" బురదలో తామరపువ్వులా వికసించు "

 

మానవులకు మాత్రమే అవకాశం వున్న ఏకైక వరం ధ్యానం. శ్రమించటంలో ఆనందం పొందేవారు వుంటారు. ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తూ ఆనందం పొందేవారు వుంటారు. ఈ ఆనందాలన్నీ ఒత్తిడిని కలిగిస్తాయే కానీ సంపూర్ణ ఆనందాన్నీ, ప్రశాంతతనూ కలిగించవు. వీటిని పొందాలంటే ధ్యానం మాత్రమే మార్గం. చక్కెర నీటికి, తేనెకు ఉన్నంత తేడా వీటి మధ్యలో వుంది.

ఏదో కావాలని, దేన్నో పొందాలనే తపనతో ధ్యానించటం వల్ల ప్రశాంతతకు బదులు అశాంతత ఏర్పడుతుంది. ఏ కోరికలూ లేని, ఏ ఆరాటమూ లేని నిశ్చల స్థితిలో నేను ఈ విశ్వంలో ఒక భాగాన్ననీ, ఏమీ పొందవలసింది లేదనీ, ఏమీ పోగొట్టుకునేది లేదనే భావనతో ఒక మంచి మానసిక పరిస్థితి ఏర్పడుతుంది. అలసి సొలసి చెమ్మగిల్లి అనవసరపు తపనలతో, అలజడులతో కొట్టుమిట్టాడుతూ సకల శాంతులను కోల్పోయిన మానసిక స్థితి ఒకింత కుదుటపడి నిజమైన ఆనందం పొందుతూ ఒక అవ్యక్తమైన మధురానుభూతిని పొందటం ద్వారా ఎంతో శక్తిని సమకూర్చుకుంటుంది. సమాధి స్థితిలో కొందరు సాధకులు తమ భారాన్ని కోల్పోతే మరికొందరు దివ్య జ్యోతిని దర్శిస్తారు. కొందరు సకల దేవతా దర్శనం చేసుకుంటే మరికొందరు విశ్వదర్శనం చేసుకుంటారు. కొందరు శరీర రాహిత్యాన్ని పొందితే మరికొందరు కాస్మిక్ జలపాతంలో పుణ్యస్నానాలు చేస్తారు. ఎవరి అనుభవం వారిది. అనుభవాలు వేరైనా పొందే ఆనందం అపారమైనది.

సాధనలో అంతరాత్మకు చేరువై, మరీ చేరువై, ఇంకా చేరువై అణువణువూ పులకించి శరీర రాహిత్యాన్ని పొంది అణువులో అణువు కలిసి మమేకమై, మైమరచి ఎంతకాలం గడిచిందో తెలియని కాలరాహిత్యస్థితిలో గుండెలో గూడుకట్టిన బాధలు ఆవిరుల రూపంలో కళ్ళలో జాలువారి అలలు అలలుగా ఈ శరీరాన్ని పవిత్రం చేయటానికా అన్నట్లు ప్రవహించిన వెచ్చని కన్నీరు నన్ను మళ్ళీ ప్రపంచంలోకి తేవటానికి కారణమైంది. అసంకల్పితంగా గుండెలోతుల్లోంచి ఉద్భవించి ఈ శరిరాన్ని అభిషేకించి సంపూర్ణ మానవునిగా పరిణామం చెందటానికి ఏర్పడే గంగాజలం కాదా ఈ ఉద్వేగభరిత పావనగంగ?

ఏమీ కోరని, కోరలేని స్థితియే ఈ సమాధి స్థితి. ధ్యానం ద్వారా సమాధి స్థితి, సమాధి స్థితి ద్వారా నిశ్చలత్వం, నిశ్చలత్వం ద్వారా నిర్వికారం. తద్వారా ప్రశాంత చిత్తం ఆపై ఏమీ లేని స్థితి, ఏమీ తెలియని స్థితి, ఏమీ కోరని స్థితి తద్వారా... చిదానందస్థితి. భావాలకు అందని అతీతమైన ఆనందస్థితి. "ఈ స్థితి నుంచి ఈ ప్రపంచంలోకి రావలసిన అవసరం వుందా?" అని అనిపించే స్థితి. ఆ స్థితి ద్వారా మృత్యువుకు భయపడని స్థితి, మృత్యువును ప్రేమించే స్థితి. ఎంత ప్రశాంతత. ఎంత విశ్రాంతి. ఎవరు గణించగలరు? ఎవరు వివరించగలరు ఈ అవధులు లేని ఆనందమయ స్థితి?

ఎందరో మహానుభావులు, మునులు, ఋషులు, ప్రాపంచిక విషయాలకు దూరంగా వుండాలనే కాంక్షతో అడవులలో హిమాలయాలలో ఈ స్థితిని పొందాటానికి వెళ్ళేవారు. ఈనాడు ఈ స్థితిని పొందటానికి ఎక్కడికీ వెళ్ళనవసరంలేదు. సాయి మందిరంలో ఎందరో మహానుభావులు, తపోసంపన్ను శ్రీశ్రీశ్రీ పత్రి గారి వంటి కారణజన్ములు ధ్యానం చేసిన ధ్యాన మందిరంలో సాయినాథుడు ఆసీనుడూ నీ చేయిపట్టి, వెన్నుతట్టి ఆనందమయస్థితికి చేర్చటానికి సకలవేళలలో సంసిద్ధులుగా వున్న తరుణాన సకల సంపదలు ఇవ్వలేని ఆనందమయ స్థితిని, ఆనందాన్ని అనుభవించటానికి నీకు కావలసిందల్లా ఆనందం పొందాలనే తపన.

ఓ సాధక రా, ధ్యానం ద్వారా నీ మార్గం, నీ గమ్యం తెలుసుకో. ఈ ప్రపంచంలో వుంటూనే బురదలో తామరపువ్వులా వికసించు. విశ్రాంతిని పొందటం ద్వారా శక్తిని పొందు. తేనెటీగలా భ్రమించినా, తేనెలా స్రవించు. ధ్యానంలో నేను అనుభవించిన నా అనుభవాలన్నీ ఇవే. మీరూ ఈ రసానుభూతిని పొందండి. ధ్యానంతో తరించండి.

 

కొండూరు సాయిబాబా
ప్రెసిడెంట్, శ్రీ షిరిడీ సాయిబాబా సంస్థాన్
బాగ్ అంబర్‌పేట, హైదరాబాద్

Go to top