" ధ్యానారోగ్యంతో నా జన్మ ధన్యం "

 

నా పేరు శారద.

గతంలో నాకు ఎడమ కాలిమడమలో విపరీతమయిన నొప్పి వుండేది. అడుగు తీసి అడుగు వేయలేక పోయేదాన్ని. ఇంట్లో ఏ పని చేయలేక విపరీతనైన మనస్తాపానికి లోనయ్యాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే "పాదంలో ఎముక పెరిగి పోయింది; "ఈ నొప్పి తగ్గడం కష్టం; అసలు నడవద్దు.. పైగా ఆపరేషన్ చేయాలి; అయినా గ్యారెంటీ లేదు" అన్నారు.

ఈ లోగా ఎముక పెరుగుతూ కాలి మడిమ నుంచి బయటికి పొడుచుకుని వచ్చి.. ఏ చిన్న వస్తువు దానికి తగిలినా విలవిలాడిపోయి విపరీతమైన నొప్పితో ఏడ్చేసేదాన్ని. చాలా వరకు బెడ్ పై పడుకునే ఉంటూ నా దుస్థితికి ఎంతగానో బాధపడేదానిని.

అదే సమయంలో మీర్‌పేట పిరమిడ్ మాస్టర్స్ "రాములు" మరి "సువర్ణ"గార్ల ద్వారా ధ్యానం గురించి తెలుసుకున్నాను. DRDL కమ్యూనిటీ హాలులో జరిగిన తటవర్తి వీరరాఘవరావు గారి మూడు రోజులు ధ్యానం క్లాసులకు వెళ్ళడం ఆ తరువాత మీర్‌పేటలో జరిగే ధ్యానం క్లాసులకు క్రమం తప్పక హాజరయ్యాను. శాకాహారిగా మారి ఇంట్లో ప్రతిరోజు గంట చొప్పున మూడు సార్లు ధ్యానం చేసేదాన్ని! కొన్ని సంవత్సరాలుగా నేను వాడుతోన్న మందులన్నీ ఆపివేసాను!

క్రమక్రమంగా చిత్రంగా నా కాలి ఎముక పెరుగుదల ఆగిపోయి నా నొప్పి కాస్త కాస్త తగ్గుముఖం పట్టింది. కొన్నేఏళ్ళుగా బెడ్‌కే అంకితం అయిన నేను ఇంట్లో నాకు నేనుగా తిరుగుతూ నా పనులు నేను చేసుకోవడం మొదలుపెట్టాను!

ఇక రెట్టించిన ఉత్సాహంతో విశాఖపట్టణంలో జరిగిన ధ్యానమహాచక్రం-2 కి బయలుదేరాను! ఆ సమయంలో కూడా కొంతవరకు మడమ నొప్పి ఉన్నా కూడా లెక్కచేయకుండా వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నా చెప్పులు తెగిపోయి విపరీతమైన నొప్పి మొదలైంది. చెప్పులు లేకుండా ధ్యాన మండపంలో అలాగే తిరుగుతూ వారం రోజులపాటు ధ్యానమహాచక్రంలో పాల్గొన్నాను! ఈ హడావిడిలో కాలి నొప్పి ఎప్పుడు పోయిందో కూడా నేను గుర్తించలేదు! గత కొన్ని యేళ్ళుగా నన్ను విపరీతమైన బాధకు గురిచేసిన కాలి మడమ ఎముక ఎటువంటి మందులు వాడకుండానే దానంతట అదే తన సహజస్థితిలోకి వచ్చి నన్ను మాత్రమే కాకుండా మా డాక్టరు గారిని కూడా ఆశ్చర్యపరచింది.

ఇంటికి రాగానే మా కుటుంబ సభ్యులు అందరూ నన్ను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. మామూలుగా తిరుగుతున్నందుకు ఆనందానికి లోనై ధ్యానమహత్తును గుర్తించి ఇంట్లో అందరూ ధ్యానులుగా, శాకాహారులుగా మారారు. మా వారు "భిక్షపతి"గారు అందరికి ధ్యానం, పిరమిడ్ శక్తిని పంచాలని నిశ్చయించి పదకొండు రోజుల క్లాసులను మా ఇంట్లో నిర్వహించాము!

మా ఇంటి ఆవరణంలో ఉన్న స్థలంలో పిరమిడ్ కట్టి 16-06-2012 రోజు డా|| న్యూటన్ గారిచే ప్రారంభోత్సవం చేసి "శివలింగేశ్వర పిరమిడ్" అని పేరు పెట్టడం జరిగింది! చుట్టుప్రక్కల వాళ్ళంతా పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుని ధ్యానం చేసి శాకాహారులుగా మారుతుంటే .. మాకు చాలా ఆనందంగా వుంది. ధ్యానప్రచారం ద్వారా మా జీవితాలను ధన్యం చేసిన బ్రహ్మర్షి పత్రీజీ కి మా కృతజ్ఞతలు!

 

శారద
హైదరాబాద్

Go to top