" నా సమస్యలను నేనే పరిష్కరించుకుంటున్నాను "

 

నా పేరు సువర్ణ. 2003 లో తాడిపత్రి కళ్యాణమండపంలో పత్రిసార్ ధ్యానం క్లాస్ వినడానికి వెళ్ళాను. ఆయన్ని చూడగానే ప్రత్యక్షంగా ఒక మహాఋషిని చూసినంత ఆనందం, ఆశ్చర్యం కలిగింది. శ్రద్ధగా విని "ధ్యానం చేయాలి" అని అనుకున్నాను. అంతకుముందు ఎన్ని పూజలు చేసినా, గుళ్ళు తిరిగినా శాంతి లేదు. ఏదో పోగొట్టుకున్నట్లు, ఇంకా ఏదో సాధించాలని వుండేది. ధ్యానం చేస్తున్నప్పటి నుంచి టెన్షన్ లేదు, ఒత్తిడి లేదు. ఎంతో హాయిగా వుంది. కళ్ళు మూసుకునికూర్చుంటే "అవి కనిపించాయి, ఇవి కనిపించాయి ఆ అనుభవం కలిగింది" అని చెబుతూంటరు. "ఇది ఏదో తమాషాగా లేదా" అన్న ప్రశ్న కలిగింది. అప్పుడు నాలో నుంచి ఇలా సమాధానం వచ్చింది: "శివుడు, ఆంజనేయుడు ఇంకా ఎందరో మునులు తపస్సు చేసే కదా ఎన్నో సాధించారు". అప్పటినుంచి ధ్యానంపై ఆసక్తి, శ్రద్ధ కలిగాయి. 5-5-2004 న ధ్యానంలో షట్‌చక్రాలు కనిపించాయి. మూడు చక్రాలు తిరుగుతున్నట్లు గమనించాను. నాసికాగ్రం దగ్గర ఎనర్జీ పాస్ కావడం కలర్స్ కనిపించాయి. ధ్యానంలో పుస్తకంలో చదువుతుంటాను.

1-6-2004 న ఒక కలశం కనిపించింది. కలశం దగ్గర కొన్ని తాళపత్రాలు కనిపించాయి. వాటిపైన సంస్కృత అక్షరాలు కనిపించాయి. చదవడానికి రాలేదు కానీ దాని యొక్క సారాంశం మాత్రం మనస్సులో ట్రాన్స్‌లేషన్ అవుతోంది. "ప్రతి మనిషి కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఈ లోకానికి వస్తాడు. ఆ లక్ష్యం సాధించేవరకు మళ్ళీ మళ్ళీ పుట్టవలసిందే. మనిషికి పట్టుదల, తపన, ధ్యాన సాధన వుంటే ఆ లక్ష్యం తప్పకుండా సాధిస్తాడు" అని తెలిసింది. సూక్ష్మశరీరం విడివడడం... నన్ను నేను చూసుకోవడం ... హిమాలయాలకు వెళ్ళడం... అక్కడ లాహిరి మహాశయులను చూడడం... పత్రిసార్ ఇంకా ఎందరో మాస్టర్లు కనిపించడం.. . జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. ధ్యానంలో గర్భస్థ శిశువును చూశాను. ఇవన్నీ చూస్తూంటే నాకు ఎంతో ఆనందం కలిగేది. ఇవి కొన్ని మాత్రమే... ఇంకా ఎన్నో అనుభవాలు కలిగాయి. మా పిల్లలు ఇద్దరూ కూడా ధ్యానం చేస్తారు. వాళ్ళకు కూడా చాలా మంచి అనుభవాలు వస్తున్నాయి. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేస్తూ నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ హాయిగా వున్నాను. ధ్యానం ద్వారా నా సమస్యలు నేనే పరిష్కరించుకుంటున్నాను.

 

N.సువర్ణ
తాడిపత్రి

Go to top