" ‘ధ్యానం’ అంటే అంతరంగంగ మరి బహిరంగ శుద్ధి "

 

మారం : మూర్తి గారు ! మీ గురించి తెలియజేయండి!

VSR మూర్తి : నా పూర్తి పేరు వల్లూరి శ్రీ రామచంద్ర మూర్తి; ప్రపంచానికి నేను ‘VSR మూర్తి’ గానే పరిచయం! నా వయస్సు 59 సం|| నా తల్లిదండ్రులు శ్రీ నాగభూషణరావు మరి శ్రీమతి సరోజినీ దేవి. నా భార్య శ్రీమతి రాజేశ్వరి మరి మా అమ్మాయి శర్వాణి.

నాకు నాలుగేళ్ళే వయస్సు ఉన్నప్పుడు నా ఆధ్యాత్మిక గురువు లభించారు. ఈనాడు ఆంధ్రదేశంలోనే ప్రతి దేవాలయంలో చెక్కబడివున్న "హనుమాన్ చాలీసా" రామ సంకీర్తనామృతాన్ని విరివిగా ప్రపంచానికి అందించిన తెనాలికి చెందిన శ్రీ జ్యోతీంద్ర సరస్వతీ రఘువీర దాస స్వామి గారు నాకు ప్రధమ గురువు. సంకీర్తనాచార్యులుగా పేరు పొందిన వారు తమ అద్భుతమైన గాత్రంతో అటు హిందూస్థానీ, ఇటు కర్నాటక సంగీతాలను రెండింటినీ మేళవించి.. హనుమాన్ చాలీసాను పాడుతూ.. పంచాహ్నికం, నామసప్తాహం, మరి రామనామ జపం నిరంతరంగా చేసేవారు.

నాకు నాలుగేళ్ళు వయస్సున్నప్పుడు వారి దర్శనం లభించింది. అప్పుడు వారు నన్ను ఆశీర్వాదిస్తూ తెలుగులిపిలో ఉన్న హిందీ హనుమాన్ చాలీసాను నాకు భహుకరించారు. కేవలం ఒక గంటలోనే నేను దాన్ని బట్టి పట్టేసాను! వెంటనే ఒక చిన్ని టవల్ కట్టుకుని .. వారిచ్చిన పుస్తకాన్ని మళ్ళీ వారి చేతికి అందించి.. "నేను చెప్తాను.. మీరు అందులో సరిచూసుకోండి" అన్నాను.

వారు నవ్వుతూ.. "నాకు వచ్చు.. నువ్వు చెప్పు".. అన్నారు.

నేను "అహ! అలాకాదు.. మీరు ఆ పుస్తకంలో సరిచూస్తూంటేనే నేను చెప్తాను" అన్నాను మంకు పట్టుతో! అది ఒక చిన్నపిల్లవాడు తల్లిదగ్గర చేసే చేష్ట..అంతే!

వారు మళ్ళీ నవ్వి.. ఆ పుస్తకాన్ని చూస్తూ వుంటే నేను మొట్టమొదటిసారిగా హనుమాన్ చాలీసాను పారాయణ చేయడం జరిగింది. వారు ముగ్ధులై .. నన్ను ఎత్తుకుని.. అక్కడే వ్రేళ్ళాడదీసీ వున్న ఒక అరటిగెలను నాకు చూపించి.."ఇదంతా నీదే" అన్నారు.

ఆ గెల నా కంటే ఎత్తుగా వుంది!

అదే రోజు సాయంత్రం .. ఆజానుబాహులైన జ్యోతీంద్ర సరస్వతీ స్వామివారు నన్ను తమ ఒడిలో కూర్చుండబెట్టుకుని మూడున్నర గంటలపాటు సంగీత కచేరి చేసారు! అది నా తొలి ఆధ్యాత్మిక అనుభవం! ఇక అప్పటి నుంచి నేను హనుమాన్ చాలిసాను వదలలేదు.

ఆ తరువాత నాకు పడకొండేళ్ళ వయస్సు వున్నప్పుడు ...ఒకసారి "జిల్లెళ్ళమూడి" వెళ్ళాను. "నేను వెళ్ళాను" అనడం కంటే ఒకరకంగా "అమ్మే నన్ను పిలిపించుకుంది" అని చెప్పవచ్చు. ఆమె నన్ను తన దగ్గర కూర్చోబెట్టుకుని ఎన్నెన్నో ఆత్మజ్ఞాన సత్యాలను అరటి పండు వొలిచి నోట్లోపెట్టినంత ఆత్మీయంగా చెబుతూండేవారు. గొప్ప తాదాత్మైన అనుభూతి అది.

"ఏ పదార్థమైనా..దాని గురించి తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు.. దాని పైన ఉన్న తోలుతీసి లోపలి పదార్థాన్ని నమిలిమ్రింగి జీర్ణం చేసుకుంటే తప్ప.. దానిలో వున్న పదార్థజ్ఞానం మనకు అంతుబట్టదు".. అని అమ్మ నేర్పించిన జ్ఞానం అద్భుతం! ఒక్కసారి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే అలా నేర్పిన అమ్మ జ్ఞానసత్యాల విలువ ఎంతగొప్పదో అర్థం నేర్పిన అమ్మ జ్ఞానసత్యాల విలువ ఎంతగొప్పదో అర్థం అవుతుంది!

అదే సంవత్సరం.. ప్రకాశం జిల్లా "ఇంకొల్లు" అనే పట్టణానికి వెళ్ళాను! అక్కడ ..ఒక ఎడ్లబండిపై సత్యసాయి బాబా నిలబడివున్న ఫోటో ముద్రించబడి వున్న "ఆంధ్రప్రభ" పేపర్‌ను చూసాను. దానిక్రింద "ద్వాపరయుగం నాటి శ్రీకృష్ణుడే మళ్ళీ అవతరించాడు" అని నోట్ కూడా వ్రాసివుంది.

"అవునా?! శ్రీ క్రుష్ణుడేమిటీ, మళ్ళి అవతరించడం ఏమిటీ? అదేంటో వెంటనే వెళ్ళి చూద్దాం" అని బాబాని అన్వేషిస్తూ పుట్టపర్తికి బయలుదేరి వెళ్ళిపోయాను. బుక్కపట్నం నుంచి మండుటెండలో పుట్టపర్తివరకు నడుచుకుంటూ వెళ్ళాను!

అది నా జీవితంలో అత్యంత చిరస్మరణీయమైన రోజు. 1962 జూన్ 9వ తేది.. నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండి పోయేరోజు! ఆ రోజు ఉదయం సుమారు 10.30 గం||ల ప్రాంతంలో పుట్టపర్తి.. ప్రశాంతినిలయంలో బాబాగారు పచార్లు చేస్తున్నారు. మండుటెండలో నడిచి వచ్చిన నేను .. చల్లని నీల్లతో ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళి వారి ముందు నిలుచుకున్నాను.

పచార్లు చేస్తున్నావారల్లా ఆగి .. దివ్యప్రేమ కళ్ళల్లో తొణికిసలాడుతూండగా.. పరిపూర్ణమైన వాత్సల్యంతో నా వైపు చూసి.. "నీ కోసం కాచుకుని కూర్చుంటినే" అన్నారు. అదొక అపురూపరమణీయమైన సన్నివేశం!

వెంటనే నన్ను గబగబా లోపలికి తీసుకెళ్ళారు బాబా! అప్పటికే అక్కడ వున్న నలభైమంది మధ్యలో నన్ను కూర్చోబెట్టుకుని.. "ఏం కావాలి?" అని అడిగారు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ!

నేనేం మాట్లాడలేదు! అసలు మాట్లాడలేని పరిస్థితి నాది.

బాబావారే.. తమ కుడిచేతిని గారితో త్రిప్పి..నేతితో చేసిన నల్లటి హల్వాను సృష్టించి.. నా చిన్ని చేతిలో పెట్టి "ఏం చేస్తావు దీన్ని?" అని అడిగారు.

ఒక పన్నెండేళ్ళ పిల్లవాడు.. అప్పటికే ఆకలితో వున్నవాడు నోరూరించే వేడివేడి హల్వాను సృష్టించి చేతిలో పెడితే ఏమంటాడు?! "తింటాను" అంటాడు!

కానీ అదేం అద్భుతమో కానీ.. "అందరికీ ఇస్తాను" అని వెంటనే నా నోటి నుంచి మాట వచ్చింది!!

ఎంతో పరమానందంతో బాబా.. "అవునవును. అదే స్వామికి చాలా ఇష్టం!"అన్నారు.

పళ్ళెంలో ఆ హల్వాను ఉంచి అక్కడ వున్నవారందరికీ పంచాను. తీరా చూస్తే నాకేమీ మిగలలేదు.. కేవలం నా చేతికి అంటిన కమ్మటి నేతి వాసన ఛాయ మాత్రం మిగిలింది.

"పాపం!" అంటూ బాబా మళ్ళి నా కుడిచేతి మునివ్రేళ్ళ మీద తట్టగా.. నేను అందరికీ ఎంతెంత హల్వాపంచానో అంత హల్వా మళ్ళీ నా చేతిలోకి వచ్చేసింది! తెగ ఆశ్చర్యపోయాను నేను!

ఇక అక్కడి నుంచి ఆధ్యాత్మిక జీవితం నల్లేరుంబండిపై నడకలాగ సాగిపోతూ వచ్చింది. శ్రీ జ్యోతీంద్ర సరస్వతులవారు, జిల్లెళ్ళమూడి అమ్మ మరి సత్యసాయి.. ఇలా ఈ ముగ్గురు గురుస్వరూపాలు మూడు డైమన్షనలో నన్ను ప్రభావితం చేసారు. ఒకరు విత్తనంలాంటి నాలోని సుషుప్తావస్థ శక్తిని తట్టిలేపితే.. ఇంకొకరు దానికి జ్ఞాన ప్రవాహాన్ని అందించి మొలకెత్తింపచేస్తే ..మరొకరు ఆ గతి శక్తిని చైతన్యశక్తి లాగా మార్చి నా ఎదుగుదలకు తోడ్పడేట్లుగా చేసిన వాత్సల్యస్వరూపులు!

ఇక ఆ తరువాత దాదాపు 50 యేళ్ళపాటు భగవాన్ సత్యసాయి బాబా తో నా సాంగత్యం సాగింది.

మారం : చాలా చిన్నవయస్సునుంచే మీ ఆధ్యాత్మిక ప్రయాణం సాగడం అద్భుతం! బాబాతో మీ అనుభూతులు..

VSR మూర్తి : బాబా ఒక "సంపూర్ణ స్వరూపం"! మానవ సంబంధాల పట్ల మానవ జీవన విధానం పట్ల.. అసలు మనిషి జన్మ ప్రణాళిక పట్ల.. మరి ప్రస్తుత మానవజన్మను సార్థకం చేసుకునే విధానాల పట్ల బాబాకు ఉన్న అవగాహనజ్ఞానం అత్యద్భుతం! భౌతిక, అదిభౌతిక మరి ఆధ్యాత్మిక స్థాయిల్లో మరెవ్వరూ అవిష్కరించలేనంత గొప్పగా వీటిని అవిష్కరించిన మహానుభావులు వారు! కొన్ని వందలసార్లు నేను వారిని కలిసివుంటాను.

ఆధ్యాత్మిక శిఖరాల మీద నన్నుకూర్చోబెట్టి, వారు నాకు చూపించవలసినవన్నీ చూపించారు. మహిమ వేరు, అనుగ్రహం వేరు, ఆధ్యాత్మికశక్తి వేరు మరి ఆత్మ ప్రజ్ఞ వేరు. ఇవన్నీ వివిధ స్థితులు..

నాకు బాబా దాదాపు యాభై ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఒక్కొక్కటి గంటన్నర సేపు! అవన్నీ కూడా పారమార్థిక చింతన గురించే తప్ప.. లౌకిక కామ్య విషయాలను గురించి మాత్రం కాదు. ఇంటర్వ్యూ చేస్తోన్న అవకాశంతో నేను ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా, అనంతంగా మరి అనూహ్యంగా వారి దివ్య కటాక్షాన్ని పొంది ధన్యుడనయ్యాను. "ఒక్కొక్క ఆత్మజ్ఞాన సందేశాన్ని బాబా అందిస్తూంటే .. దానిని రికార్డు చేసుకుంటోన్న నాలోపల లోకలోకాంతర ప్రాణాలన్నీ కదిలిపోయేవి".

మళ్ళీ అవతరించిన శ్రీ క్రుష్ణుడిని చూద్దామని వెళ్ళిననేను.. వారి సమక్షంలో సర్వదేవతా తత్వాన్ని అనుభవించాను. కృతయుగం నాటి "సత్యం", త్రేతాయుగంనాటి "ధర్మం", ద్వాపరయుగం నాటి "శాంతి, ప్రేమ" మరి కలియుగం నాటి "అహింస" ల యొక్క సమగ్రస్వరూపమే శ్రీసత్యసాయి.

మారం : ఈ నాలుగు దైవ దర్శనాల గురించి బాబా ఏమని సందేశం ఇచ్చేవారు?

VSR మూర్తి : సత్యం: నేను దేహం మాత్రమే కాదు.. నాకు ఒక దేహతీతమైన స్థితివుంది! నా దేహం ప్రాణశక్తితో కూడి ఉన్నంతవరకు మాత్రమే అ స్థితి అందులో సంచరిస్తూ వుంటుంది. అశాశ్వతమైన ఆ దేహం నశించిపోయినా రూపరహితం నామరహితం అయిన నా దేహాతీత స్థితి మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది!

ధర్మం : వ్యక్తి ధర్మం, మను ధర్మం, కుటుంబ ధర్మం, సామాజిక ధర్మం, ఆర్థిక ధర్మం, ప్రాపాంచిక ధర్మం అంటూ ధర్మం అనేక రూపాల్లో మనకు గోచరిస్తుంది. ఈ సంపూర్ణ ధర్మస్వరూపాన్ని గనుక మనం మన జీవన విధానమ్లో ప్రతిష్టించలేకపోతే.. అటువంటి "ధర్మం" కేవలం ఒక శాస్త్రంగా లేదా ఒక పుస్తకంగా మిగిలిపోతుంది.

శాంతి : "శాంతి" ఒకరు ఇచ్చేది కాదు. ఎవరికి వారుగా సాధించుకోవాలి! ఒకసారి ఒకానొక భక్తుడు "ఐ వాంట్ పీస్" అని బాబాను వేడుకున్నాడు.

అప్పుడు బాబా "నువ్వు ముందు ‘ఐ’ అనె అహాన్ని వదిలి పెట్టు.. ఆ తరువాత ‘వాంట్’ అనే కోరికను వదిలిపెట్టు! ఇక నీ దగ్గర మిగిలింది ‘పీస్’ కదా! అది నీకు ఎవరిస్తారయ్యా? నీకు నువ్వుగా ధ్యానం. సద్గోష్టి మరి స్వాధ్యాయం ద్వారా సంపాదించుకోవాలి" అన్నారు చమత్కారంగా!

ప్రేమ : రాగం వేరు.. అనురాగం వేరు. రక్తసంబంధంతో వున్న బంధాలైన తల్లి, తండ్రి,బిడ్డ అన్న, అక్క .. వంటి బంధాలన్నీ రాగబంధాలే! వాటిని ఎవ్వరూ కూడా చెరిపివేయలేరు. వాటిని అర్థం చేసుకుంటూ జీవించాలి.

ఇంకొకటి అనురాగబంధం అది ఈ ప్రపంచంతో మనం ఏర్పరచుకున్న సంబంధాలవల్ల మరి పరిచయాల వల్ల ఏర్పడిన తెలియరాని బంధం! దానిని వెశ్లేషించడం కష్టం! కాలంతో పాటు జీవుడి స్థితిగతులు మారినా, ఆలోచనా విధానాల్లొ మార్పులు చోట చేసుకున్నా, జీవితంలో ఏది అవసరమో మరి ఏది అనవసరమో సుస్పష్టమైనా అనురాగ బంధాలు మారిపోతూంటాయి. అదేమీ విషాదభూమిక కాదు.. కేవలం పరిణామ దశ మాత్రమే!

ఈ దశలోనే ఒక దివ్యమైన ప్రేమబంధం అగోచరంగా, అవ్యక్తంగా వుంటూ పరమాత్మ భావాన్నీ మరి దివ్యత్వాన్నీ మనలో మేల్కొలుపుతూ.. రాగ అనురాగబంధాలకు అతీతంగా మరి అత్యున్నతమైన బంధంగా ఏర్పడుతుంది. అలాంటి ప్రేమ బంధాన్ని నేను సత్యసాయి భగవానుల దగ్గర అనుభవించాను.

అహింస : ఒక జీవిని మరొక జీవి చంపితినడం మాత్రమే హింస కాదు. భావన చేత, చూపుచేత, మాటచేత, మానవ సంబంధాలను హేళన చేసే విధానం ద్వారా మరొక వ్యక్తి యొక్క భావనను గాయపరచినట్లయితే.. అది కూడా హింస క్రిందికే వస్తుంది.

"ఎవ్వరూ మనకంటే అధికులు లేరు: ఎవ్వరు మనకంటే అధములు కారు; అందరూ సమానమే" అన్న సమ్యక్ భావనలో ప్రతిక్షణం నిలకడచెంది ఉండాలి. అదే అహింస యొక్క సమగ్ర రూపం!

ఇలా .. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసల గురించి ఎంతో అద్భుతంగా తెలియజేసారు బాబా!

మారం : ‘స్నేహం’ గురించి బాబా ఏంచెప్పారు?

VSR మూర్తి : "అంతరంగము కన్న అధ్యాపకుడు లేడు అరయకాలమె పరమగురువు గ్రంధరాజమగును నీకు ప్రత్యక్షలోకమే ఎవడు స్నేహితుండు నీకు..మరి శ్వరుండె"

ఎవడు సదా నీ మంగళసౌభాగ్యాన్ని కోరుతూ నిన్ను ఆశీర్వదిస్తాడో అలాంటి ఆత్మస్వరూపుడైన ఈశ్వరుడే మన స్నేహితుడు అంటారు బాబా!

"స్నేహం" అంటే సంస్కృతంలో "నెయ్యం" అని అర్థం! "నెయ్యలు" అంటే ధాతువుల్లో "నెయ్యి"గా పిలుస్తారు. హోమాలూ, యజ్ఞాలూ చేసేటప్పుడు "ధార" తగ్గకుండా గుండంలో నెయ్యినిపోస్తారు. "స్వాహాకారం" చేస్తారు. స్నేహం కూడా అలాగే ధారగా సాగాలి! మధ్య మధ్యలో తెగిపోతూ, మళ్ళీ ముడివేసుకుంటూ "ప్యాచ్‌వర్క్"లా సాగేది స్నేహం కాదు. మన మనస్సు, మన భావాలు, మనకు వున్న ఆశయాలు ఆదర్శాలు మరి మనం నడుస్తోన్న ఆధ్యాత్మిక మార్గం ఎక్కడ గౌరవం పొందుతోందో..ఎవరు దానికి గౌరవం ఇస్తారో..వారితోనే మనం స్నేహం చెయ్యాలి!

మనతో శాశ్వతమైన స్నేహం చేసే మన ఆత్మే మన స్నేహితుడు.. మరి స్నేహితుడు అంటే పరమేశ్వరుడి రూపంలో వున్న గురువే కనుక "ఈశ్వరో గరురాత్మతీ" అన్న భావనతో ఆ శాశ్వతమైన స్నేహంతోనే మనం జీవించాలి.

మారం : ప్రపంచం నలుమూలల నుంచి ఏ దేశస్థులు తమ దగ్గరికి వచ్చినా .. బాబా వారు వారికి వారి భాషలోనే సమాధానం ఇచ్చేవారు అని ప్రతీతి! దీనిని వివరించండి సార్!

VSR మూర్తి : ఇది "సత్యం"! బాబా తన ప్రాపంచిక చదువును 8వ తరగతి వరకు కూడా పూర్తిచేయలేదు! కానీ వారికి వేదాలపై, భారత భాగవత రామాయణాల మీద, ప్రస్థానత్రయం మీద ‘అద్వైత బోధ మీద, ధ్యానం మీద, యోగం మీద ఇలా వారు సృశించని అంశం లేదు. అయితే ఇవన్నీ కూడా ప్రాపంచిక స్థాయిలో ప్రామాణికంగా నిలిచి ప్రతి ఒక్కరు అధ్యయనం చేయాల్సిన అంశాలుగా ఉన్నాయి.

అయితే "మనస్సు" యొక్క స్థాయిని దాటగలిగిన వాడి భావంలోంచి శుద్ధచైతన్యం ఆవిష్కరించబడి.. అంతరంగంలో వున్న మూలభావం.. ఆయా భాషల్లోకి దానంతటదే అనువాదం అయిపోతుంది. అప్పుడు అతడివెంట ఈ శాస్త్రాలూ మరి పురాణాలన్నీ కూడా పరిగెత్తుకుని వస్తాయి మరి ఇక అతడు దేనివెంట కూడా పరిగెత్తనవసరం వుండదు. ఇది ఏకాత్మ భావన!

విదేశస్థులే కాదు "ఏలియన్స్" అనే మనకు ఏ మాత్రం సంబంధం లేని గ్రహాంతరవాసులతో కూడా బాబా మాట్లాడుతూ వుంటే.. వినేవారు పరమానంద స్థితిని పొందిన సందర్భాలెన్నో! బాబా ఎప్పుడూ అంటూండేవారు!

"There is only one language..and that is the language of Heart"

"హృదయం" అంటే ఆత్మకు స్థావరం! హృదయభాషను నేర్పినవాడి మాటలన్నీ కూడా శుద్ధ చైతన్యంతో అలరారుతూంటాయి!

మారం : ఒకానొక సందర్భంలో బాబా "నేను 96 యేళ్ళు జీవిస్తాను" అని ప్రకటించారు కానీ 86 యేళ్ళకే దేహత్యాగం చేసారు?

VSR మూర్తి : పరమేశ్వరుడి ఇష్టమే ఆయన ఇష్టం! ప్రసమ్గవశాత్తు ఒకసారి బాబా వారు "నేను 96 యేళ్ళు జీవిస్తాను" అని చెప్పారు. అందులో అణుమాత్రం కూడా సందేహం లేదు!

మతాతీతంగా, కులాతీతంగా ప్రపంచం మొత్తానికి భారతీయ సంస్కృతినీ, ఆధ్యాత్మిక విధానాన్నీ "ప్రేమ" "సేవ" అనే రెండు యోగమార్గాల ద్వారా తెలియజేసిన బాబా .. బహుశః ఇక "నా అవతారం యొక్క అవసరం లేదు" అనుకుని వుండవచ్చు!

మనం ఎక్కడికైనా ఏదయినా పనిమీద వెళ్ళినప్పుడు ఇక అక్కడ ఆ పని పూర్తయ్యాక ఎందుకుంటాం? పని తొందరగాపూర్తయితే.. తొందరగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాం! బాబా కూడా అంతే!

వారు తమ 14వ సంవత్సరాల జీవితాన్ని సుషుప్తావస్థలో గడిపిన తరువాత తనను తాను అవతార ప్రకటన చేసుకుని ఆ 72 సంవత్సరాల పాటు ప్రతి నిమిషం బోధాకృతిలో.. మానవ జాతిని ఎంత సంసిద్ధపరచాలో అంతా చేసారు!

మారం : సత్యసాయి ధ్యానం గురించి చెప్పేవారా?

VSR మూర్తి : అద్భుతంగా చెప్పేవారు! సాధకులు తమ దగ్గరికి వచ్చినప్పుడు, నిత్యప్రార్థన, నిత్యధ్యానం చెయ్యమని చెప్పేవారు. ప్రార్థన అంటే ఆర్థించడం కాదు. వారి దృష్టిలో ప్రార్థన అంటే ఆర్థించడం కాదు. వారి ద్రుష్టిలో ప్రార్థన అంటే.. "సమస్త లోకాలు: సుఖినోభవంతు" అని! లోకాలన్నీ బాగుంటే మనం బాగుంటాం. మనం ఒక్కళ్ళం బాగుండగలమా! లోకం యొక్క ఆనందమే మన అనందం.

మన ఆనందం మళ్ళీ లోకానికి ఇవ్వాలి. "ఋగ్వేదం" లో మాట ఇది! "నా యందు అద్భుత భావనలు ప్రవాహవేగంతో వచ్చుగాక.. నా నుండి అద్భుత భావనలు ప్రవాహవేగంతో ఈ ప్రపంచానికి చెందుగాక" ఇవి రెండూ "ఋగ్వేదం"లోని సూక్తులు.

బాబావారు నిత్యప్రార్థన చేయమన్నారు కానీ మనకు ప్రార్థన అనగానే శ్లోకాలు, శోకాలు గుర్తుకు వస్తాయి. ఇదికాదు ప్రార్థన. చతుర్దశ భువనాలూ హాయిగా ఉండాలి అని సంకల్పం వుండాలి. అది ఉండాలి అంటే..ధ్యానంలో వుండాలి అని తెలిపారు బాబా!

మారం : ధ్యానం గురించి ఇంకా ఏం చెప్పేవారు బాబా!

VSR మూర్తి : చాలా చాలా! ధ్యానం లేకపోతే అసలేమీ లేదు! ధ్యానం అంతరంగశుద్ధి మరి బహిరంగ శుద్ధి. అలాగే మన ఆలోచనలు యొక్క తీవ్రత తగ్గడానికి, ఇంద్రియాల కార్యకలాపాలను నియంత్రించడానికి కావలసింది ధ్యానం.

మనలోపల వున్న వాయువే.. మన ఆయువు కనుక ఆ వాయువుకు శ్వాస అనే పేరు పెట్టుకుని జాగ్రత్తగా ఆ ‘శ్వాస’ ను గమనించుకుంటూ అర్థం చేసుకుంటూ.. నియంత్రించుకుంటూ.. దాని రాకపోకల మీద మనస్సును పెట్టగలిగి నట్లయితే, ప్రాపంచికమైన మనస్సు, ఒక ఆధ్యాత్మికమైన ధ్యాన మనస్సుగా మారుతుంది! అందుకే ధ్యాని అయిన వాడికి ఒకానొక స్పష్టత, గంభీరత, సద్విద్య, మరి పరిపూర్ణత ఏర్పడుతాయి!

ధ్యానం చెయ్యడం మాత్రమే కాకుండా, "ధ్యానిగా ఉండండి.. మీలో మీరు ఉండండి" అనేవారు బాబా!

Go to top