడంతో ధ్యానం చేసి బయటికి వెళ్తే.. నా పనులన్నీ కూడా అద్భుతంగా జరిగిపోతున్నాయి! అనందంతో నా శరీరం తేలిక అయిపోయిన అనుభూతినీ..మరి ఏదో వెలుగు నా శరీరంలో నిండిపోయిన అనుభూతినీ. మరి ఏదో వెలుగు నా శరీరంలో నిండిపోతున్న అనుభవాన్నీ నేను ధ్యానంలో పొందాను!

ధర్మమహాచక్రం చివరిరోజు..మే 13వ తేదీన "బ్రహ్మర్షి పత్రీజీ సెంటర్‌కి వస్తూన్నారు" అని తెలిసి నా భార్యానూ, పిల్లలనూ తీసుకుని వెళ్ళాను. అంత దగ్గరగా పత్రీజీని చూసి నేను ఎంత ఆనందపడ్డానో వర్ణించలేను. ఇంతలోనే పత్రీజీ నా దగ్గరికి వచ్చి, నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి "ఏంటి సంగతులు?" అన్నారు! క్షణకాలం నా మనస్సంతా శూన్యమైపోయి.. నా ప్రమేయం లేకుండానే నా నోట్లోంచి "నేను చాలా ఆనందంగా ఉన్నాను సార్" అన్న మాటలు వచ్చాయి. నా జీవితంలోనే అది ఎంతో అద్భుతమైన రోజు!

ఇప్పుడు మేం పూర్తిగా శాకాహారుల్లా మారి ప్రతిరోజూ ఆనందంగా ఉంటూ.. ముస్లిం మతస్థులందరికీ ధ్యానం గురించీ, శాకాహారం గురించీ.. ప్రచారం చేస్తున్నాం.

మా అమ్మాయికి ఉన్న ఆస్తమా కూడా క్రమంగా నెమ్మదిస్తూ వచ్చింది. కుల మత ప్రసక్తిలేకుండా జీవితాలను ఉద్ధరించుకోవడంతో పాటు.. ధ్యానశాకాహార ప్రచారాల ద్వారా ఇతరుల జీవితాలను వారే ఉద్ధరించుకునేలా వారికి సహాయం చేసే అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పత్రీజీకి మా క్రుతజ్ఞతలు తెలియజేస్తూన్నాం!

 

చిన్న ఖాసిం
గుంటూరు

Go to top