" కోమిటిశెట్టి, బ్రాహ్మణరత్న"

 

2003 వ సంవత్సరం ఫిబ్రవరి నెల 22వ తేదీ. ఈ జన్మలో ఈ ఆత్మ ధరించిన ఈ శరీరానికి 49 వ పుట్టినరోజు. సమయం... రాత్రి 2గం. సుమారు ప్రాంతం. సందర్భం... హైదరాబాద్ నుంచి బళ్ళారి వెళుతున్న బస్సులో ప్రయాణం. చలి బాగా వుంది. హైదరాబాద్‌లో ఉదయం అంతా ఎండ. బస్సులో రాత్రి చలి. లోపలికి వస్తున్న చలిగాలి ఇబ్బంది పెడుతోంది. సూట్‌కేస్‌లో షాల్ కానీ, మంకీక్యాప్ కానీ లేదు. చెవుల్లో ఇబ్బందిగా వుంది... ధ్యానంలోకి రాకముందు దాదాపు 9 సం.లు బాధించిన ఆస్త్మా పూర్తిగా తొలగిపోయినా, చలిగాలి మాత్రం పడటం లేదు మరి.

ఏం చేయాలో కాసేపు ఆలోచించినపుడు అనిపించింది... "ఎవరైనా మాస్టర్ సహాయం చేస్తే బాగుంటుంది" అని. అంతే వెంటనే ఆపాద మస్తకమూ ఎవరో ఒక ఉన్నిరగ్గుతో కవర్ చేసిన అనుభూతి. కళ్ళు, ముక్కు, నోరు, ముఖానికి మాత్రం చలిగాలి స్పర్శ తెలుస్తోంది. అలా అలా దాదాపు రెండుగంటల సేపు అద్భుతమైన వెచ్చని స్పర్శ శరీరానికి తగిలింది. బాగా అలసి పోయేనేమో ఆ రోజు, కాస్సేపు నిద్ర మళ్ళీ కాస్సేపు మెలకువతో ఈ అద్భుత నులి వెచ్చని అనుభూతి.

" షిర్డీబాబా భౌతికంగా ప్రత్యక్షమయ్యారు "

అప్పుడనుకున్నాను "నిజంగానే ఎవరో మాస్టర్ సహాయం చేస్తున్నారు... లేకపోతే ఇదెలా సంభవమవుతుంది" అని "ఎవరో మరి ఆ మాస్టర్ భౌతికంగా కనపడితే బావుంటుంది" అనుకున్నాను. అలా నేను అనుకున్న మరుక్షణంలో ఆ బస్సులో నా సీటుకి ముందు సీటుకి మధ్యలో "షిర్డీబాబా" భౌతికంగా ప్రత్యక్షమయ్యారు. కళ్ళు జ్యోతుల్లా మెరుస్తున్నాయి. భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళు వేసుకునే 'ఎరపు డ్రెస్సు'. చామన చాయ రంగు... అంతవరకు నా శరీరం మీద నాకు కనిపించని ఉన్ని వస్త్రం కనపడుతోంది. ఆశ్చర్యానందానుభూతి నాలో. "ఏంటిది? నేను నిద్రలో కలగంటున్నానా? లేకపోతే ధ్యానంలో అనుభవమా?" నాకు అర్థంకాలేదు. దాదాపు ఒక నిమిషంపాటు. ఆశ్చర్యం నుంచి తేరుకుని, బాబా చెయ్యి పట్టుకున్నాను నిజమో కాదో తేల్చుకుందామని.

"అబ్దుల్ బాబా"

కల కాదు నిజమే. నవ్వుతున్నారు బాబా పసిపాపలా... స్వచ్ఛంగా .. గత జన్మలో నా స్వామి ఈ జన్మలో నిజరూపంతో కళ్ళముందర. ఆనందభాష్పాలు జల జలారాలుతున్నాయి నాలోంచి. నాకొచ్చిన మొదటి సందేహం అసలు "ఈ సీటుకి ముందు సీటుకి మధ్య ఉన్న ఇంత కొద్ది స్థలంలో బాబా ఎలా ఇమిడారు?" అని. నా థాట్ వెంటనే ఆయనకు చేరిపోయింది. వారంటున్నారు "వెర్రివాడా, ఎన్నిసార్లో నా పారాయణ చేశావు. నేను ఉయ్యాల బల్ల మీద రాత్రి ఎలా నిద్రపోయేవాడినో చదివావు. నీ భౌతిక నేత్రాలతో ఎన్నోసార్లు చూశావు 'అబ్ధుల్లా'గా. ఇంత వెర్రి సందేహం నీకెలా వచ్చింది?" అని. మా ఇద్దరి సంభాషణ భావప్రసారం ద్వారానే జరుగుతోంది... అంటే నా ఆలోచనలు ఆయనకు చేరుతున్నయి, వారి సమాధానాలు థాట్‌లోనే నాకు చేరుతున్నాయి.

అడిగాను "ఇదేమిటి ప్రభూ, మేరే మాలిక్ ఐసా నహీ హోనా చాహియే. మై ఆప్ కా సేవా కరనాహై. మై ఆప్ కా జనమ్ జనమ్ కా సేవక్‌హూ. ఆప్ మేరే మాలిక్ హై" అన్నాను. హిందిలో.

"షిర్డీలో నేను జీవించి ఉన్నప్పుడు, మరణించిన తర్వాత కూడా నువ్వు అబ్దుల్లాగా 48 సంవత్సరాలు ఎంతో సేవ చేశావు. మలమూత్రాదులు శుభ్రం చేశావు. నా ఆదరణ, అభిమానం చూరగొన్నావు. అందుకే నీ ఆఖరి కోరిక ప్రకారంగానే నిన్ను నా సమాధి మందిరం ఆవరణలోనే సమాధి చేశారు. ఈ భాగ్యం నీకొక్కడికే దక్కింది అన్నారు.

"మాలిక్, నేను ఎంతో భాగ్యం చేసుకున్నాను మిమ్మల్ని మళ్ళీ ఈ జన్మలో ... ఈ రెండుకళ్ళతో... చూడడానికి. ఈ ఆనందాన్ని నేను మరచిపోలేను. దీనికంతటికీ కారణం నా ధ్యాన ప్రచారమే. ఈ జన్మలో నాగురువు సుభాష్ పత్రిగారి సాహచర్య ఫలమే. గత జన్మలోని గురువు కనపడడానికి ఈ జన్మలోని గురువు కారణమయ్యాడు. ఆహా, ఏమి నా భాగ్యం. ఎంత గొప్ప జన్మ నాది" అన్నాను

"బేటా, గత 48 సంవత్సరాలుగా నీ పరోక్షంలో నీ తోడు నీడగా వుంటూ నీకు సేవచేశాను. నువ్వు ఎప్పటికప్పుడు అనుకునే వాడివి కదా, నువ్వెన్నో చిక్కుల నుంచీ, ఇబ్బందులనుంచీ, ఘర్షణల నుంచీ బయట పడినప్పుడల్లా 'ఏదో శక్తి నన్ను అనుక్షణమూ కాపాడుతోంది... లేకుంటే ఈ జీవితం ఎలా వుండేదో' అని. అది నిజం. నేను ఎప్పటికప్పుడు నిన్ను కాపాడుకుంటూ వచ్చాను. ఇంకా నువ్వు ఎన్నో జన్మల్లో అనుభవంచవలసిన కర్మలన్నీ ఈ జన్మలోనే పూర్తి అయ్యేలా చూశాను. నువ్వెన్నో ఘర్షణలు, ఇబ్బందులు పడుతున్నా, ఎప్పటికప్పుడు నీకు దారి చూపించి, నిన్ను ఆదుకున్నాను. 48 సం|| లు నువ్వు షిర్డీలో సేవ చేశావు. ఈ జన్మలో నీకు నేను గత 48 సం||లుగా సేవ చేశాను. నా ఋణం తీరిపోయింది. ఇక నీకు నాకు రాం రాం." అన్నారు బాబా.

"ఉత్తమగురువు నీకు లభించాడు"

నేను నిర్విణ్ణున్నయ్యాను. "అసలెందుకు మీరు దర్శనం ఇచ్చారు?. ఇచ్చారు, ఓకే, 'ఋణం తీరింది' అంటున్నారు. అసలు మీరు ఈ మాట ఎందుకు చెప్పాలి? చెప్పి నాలో అనవసరమైన ఒక 'గిలి' ని మీరు కలిగించారు. ఎలాగో ఈ జీవితాన్ని గడుపుతున్నాను మీకు తెలుసు. నాకు తెలుసు... పత్రీజీకి తెలుసు... నేనెన్ని గొప్ప ఘర్షణలు దాటుకుని వచ్చానో. కొంతవరకు నా భార్యకు తెలుసు. మీరంటున్న మీ సహకారం వల్ల దాటాననీ ఇప్పుడేమో నాకు మీకు 'రాం రాం' అనీ అంటున్నారు. ఇది మీకు న్యాయం కాదు. తెలియకుండా ఉంటే వేరు. ఇప్పుడు తెలిసిన తరువాత మీరు నన్ను వీడిపోతున్నారు అంటే నాకు చాలా కష్టంగా వుంది, ఇబ్బందిగా వుంది" అన్నాను.

అప్పుడు బాబా "ఓయ్, నువ్వు చింతించాల్సిన పనిలేదు. గత జన్మలో నీ గురువునే. అయితే, నా కంటే ఈ జన్మలో మరింత త్రికాల జ్ఞాని, బ్రహ్మవేత్త, మహాపురుషుడైన ఉత్తమ గురువు నీకు లభించాడు. వారిని 'సుభాష్ పత్రి' అనే కంటే ... 'సుభాషిత పత్రి' అంటే బాగుంటుందేమో. నువ్వు వారి మార్గదర్శకత్వంలో మరెంతో ఆత్మజ్ఞానం పొందుతావు. గతజన్మలో నువ్వు ఉర్దూలో చాలానే వ్రాశావు. ఆ జన్మలోని జ్ఞానం, నా జ్ఞానం, నీ జ్ఞానం, నీ గురుబోధ అన్నీ కలిపి అద్భుతంగా వ్రాస్తావు. పత్రి మాస్టర్ సేవలో, సాహచర్యంలో బ్రహ్మజ్ఞానివై జీవన్ముక్తి పొందు. ధ్యాన ప్రచారమంటే చిన్న విషయం కాదు. అన్ని స్థితులు దాటి బ్రహ్మస్థితికి రాబోతున్నావు. ఇంకా నీకెందుకు నా మార్గదర్శకత్వం, సహాయం? నిన్ను నువ్వు ఉద్ధరించుకునే అవకాశం నీకు కలిగింది.

"ఇంతవరకు నువ్వు మరొకరి తోడ్పడుతూ వున్నావు. ఇక మీద కేవలం నీ గురువు సహచర్యంతో, మార్గదర్శకత్వంలో అద్భుతంగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకుంటావు. ఇంతవరకు నువ్వు వేరు. ఇకపైన నువ్వు వేరు. నువ్వే ఎందరికో తోడ్పడతావు. ఎన్నో జీవితాలను 'ధ్యానం' అనే ఒక్క సహాయం చేసి వారిని వారు ఉద్ధరించుకునేలా చేస్తావు. ఇంకొక అయిదు సంవత్సరాలు నీకు ఘర్షణ తప్పదు. మరింత మరింత రాటు దేలతావు. అన్నీ అవగతం చేసుకుని, అన్నీ జీర్ణించుకుని ఆ అనుభవాలను అందరికీ చెబుతావు. వర్ధిల్లు" అని అంతర్ధానమవుతున్న క్షణంలో...

"ఆగు మేరా మాలిక్. ఆగు. వెళ్ళొద్దు. నన్ను విడిచి వెళ్ళవద్దు. నాకు ఇంక సహాయం చేయకపోయినా ఫరవాలేదు. నా వీపు మీద నివసించు చాలు. ఇంకేమీ వద్దు" అని గట్టిగా బాబా మణికట్టు పట్టుకున్నాను. చిరునవ్వు నవ్వుతూ అంతర్ధానమయ్యారు ఆ మహా మహావతారుడు... బాబా.

"షిర్డీబాబా నాలో వాకిన్"

ఆ తరువాత ఎనిమిది నెలలకు అంటే 2003 సంవత్సరం అక్టోబర్ ప్రాంతాల్లో అర్ధమయ్యింది... 'షిర్డీబాబా' ఈ శరీరంలో వాకిన్ అయ్యారని. ఆ తరువాత ఒక్కొక్క సంఘటనా.. ఒక్కొక్క అనుభూతి... ఆర్టికల్స్ వ్రాస్తున్నప్పుడు వచ్చే విషయాలు, మాట్లాడుతున్నపుడు ఈ నోట్లోంచి వచ్చే గొప్ప జ్ఞానప్రవచనం, ఎవరినైనా హీల్ చేసినప్పుడు, ఎవరి కళ్ళలోకైనా చూచినప్పుడు, ఎవరినైనా కౌన్సిలింగ్ చేసినప్పుడు, నాకు అర్థం కాకుండానే వారికి హీల్ అయినప్పుడు, వారి సమస్యలకు సమధానం దొరికినప్పుడు ఎదుటివారిని చూసి వారి మనస్సులో భావాలు వారికి చెప్పినప్పుడు వాళ్ళ సమస్యలకు పరిష్కారం తెలిసినప్పుడు, ఎదుటి వారి కళ్ళలో కనపడే కృతజ్ఞతా భావం, మెల్ల మెల్లగా నాకు అర్ధమవడం ప్రారంభించింది. ఇదంతా ఈ శరీరం ఆక్రమించుకున్న 'బాబా' స్టేటస్ అని.

" పూజ, స్తోత్రం, యాగం... ఇలా ఎన్నెన్నో... "

ధ్యానం చేయడం మొదలు పెట్టడానికి ముందు 1969 నుంచి 1998 వరకూ నా జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో. పూజ, స్తోత్రం, మంత్రం, యజ్ఞం, యాగం... ఇలా ఎన్నెన్నో.. ఎంతోమంది స్వాములతో, స్వామీజీలతో, బాబాలతో, సాధువులతో, ఫకీర్లతో స్నేహం. అన్నదానం, వస్త్రదానం, సువర్ణదానం, ఆర్ధికదానం... ఎన్నో ... ఎన్నెన్నో... తిరగని క్షేత్రంలేదు. చేయని పూజ లేదు. ఎన్నో స్త్రోత్రాలు కంఠతా వచ్చేవి. ఎంతో శ్రావ్యంగా పఠించేవాడిని. ఎన్నో స్తోత్రాలు కంఠతా వచ్చేవి. ఎంతో శ్రావ్యంగా పఠించేవాడిని. 15 సార్లు శబరిమలై వెళ్ళాను. ఎనిమిదిసార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. తిరుపతికి ప్రతి సంవత్సరం వెళ్ళేవాణ్ణి. వెళ్ళిన ప్రతిసారీ తలనీలాలు సమర్పించేవాడిని. నామాలు పెట్టుకునేవాడిని. మా ఊళ్ళో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించాను. లక్ష్మీనరసింహస్వామి ఆలయం జీర్ణోద్ధరణ చేశాను. రోజూ ఎంతో సమయం పూజలో గడిపేవాడిని. పుట్టుకతో వైశ్యుడినయినా, బ్రాహ్మణుల కంటే ఎక్కువుగా దేవతారాధన చేసేవాడిని. లేచినా కూర్చున్నా... సెంటిమెంట్.

ధ్యానంలోకి వచ్చిన తరువాత ఒక్కసారిగా అన్నీ వదులుకోగలిగాను. అసలు సెంటిమెంటు అనే మాటను నా జీవితంలో లేకుండా చేసుకున్నాను. కేవలం ఒక సంవత్సర కాలంలో ఇంత ఖచ్చితంగా మార్పు పొంది, ధ్యానయోగిగా మారడం నాకే గొప్ప విడ్డూరం. ఇక మా బంధువులు, స్నేహితులు, పరిచయస్థులు అందరూ ముక్కు మీద వ్రేలు వేసుకున్నారంటే అతిశయోక్తి లేదు.

"తీవ్ర అనారోగ్యం"

2005 సంవత్సరం ఈ శరీరంలో తీవ్ర అనారోగ్యం కలిగింది... దాదాపు ఎనిమిది నెలలు. మే నెల 2005 నుంచి అనారోగ్యం పెరుగుతూ ఆగస్టు నెల వచ్చేసరికి అసలు బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి. దాదాపు నలభైరోజులు తీవ్రమైన జ్వరం. మందుల జోలికి, డాక్టరు జోలికి అస్సలు పోలేదు వళ్ళు పేలిపోతున్నా. అక్టోబరు నెలలో మాత్రం మళ్ళీ బాగా ఆరోగ్యం చేకూరింది. అప్పుడు ఎవరో అడిగారు పత్రీజీని "మారం శివప్రసాద్ త్వరగానే కోలుకున్నాడు" అని. అప్పుడు పత్రిసార్ అన్నారు. "మారం శివప్రసాద్ తల్లితండ్రులు ఇచ్చిన 'మాంస శరీరాన్ని' వదిలి 'మంత్ర శరీరాన్ని' ధరించాడు. పాము కుబుసం వదిలి వేసినట్లుగా ఈతని మాంసపిండం మంత్రపిండం అయింది. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఈవిధంగా మాంస పిండం వదిలి మంత్ర శరీరం ధరించాలి" అన్నారు. ఆ తరువాత మళ్ళీ మూడు నెలల తీవ్ర అనారోగ్యం తరువాత పూర్తిగా కోలుకోవడం జరిగింది.

2005 నవంబర్ నెల 19, 20, 21 తారీఖుల్లో నా శరీరం మూడు రోజులు దాదాపు కోమా స్థితిలో లాగా వుంది. కేవలం ముఖం మాత్రం కదిలి, మిగతా శరీరమంతా డెడ్ అయిపోయింది. అప్పుడు అవగాహన అయింది "బాబా" తాను మూడురోజులు తన "కారణ శరీరాన్ని" ధరించి కాస్మాస్ లోకి వెళ్ళి, భౌతిక శరీరంలో కోమా స్థితిలోఉన్నప్పటి అనుభూతి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 22 తరువాత ఈ శరీఅంలోని స్థితి చక్కగా అవగతమైంది.

"ద్విజుడు... బ్రాహ్మణరత్న"

'గీతామకరందం' రెండోసారి చదివినప్పుడు 'మంత్రం పిండం' అంటే ఏమితో పూర్తిగా అర్థమయ్యింది. శ్రద్ధాత్రయ విభాగయోగంలో 14 వ శ్లోకంలో 'ద్విజుడు' అనే దానికి శ్రీ విద్యాప్రకాశనందగిరి స్వామి వారి వ్యాఖ్యానంలో:

"ద్విజులు అనగా రెండవ జన్మ ఎత్తిన వారు. అంటే పుట్టుకతో వచ్చిన జన్మ కాక సంస్కారముచే సాధనచే అజ్ఞానాన్ని చేధించి, పాత మనస్సును వదిలివేసి, బ్రహ్మజ్ఞానంతో కూడిన నూతన శరీరాన్ని, మనస్సును పొందినవారు, వారి జీవితం పూర్వ జీవితంలా వుండదు, వారిలో బ్రహ్మతేజస్సు ప్రకాశిస్తూ వుంటుంది."

ఆ విషయాన్ని ధృవీకరిస్తూ పత్రీజీ మూడు నాలుగు నెలల క్రితం మా ఇంటికి వచ్చినప్పుడు "ఈ మారం శివప్రసాద్ 'బ్రాహ్మణరత్న' అయ్యాడు" అన్నారు. బుద్ధ జయంతి సందర్భంగా పత్రీజీ 2006 మే లో బెంగుళూరు విశ్వాలయంలో కొంతమందికి 'ధ్యాన రత్న' బిరుదు ప్రసాదించినప్పుడు "అయ్యో నేను ఇందుకు నోచుకోలేదే" అనుకున్నాను. కానీ నా స్వామి నన్ను ధ్యానరత్న బదులుగా 'బ్రాహ్మణ రత్న'తో గౌరవించారు.

"ఈ ఇల్లు నా ఇల్లు"

ఇరవై రోజుల క్రితం రాత్రి ఏడు గంటలప్పుడు సిటీలో ఒక ట్రస్ట్‌ను స్థాపించలని పత్రీజీ ఇంకొక మాస్టర్‌కి చెప్పినప్పుడు "అయ్యో, నాకు ఈ బాధ్యత అప్పచెప్పినప్పుడు సేవ చేసే భాగ్యం కలుగలేదు. ఇప్పుడు అవకాశం ఇతరులకి కలిగింది" అని ఒకింత బాధపడ్డాను. అయితే ఆ రోజు రాత్రి 11 గంటలకు నిర్మలమ్మ ఫోన్ చేసింది. "అన్నయ్యా, ఈ రోజు పత్రీజీ ఇంట్లో వున్నప్పుడు 'రాయదుర్గం రవి' వచ్చాడు. మాటల్లో ప్రస్తుతం పత్రీజీ ఉన్న ఇల్లు జాయింట్ ఫ్యామిలీకి చెందింది అని తెలుసుకున్న రవి, 'సార్, ఒకవేళ మీ అన్న మిమ్మల్ని ఆ ఇంట్లోంచి వెళ్ళమంటే ఏం చేస్తారు?' అని అడిగాడు. 'మా అన్న వెళ్ళమని అనడు. ఒకవేళ వెళ్ళమంటే నేను మారం ఇంటికి వెళతాను' అన్నారు" అని నిర్మలమ్మ చెప్పింది. 7 గంటలకు నేను నాకేదో అవకాశం లభించలేదు ఇవ్వలేదు అనుకుంటే, 11 గం.లకు తెలిసింది నా స్థానం వారి హృదయంలో ఉందని. "ఈ మాస్టర్ ఇల్లు నా ఇల్లు" అని పత్రీజీ చెప్పారు. అంటే ఆ గుండెలో ఈ "మారం" స్థానం శాశ్వతం కదా. ఇంతకంటే ఏం కావాలి ఈ జన్మకు.

ఇంకొక సత్యం తెలిసి, అది పత్రీజీ ద్వారా నిర్దారణ అయింది. 2005 సెప్టెంబరు, అక్టోబర్ ప్రాంతాల్లో నాకొక సందేశం వినపడింది. అదేమంటె షిర్డీబాబా తపోలోకవాసి అంటే బ్రహ్మలోకవాసి అనీ, బాబాకు సత్యంలోకం అంటే, మహాకారణలోకవాసం అంటే ప్రీతి అనీ. ఆ తరువాత 2006 వ సంవత్సరం ఫిబ్రవరి ప్రాంతాల్లో కోయంబత్తూర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ S.K.రాజన్ చెప్పారు. ఏమంటే, పత్రీజీ ఈరోడ్ లో చెప్పారు, షిర్డీబాబా సత్యలోక నివసార్హత పొందడానికి మళ్ళీ భూమిపైకి రావాలని అనుకుంటున్నారు అని. నాకు కన్‌ఫర్మ్ అయింది బాబా ఎందుకు నాలో 'వాకిన్' అయ్యారో.

"డబ్బు మాయలోంచి బయటపడ్డాను"

పత్రీజీ ద్వారా నేను పొందిన మరొక వరం 'డబ్బు' అనే మహామాయ లోంచి బయట పడడం. ఒక నెల ముందు కొంపల్లిలో పత్రిసార్ క్లాసు జరిగింది. అంతకు ముందు రోజు ఇద్దరు స్నేహితులు నాకు ఒక పెద్ద బిజినెస్ ఆఫర్ ఇచ్చారు. పూర్వాశ్రమంలో నేను ఎన్నో పెద్ద పెద్ద వ్యాపారాలు చేసివున్నాను. కనుక నాకు చాలా వ్యాపారాల గురించి, వాటి స్థితుల గురించి బాగా తెలుసు. ఆ వ్యాపారంలో భాగం తీసుకుంటే చాలా పెద్ద మొత్తంలో లాభం వస్తుంది. అయితే పత్రిసార్ ఆమోదం లేనిదే నేను ఏ పనీ చేయను. వారిని అడిగాను కొంపల్లిలో. సార్ ఒక్క క్షణం నా కళ్ళలోకి చూసి అన్నారు "నీకు ఇక ఏ ఒక్కరితో కూడా ఏ వ్యాపార లావాదేవీలు వద్దు" అని. అంతే, ఒక క్షణంలో వెయ్యోవంతులో నేను నిర్ణయించుకున్నాను "నాకు ఇక ఏ వ్యాపార లావాదేవీలూ వద్దు" అని. నా స్నేహితుడు వారి వ్యాపార స్థలం చూపించాడు. అయినా ఆ వ్యాపార స్థలం ఎంత బాగున్నా నాలో వెంట్రుకవాసి కదలిక కూడా లేదు, పైగా అక్కడ ధ్యానం చేసి ఆత్మతృప్తితో స్నేహితులను అభినందించడం జరిగింది. ఆ సంఘటనతో డబ్బు మీద మమకారం పూర్తిగా పోయింది. ఆ మహా మాయను పూర్తిగా జయించడం జరిగింది. ఇంతకంటే పొందవలసిన భాగ్యం ఏమీ లేదు నాకు.

"ఎన్ని తన్నులు తిన్నానో"

పత్రీజీ చెప్పింది 'తు.చ.' తప్పకుండా ఆచరించాను. ఎన్ని తిట్లు తిన్నానో. ఎన్ని తన్నులు తిన్నానో. తిట్టిన కొద్దీ, తన్నిన కొద్దీ మరింత తీర్చిదిద్దబడ్డాను. ఒకసారి "నాకు నీ ముఖం చూపించకు వెళ్ళు, గెటవుట్" అన్నారాయన. అటువంటి పరిస్థితిలో కూడా నేను ఆయన సాహచర్యం వదలలేదు. ఆయన నన్ను అలాగే చూసుకున్నారు. ఎంతగానో జ్ఞానం బోధించారు. ఎన్నో బాధ్యతలు అప్పజెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా, అనంతంగా ఈ ఆత్మ ఎదుగుదలకోసం సహాయపడ్డారు. ఒక గురువును ఎలా అర్ధం చేసుకోవాలో, ఎలా వారితో ప్రవర్తించాలో, ఎలా ఫాలో అవ్వాలో తెలియక మొదట్లో సతమతమయ్యాను.

క్రమంగా వారిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన తరువాత... ఇంక నేను వెనుదిరిగి చూడలేదు... పత్రీజీ నన్ను చూచిరమ్మంటే కాల్చివచ్చే ఆంజనేయుడిలాగా. ఎంతో ఘర్షణామయమైన జీవితం నాది. మా తండ్రిగారు మరణించిన పది సంవత్సరాలు తీవ్ర ఆర్థిక సమస్యలు. పెళ్ళయిన పది సంవత్సరాలు సంతానం లేదు. తర్వాత మళ్ళీ ఆర్థిక తిరోగతి. ఇలా ఎన్నెన్నో తీవ్రాతితీవ్రమైన సంఘర్షణల తరువాత 2003 నుంచి జీవితం గాడిలో పడడం, ఆత్మజ్ఞానం పొందడం, ధ్యాన ప్రచారమే జీవిత ధ్యేయం కావడం జరిగింది.

"ధ్యాన ప్రచారం"

పత్రీజీని కోరి మరీ 2003 లో ఆదిలాబాద్ జిల్లాలో ధ్యాన ప్రచారం చేశాను. నాకార్లో నాలుగు కార్పెట్లు, ఒక హ్యాండ్ మైక్, ఒక పవర్ మైక్, క్యాసెట్లు, సి.డిలు, పుస్తకాలు, వెంట ఇద్దరు మాస్టర్లు. ఎక్కడా, ఏ వూళ్ళో కూడా ఎవ్వరికీ ఒక రూపాయి ఖర్చుపెట్టనివ్వకుండా 2003 అంతా అదిలాబాద్ జిల్లాలో ధ్యాన ప్రచారం చేశాను. ఈ జీవితంలో ఇంక వెనుదిరిగి చూసేదేమీ లేదు. నా టార్గెట్ పత్రీజీ టార్గెట్ లో రెండు శాతం. అంటే పదిహేను కోట్ల మందికి ధ్యానం చెప్పడం. దానికోసం కొన్ని వేలమంది పిరమిడ్ మాస్టర్స్‌ని తయారుచేయడం.

...నా జీవితంలో ఎన్నో అనుభూతులు.. స్మృతులు.. వాటిల్లో ముఖ్యమైనవి :

* 1955 సం|| ఫిబ్రవరి నెల 22న కీ||శే|| మారం రామచంద్రయ్యశెట్టి మరి శ్రీమతి మారం మీనాక్షమ్మలకు ద్వితీయపుత్రుడిగా కర్నూలు జిల్లా ఆత్మకూరులో జన్మించడం. అదీ అమవాస్య మధ్యాహ్నం 12 గం|| మంగళవారం రోజు.

* 1968 తండ్రి మరణం, వ్యాపారంలోకి రావడం.

* 1976 ఆగస్టు నెల 14 వతేదీన చంద్రకుమారితో వివాహం, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. నా భార్య చంద్ర పౌర్ణమి శుక్రవారం రోజు తెల్లవారు ఝామున పుట్టింది. అమావాస్య మంగళవారం మిట్ట మధ్యాహ్నం పుట్టిన నాకు, పౌర్ణమి శుక్రవారం తెల్లవారు ఝామున పుట్టిన ఆవిడతో కళ్యాణం.

* 1998 సం|| జూలైలో ఆత్మకూరు అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం చేసి ప్రతిష్ఠ చేయడం, ఆ ప్రాంతంలోనే లక్ష్మీనరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ చేయడం.

* 1998 నవంబర్ 21 వ తేదీన ఆదోని సీనియర్ పిరమిడ్ మాస్టర్, నా మేనల్లుడు ప్రేమనాథ్ ద్వారా మొట్టమొదటిసారి ఆనాపానసతి ధ్యానం చేయడం.

* 1998 సంవత్సరంలోనే ‘ బ్రహ్మర్షి పత్రీజీ ’ పరిచయ భాగ్యం, ఆదోనిలోని ప్రేమనాథ్ ఇంట్లో. " నాకు తగిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు " అని పత్రీజీ చెప్పడం.

* 1999 లో ఆత్మకూరు నుంచి కర్నూలు షిప్ట్ కావడం. పత్రీజీతో, ఆంజనేయశర్మ సార్‌తో, పాల్ సార్‌తో, చంద్రశేఖర శర్మసార్‌తో సమీప సాన్నిహిత్యం.

* 2000 వ సంవత్సరం మే లో సికింద్రాబాద్‌కు నేను వచ్చి స్థిరపడడం.

* 2000 జూలై ప్రాంతంలో పత్రీజీ కూడా తమ హెడ్ ఆఫీస్‌ను హైదరాబాద్ చేసుకోవడం. అప్పటినుంచి వారితో మరింత సమీప సాన్నిహిత్యం, వారి మహోన్నతమైన మార్గదర్శకత్వంలో ఆత్మ ఎదుగుదల.

* 2000, 2001, 2002 సంవత్సరాలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మరి నా స్వంత చెల్లెలాగా నేను చూసుకున్న శ్రీమతి నిర్మలమ్మతో కలిసి జంట నగరాల్లో ముమ్మరంగా ధ్యాన ప్రచారం చేయడం. నిర్మలమ్మతో కలిసి వాసవీనగర్‌లో ఎనిమిది రోజుల ధ్యాన యజ్ఞాలు, జంటనగరాలలో ఎన్నో చోట్ల బ్రహ్మర్షి పత్రీజీతో ఎన్నో పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం.

* 1999, 2001, 2002 సంవత్సరాలలో వరుసగా బ్రహ్మర్షి పత్రీజీ ఆధ్వర్యంలో 'శ్రీశైలం ట్రెక్కింగ్' ఏర్పాటు చేయడం.

* 2001 సంవత్సరం జనవరి 25 వ తారీఖు గురువారం రోజున షిర్డీలో సాయినాథుని ఆలయంలోంచి బయటకు వస్తున్న నా గత జన్మలోని నా భౌతిక శరీరమైన "అబ్దుల్ బాబా" ను నా చర్మచక్షువులతో సందర్శించడం. అదేరోజు ఒక గంట తరువాత షిర్డీ లోని బాబా ఆలయ ఆవరణలో ఉన్న 'అబ్ధుల్ బాబా సమాధి' ముందు ధ్యానం చేసి, "నేను నా గత జన్మలో అబ్దుల్ బాబా" అని తెలుసుకోవడం.

* 2001, 2002, 2003 సంవత్సరాలలో కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారిలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మస్కీ ఏర్పాటు చేసిన "108 ఆదివారాలు - 108 మంది పిరమిడ్ మాస్టర్లు" కార్యక్రమానికి దాదాపు 70 మంది మాస్టర్లను ప్రతి ఆదివారం బళ్ళారికి పంపడం.

* 2003 ఫిబ్రవరి 22, నా 49 వ జన్మదినం నాడు 100వ ఆదివారం ప్రోగ్రాం కోసం బళ్ళారి వెళ్తూ బస్సులో షిర్డీబాబా భౌతిక దర్శనం పొందడం.

* అదే సమయంలో షిర్డీబాబా ఈ శరీరంలో 'వాకిన్' కావడం.

* 2003 వ సంవత్సరంలో అదిలాబాద్ జిల్లా అంతటా తిరిగి ముమ్మరంగా ధ్యాన ప్రచారం చేయడం.

* 2005 వ సంవత్సరంలో "నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్", దాదాపు మృత్యుముఖం నుంచి బయటపడడం. మాంస పిండం నుంచి మంత్రపిండంగా మారడం.

* 2006 వ సంవత్సరంలో "ధ్యాన రాజధాని" ఆధ్యాత్మిక మాస పత్రికను తీసుకురావటం.

* "షిర్డీబాబా మారం శివప్రసాద్‌లో 'వాకిన్' అయ్యారు" అని బ్రహ్మర్షి పత్రీజీ నోటి నుంచి వినడం.

* ఈ సంవత్సరం సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 17 వరకు వాసవీనగర్‌లో ఎనిమిది రోజుల ధ్యాన మహాయజ్ఞం నిర్వహించడం.

"జీవితం ధ్యానబోధకే అంకితం"

బ్రహ్మర్షి పత్రీజీ మార్గదర్శకత్వంలో, సాహచర్యంలో ఇంకెన్నో ఎన్నెన్నో అనుభూతులు, అవగాహనలు, సత్యదర్శనం. శిష్యరికం అంటే ఆయన ఒప్పుకోరు కానీ, నేను ఆయనకు 'రామదూత' హనుమంతుని లాంటి బంటును. అని చెప్పుకోవడం నాకు ఎంతో ఆనందం కలిగించే విషయం... గర్వం కూడా.

ప్రస్తుతం నాది 'అపరిచితుడి' లాంటి పరిస్థితి... ధ్యానం గురించి, ఆధ్యాత్మికత గురించి, సత్యం గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రం నేను బ్రాహ్మణుడిని.

భౌతిక విషయాల్లో నేను పూర్వాశ్రమంలోని కోమిటిశెట్టిని. అందులోంచి కూడా దాదాపు బయటపడ్డాను. డబ్బు అనే మాయ నుంచి బయటపడ్డాను కనుక. ఇదీ నా జీవితం.

మనసా, వాచా, కర్మణా నేను పత్రీజీ సంధించి విడిచిన ధ్యాన దూతను. ఈ జీవితం వారి మార్గానుసరణకే అంటే ధ్యాన బోధకే అంకితం.

థాంక్ యూ ఆల్.

 

మారం శివప్రసాద్
సికింద్రాబాద్

Go to top